ధరలను నియంత్రించాలని కోరుతూ వినూత్న నిరసన
భీమవరం : పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని , నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో భీమవరం టౌన్‌షిప్‌లో సంచితో డబ్బు, చేతిలో సరుకులు అంటూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు జేఎన్‌వీ గోపాలన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవులు చేపట్టి రెండేళ్లు పూర్తయినా నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదని ఎద్దేవా చేశారు.
2014 ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ గొప్పగా ప్రచారం చేసిన బీజేపీ, టీడీపీలు విచ్చలవిడిగా పెరుగుతున్న ధరలను అరికట్టలేకపోగా నిరుద్యోగ సమస్య మరింత జఠిలమైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తీసివేసి వారి కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం.వైకుంఠరావు, చైతన్యప్రసాద్, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, జడ్డు లక్ష్మి, కోటేశ్వరమ్మ, నూకరత్నం పాల్గొన్నారు.