దిగుమతి సుంకాల పెంపుతో నెల రోజుల వ్యవధిలో 23–37 శాతం ధరల పెరుగుదల
పామాయిల్ ధరే రూ.100 నుంచి రూ.137కి చేరిక
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలవుతున్న వేళ వంటనూనెల ధరలు చుక్కలనంటుతున్నాయి. గడిచిన నెల రోజులుగా క్రమంగా పెరుగుతూ సామాన్యులకు అందనంతగా పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లోనే వంట నూనెల ధరలు 23 నుంచి 37 శాతం వరకు పెరగడంతో పండగ వేళ సామాన్యులకు ఇక్కట్లు తప్పేలా లేవు.
ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత నెలలో రూ.100 ఉన్న పామాయిల్ ధర రూ.137 (37 శాతం) పెరగ్గా, సోయాబీన్ నూనె రూ.120 నుంచి రూ.148 (23 శాతం), సన్‌ఫ్లవర్ రూ.120 నుంచి రూ.149 (23.5 శాతం), ఆవ నూనె రూ.140 నుంచి రూ.181 (29శాతం), వేరుశనగ నూనె రూ.180 నుంచి రూ.187 (4 శాతం) మేర పెరిగాయి. దేశీయంగా నూనెగింజల సాగు పెద్దగా లేకపోవడంతో దేశం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.
ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా నుంచి సన్‌ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకుంటోంది. మొత్తంగా 58 శాతం ఇతర దేశాల నుంచే భారత్‌కు వస్తోంది. నూనెల వినియోగంలో భారత్ రెండో అతిపెద్ద వినియోగదారుగా ఉంది. దేశీయంగా నూనె పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గత నెలలో ముడి సోయాబీన్, పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాలను 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచింది.
శుధ్ది చేయబడిన ఆవ నూనెల దిగుమతి సుంకాన్ని 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచింది. సెపె్టంబర్ 14 నుంచి పెరిగిన సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హోల్‌సేల్ వ్యాపారులు ధరలు పెంచి అమ్మకాలు చేపట్టారు. దీనితో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు నూనెగింజల సాగులో ముందున్న మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పంట ఉత్పత్తి తగ్గింది.
ఈ ప్రభావం సైతం ధరల పెరుగుదలకు కారణమైంది. పెరిగిన ధరల ప్రభావం రెస్టారెంట్‌లు, హోటళ్లతో పాటు దీపావళి సందర్భంగా చేసుకునే తీపి పదార్థలపై గణనీయంగా పడుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో స్వీట్ల ధరలను పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కొత్త పంట మార్కెట్‌లోకి వచ్చే వరకు ధరలు దిగిరావని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment