దీపావళి నుంచి తగ్గనున్న ఔషధాల ధరలు
న్యూఢిల్లీ: దీపావళి పండుగ నుంచి మధుమేహం, హైపర్ టెన్షన్, న్యూమోనియా వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఈమేరకు 18 నూతన బ్రాండ్లకు చెందిన నిత్యావసర ఔషధాల ధరలపై జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) నియంత్రణ విధించింది. ఈ ఔషధాలు రానున్న 15 రోజుల్లో మార్కెట్‌లో విడుదలకానున్నాయి. ఔషధ ధరల నియంత్రణ ఆర్డర్ (డీపీసీవో)-2013లోని పారాగ్రాఫ్ 5 పరిధిలోకి ఈ నూతన ఔషధాలను తీసుకొస్తూ.. వాటి ధరలు ఇష్టానుసారం పెంచకుండా పరిమితులు విధించింది.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఔషధాల ఎమ్మార్పీ ధరల ఆధారంగా వాటి గరిష్ఠ రిటైల్ ధరను ఎన్పీపీ నిర్ణయించింది. ప్రముఖ ఫార్మాసుటికల్ కంపెనీలు సిప్లా, మెర్క్, ఫ్రాంకో ఇండియన్, అలెబిక్ ఫార్మా, యూనిచెమ్ మొదలైన వాటి నుంచి ఈ ఔషధాలు మార్కెట్‌లోకి రానున్నాయి. ఎన్పీపీ నిర్దేశించిన ప్రకారం ఆయా సంస్థలు ధరలు నిర్ణయించకపోతే.. చట్టపరంగా తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అంతేకాకుండా అధికంగా వసూలుచేసిన మొత్తానికి డిపాజిట్‌ను వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని ఔషధ నియంత్రణ సంస్థ తన తాజా ఆదేశంలో పేర్కొంది.