Summer Holly Days
-
సమ్మర్ డేస్: చలువ పందిరి జ్ఞాపకం
వేసవి ఈ కాలపు పిల్లలకు ఏం జ్ఞాపకాలు మిగులుస్తోంది? ఓటిటిలో కొత్త సినిమా... వేరే చోట ఉండే మేనత్త కొడుకుతో ఇంట్లో కూచుని ఆడే వీడియో గేమ్? ఐఐటి ఫౌండేషన్ కోర్సులో చేరిక... మహా అయితే కింద సెల్లార్లో వెహికిల్స్‌కు తగలకుండా ఆడే క్రికెట్ షాట్సు.. ఇదా వేసవి అంటే.. ఆ చలువ పందిళ్లు ఎక్కడా? ఆ తాటి ముంజలు ఎక్కడా? ఆ మల్లెజడల ఫొటోలు ఎక్కడా? ఆ తెలుగుదనపు సంపద ఎక్కడా? ఎక్కడమ్మా ఆ రోజులు. మార్చి నెల రావడంతోనే చందాలు మొదలవుతాయి బజారు వీధిలో. అంగళ్లు ఉన్నవాళ్లంతా తలా ఇంత అని ఇస్తారు. ఎవరో ఒకరు ముందుకు పడి బజారు ఉన్నంత మేరా చలువ పందిరి వేయిస్తారు. సవక కర్రలు, కొత్త తాటాకులు, వెదురు బొంగులు అన్నీ కలిసి బజారు వీధిని ఎండ తగలకుండా కప్పేస్తాయి. ఇక ఎండాకాలం అయ్యేంత వరకూ ఊరికి అదే వేదిక. మధ్యాహ్నం పన్నెండైతే చాలు రిక్షా వాళ్లొచ్చి దాని కిందే ఆగుతారు. సోడా బండ్లు దాని కిందే ఉంటాయి. చల్లమజ్జిగను కుండలో పెట్టుకుని అమ్మే ముసలాయన అక్కడే. మరి పిల్లలు? అక్కడే కాలక్షేపం. ఇంట్లో బోర్. బయట ఎండ. ఆ చలువ పందిరి కింద అటూ ఇటూ తిరుగుతూ చోద్యం చూడటమే పని. అంగళ్ల వాళ్లు చల్లగా కూచుని బేరాలు చేస్తూ లాగే రిక్షా నుంచి సరుకు దించుకుంటూ మధ్య మధ్య తాటి ముంజల గెలలు అటుగా వెళుతుంటే కొని ఇళ్లకు పంపిస్తూ కూల్‌డ్రింక్ షాపు నుంచి ఆరంజ్ క్రష్ తెప్పించుకుంటూ ఆ భోగమే వేరు. చలువ పందిరి వేసీ వేయగానే శ్రీరామ నవమి వస్తుంది. నవమి తొమ్మిది రోజులు విష్ణాలయం వారు అక్కడే ప్రోగ్రాములు పెట్టిస్తారు. నాలుగు బల్లలు వేస్తే అదే స్టేజ్. పక్కనే ఉండే సవక గుంజకు తొమ్మిది రోజుల ప్రోగ్రామ్ పోస్టరు ఉంటుంది. ఆ రోజు ప్రోగ్రామ్‌ను పలక మీద రాసి కడతారు. ‘రుక్మిణీ కల్యాణం– హరికథ– చెప్తున్నది ఫలానా ఆమె– బ్రాకెట్లో ఆకాశవాణి ఆర్టిస్టు అని ఉంటుంది. పిల్లలు దానిని నోరు తెరుచుకుని చదివి సాయంత్రం 7 నుంచి మొదలయ్యే ఆ కార్యక్రమానికి స్నానాలు చేసి తల దువ్వుకుని అమ్మ దగ్గర ఒక పావలా తీసుకొని వస్తారు. మరుసటి రోజు బుర్ర కథ ఉంటుంది. ఇంకోరోజు సత్య హరిశ్చంద్ర కాటిసీను. ఒకరోజు మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్, మేజిక్ షో ఉంటాయి. చివరి రోజు పాటకచ్చేరి. దీని కోసమే జనం యుగాలుగా ఎదురు చూస్తున్నట్టుంటారు. పిల్లలు ఆ పాటకచ్చేరి స్టేజి చుట్టూ మూగి డ్రమ్స్, తబలా, గిటార్లను నోరు తెరుచుకుని చూస్తారు. ముందు వాతాపిగణ పతిం భజే పాడి ఆ తర్వాత రెండు ఘంటసాల పాటలు వేసుకుని ఆ తర్వాత ‘రాక్షసుడు’ నుంచి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ పాడతారు. అక్కడే గుగ్గిళ్లు అమ్మేవాడు పిల్లల డబ్బులకు తగిన గుగ్గిళ్లు ఇచ్చి వెళతాడు. పీసుమిఠాయి బండి అక్కడే ఉంటుంది. రౌండ్‌గా ఉండే రేకు డబ్బాలో రోజా రంగు ఐస్‌క్రీమ్ అమ్మేవాడు కూడా అక్కడే ఉంటాడు. చిల్లర ఉన్న పిల్లలు కొనుక్కుంటారు. లేని పిల్లలకు కొనిపెడతారు. ఇంతలో ఒకడు ‘ఆకుచాటు పిందె తడిచె’ కావాల్సిందేనని పట్టుబడతారు. ఆ పాటను ప్రిపేర్ అయి రాని పాటకచ్చేరి బృందం కచ్చాపచ్చాగా పాడి ప్రమాదం నుంచి బయటపడుతుంది. చలువ పందిరి కింద మధ్యాహ్నం అయ్యాక లూజుగా పోసిన మల్లెమొగ్గలు అమ్ముతూ తిరిగేవాళ్లుంటారు. ఆడవాళ్లు రేకు డబ్బా నిండుగా రెండు రూపాయల లెక్కన కొంటారు. ఇంటికి తీసుకెళ్లి ఓపిగ్గా వాటిని కడతారు. ఆడపిల్లలకు జడ కుట్టే సీజను ఇదే. మల్లెపూలు, కనకాంబరాలు, మరువం మూడు వరుసలు చేసి మూడు రంగులతో కళకళలాడిస్తారు. కలిగిన వాళ్లు బంగారు జడబిళ్లలు పెట్టుకుంటారు. ఫొటో సమయంలో పాపిటబిళ్ల సరేసరి. లేదంటే స్టూడియోవాడు ఇస్తాడు. జడ అద్దంలో పడేలా ఒక ఫోటో దిగి అది వచ్చే వరకు ఆడపిల్లలు వెయిట్ చేస్తారు. వచ్చాక ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలిస్తే ఎప్పటికీ అది అలా ఉండిపోతుంది. ఊళ్ల నుంచి బంధువుల పిల్లలు వస్తారు. గోలీలు, బొంగరాలు తెస్తారు. బజారులో దొరికే గోలీలు ఎవరి దగ్గరైనా ఉంటాయి. కాని సోడా గోలీలు ఉన్నవాళ్లు గొప్ప. నీలం రంగులో ఉండే ఆ గోలీలు భలే మెరుస్తాయి. పెద్దసైజు గోలీని డంకా అంటారు. రెండు గోలీలు గోడకు వేసి డంకాతో కొడితే ఒక గోలీ లాభం. చెట్టు కింద అరుగులు కూడా ఈ కాలంలో కళకళలాడుతాయి. వేపచెట్టు నీడలో పిల్లలు ‘సీతారాములు’ ఆట ఆడతారు. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు పేర్లు చీటీలలో రాసి నలుగురూ నాలుగు చీటీలు ఎత్తుకొని సీత ఎవరో కనిపెట్టమంటారు. కనిపెడితే మార్కులు. ఈ కాలంలోనే పరమపద సోపానపటం ఆడతారు. ఈలోపు అమ్మ కిరిణీ పండును తొక్క తీసి ముక్కలు చేసి కాసింత చక్కెర అలంకరణగా జల్లి ఇస్తుంది. అవి తిని చేయి కడుక్కోకుండానే ఆటకు పరుగు. వేసవి వస్తే ఒక ఊరి పిల్లలు ఇంకో ఊరు చూస్తారు. కాదు.. ఒక ఊరి పిల్లలు ఇంకో ఊళ్లో ఉండే తమ వారిని చూస్తారు. వీరు తమ మనుషులు అని ఆనందిస్తారు. బంధాలను బాల్యం నుంచే పెనవేసుకుంటారు. మేనత్తకు ఒక మేనల్లుడంటే ఇష్టం. పెద్దమ్మకు ఒక చెల్లికూతురు అంటే ప్రాణం. పిన్ని ఫలానా బుజ్జిగాడి కోసం డబ్బు దాచి సినిమాకు పోరా అని ఇస్తుంది. బంధువులొస్తే కజ్జికాయలు వండుతారు. పొయ్యి దగ్గర కూచుని మాటలు మరిగిస్తారు. రాత్రిళ్లు పెరట్లో నులకమంచాలు వేసుకుని ఆకాశాన్ని చూస్తూ కథలు చెప్పుకుంటారు. నీళ్లు జల్లి డాబాల మీద పక్కలు వేస్తారు. చందమామలు చదివి తెలుగు నేరుస్తారు. బాలమిత్ర లోకంలో తమను తాము మరుస్తారు. చద్దన్నం రుచి తెలుస్తుంది. బండి వాడు అతి సన్నగా కోసిన పావలా బద్ద పుచ్చకాయను ఎంత ఆలస్యంగా తిందామనుకున్నా తొందరగానే అయిపోతుంది. స్కూల్లో చదువుకున్నది స్కూలు చదువు. వేసవిలో చదువుకునేది మరో చదువు. అలాంటి చదువు ఇప్పుడు ఉందా.. లేకపోవడం వల్ల దూరం చేస్తున్నామా... ఉండీ దూరం చేస్తున్నామా... మూలాలు ఉన్న మొక్కలు గట్టిగా ఎదుగుతాయి. వేసవిలో పడాల్సిన వేర్లు పిల్లలకు పడనివ్వండి. -
తెలంగాణ: పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ : పాఠశాలలకు జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డైట్ కళాశాలలకు కూడా జూన్ 15 వరకు వేసవి సెలవులను పొడిగించింది. ఈ మేరకు విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
సిటీ ‘ఎలక్షన్ టూర్’
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు పిల్లలకు వేసవి సెలవులు.. మరోవైపు ఎన్నికలు.. పైగా ఉగాది పర్వదినం.. అన్నీ ఒకేసారి కలిసి రావడంతో నగరవాసులు ‘ఎన్నికల టూర్’కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత ఊళ్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనే పట్టుదలతో పల్లె బాట పడుతున్నారు. ఎన్నికలు, ఉగాది సందర్భంగా కలసి వచ్చే వరుస సెలవుల దృష్ట్యా కూడా చాలా మంది పయనమవుతున్నారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు 10 లక్షల మందికి పైగా నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లనున్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు బయలుదేరే ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో సగానికిపైగా రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టు భారీగా పెరిగింది. కొన్ని రైళ్లలో 150 నుంచి 200కు పైగా వెయిటింగ్ ఉంది. మరికొన్ని రైళ్లలో రిజర్వేషన్ల బుకింగ్ సైతం నిలిపివేశారు. వాటిలో ‘నో రూమ్’దర్శనమిస్తోంది. వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఎన్నికల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లలోనూ బెర్త్‌లన్నీ భర్తీ అయ్యాయి. ప్రత్యేకించి ఏపీకి వెళ్లేందుకు ఇప్పటికిప్పుడు ఎలాంటి అవకాశం లేదు. ఎన్నికల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని రైళ్లు అదనంగా ఏర్పాటు చేస్తే తప్ప జనం సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం లేదు. తెలంగాణలోనూ వివిధ జిల్లాలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లనున్నారు. ఎండాకాలం దృష్ట్యా ఇప్పటికే పలు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరో వారం రోజుల్లో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరుకోనుంది. అదనపు రైళ్లేవి... వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, ముంబై, బెంగళూర్ తదితర ప్రాంతాలకు సుమారు 50 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. వీటిలో చాలా వరకు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లే ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉండే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఈ రైళ్లు ఎన్నికల రద్దీకి అనుగుణంగా అందుబాటులో లేవు. దీంతో రెగ్యులర్ రైళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సుమారు 85 రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ నెల 5 నుంచి 12 వరకు పూర్తిగా బుక్ అయ్యాయి. రద్దీ రెట్టింపయింది. సాధారణ రోజుల్లో మూడు రైల్వేస్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులతో పాటు ఎన్నికల సందర్భంగా మరో 1.5 లక్షల మందికి పైగా బయలుదేరే అవకాశం ఉంది. కానీ ఈ అదనపు రద్దీని అధిగమించేందుకు ఇప్పటి వరకు దక్షిణమధ్య రైల్వే ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. ఏసీ, నాన్ ఏసీ బోగీలన్నీ బుక్ అయిన దృష్ట్యా ప్రయాణికులు అప్పటికప్పుడు సాధారణ బోగీలను ఆశ్రయించవలసి ఉంటుంది. కానీ ఈ జనరల్ బోగీల్లోనూ రెట్టింపుగా తరలివెళ్లే అవకాశం ఉంది. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతోపాటు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్న దృష్ట్యా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేక బస్సులకు ఆర్టీసీ ప్రణాళిక... ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 1000 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీఎస్ఆర్టీసీతో పాటు, ఏపీఎస్ ఆర్టీసీ కూడా నగరంలోని కూకట్పల్లి, మియాపూర్, ఎస్సార్ నగర్, అమీర్‌పేట్, ఈసీఐఎల్, సైనిక్‌పురి, ఎల్బీ నగర్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధి కారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అను గుణంగా ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేక బస్సు లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సైతం సిద్ధమవుతున్నాయి. ఎన్నికల సంద ర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చార్జీలను రెట్టింపు చేసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. విమాన ప్రయాణాల్లో రాయితీ ఒకవైపు రైళ్లు, బస్సుల్లో ఎన్నికల రద్దీ పరిస్థితి ఇలా ఉండగా, ఎన్నికల సందర్భంగా సొంత ఊళ్లో ఓటు వేసేందుకు బయలుదేరే ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు ప్రత్యేక రాయితీని ప్రకటించాయి. ‘ఘర్ జావో ఓట్ కరో’అనే నినాదంతో థామస్ కుక్ ప్రచారం చేపట్టింది. ఏప్రిల్ నుంచి మే వరకు ఎన్నికల సందర్భంగా రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీని ప్రకటించింది. దేశీయ ప్రయాణాలపైన రూ.1000 చొప్పున, అంతర్జాతీయ ప్రయాణాలపైన రూ.3000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకొనేందుకు ప్రయాణికులు ఆధా ర్ కార్డును, తిరుగు ప్రయాణంలో అయితే ఓటు వేసిన సిరా గుర్తును చూపితే చాలు. ఈ రాయితీ లభిస్తుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. -
టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకండి
పిల్లలూ జాగ్రత్త మెదక్ : స్కూల్ లేదు.. హోంవర్క్ గోలలేదు.. అసైన్మెంట్ల లొల్లిలేదు.. ఏడతిరుగుతున్నావురా... పుస్తకాలు ముందేసుకుని చదువుకోవచ్చుగా...ఇలాంటి అరుపులు లేవు...ఈ సమ్మర్ హాలీడేస్లు పిల్లలకు జాలీడేసే. ఎంచక్కా టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుని కూర్చుందామనుకునే పిల్లలపై పెద్ద లు లుక్కేయ్యాల్సిందే. లేకుంటే మీ పిల్లల్ని అందరూ ‘లడ్డూ’ అని పిలవాల్సి వస్తుందండి బాబు. రోజుకు మూడు నాలుగు గంటలు టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోవడం, సరైన వ్యాయా మం లేకపోడంతో...బెలూన్లలా ఉబ్బిపోతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. రెండు గంటల కంటే ఎ క్కువగా టీవీ చూస్తే కంటి జబ్బులు వస్తాయని వైద్యులు అంటున్నారు. ఒంటికి వ్యాయామం అవసరం... ఎలాగూ సెలవులే కదా అని అస్తమానం రిమోట్ పట్టుకుని వీడియో, ఇండోర్ గేమ్స్ ఆడటం... విసుగనిపిస్తే నెట్‌బ్రౌజింగ్ చేయడం, సినిమా సీడీలతో కాలక్షేపం మితిమీరితే ఇబ్బందే మరి. ఇరవై నాలుగ్గంటలూ కుర్చీలు, సోఫాల కు అత్తుక్కుపోయి టీవీలు, కంప్యూటర్ల ఆటలకే పరి మితం కావొద్దు. ఒంటికి కాస్త వ్యాయామం కూడా ఇవ్వాలి. ఫ్రిజ్‌నిండా వేసవి రుచులు నింపుకుని, టీవీ, కంప్యూటర్లతో ఆటలాడు తూ మధ్యమధ్యలో ఎం చక్కా చిరుతిళ్లు లాగించేస్తే ఆరోగ్యం పాడవడంతోపాటు లావెక్కిపోతారు.స్కూళ్లు తెరవగానే లావెక్కిన పిల్లలను ‘లడ్డొడా..’ అంటూ ఎగతాలిచేసే ప్రమాదం ఉంది. శరీరానికి శ్రమఇవ్వాలి. అప్పుడప్పుడు బయటకు వెళ్లి పరగెత్తాలి, నడవాలి.. ఆడుకోవాలి.