సమ్మర్‌ డేస్‌: చలువ పందిరి జ్ఞాపకం | summer days: The memory of the dark tent, whwre is the ice apple, | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ డేస్‌: చలువ పందిరి జ్ఞాపకం

Published Sat, Apr 16 2022 12:29 AM | Last Updated on Sat, Apr 16 2022 12:29 AM

summer days: The memory of the dark tent, whwre is the ice apple,  - Sakshi

వేసవి ఈ కాలపు పిల్లలకు ఏం జ్ఞాపకాలు మిగులుస్తోంది?
ఓటిటిలో కొత్త సినిమా... వేరే చోట ఉండే మేనత్త కొడుకుతో ఇంట్లో కూచుని ఆడే వీడియో గేమ్‌?
ఐఐటి ఫౌండేషన్‌ కోర్సులో చేరిక... మహా అయితే కింద సెల్లార్‌లో వెహికిల్స్‌కు తగలకుండా ఆడే క్రికెట్‌ షాట్సు..
ఇదా వేసవి అంటే.. ఆ చలువ పందిళ్లు ఎక్కడా?
ఆ తాటి ముంజలు ఎక్కడా?
ఆ మల్లెజడల ఫొటోలు ఎక్కడా?
ఆ తెలుగుదనపు సంపద ఎక్కడా?
ఎక్కడమ్మా ఆ రోజులు.


మార్చి నెల రావడంతోనే చందాలు మొదలవుతాయి బజారు వీధిలో. అంగళ్లు ఉన్నవాళ్లంతా తలా ఇంత అని ఇస్తారు. ఎవరో ఒకరు ముందుకు పడి బజారు ఉన్నంత మేరా చలువ పందిరి వేయిస్తారు. సవక కర్రలు, కొత్త తాటాకులు, వెదురు బొంగులు అన్నీ కలిసి బజారు వీధిని ఎండ తగలకుండా కప్పేస్తాయి. ఇక ఎండాకాలం అయ్యేంత వరకూ ఊరికి అదే వేదిక. మధ్యాహ్నం పన్నెండైతే చాలు రిక్షా వాళ్లొచ్చి దాని కిందే ఆగుతారు.

సోడా బండ్లు దాని కిందే ఉంటాయి. చల్లమజ్జిగను కుండలో పెట్టుకుని అమ్మే ముసలాయన అక్కడే. మరి పిల్లలు? అక్కడే కాలక్షేపం. ఇంట్లో బోర్‌. బయట ఎండ. ఆ చలువ పందిరి కింద అటూ ఇటూ తిరుగుతూ చోద్యం చూడటమే పని. అంగళ్ల వాళ్లు చల్లగా కూచుని బేరాలు చేస్తూ లాగే రిక్షా నుంచి సరుకు దించుకుంటూ మధ్య మధ్య తాటి ముంజల గెలలు అటుగా వెళుతుంటే కొని ఇళ్లకు పంపిస్తూ కూల్‌డ్రింక్‌ షాపు నుంచి ఆరంజ్‌ క్రష్‌ తెప్పించుకుంటూ ఆ భోగమే వేరు.

చలువ పందిరి వేసీ వేయగానే శ్రీరామ నవమి వస్తుంది. నవమి తొమ్మిది రోజులు విష్ణాలయం వారు అక్కడే ప్రోగ్రాములు పెట్టిస్తారు. నాలుగు బల్లలు వేస్తే అదే స్టేజ్‌. పక్కనే ఉండే సవక గుంజకు తొమ్మిది రోజుల ప్రోగ్రామ్‌ పోస్టరు ఉంటుంది. ఆ రోజు ప్రోగ్రామ్‌ను పలక మీద రాసి కడతారు. ‘రుక్మిణీ కల్యాణం– హరికథ– చెప్తున్నది ఫలానా ఆమె– బ్రాకెట్‌లో ఆకాశవాణి ఆర్టిస్టు అని ఉంటుంది.

పిల్లలు దానిని నోరు తెరుచుకుని చదివి సాయంత్రం 7 నుంచి మొదలయ్యే ఆ కార్యక్రమానికి స్నానాలు చేసి తల దువ్వుకుని అమ్మ దగ్గర ఒక పావలా తీసుకొని వస్తారు. మరుసటి రోజు బుర్ర కథ ఉంటుంది. ఇంకోరోజు సత్య హరిశ్చంద్ర కాటిసీను. ఒకరోజు మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్, మేజిక్‌ షో ఉంటాయి. చివరి రోజు పాటకచ్చేరి. దీని కోసమే జనం యుగాలుగా ఎదురు చూస్తున్నట్టుంటారు. పిల్లలు ఆ పాటకచ్చేరి స్టేజి చుట్టూ మూగి డ్రమ్స్, తబలా, గిటార్‌లను నోరు తెరుచుకుని చూస్తారు.

ముందు వాతాపిగణ పతిం భజే పాడి ఆ తర్వాత రెండు ఘంటసాల పాటలు వేసుకుని ఆ తర్వాత ‘రాక్షసుడు’ నుంచి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ పాడతారు. అక్కడే గుగ్గిళ్లు అమ్మేవాడు పిల్లల డబ్బులకు తగిన గుగ్గిళ్లు ఇచ్చి వెళతాడు. పీసుమిఠాయి బండి అక్కడే ఉంటుంది. రౌండ్‌గా ఉండే రేకు డబ్బాలో రోజా రంగు ఐస్‌క్రీమ్‌ అమ్మేవాడు కూడా అక్కడే ఉంటాడు. చిల్లర ఉన్న పిల్లలు కొనుక్కుంటారు. లేని పిల్లలకు కొనిపెడతారు. ఇంతలో ఒకడు ‘ఆకుచాటు పిందె తడిచె’ కావాల్సిందేనని పట్టుబడతారు. ఆ పాటను ప్రిపేర్‌ అయి రాని పాటకచ్చేరి బృందం కచ్చాపచ్చాగా పాడి ప్రమాదం నుంచి బయటపడుతుంది.

చలువ పందిరి కింద మధ్యాహ్నం అయ్యాక లూజుగా పోసిన మల్లెమొగ్గలు అమ్ముతూ తిరిగేవాళ్లుంటారు. ఆడవాళ్లు రేకు డబ్బా నిండుగా రెండు రూపాయల లెక్కన కొంటారు. ఇంటికి తీసుకెళ్లి ఓపిగ్గా వాటిని కడతారు. ఆడపిల్లలకు జడ కుట్టే సీజను ఇదే. మల్లెపూలు, కనకాంబరాలు, మరువం మూడు వరుసలు చేసి మూడు రంగులతో కళకళలాడిస్తారు. కలిగిన వాళ్లు బంగారు జడబిళ్లలు పెట్టుకుంటారు. ఫొటో సమయంలో పాపిటబిళ్ల సరేసరి. లేదంటే స్టూడియోవాడు ఇస్తాడు. జడ అద్దంలో పడేలా ఒక ఫోటో దిగి అది వచ్చే వరకు ఆడపిల్లలు వెయిట్‌ చేస్తారు. వచ్చాక ఫ్రేమ్‌ కట్టించి గోడకు తగిలిస్తే ఎప్పటికీ అది అలా

ఉండిపోతుంది.
ఊళ్ల నుంచి బంధువుల పిల్లలు వస్తారు. గోలీలు, బొంగరాలు తెస్తారు. బజారులో దొరికే గోలీలు ఎవరి దగ్గరైనా ఉంటాయి. కాని సోడా గోలీలు ఉన్నవాళ్లు గొప్ప. నీలం రంగులో ఉండే ఆ గోలీలు భలే మెరుస్తాయి. పెద్దసైజు గోలీని డంకా అంటారు. రెండు గోలీలు గోడకు వేసి డంకాతో కొడితే ఒక గోలీ లాభం. చెట్టు కింద అరుగులు కూడా ఈ కాలంలో కళకళలాడుతాయి. వేపచెట్టు నీడలో పిల్లలు ‘సీతారాములు’ ఆట ఆడతారు.

సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు పేర్లు చీటీలలో రాసి  నలుగురూ నాలుగు చీటీలు ఎత్తుకొని సీత ఎవరో కనిపెట్టమంటారు. కనిపెడితే మార్కులు. ఈ కాలంలోనే పరమపద సోపానపటం ఆడతారు. ఈలోపు అమ్మ కిరిణీ పండును తొక్క తీసి ముక్కలు చేసి కాసింత చక్కెర అలంకరణగా జల్లి ఇస్తుంది. అవి తిని చేయి కడుక్కోకుండానే ఆటకు పరుగు.

వేసవి వస్తే ఒక ఊరి పిల్లలు ఇంకో ఊరు చూస్తారు. కాదు.. ఒక ఊరి పిల్లలు ఇంకో ఊళ్లో ఉండే తమ వారిని చూస్తారు. వీరు తమ మనుషులు అని ఆనందిస్తారు. బంధాలను బాల్యం నుంచే పెనవేసుకుంటారు. మేనత్తకు ఒక మేనల్లుడంటే ఇష్టం. పెద్దమ్మకు ఒక చెల్లికూతురు అంటే ప్రాణం. పిన్ని ఫలానా బుజ్జిగాడి కోసం డబ్బు దాచి సినిమాకు పోరా అని ఇస్తుంది. బంధువులొస్తే కజ్జికాయలు వండుతారు.

పొయ్యి దగ్గర కూచుని మాటలు మరిగిస్తారు. రాత్రిళ్లు పెరట్లో నులకమంచాలు వేసుకుని ఆకాశాన్ని చూస్తూ కథలు చెప్పుకుంటారు. నీళ్లు జల్లి డాబాల మీద పక్కలు వేస్తారు. చందమామలు చదివి తెలుగు నేరుస్తారు. బాలమిత్ర లోకంలో తమను తాము మరుస్తారు. చద్దన్నం రుచి తెలుస్తుంది. బండి వాడు అతి సన్నగా కోసిన పావలా బద్ద పుచ్చకాయను ఎంత ఆలస్యంగా తిందామనుకున్నా తొందరగానే అయిపోతుంది.

స్కూల్లో చదువుకున్నది స్కూలు చదువు. వేసవిలో చదువుకునేది మరో చదువు. అలాంటి చదువు ఇప్పుడు ఉందా.. లేకపోవడం వల్ల దూరం చేస్తున్నామా... ఉండీ దూరం చేస్తున్నామా...

మూలాలు ఉన్న మొక్కలు గట్టిగా ఎదుగుతాయి. వేసవిలో పడాల్సిన వేర్లు పిల్లలకు పడనివ్వండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement