తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా? | For weight loss and Diabetes amazing health benefits of Palmyra Sprout | Sakshi
Sakshi News home page

తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?

Published Sat, Jan 25 2025 12:43 PM | Last Updated on Sat, Jan 25 2025 1:04 PM

For weight loss and Diabetes amazing health benefits of Palmyra Sprout

చలికాలం మొదలు కాగానే మార్కెట్టులో విరివిగా కనిపించే వాటిలో తేగలు ఒకటి. వీటిని కొన్ని  ప్రాంతాలలో గేగులు అని అంటారు. వీటిని తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే తేగల్లో ఆరోగ్య  పోషకాలు పుష్కలంగా వున్నాయి. అవేంటో తెలుసుకుంటే ఇప్పుడైనా వీటిని తినేందుకు త్వరపడతారు. తేగల్లో పొటాషియం, విటమిన్‌ బి1, బి2, బి3, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్‌, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభిస్తాయి. ఇవి పోషకాల లోపాన్నీ తగ్గిస్తాయి. 
 

తేగలతో ఇన్ని రకాలు ఎపుడైనా  ట్రైచేశారా? 
తేగలను ఉడికించి మిరియాలు, ఉప్పు అద్దుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. తేగలు తింటే బరువు తగ్గడంతోపాటు కాన్సర్‌ కూడా దూరం అవుతుంది. అలాగే తేగలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని పిండి కొట్టి, కొబ్బరి పాలు, బెల్లం, ఏలకుల పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్‌ ఇట్టే కరిగిపోతుంది.

తేగలపిండితో రొట్టెలు చేసుకుని తినొచ్చు. ఇందులోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది. పెద్ద పేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులోని కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో తెల్ల కణాలను వృద్ధి చేస్తుంది. శరీరానికి చలువనిచ్చి, నోటిపూతను తగ్గిస్తుంది. తేగలను పాలలో ఉడికించి ఆ పాలను చర్మానికి పూతలా రాసుకుంటే చర్మం మిలమిల లాడుతంంది.

తేగలు దొరికే రోజుల్లో పిల్లలకు రెగ్యులర్‌గా వీటిని పెడితే ఎముకల ఎదుగుదలకు దోహద పడుతుంది. తాటి తేగలను మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించి మధుమేహాన్ని అదుపు చేస్తుంది. రక్తం తక్కువగా ఉండి అనీమియాతో బాధపడుతున్నవారు ఈ సీజన్‌లో వచ్చే తేగలను తింటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. 

తాటి చెట్ల ద్వారా... 
తేగలకు మూలం తాటిచెట్టే. వేసవిలో తాటికాయల కాపు మొదలవుతుంది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తాటి ముంజులు మార్కెట్లోకి వస్తాయి. అవి ముదిరి తాటికాయలుగా తయారై పండ్లుగా మారతాయి. అలా రాలిన తాటి పండ్ల గుజ్జును వినియోగించి పిండి వంటలు తయారు చేస్తారు.  ముఖ్యంగా తాటి తాండ్ర, తాటి రొట్టెలు మొదలైనవి.    ఈ తాటి కాయల టెంకలతో పాటు,కాయలను కూడా ప్రత్యేక ప్రాంతాల్లో రైతులు వ్యాపారులు తేగల పాతరలు వేస్తారు. వీటికి ఎటువంటి ఎరువులు అవసరం లేదు. భూమి ఇసుక పొరలలో దృఢంగా పెరుగుతాయి. డిసెంబర్‌ నాటికి ఇవి తేగలుగా తయారవుతాయి.  వీటిని మొలకలు రాకముందే తీసి, కుండల్లో ప్రత్యేకంగా అమర్చి నిప్పుల్లో కాల్చతారు. ఇవి తినడానికి కమ్మగా ఉంటాయి.  వీటి మార్కెట్లో విక్రయంచి రైతులు ఉపాధి పొందుతారు.

ఆహా ఆరోగ్యం.. 
తేగలు గుండె జబ్బులు, డయాబెటిస్‌ ఇలా ఎన్నో సమస్యలకు చెక్‌ పెడతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తాయి. నోటి సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. డయాబెటిస్‌తో బాధపడే వారు వీటిని తింటే డయాబెటిస్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా తాటి తేగలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను కలిగించే తాటి తేగలను ప్రతిరోజు క్రమం తప్పకుండా దొరికినప్పుడు ఒకటి చొప్పున తీసుకుంటే చాలా మంచిది. 

ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పెరిగే ఈ తాటి తేగలు మంచి పోషకాహారంగా మనం చెప్పవచ్చు. వీటిల్లో ఉండే పీచు పదార్థం మన జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది. మన శరీరంలోని టాక్సిన్స్‌ బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని భావించే వారికి తాటి తేగలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఇవి మహిళల్లో ఆస్టియోపోరోసిస్‌ సమస్య రాకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తెల్లరక్త కణాలను పెంచి, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

ఇవీ చదవండి :ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!
అపుడు వాచ్‌మెన్‌గా, ఇపుడు దర్జాగా : శభాష్‌ రా బిడ్డా! వైరల్‌ స్టోరీ

 నోట్‌: మంచిది కదా అని అతిగా తింటే మాత్రం చెరుపు చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement