
వేసవిలో మాత్రమే కనిపించే సీజనల్ ఫుడ్ తాటి ముంజలు. ఇవి చూసేందుకు చిన్నవైనా పోషకాల్లో మెండు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగించే దివ్య ఔషధం. ప్రకృతి వరప్రసాదంగా మారి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది.
ఎండలు మండుతుండడంతో ప్రజలు పండ్లు, పానీయాలు సేవిస్తుంటారు. కానీ వేసవిలో మాత్రమే లభించే ముంజలు తప్పక తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వేసవిలో సాధారణంగా మామిడి, పుచ్చకాయ, జామ, ఖర్బూజా ఇలా అనేక రకాల పండ్లు, పానీయాలు తీసుకుంటుంటారు. కానీ వీటిని మించి పోషకాలు ముంజల్లో ఉంటుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవి ఉంటుండడంతో వీటిని పట్టణాలకు తరలించి పలువురు ఉపాధి పొందుతున్నారు.
నగరంలో వ్యాపారం
గ్రామాల్లో తాటి ముంజల ఉపాధి మూడు పూలు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ప్రధాన రహదారుల వెంట తాటి ముంజలు కనిపించని చోటు లేదు. ఆటోల్లో నగరానికి తరలించి విక్రయిస్తున్నారు. పలువురు వ్యాపారులు నగరం నుంచి వచ్చి పల్లెల్లో గీత కార్మికుల వద్ద ముంజలు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు. వీటి ధర సుమారు రూ.100 నుంచి 150 వరకు ఉంది. చాలా మంది గీత కార్మికులు, ముదిరాజ్ కులస్తులు కుటుంబ సభ్యులు నగరంలో జోరుగా వ్యాపారం సాగిస్తున్నారు.
చదవండి👉🏾 Health Tips: తల దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే
పోషకగని
తాటి ముంజల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఎ, బీ, సీతో పాటు ఐరన్, జింక్ , పాస్పరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలుంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపుతాయి. దీంతో శరీరం శుభ్రమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. తాటి ముంజలకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటడంతో వేసవిలో ఎంతో మేలు చేస్తాయి.
ఎండ వలన కలిగ ఆలసట నీరసాన్ని దూరం చేస్తుంది. మలబద్దకం సమస్యను నివారించడంలో ముంజలు బాగా పని చేస్తాయి. వీటిని తరుచుగా తినడం వలన జీర్ణక్రీయ మెరుగుపడుతుంది. అజీర్తి, ఎసిడిటీ సమస్యలు దరిచేరవు. మొటిమలను తగ్గించడంలోను మంజలు పని చేస్తాయి. వీటిని గర్భిణులు ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది.