సేంద్రియ ఆహారం ఆవశ్యకతపై వినియోగదారుల్లో పెరుగుతున్న చైతన్యంతో కిచెన్ గార్డెన్ల సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో కూరగాయలు, పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇంటిపట్టునే 13 రకాల కూరగాయలను సేంద్రియంగా పండించుకొని తింటున్న కుటుంబాల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. పఠాన్‌చెరులోని ‘ఇక్రిశాట్’ ఆవరణలో గల వరల్డ్ వెజిటబుల్ సెంటర్ దక్షిణాసియా కేంద్రం సేంద్రియ పెరటి తోటల సాగుపై పరిశోధనలు చేపట్టింది (లాభాపేక్ష లేని ఈ సంస్థ కేంద్ర కార్యాలయం తైవాన్‌లో ఉంది). రెండు నమూనాల్లో సేంద్రియ పెరటి తోటల సాగుకు సంబంధించి ‘సెంటర్’ అధ్యయనంపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం.
వరల్డ్ వెజిటబుల్ సెంటర్ జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వ / ప్రైవేటు వ్యవసాయ పరిశోధనా సంస్థలతో కలసి కూరగాయలు, మిరప వంటి పంటలపై పరిశోధనలు చేసింది. టాటా ట్రస్టులతో కలిసి 36 చదరపు మీటర్ల స్థలంలో పౌష్టిక విలువలతో కూడిన 13 రకాల సేంద్రియ కూరగాయల పెరటి తోటల (న్యూట్రి గార్డెన్స్) పై తాజాగా క్షేత్రస్థాయిలో ఈ పరిశోధన జరిగింది.
కుటుంబానికి వారానికి 5.1 కిలోల (ప్రతి మనిషికి రోజుకు 182 గ్రాముల) చొప్పున.. ఏడాదికి 266.5 కిలోల పోషకాలతో కూడిన తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సమకూరాయి. తద్వారా ఒక కుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75% అందాయి. బీటా కెరొటెన్ (విటమిన్ ఎ), విటమిన్ సి అవసరానికన్నా ఎక్కువే అందాయి. 25% ఐరన్ సమకూరిందని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది.
జార్కండ్‌లో పెరటి తోటల పెంపకం ద్వారా కుటుంబాలకు కూరగాయల ఖర్చు 30% తగ్గింది. అస్సాంలో సేంద్రియ న్యూట్రిగార్డెన్ల వల్ల పది వేల కుటుంబాలు విషరసాయనాలు లేని కూరగాయలను సొంతంగానే పండించుకుంటున్నారు. మార్కెట్‌లో కొనటం మానేశారని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది. వ్యవసాయ దిగుబడులు పెంచే పరిశోధనలతో పాటు భవిష్యత్తు తరాల ప్రజల ఆరోగ్యదాయక జీవనానికి ఉపయోగపడే క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తున్నామని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ చెప్పారు.
స్క్వేర్ గార్డెన్ నిర్మాణం ఎలా?
గ్రామీణ కుటుంబాలకు సర్కిల్ గార్డెన్‌తో పోల్చితే నలుచదరంగా ఉండే స్క్వేర్ గార్డెనే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు ఉండే స్థలాన్ని ఎంపికచేసుకొని మెత్తగా దున్నాలి. మాగిన పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువుతో వేప పిండి కలిపి చల్లితే చీడపీడలు రావు. 6-6 స్థలాన్ని 7 బెడ్స్ (ఎత్తుమడులు) గా ఏర్పాటు చేయాలి. వాటిని అడ్డంగా విభజించి 14 చిన్న మడులు చేయాలి. ఒక్కో మడిలో ఒక్కో పంట వేయాలి. పాలకూర, గోంగూర, ఉల్లి, క్యారట్, టొమాటో, బెండ, వంగ వంటి పంటలు వేసుకోవాలి. బెడ్స్ మధ్యలో అంతరపంటలుగా బంతి, మొక్కజొన్న విత్తుకుంటే రసంపీల్చే పురుగులను నియంత్రించవచ్చు.
ఇంటిపంటల ఉత్పాదకత 5 రెట్లు!
సేంద్రియ ఇంటిపంటలు పౌష్టిక విలువలతో కూడి సమతులాహార లభ్యతను, ఆహార భద్రతను పెంపొందిస్తున్నాయి. తాము తినే ఆహారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే సామర్ధ్యాన్ని కుటుంబాలకు ఇస్తున్నాయి. ఫలితంగా మరింత సుస్థిరమైన, ఆరోగ్యదాయకమైన జీవనానికి మార్గం సుగమం అవుతోంది. ప్రణాళికాబద్ధంగా సేంద్రియ ఇంటిపంటలను వ్యక్తిగత శ్రద్ధతో సాగు చేస్తే పొలాల ఉత్పాదకతో పోల్చినప్పుడు దాదాపు 5 రెట్ల ఉత్పాదకత సాధించవచ్చు. భారత్‌లో పొలాల్లో కూరగాయల దిగుబడి హెక్టారకు సగటున 12.7 టన్నులు ఉండగా, సేంద్రియ ఇంటిపంటల ద్వారా హెక్టారుకు ఏడాదికి 73.9 టన్నుల దిగుబడి పొందవచ్చు. విస్తారమైన కూరగాయ తోటల్లో సైతం సమీకృత వ్యవసాయ పద్ధతులు పాటిస్తే రసాయనాల వినియోగం తగ్గటంతో పాటు 20% అధిక దిగుబడి పొందవచ్చు.
– ఎం. రవిశంకర్,
సీనియర్ హార్టీకల్చరిస్ట్, ప్రాజెక్టు మేనేజర్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం, పఠాన్‌చెరు
సర్క్యులర్ కిచెన్ గార్డెన్ ఎలా?
పట్టణ ప్రాంతాల్లో స్థలం తక్కువగా ఉన్న చోట సర్క్యులర్ గార్డెన్ అనుకూలంగా ఉంటుంది. చూపులకూ ముచ్చటగా ఉంటుంది. 3 మీటర్ల చుట్టుకొలత ఉండే మడిలో 11 రకాల పంటలు పండించవచ్చు. మధ్యలో ఉండే చిన్న సర్కిల్‌లో కొత్తిమీర, పుదీన వంటి ఆకుకూరలు వేసుకోవచ్చు. పెద్దగా ఉండే వెలుపలి సర్కిల్‌లో అనేక మడులు చేసి వేర్వేరు కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు. ఒక మడిలో భూసారం పెంపుదలకు వాడే పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలి. చీడపీడల నియంత్రణకు పసుపు, నీలం జిగురు అట్టలు పెట్టుకోవాలి. వేపనూనె, పులిసిన మజ్జిగ పిచికారీ చేస్తుంటే తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోవచ్చు. ఈ సస్యరక్షణ చర్యల ద్వారా రసాయనిక పురుగుమందులు వాడకుండానే పంటలను రక్షించుకోవచ్చు.
స్క్వేర్ గార్డెన్ దిగుబడి ఎక్కువ
గుండ్రంగా, దీర్ఘ చతురస్త్రాకారంలో ఉండే రెండు రకాల గార్డెన్ డిజైన్లు పెరటి కూరగాయ తోటల సాగుకు అనుకూలం. స్థలం లభ్యతను బట్టి గార్డెన్ డిజైన్‌ను ఎంపిక చేసుకోవాలి. 6 మీటర్ల చుట్టుకొలత గల సర్కిల్ గార్డెన్‌లో 150 రోజుల్లో 56 కిలోల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు పండాయి. ఎరువులు, విత్తనాలు తదితర ఉత్పాదకాల ఖర్చు రూ. 1,450. అయితే, 6“6 మీటర్ల విస్తీర్ణంలో పెరటి తోట (స్క్వేర్ గార్డెన్)లో అవే పంటలు సాగు చేస్తే 67 కిలోల దిగుబడి వచ్చింది, ఉత్పాదకాల ఖర్చు రూ. 1,650 అయ్యింది. ఈ గార్డెన్లు విటమిన్లు, ఖనిజాలు, పీచు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన సమతుల ఆహారాన్ని కుటుంబానికి అందించాయి. ఆమేరకు మార్కెట్‌పై ఆధారపడకుండా రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే పౌష్టికాహారాన్ని ఆ కుటుంబం పండించుకొని తినవచ్చని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పేర్కొంది. ఇళ్లు కిక్కిరిసి ఉండే అర్బన్ ప్రాంతాల్లో కంటెయినర్ గార్డెన్లను ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను నగరవాసులు పండించుకోవటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే.
సేంద్రియ ఇంటిపంటలపై వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పరిశోధన
36 చ.మీ. స్థలంలో వారానికి 5.1 (ఏడాదికి 266.5) కిలోల సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల దిగుబడి
కుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75%, ఐరన్ 25%, పుష్కలంగా ఎ, సి విటమిన్లు
(ఇతర వివరాలకు.. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ప్రతినిధి
వినయనాథ రెడ్డి 99125 44200)
Comments
Please login to add a commentAdd a comment