సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో కమ్యూనిస్టు, బీఆర్‌ఎస్ పార్టీలు వచ్చే సాధారణ ఎన్నికలో పొత్తు పెట్టుకుంటాయని అంతా భావించినా అది కుదరలేదు. తమకు అవకాశం వస్తుందని భావించిన నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో అంచనాలు తలకిందులయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీతో బీఆర్‌ఎస్ జత కట్టింది. ఆ సందర్భంలోనే.. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పనిచేస్తామని ఇరుపార్టీల నేతలు ప్రకటించారు. నిన్నటి వరకు కూడా కమ్యూనిస్టులు, బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటాయని అంతా అనుకున్నారు. కానీ, కమ్యూనిస్టులు అడిగే స్థానాల్లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తు లేనట్లేనని తేలిపోయింది.
కామ్రేడ్ల పొత్తు ఎవరితో..
దేశంలోనే ఎప్పుడూలేని విధంగా మునుగోడు ఉప ఎన్నిక పోటాపోటీగా జరిగింది. ఇందులో కమ్యూనిస్టు పార్టీలు బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నాయి. ఇక ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో సహా ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ప్రధానంగా బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ జరిగింది. ఈ రెండు పార్టీలు యుద్ధాన్ని తలపించేలా ప్రచారం కొనసాగించాయి. మొత్తానికి ఆ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంలోనే కమ్యూనిస్టుల పొత్తుతోనే విజయం సాధించినట్లు బీఆర్‌ఎస్ ప్రకటించింది.
భవిష్యత్తులోనూ ఎన్నికల్లో కలిసే పనిచేస్తామని ప్రకటించింది. ఆ తరువాత పొత్తుల్లో భాగంగా స్థానాల కేటాయింపుపై అంచనాలు పెరిగిపోయాయి. మునుగోడు ఎలాగైనా సీపీఐకి వస్తుందని అంచనా వేసుకున్నారు. లేదంటే మిర్యాలగూడను సీపీఎంకు కేటాయిస్తారని ఆ పార్టీ భావించింది. గతంలో సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి అక్కడ నుంచి గెలుపొందారు. దీంతో ఆ స్థానంపై సీపీఎం ఆశ పెట్టుకుంది.
కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం, సీపీఐలకు ఒకటి చొప్పున టికెట్ ఇస్తారని, సీపీఎంకు భద్రాచలం, సీపీఐకి మునుగోడు ఇస్తారన్న చర్చ సాగింది. అయితే సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితా ప్రకారం పొత్తు లేదని తేల్చేశారు. మిర్యాలగూడలో సిట్టింగ్ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావుకు, మునుగోడులో సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బరిలో ఉంటారని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? సొంతంగా పోటీ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment