సిటీ ‘ఎలక్షన్‌ టూర్‌’ | Public holydays on elections time | Sakshi
Sakshi News home page

సిటీ ‘ఎలక్షన్‌ టూర్‌’

Published Tue, Apr 2 2019 4:48 AM | Last Updated on Tue, Apr 2 2019 4:48 AM

Public holydays on elections time - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు పిల్లలకు వేసవి సెలవులు.. మరోవైపు ఎన్నికలు.. పైగా ఉగాది పర్వదినం.. అన్నీ ఒకేసారి కలిసి రావడంతో నగరవాసులు ‘ఎన్నికల టూర్‌’కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత ఊళ్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనే పట్టుదలతో పల్లె బాట పడుతున్నారు. ఎన్నికలు, ఉగాది సందర్భంగా కలసి వచ్చే వరుస సెలవుల దృష్ట్యా కూడా చాలా మంది పయనమవుతున్నారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు 10 లక్షల మందికి పైగా నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లనున్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు బయలుదేరే ఏసీ, నాన్‌ ఏసీ బస్సుల్లో సగానికిపైగా రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోనూ వెయిటింగ్‌ లిస్టు భారీగా పెరిగింది.

కొన్ని రైళ్లలో 150 నుంచి 200కు పైగా వెయిటింగ్‌ ఉంది. మరికొన్ని రైళ్లలో రిజర్వేషన్ల బుకింగ్‌ సైతం నిలిపివేశారు. వాటిలో ‘నో రూమ్‌’దర్శనమిస్తోంది. వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఎన్నికల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లలోనూ బెర్త్‌లన్నీ భర్తీ అయ్యాయి. ప్రత్యేకించి ఏపీకి వెళ్లేందుకు ఇప్పటికిప్పుడు ఎలాంటి అవకాశం లేదు. ఎన్నికల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని రైళ్లు అదనంగా ఏర్పాటు చేస్తే తప్ప జనం సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం లేదు. తెలంగాణలోనూ వివిధ జిల్లాలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లనున్నారు. ఎండాకాలం దృష్ట్యా ఇప్పటికే పలు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరో వారం రోజుల్లో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరుకోనుంది.

అదనపు రైళ్లేవి...
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ నుంచి విశాఖ, తిరుపతి, ముంబై, బెంగళూర్‌ తదితర ప్రాంతాలకు సుమారు 50 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. వీటిలో చాలా వరకు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లే ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో ఉండే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఈ రైళ్లు ఎన్నికల రద్దీకి అనుగుణంగా అందుబాటులో లేవు. దీంతో రెగ్యులర్‌ రైళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సుమారు 85 రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఈ నెల 5 నుంచి 12 వరకు పూర్తిగా బుక్‌ అయ్యాయి. రద్దీ రెట్టింపయింది. సాధారణ రోజుల్లో మూడు రైల్వేస్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులతో పాటు ఎన్నికల సందర్భంగా మరో 1.5 లక్షల మందికి పైగా బయలుదేరే అవకాశం ఉంది. కానీ ఈ అదనపు రద్దీని అధిగమించేందుకు ఇప్పటి వరకు దక్షిణమధ్య రైల్వే ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. ఏసీ, నాన్‌ ఏసీ బోగీలన్నీ బుక్‌ అయిన దృష్ట్యా ప్రయాణికులు అప్పటికప్పుడు సాధారణ బోగీలను ఆశ్రయించవలసి ఉంటుంది. కానీ ఈ జనరల్‌ బోగీల్లోనూ రెట్టింపుగా తరలివెళ్లే అవకాశం ఉంది. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతోపాటు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్న దృష్ట్యా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది.

ప్రత్యేక బస్సులకు ఆర్టీసీ ప్రణాళిక...
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 1000 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీఎస్‌ఆర్టీసీతో పాటు, ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా నగరంలోని కూకట్‌పల్లి, మియాపూర్, ఎస్సార్‌ నగర్, అమీర్‌పేట్, ఈసీఐఎల్, సైనిక్‌పురి, ఎల్‌బీ నగర్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధి కారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అను గుణంగా ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేక బస్సు లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సైతం సిద్ధమవుతున్నాయి. ఎన్నికల సంద ర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చార్జీలను రెట్టింపు చేసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి.

విమాన ప్రయాణాల్లో రాయితీ
ఒకవైపు రైళ్లు, బస్సుల్లో ఎన్నికల రద్దీ పరిస్థితి ఇలా ఉండగా, ఎన్నికల సందర్భంగా సొంత ఊళ్లో ఓటు వేసేందుకు బయలుదేరే ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు కొన్ని ట్రావెల్‌ ఏజెన్సీలు ప్రత్యేక రాయితీని ప్రకటించాయి. ‘ఘర్‌ జావో ఓట్‌ కరో’అనే నినాదంతో థామస్‌ కుక్‌ ప్రచారం చేపట్టింది. ఏప్రిల్‌ నుంచి మే వరకు ఎన్నికల సందర్భంగా రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీని ప్రకటించింది. దేశీయ ప్రయాణాలపైన రూ.1000 చొప్పున, అంతర్జాతీయ ప్రయాణాలపైన రూ.3000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకొనేందుకు ప్రయాణికులు ఆధా ర్‌ కార్డును, తిరుగు ప్రయాణంలో అయితే ఓటు వేసిన సిరా గుర్తును చూపితే చాలు. ఈ రాయితీ లభిస్తుందని ఆ సంస్థ స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement