Palm fruit
-
ఇవిగో ఈత పళ్లు
గిరిజన ప్రాంతాల్లో ఈత పళ్ల సీజన్ ప్రారంభమైంది. మైదాన ప్రాంతాల్లో ఈత చెట్లు పెద్దవిగా ఉండడంతో పాటు పండ్ల పరిమాణం పెద్దవిగానే ఉంటాయి. ఏజెన్సీలో మాత్రం చిన్న మొక్కల మాదిరిగా ఈత చెట్లు ఉండగా వాటికి కాసే పండ్లు పరిమాణం కూడా చిన్నవిగా ఉంటాయి. జి.మాడుగుల, జి.కె.వీధి, పాడేరు, హుకుంపేట, పెదబయలు, అరకులోయ, అనంతగిరి మండలాల్లో ఈతచెట్లు అధికంగా ఉన్నాయి. ఈత చెట్లు ఉన్న కొండల్లో వేరే వృక్ష జాతి ఏమి ఉండవు. గిరిజనులు ఈత మొక్కల నుంచి బొడ్డెంగులు తవ్వి తింటుంటారు. ఈ సీజన్లో మాత్రం ఈత పండ్లను సేకరించి ఇంటిల్లపాది తినడంతో పాటు వారపు సంతలు, మండల కేంద్రాల్లో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఈత పళ్ల సీజన్ కావడంతో గిరిజనులు వాటిని సేకరించి అమ్మకాలు జరుపుతున్నారు. విద్యాలయాలకు వేసవి సెలవులు కావడంతో గిరిజన చిన్నారులు కూడా ఈ పళ్లను సేకరిస్తున్నారు. గ్లాస్ రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. –సాక్షి, పాడేరు -
సమ్మర్ డేస్: చలువ పందిరి జ్ఞాపకం
వేసవి ఈ కాలపు పిల్లలకు ఏం జ్ఞాపకాలు మిగులుస్తోంది? ఓటిటిలో కొత్త సినిమా... వేరే చోట ఉండే మేనత్త కొడుకుతో ఇంట్లో కూచుని ఆడే వీడియో గేమ్? ఐఐటి ఫౌండేషన్ కోర్సులో చేరిక... మహా అయితే కింద సెల్లార్లో వెహికిల్స్కు తగలకుండా ఆడే క్రికెట్ షాట్సు.. ఇదా వేసవి అంటే.. ఆ చలువ పందిళ్లు ఎక్కడా? ఆ తాటి ముంజలు ఎక్కడా? ఆ మల్లెజడల ఫొటోలు ఎక్కడా? ఆ తెలుగుదనపు సంపద ఎక్కడా? ఎక్కడమ్మా ఆ రోజులు. మార్చి నెల రావడంతోనే చందాలు మొదలవుతాయి బజారు వీధిలో. అంగళ్లు ఉన్నవాళ్లంతా తలా ఇంత అని ఇస్తారు. ఎవరో ఒకరు ముందుకు పడి బజారు ఉన్నంత మేరా చలువ పందిరి వేయిస్తారు. సవక కర్రలు, కొత్త తాటాకులు, వెదురు బొంగులు అన్నీ కలిసి బజారు వీధిని ఎండ తగలకుండా కప్పేస్తాయి. ఇక ఎండాకాలం అయ్యేంత వరకూ ఊరికి అదే వేదిక. మధ్యాహ్నం పన్నెండైతే చాలు రిక్షా వాళ్లొచ్చి దాని కిందే ఆగుతారు. సోడా బండ్లు దాని కిందే ఉంటాయి. చల్లమజ్జిగను కుండలో పెట్టుకుని అమ్మే ముసలాయన అక్కడే. మరి పిల్లలు? అక్కడే కాలక్షేపం. ఇంట్లో బోర్. బయట ఎండ. ఆ చలువ పందిరి కింద అటూ ఇటూ తిరుగుతూ చోద్యం చూడటమే పని. అంగళ్ల వాళ్లు చల్లగా కూచుని బేరాలు చేస్తూ లాగే రిక్షా నుంచి సరుకు దించుకుంటూ మధ్య మధ్య తాటి ముంజల గెలలు అటుగా వెళుతుంటే కొని ఇళ్లకు పంపిస్తూ కూల్డ్రింక్ షాపు నుంచి ఆరంజ్ క్రష్ తెప్పించుకుంటూ ఆ భోగమే వేరు. చలువ పందిరి వేసీ వేయగానే శ్రీరామ నవమి వస్తుంది. నవమి తొమ్మిది రోజులు విష్ణాలయం వారు అక్కడే ప్రోగ్రాములు పెట్టిస్తారు. నాలుగు బల్లలు వేస్తే అదే స్టేజ్. పక్కనే ఉండే సవక గుంజకు తొమ్మిది రోజుల ప్రోగ్రామ్ పోస్టరు ఉంటుంది. ఆ రోజు ప్రోగ్రామ్ను పలక మీద రాసి కడతారు. ‘రుక్మిణీ కల్యాణం– హరికథ– చెప్తున్నది ఫలానా ఆమె– బ్రాకెట్లో ఆకాశవాణి ఆర్టిస్టు అని ఉంటుంది. పిల్లలు దానిని నోరు తెరుచుకుని చదివి సాయంత్రం 7 నుంచి మొదలయ్యే ఆ కార్యక్రమానికి స్నానాలు చేసి తల దువ్వుకుని అమ్మ దగ్గర ఒక పావలా తీసుకొని వస్తారు. మరుసటి రోజు బుర్ర కథ ఉంటుంది. ఇంకోరోజు సత్య హరిశ్చంద్ర కాటిసీను. ఒకరోజు మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్, మేజిక్ షో ఉంటాయి. చివరి రోజు పాటకచ్చేరి. దీని కోసమే జనం యుగాలుగా ఎదురు చూస్తున్నట్టుంటారు. పిల్లలు ఆ పాటకచ్చేరి స్టేజి చుట్టూ మూగి డ్రమ్స్, తబలా, గిటార్లను నోరు తెరుచుకుని చూస్తారు. ముందు వాతాపిగణ పతిం భజే పాడి ఆ తర్వాత రెండు ఘంటసాల పాటలు వేసుకుని ఆ తర్వాత ‘రాక్షసుడు’ నుంచి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ పాడతారు. అక్కడే గుగ్గిళ్లు అమ్మేవాడు పిల్లల డబ్బులకు తగిన గుగ్గిళ్లు ఇచ్చి వెళతాడు. పీసుమిఠాయి బండి అక్కడే ఉంటుంది. రౌండ్గా ఉండే రేకు డబ్బాలో రోజా రంగు ఐస్క్రీమ్ అమ్మేవాడు కూడా అక్కడే ఉంటాడు. చిల్లర ఉన్న పిల్లలు కొనుక్కుంటారు. లేని పిల్లలకు కొనిపెడతారు. ఇంతలో ఒకడు ‘ఆకుచాటు పిందె తడిచె’ కావాల్సిందేనని పట్టుబడతారు. ఆ పాటను ప్రిపేర్ అయి రాని పాటకచ్చేరి బృందం కచ్చాపచ్చాగా పాడి ప్రమాదం నుంచి బయటపడుతుంది. చలువ పందిరి కింద మధ్యాహ్నం అయ్యాక లూజుగా పోసిన మల్లెమొగ్గలు అమ్ముతూ తిరిగేవాళ్లుంటారు. ఆడవాళ్లు రేకు డబ్బా నిండుగా రెండు రూపాయల లెక్కన కొంటారు. ఇంటికి తీసుకెళ్లి ఓపిగ్గా వాటిని కడతారు. ఆడపిల్లలకు జడ కుట్టే సీజను ఇదే. మల్లెపూలు, కనకాంబరాలు, మరువం మూడు వరుసలు చేసి మూడు రంగులతో కళకళలాడిస్తారు. కలిగిన వాళ్లు బంగారు జడబిళ్లలు పెట్టుకుంటారు. ఫొటో సమయంలో పాపిటబిళ్ల సరేసరి. లేదంటే స్టూడియోవాడు ఇస్తాడు. జడ అద్దంలో పడేలా ఒక ఫోటో దిగి అది వచ్చే వరకు ఆడపిల్లలు వెయిట్ చేస్తారు. వచ్చాక ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలిస్తే ఎప్పటికీ అది అలా ఉండిపోతుంది. ఊళ్ల నుంచి బంధువుల పిల్లలు వస్తారు. గోలీలు, బొంగరాలు తెస్తారు. బజారులో దొరికే గోలీలు ఎవరి దగ్గరైనా ఉంటాయి. కాని సోడా గోలీలు ఉన్నవాళ్లు గొప్ప. నీలం రంగులో ఉండే ఆ గోలీలు భలే మెరుస్తాయి. పెద్దసైజు గోలీని డంకా అంటారు. రెండు గోలీలు గోడకు వేసి డంకాతో కొడితే ఒక గోలీ లాభం. చెట్టు కింద అరుగులు కూడా ఈ కాలంలో కళకళలాడుతాయి. వేపచెట్టు నీడలో పిల్లలు ‘సీతారాములు’ ఆట ఆడతారు. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు పేర్లు చీటీలలో రాసి నలుగురూ నాలుగు చీటీలు ఎత్తుకొని సీత ఎవరో కనిపెట్టమంటారు. కనిపెడితే మార్కులు. ఈ కాలంలోనే పరమపద సోపానపటం ఆడతారు. ఈలోపు అమ్మ కిరిణీ పండును తొక్క తీసి ముక్కలు చేసి కాసింత చక్కెర అలంకరణగా జల్లి ఇస్తుంది. అవి తిని చేయి కడుక్కోకుండానే ఆటకు పరుగు. వేసవి వస్తే ఒక ఊరి పిల్లలు ఇంకో ఊరు చూస్తారు. కాదు.. ఒక ఊరి పిల్లలు ఇంకో ఊళ్లో ఉండే తమ వారిని చూస్తారు. వీరు తమ మనుషులు అని ఆనందిస్తారు. బంధాలను బాల్యం నుంచే పెనవేసుకుంటారు. మేనత్తకు ఒక మేనల్లుడంటే ఇష్టం. పెద్దమ్మకు ఒక చెల్లికూతురు అంటే ప్రాణం. పిన్ని ఫలానా బుజ్జిగాడి కోసం డబ్బు దాచి సినిమాకు పోరా అని ఇస్తుంది. బంధువులొస్తే కజ్జికాయలు వండుతారు. పొయ్యి దగ్గర కూచుని మాటలు మరిగిస్తారు. రాత్రిళ్లు పెరట్లో నులకమంచాలు వేసుకుని ఆకాశాన్ని చూస్తూ కథలు చెప్పుకుంటారు. నీళ్లు జల్లి డాబాల మీద పక్కలు వేస్తారు. చందమామలు చదివి తెలుగు నేరుస్తారు. బాలమిత్ర లోకంలో తమను తాము మరుస్తారు. చద్దన్నం రుచి తెలుస్తుంది. బండి వాడు అతి సన్నగా కోసిన పావలా బద్ద పుచ్చకాయను ఎంత ఆలస్యంగా తిందామనుకున్నా తొందరగానే అయిపోతుంది. స్కూల్లో చదువుకున్నది స్కూలు చదువు. వేసవిలో చదువుకునేది మరో చదువు. అలాంటి చదువు ఇప్పుడు ఉందా.. లేకపోవడం వల్ల దూరం చేస్తున్నామా... ఉండీ దూరం చేస్తున్నామా... మూలాలు ఉన్న మొక్కలు గట్టిగా ఎదుగుతాయి. వేసవిలో పడాల్సిన వేర్లు పిల్లలకు పడనివ్వండి. -
Summer Tips: తాటిముంజెలు ఎక్కువగా తింటున్నారా.. ఇందులో 80 శాతానికి పైగా!
Health Benefits Of Ice Apple: తాటిచెట్లు.. గ్రామీణ ప్రాంతాల్లో ఎందరికో జీవనాధారం. తాటి ఆకులు, కొయ్యలతో నివాసాలు ఏర్పరచుకోవచ్చు. ఇక తాటి చెట్ల నుంచి వచ్చే నీరా తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని పెద్దల మాట. అంతేకాదు నీరాతో బెల్లం కూడా తయారు చేయవచ్చట. అంతేనా... ఆరోగ్య ప్రదాయిని అయిన స్వచ్ఛమైన కల్లుతో పాటు సీజనల్గా తాటి ముంజెలు, తాటి పండ్లు, ఆ తర్వాత తేగలు, బురుగుంజ అందిస్తాయి తాటిచెట్లు . మరి ఇప్పటికే వేసవి వచ్చేసింది. ఈ సీజన్లో దొరికే తాటి ముంజెలు(ఐస్ ఆపిల్) తినడం వల్ల కాలిగే ప్రయోజనాలు తెలుసుకుందామా! తాటి ముంజెల వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ►తాటి ముంజెలు ఎండధాటి నుంచి రక్షణ కల్పిస్తాయి. ►100గ్రాముల ముంజెల్లో 43 కేలరీలు ఉంటాయి. ►మూడు తాటి ముంజెలు తిన్నట్లయితే, ఒక కొబ్బరిబొండాన్ని తాగినంత ఫలితం ఉంటుంది. ►లేత తాటిముంజెల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా నీరే ఉంటుంది. ►వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ►బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజెలు చక్కని ఫలహారం. ►ఆటలమ్మ వంటివి సోకినప్పుడు శరీరంపై ఏర్పడే పుండ్లపై తాటిముంజెల నీటిని పట్టిస్తే దురద తగ్గి, అవి త్వరలోనే మానిపోతాయి. ►కొన్ని ప్రాంతాల్లో తాటిముంజెలతో శీతలపానీయాలను కూడా తయారు చేస్తారు. తమిళనాడులో తాటిముంజెల పానీయాన్ని ‘ఎలనీర్ నుంగు’ అంటారు. చదవండి: World TB Day 2022: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి! -
తాటి పండ్లతో జీవామృతం
ప్రకృతి వ్యవసాయదారులు జీవామృతం తయారీలో సాధారణంగా నల్లబెల్లం వాడతారు. దీనికి తీవ్ర కొరత ఏర్పడింది. సాధారణ బెల్లం కిలో ధర రూ. 70ల నుంచి రూ.100లకు చేరింది. దీంతో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఖర్చులు పెరిగాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి. వెలంవారిపల్లెకు చెందిన వెన్నెల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహకులు, అభ్యుదయ రైతు కొమ్ములూరు విజయకుమార్ బెల్లం బదులుగా తాటి పండ్లను వాడుతున్నారు. ఈ పద్ధతిని స్థానిక రైతులకూ అలవాటు చేశారు. ఆయన మాటల్లోనే.. ఎకరాకు దుక్కిలో వేసే ఘన జీవామృతం తయారీకి 8 కిలోల బెల్లం కావాలి. ద్రవ జీవామృతం తయారీకి మొత్తం పంట కాలంలో ఆరుసార్లు పిచికారీకి 12 కిలోల బెల్లం అవసరమవుతుంది. దీనికి గాను రూ. 2 వేలు ఖర్చు చేయాలి. బెల్లానికి బదులుగా మాగి కింద పడిన తాటి పండ్లు వాడుకోవచ్చు.50 మాగిన తాటి పండ్లు తీసుకొని వాటిని పీచుతో సహా బాగా పగల పీకాలి. వీటిని ఒక పట్టపై ఉంచుకుని 200 లీటర్ల డ్రమ్ము తీసుకుని ఆ డ్రమ్ములో పీచుతో పగల పీకిన పండ్లను వేయాలి. ఆ తరువాత నిండుగా నీరు పోయాలి. రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కలియబెట్టాలి. అవి తెల్లగా పీచు తేలుతూ కనిపిస్తాయి. ఆ డ్రమ్ములో నీరు పచ్చగా మారిపోతాయి. అలా నాలుగైదు రోజులకు ద్రావణం తయారవుతుంది. తాటి పండ్లు ఏడాది పొడవునా దొరకవు. కానీ, ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని 6 నెలల వరకు నిల్వ చేసుకొని, జీవామృతంలో బెల్లానికి బదులుగా వాడుకోవచ్చు. ఇలా తయారైన తాటి పండ్ల ద్రావణాన్ని బెల్లం ఎన్ని కిలోలు వాడతామో అన్ని లీటర్ల మేరకు ఈ ద్రావణాన్ని వాడుకోవాలి. అదే విధంగా ‘సేద్య సంజీవని ఎరువు’ తయారు చేసుకునే రైతులు కూడా 1 ఎకరానికి ఎరువు తయారు చేసుకునేటప్పుడు 50 కిలోల బెల్లానికి బదులుగా 50 లీటర్ల ఈ తాటిపండు ద్రావణం వాడుకుంటే సరిపోతుంది. ఈ ద్రావణం మదపు వాసన వస్తుంది. ఈ వాసనకు తేనెటీగలు విపరీతంగా పంటపై వాలుతాయి. అదే విధంగా ఈ ద్రావణం పంటలకు మేలు చేసే కీటకాలను కూడా ఆకర్షిస్తుంది. పూత బాగా రావడానికి ఈ ద్రావణం తోడ్పతుంది. వానపాములు కూడా సమృద్ధిగా పెరుగుతాయని విజయకుమార్ (98496 48498) తెలిపారు.– మాచుపల్లె ప్రభాకరరెడ్డి,సాక్షి అగ్రికల్చర్, వైఎస్సార్ జిల్లా టమాటా పంట బాగా పండింది టమాటా పంటకు తాటి పండ్లతోనే ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారు చేసుకొని ఉపయోగించాను. తేనెటీగల ఉధృతి పెరిగింది. పంటపై పిచికారీ చేయడం వల్ల దోమ లేకుండా పోయింది. పంట దిగుబడిని పెంచే మిత్ర కీటకాలు విపరీతంగా వచ్చాయి. దీనివల్ల నాణ్యమైన పంటను పండించగలిగాను.–పి.రెడ్డెయ్య, రైతు, అనిమెల, వీరపునాయునిపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా కూరగాయ పంటలకు మేలు తాటిపండు ద్రావణం తయారీ చాలా సులభం. దీని నుంచి మంచి సువాసన వస్తుంది. ఈ వాసనకు కీటకాలు ఆకర్షితమై పంటపైకి వస్తాయి. పూత దశలో పరపరాగ సంపర్కం పెరుగుతుంది. దీంతో పంట దిగుబడి పెరిగి పంట పుష్కలంగా పండుతుంది. ఈ ద్రావణంతో చేసిన జీవామృతం వల్ల కూరగాయ పంటలకు మేలు జరిగింది.–యశోదమ్మ, రైతు, చిన్ననరస్సుపల్లె,చిననమండెం మండలం, వైఎస్సార్ జిల్లా అన్ని పంటలకు చక్కగా పనిచేస్తుంది తాటిపండు జీవామృతం వ్యవసాయ, ఉద్యాన పంటలన్నిటికీ చక్కగా పనిచేస్తుంది. గతంలో బెల్లం దొరక్క నానా అవస్థలు పడుతుండే వాళ్లం. తాటిపండుతో తయారైన జీవామృతం అన్ని పంటలకూ పనిచేస్తుంది.–టి. వెంకటకృష్ణ, రైతు, బోలగొంది చెరువు,వేంపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా -
తాటి తేగలూ ఆదాయ వనరులే!
తాటి పండు నుంచి లభించే ఉత్పత్తుల్లో తేగలు ముఖ్యమైనవి. పలు పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న తేగలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. తేగల పిండి తయారీని కుటీర పరిశ్రమగా చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చునంటున్నారు పందిరిమామిడి (తూ. గో. జిల్లా) ఉద్యాన పరిశోధనా కేంద్రానికి చెందిన ఆహార-సాంకేతిక విజ్ఞాన శాస్త్రవేత్త పిసి వెంగయ్య. తాటి టెంక నుంచి 21-30 రోజుల్లో మొలక వస్తుంది. ఈ మొలక భూమిలోకి దాదాపు 45-60 సెం. మీ. పోతుంది. మొలక వచ్చినప్పటి నుంచి నాలుగు నెలలకు ఏర్పడే దానిని తేగ అంటారు. తేగ పెరిగే కొద్దీ కొబ్బరిలా గట్టిగా ఉండే పదార్థం కరిగిపోతుంది. ఇది దాదాపు 6-12 నెలలు అంటే తేగ నుంచి మొక్క వచ్చే వరకు ఉపయోగపడుతుంది. టెంకలను నీడలో పాతర పెడితే తేగలు ఇంకా అభివృద్ధి చెందుతాయి. విత్తనం నుంచి మొక్క రావటం అనేది 50 శాతం వరకు ఉంటుంది. గుజ్జు తీసిన టెంకలు తొందరగా మొలక వ చ్చి బాగా పెరుగుతాయి. పెద్ద టెంకల నుంచి మందం గల తేగలు చిన్న టెంకల నుంచి సన్న తేగలు వస్తాయి. పొడవులో మాత్రం వ్యత్యాసం ఉండదు. టెంకలను వరుసల మీద అమర్చటం ద్వారా కూడా తేగలు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఈ వరసలు నాలుగు కంటే ఎక్కువగా ఉండకూడదు. తేగల ఉత్పత్తిలో ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. తేగల పిండి తయారీ ఇలా... తాజా తేగలను శుభ్రపరచి ఒక అరగంట పాటు ఉడికించి అమ్మవచ్చు. వీటిలో పలు ఔషధ గుణాలు ఉన్నాయి. తేగలను వివిధ రూపాల్లోకి మార్చి సంవత్సరమంతా వాడవచ్చు. దీనికోసం తేగలను ఎండబెట్టి ముక్కలుగా నిల్వ ఉంచాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిండిగా మార్చుకోవచ్చు. పచ్చి తేగలను లేదా ఉడికించిన తేగలను రెండుగా విడదీసి ఆరబెట్ట వచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టటం మరో పద్ధతి. వీటిలో ఏదో ఒక విధానంలో తేగలను పిండిగా మార్చవచ్చు. తేగను పిండి రూపంలోకి మార్చి 250 మైక్రాన్ల జల్లెడ ద్వారా జల్లిస్తారు. పచ్చి పిండిని వాడేటప్పుడు ఒకట్రెండు గంటలు నీటిలో నానబె డితే చేదు పోతుంది. పిండి నుంచి నీటిని తొలగించేందుకు వడపోయాలి. లేదా వేడి చేయాలి. తేగల పిండితో పలు వంటకాల తయారీ ... పిండిని ఉడికించడం ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాలు చేయవచ్చు. ఉడికించిన పిండిలో బెల్లం, కొబ్బరి పొడి కలిపి తినవచ్చు. ఈ పిండిలో కొబ్బరిపొడి కలిపి ఆవిరితో ఉడికిస్తే మంచి రుచికరమైన వంటకం తయారవుతుంది. మినపప్పుతో కలిపి ఇడ్లీ, దోశె తయారు చేయవచ్చు. బ్రెడ్, గోధుమ పిండితో కలిపి నూడిల్స్ తయారు చేయవచ్చు. వరి, గోధుమ పిండితో తయారు చేసే అన్ని వంటకాల్లోను దీన్ని వాడవచ్చు. తాజా తేగ 46 గ్రా. బరువుంటుంది. ఉడికించి ఆరబెట్టినది 16. గ్రా., పచ్చిది ఆరబెట్టినది 18గ్రా. బరువుంటుంది. సుమారు 60 శాతం పిండి పదార్థం ఉంటుంది. తేగల్లో ముఖ్యమైనది పిండి పదార్థం. ఇది తేగ మొదటి భాగంలో ఎక్కువగా ఉంటుంది. పోనుపోను తగ్గుతూ ఉంటుంది. తాజా తేగలో సుమారు 55 శాతం తేమ ఉంటుంది. ప్రొటీన్లు 5 శాతం, కొవ్వు పదార్థాలు 0.5 శాతం ఉంటాయి. ( వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం పందిరి మామిడి పరిశోధనా స్థానం ఆహార - సాంకేతిక విభాగం శాస్త్రవేత్త వెంగయ్యను 94931 28932 నంబరులో సంప్రదించవచ్చు) ప్రాచీన వర్షాధార సేద్య పద్ధతిపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రాచీన కాలం నుంచి కర్ణాటకలో వాడుకలో ఉన్న అటవీ వ్యవసాయ విధానం ‘కడు కృషి’. ప్రముఖ శాస్త్రవేత్త డా. ఖాదర్ ఈ పద్ధతిని పునరుద్ధరించి, రైతులకు శిక్షణ ఇస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా (కాబిని డ్యాం దగ్గర) బీదరహళ్లిలోని హెచ్డి కోటే హ్యాండ్పోస్ట్ వ్యవసాయ క్షేత్రంలో నవంబర్ 12, 13 తేదీల్లో శిక్షణా శిబిరం జరుగుతుంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా సహజంగా పంటలు సాగు చేయడం ఈ కడు కృషి విధానం ప్రత్యేకత. ముఖ్యంగా ఈ విధానం కరవు, మెట్ట ప్రాంతాల్లో వర్షాధార సేద్యం చేసే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. భూసారాన్ని పెంపొందించే సహజ క్రిమినాశనులు, మొక్కల సహజ పెరుగుదలకు ఉపకరించే ద్రావణాలు, సహజ ఎరువుల తయారీపై డా. ఖాదర్ శిక్షణ ఇస్తారు. భూగర్భజలాల పరిరక్షణ పద్ధతులు, చిరుధాన్యాల సాగు, చిరుధాన్యాల వల్ల ఒనగూడే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరిస్తారు. నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే శిక్షణ 13వ తేదీ ఉదయం 11 గంటలకు ముగుస్తుంది. నవంబర్ 5లోగా పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు 097422 58739 నంబరులో వాట్స్యాప్ ద్వారా సంప్రదించవచ్చు.