తాటి పండ్లతో జీవామృతం | Organic Agriculture With Palm fruit | Sakshi
Sakshi News home page

తాటి పండ్లతో జీవామృతం

Published Tue, Aug 27 2019 8:21 AM | Last Updated on Tue, Aug 27 2019 8:21 AM

Organic Agriculture With Palm fruit - Sakshi

ప్రకృతి వ్యవసాయదారులు జీవామృతం తయారీలో సాధారణంగా నల్లబెల్లం వాడతారు. దీనికి తీవ్ర కొరత ఏర్పడింది. సాధారణ బెల్లం కిలో ధర రూ. 70ల నుంచి రూ.100లకు చేరింది. దీంతో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఖర్చులు పెరిగాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె మండలం టి. వెలంవారిపల్లెకు చెందిన వెన్నెల రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ నిర్వహకులు, అభ్యుదయ రైతు కొమ్ములూరు విజయకుమార్‌ బెల్లం బదులుగా తాటి పండ్లను వాడుతున్నారు. ఈ పద్ధతిని స్థానిక రైతులకూ అలవాటు చేశారు. ఆయన మాటల్లోనే..  

ఎకరాకు దుక్కిలో వేసే ఘన జీవామృతం తయారీకి 8 కిలోల బెల్లం కావాలి. ద్రవ జీవామృతం తయారీకి మొత్తం పంట కాలంలో ఆరుసార్లు పిచికారీకి 12 కిలోల బెల్లం అవసరమవుతుంది. దీనికి గాను రూ. 2 వేలు ఖర్చు చేయాలి. బెల్లానికి బదులుగా మాగి కింద పడిన తాటి పండ్లు వాడుకోవచ్చు.50 మాగిన తాటి పండ్లు తీసుకొని వాటిని పీచుతో సహా బాగా పగల పీకాలి. వీటిని ఒక పట్టపై ఉంచుకుని 200 లీటర్ల డ్రమ్ము తీసుకుని ఆ డ్రమ్ములో పీచుతో పగల పీకిన పండ్లను వేయాలి. ఆ తరువాత నిండుగా నీరు పోయాలి. రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కలియబెట్టాలి. అవి తెల్లగా పీచు తేలుతూ కనిపిస్తాయి. ఆ డ్రమ్ములో నీరు పచ్చగా మారిపోతాయి. అలా నాలుగైదు రోజులకు ద్రావణం తయారవుతుంది. తాటి పండ్లు ఏడాది పొడవునా దొరకవు. కానీ, ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని 6 నెలల వరకు నిల్వ చేసుకొని, జీవామృతంలో బెల్లానికి బదులుగా వాడుకోవచ్చు. ఇలా తయారైన తాటి పండ్ల ద్రావణాన్ని బెల్లం ఎన్ని కిలోలు వాడతామో అన్ని లీటర్ల మేరకు ఈ ద్రావణాన్ని వాడుకోవాలి.

అదే విధంగా ‘సేద్య సంజీవని ఎరువు’ తయారు చేసుకునే రైతులు కూడా 1 ఎకరానికి ఎరువు తయారు చేసుకునేటప్పుడు 50 కిలోల బెల్లానికి బదులుగా 50 లీటర్ల ఈ తాటిపండు ద్రావణం వాడుకుంటే సరిపోతుంది. ఈ ద్రావణం మదపు వాసన వస్తుంది. ఈ వాసనకు తేనెటీగలు విపరీతంగా పంటపై వాలుతాయి. అదే విధంగా ఈ ద్రావణం పంటలకు మేలు చేసే కీటకాలను కూడా ఆకర్షిస్తుంది. పూత బాగా రావడానికి ఈ ద్రావణం తోడ్పతుంది. వానపాములు కూడా సమృద్ధిగా పెరుగుతాయని విజయకుమార్‌ (98496 48498) తెలిపారు.– మాచుపల్లె ప్రభాకరరెడ్డి,సాక్షి అగ్రికల్చర్, వైఎస్సార్‌ జిల్లా

టమాటా పంట బాగా పండింది
టమాటా పంటకు తాటి పండ్లతోనే ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారు చేసుకొని ఉపయోగించాను. తేనెటీగల ఉధృతి పెరిగింది. పంటపై పిచికారీ చేయడం వల్ల దోమ లేకుండా పోయింది. పంట దిగుబడిని పెంచే మిత్ర కీటకాలు విపరీతంగా వచ్చాయి. దీనివల్ల నాణ్యమైన పంటను పండించగలిగాను.–పి.రెడ్డెయ్య, రైతు, అనిమెల, వీరపునాయునిపల్లె మండలం, వైఎస్సార్‌ జిల్లా

కూరగాయ పంటలకు మేలు
తాటిపండు ద్రావణం తయారీ చాలా సులభం. దీని నుంచి మంచి సువాసన వస్తుంది. ఈ వాసనకు కీటకాలు ఆకర్షితమై పంటపైకి వస్తాయి. పూత దశలో పరపరాగ సంపర్కం పెరుగుతుంది. దీంతో పంట దిగుబడి పెరిగి పంట పుష్కలంగా పండుతుంది. ఈ ద్రావణంతో చేసిన జీవామృతం వల్ల కూరగాయ పంటలకు మేలు జరిగింది.–యశోదమ్మ, రైతు, చిన్ననరస్సుపల్లె,చిననమండెం మండలం, వైఎస్సార్‌ జిల్లా

అన్ని పంటలకు చక్కగా పనిచేస్తుంది
తాటిపండు జీవామృతం వ్యవసాయ, ఉద్యాన పంటలన్నిటికీ చక్కగా పనిచేస్తుంది. గతంలో బెల్లం దొరక్క నానా అవస్థలు పడుతుండే వాళ్లం. తాటిపండుతో తయారైన జీవామృతం అన్ని పంటలకూ పనిచేస్తుంది.–టి. వెంకటకృష్ణ, రైతు, బోలగొంది చెరువు,వేంపల్లె మండలం, వైఎస్సార్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement