సాక్షి, న్యూఢిల్లీ: కరోనా ఉధృతి సమయంలో పల్స్ ఆక్సీమీటర్లు, ఇతర పరికరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపించాయి. మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ వాస్తవ ధర కంటే దాదాపు రెండుమూడు రెట్లు అధిక ధరకు విక్రయిస్తూ డబ్బులు దండుకున్నాయి. ఈ క్రమంలో నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) కీలక నిర్ణయం తీసుకుంది.
పల్స్ ఆక్సీమీటర్, నెబ్యులైజర్, డిజిటల్ థెర్మామీటర్, గ్లూకోమీటర్, బీపీ మానిటర్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. వీటిపై మార్జిన్‌ను 70 శాతానికి పరిమితం చేస్తూ ఎన్‌పీపీఏ ఉత్తర్వులు వెలువరించింది. తయారీ, దిగుమతి, మార్కెటింగ్ కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వీటి విక్రయం ద్వారా 709 శాతం వరకు లాభాలను ఆర్జిస్తున్నారని తెలిపింది. తయారీ సంస్థలు ఇక నుంచి వీటి ధరలను సవరించాల్సిందే.
జూలై 20 నుంచి తాజా ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. ఔషధాల (ధరల నియంత్రణ) ఉత్తర్వు-2013 ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను తయారీదార్లు ఉల్లంఘించినట్టయితే అధికంగా వసూలు చేసిన మొత్తానికి 15 శాతం వార్షిక వడ్డీతోపాటు 100 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆక్సీజన్ కాన్సంట్రేటర్లపై మార్జిన్‌ను 70 శాతానికి పరిమితం చేస్తూ గత నెలలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment