poor people suffer
-
దేశవ్యాప్తంగా బ్రాండెడ్ ఔషధాల ధరలకు రెక్కలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బ్రాండెడ్ ఔషధాల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలతోనే ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో తాజాగా ధరలు పెరగడం పేదలకు భారం కానుంది. గడచిన రెండేళ్లలో ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఔషధాల ధరల పెంపునకు అనుమతి కోరుతూ ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలన్నీ ఇప్పటికే ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ)కి లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినియోగించే ఔషధాల ధరలు పెరగనున్నట్టు ఎన్పీపీఏ వర్గాలు తెలిపాయి. బీసీజీ వ్యాక్సిన్‌తో పాటు, విటమిన్–సీ, క్లోరోక్విన్, మెట్రొనిడజోల్ వంటి ప్రధానమైన 21 రకాల మందుల ధరలు మోత మోగనున్నాయి. దీంతో ఎన్పీపీఏ డిసెంబర్ మొదటి వారంలో సమావేశం నిర్వహించింది. త్వరలోనే పెరిగిన మందుల ధరలను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలకు 30 శాతం నుంచి 50 శాతం వరకూ ధర పెరగనుంది. అయితే ప్రజా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని అసాధారణంగా ధరలు పెంచబోమని ఎన్పీపీఏ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ మండలి కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి. బీసీజీ వ్యాక్సిన్ ప్రభావం తీవ్రంగా.. బీసీజీ వ్యాక్సిన్ ధర భారీగా పెరగనుంది. బిడ్డ పుట్టగానే టీబీ లేదా క్షయ రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తారు. మన రాష్ట్రంలో ఏటా 6.50 లక్షల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీళ్లందరికీ బీసీజీ వ్యాక్సిన్ వేయాల్సిందే. దీంతోపాటు మలేరియా మందులు, యాంటీ బాక్టీరియల్‌కు వాడే మెట్రోనిడజోల్ వంటి మందుల ధరలు పెరగడం వల్ల దీని ప్రభావం ప్రభుత్వంపై తీవ్రంగా పడనుంది. మన రాష్ట్రంలో ఇలా పెరిగిన మందుల వల్ల ఏటా రూ.120 కోట్ల వరకూ అదనంగా రోగులపై భారం పడే అవకాశాలున్నట్టు ఔషధ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టెంట్ రేట్లు తగ్గించినా... గుండెకు వేసే స్టెంట్ రేట్లు విచ్చలవిడిగా పెరిగిన నేపథ్యంలో వీటిని కూడా ఎన్పీపీఏ ధరల నియంత్రణలోకి తెచ్చింది. ఒక్కో స్టెంట్‌ను రూ.30 వేలకు మించి అమ్మకూడదని నిబంధన విధించింది. ఇదివరకు స్టెంట్ వేస్తే రూ. 1.50 లక్షలు వ్యయం అయ్యేది. కానీ ఇప్పుడు కూడా అంతే ధరకు వేస్తున్నారు. అంటే స్టెంట్ రేటు తగ్గినా ప్రొసీజర్ రేట్లు ఎక్కువ వేసి ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ఆస్పత్రి చార్జీలు తమ పరిధిలోకి రావని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే స్టెంట్ల ధరలు తగ్గించినా రోగులపై భారం తగ్గడం లేదు. ఇలా 870 రకాల మందులు ధరల నియంత్రణ పరిధిలో ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న ఉత్పత్తి సంస్థలపై ఔషధ నియంత్రణ శాఖ దాడులు చేసి ఆయా మందులను సీజ్ చేసింది. అలయెన్స్ బయోటిక్స్, డిజిటల్ విజన్, సెంచురీ డ్రగ్స్ వంటి ఉత్పత్తి సంస్థలు తయారు చేసిన మందులు నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఆ మందులను సీజ్ చేశారు. ఉత్పత్తిదారులపైనా కేసులు నమోదు చేసినట్టు ఔషధ నియంత్రణ శాఖ కృష్ణా జిల్లా అధికారి రాజభాను ‘సాక్షి’కి తెలిపారు. ధరలు పెరిగే ఔషధాల్లో కొన్ని.. -
ధరలను నియంత్రించాలని కోరుతూ వినూత్న నిరసన
భీమవరం : పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని , నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో భీమవరం టౌన్షిప్లో సంచితో డబ్బు, చేతిలో సరుకులు అంటూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవులు చేపట్టి రెండేళ్లు పూర్తయినా నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ గొప్పగా ప్రచారం చేసిన బీజేపీ, టీడీపీలు విచ్చలవిడిగా పెరుగుతున్న ధరలను అరికట్టలేకపోగా నిరుద్యోగ సమస్య మరింత జఠిలమైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తీసివేసి వారి కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం.వైకుంఠరావు, చైతన్యప్రసాద్, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, జడ్డు లక్ష్మి, కోటేశ్వరమ్మ, నూకరత్నం పాల్గొన్నారు.