సాక్షి, అమరావతి: ఐస్ ఆపిల్‌గా పిలిచే తాటి ముంజలపై కరోనా ప్రభావం పడింది. ప్రతి ఏడూ వేసవి కాలంలో పసందు చేసే తాటి ముంజలు ఈ ఏడాది వేసవిలో అసలు కనిపించడం లేదు. ప్రస్తుతం కరోనా కాలం కావడంతో చెట్ల నుంచి కాయలు దించే వారు కరువయ్యారు. వాటిని కోసి, ముంజలు తీసి అమ్మే వాళ్లు కూడా కరోనా భయంతో బయటకు రావడం లేదు. ఒకవేళ దూరాభారం నుండి మార్కెట్‌కు తీసుకొచ్చినా ప్రస్తుతం జనసంచారం తక్కువగా ఉన్న పరిస్థితుల్లో వ్యాపారం జరుగుతుందో లేదోనని సీజనల్ వ్యాపారులు మిన్నకుంటున్నారు. ఫలితంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే తియ్యటి తాటి ముంజలు ఈసారి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి.
ఐస్ ఆపిల్ అని ఎందుకంటారంటే..
వేసవి ప్రత్యేక ఫలాల్లో ఒకటైన తాటి ముంజ పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటుంది. ముంజ లోపల తియ్యటి నీరుంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, వేసవి తాపం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుకనే దీన్ని ఐస్ యాపిల్ అంటారు. ముంజల్లో నీటి శాతం ఎక్కువ. వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ఇవి మనకు ఉపయోగపడతాయి.
ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే..
తాటి ముంజల్లో క్యాలరీలు తక్కువ. పోషకాలు ఎక్కువ. ముంజలపై తెల్లగా ఉండే పై పొరతో పాటుగా తింటే శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయని డాక్టర్లు సైతం చెబుతున్నారు. వీటిలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వడదెబ్బ తగలకుండా రక్షణనిస్తాయి. శరీరానికి కావాల్సిన ఏ, బీ, సీ విటమిన్లతోపాటు కరోనా కాలంలో విస్తృతంగా వాడుతున్న ఐరన్, జింక్, ఫాస్పరస్, క్యాన్సర్,కాలేయ సంబంధ వ్యాధుల్ని తగ్గించే పొటాషియం ముంజల్లో పుష్కలంగా లభిస్తాయి. శరీర బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఆటలమ్మ (చికెన్‌పాక్స్)తో బాధ పడేవారికి ఒంటిపైన వీటితో రుద్దితే ఉపశమనం కలుగుతుంది.
చెట్టు దిగనంటున్న 'ఐస్ ఆపిల్'
Published Sun, May 9 2021 4:59 AM | Last Updated on Sun, May 9 2021 9:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment