summer games
-
సమ్మర్ డేస్: చలువ పందిరి జ్ఞాపకం
వేసవి ఈ కాలపు పిల్లలకు ఏం జ్ఞాపకాలు మిగులుస్తోంది? ఓటిటిలో కొత్త సినిమా... వేరే చోట ఉండే మేనత్త కొడుకుతో ఇంట్లో కూచుని ఆడే వీడియో గేమ్? ఐఐటి ఫౌండేషన్ కోర్సులో చేరిక... మహా అయితే కింద సెల్లార్లో వెహికిల్స్‌కు తగలకుండా ఆడే క్రికెట్ షాట్సు.. ఇదా వేసవి అంటే.. ఆ చలువ పందిళ్లు ఎక్కడా? ఆ తాటి ముంజలు ఎక్కడా? ఆ మల్లెజడల ఫొటోలు ఎక్కడా? ఆ తెలుగుదనపు సంపద ఎక్కడా? ఎక్కడమ్మా ఆ రోజులు. మార్చి నెల రావడంతోనే చందాలు మొదలవుతాయి బజారు వీధిలో. అంగళ్లు ఉన్నవాళ్లంతా తలా ఇంత అని ఇస్తారు. ఎవరో ఒకరు ముందుకు పడి బజారు ఉన్నంత మేరా చలువ పందిరి వేయిస్తారు. సవక కర్రలు, కొత్త తాటాకులు, వెదురు బొంగులు అన్నీ కలిసి బజారు వీధిని ఎండ తగలకుండా కప్పేస్తాయి. ఇక ఎండాకాలం అయ్యేంత వరకూ ఊరికి అదే వేదిక. మధ్యాహ్నం పన్నెండైతే చాలు రిక్షా వాళ్లొచ్చి దాని కిందే ఆగుతారు. సోడా బండ్లు దాని కిందే ఉంటాయి. చల్లమజ్జిగను కుండలో పెట్టుకుని అమ్మే ముసలాయన అక్కడే. మరి పిల్లలు? అక్కడే కాలక్షేపం. ఇంట్లో బోర్. బయట ఎండ. ఆ చలువ పందిరి కింద అటూ ఇటూ తిరుగుతూ చోద్యం చూడటమే పని. అంగళ్ల వాళ్లు చల్లగా కూచుని బేరాలు చేస్తూ లాగే రిక్షా నుంచి సరుకు దించుకుంటూ మధ్య మధ్య తాటి ముంజల గెలలు అటుగా వెళుతుంటే కొని ఇళ్లకు పంపిస్తూ కూల్‌డ్రింక్ షాపు నుంచి ఆరంజ్ క్రష్ తెప్పించుకుంటూ ఆ భోగమే వేరు. చలువ పందిరి వేసీ వేయగానే శ్రీరామ నవమి వస్తుంది. నవమి తొమ్మిది రోజులు విష్ణాలయం వారు అక్కడే ప్రోగ్రాములు పెట్టిస్తారు. నాలుగు బల్లలు వేస్తే అదే స్టేజ్. పక్కనే ఉండే సవక గుంజకు తొమ్మిది రోజుల ప్రోగ్రామ్ పోస్టరు ఉంటుంది. ఆ రోజు ప్రోగ్రామ్‌ను పలక మీద రాసి కడతారు. ‘రుక్మిణీ కల్యాణం– హరికథ– చెప్తున్నది ఫలానా ఆమె– బ్రాకెట్లో ఆకాశవాణి ఆర్టిస్టు అని ఉంటుంది. పిల్లలు దానిని నోరు తెరుచుకుని చదివి సాయంత్రం 7 నుంచి మొదలయ్యే ఆ కార్యక్రమానికి స్నానాలు చేసి తల దువ్వుకుని అమ్మ దగ్గర ఒక పావలా తీసుకొని వస్తారు. మరుసటి రోజు బుర్ర కథ ఉంటుంది. ఇంకోరోజు సత్య హరిశ్చంద్ర కాటిసీను. ఒకరోజు మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్, మేజిక్ షో ఉంటాయి. చివరి రోజు పాటకచ్చేరి. దీని కోసమే జనం యుగాలుగా ఎదురు చూస్తున్నట్టుంటారు. పిల్లలు ఆ పాటకచ్చేరి స్టేజి చుట్టూ మూగి డ్రమ్స్, తబలా, గిటార్లను నోరు తెరుచుకుని చూస్తారు. ముందు వాతాపిగణ పతిం భజే పాడి ఆ తర్వాత రెండు ఘంటసాల పాటలు వేసుకుని ఆ తర్వాత ‘రాక్షసుడు’ నుంచి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ పాడతారు. అక్కడే గుగ్గిళ్లు అమ్మేవాడు పిల్లల డబ్బులకు తగిన గుగ్గిళ్లు ఇచ్చి వెళతాడు. పీసుమిఠాయి బండి అక్కడే ఉంటుంది. రౌండ్‌గా ఉండే రేకు డబ్బాలో రోజా రంగు ఐస్‌క్రీమ్ అమ్మేవాడు కూడా అక్కడే ఉంటాడు. చిల్లర ఉన్న పిల్లలు కొనుక్కుంటారు. లేని పిల్లలకు కొనిపెడతారు. ఇంతలో ఒకడు ‘ఆకుచాటు పిందె తడిచె’ కావాల్సిందేనని పట్టుబడతారు. ఆ పాటను ప్రిపేర్ అయి రాని పాటకచ్చేరి బృందం కచ్చాపచ్చాగా పాడి ప్రమాదం నుంచి బయటపడుతుంది. చలువ పందిరి కింద మధ్యాహ్నం అయ్యాక లూజుగా పోసిన మల్లెమొగ్గలు అమ్ముతూ తిరిగేవాళ్లుంటారు. ఆడవాళ్లు రేకు డబ్బా నిండుగా రెండు రూపాయల లెక్కన కొంటారు. ఇంటికి తీసుకెళ్లి ఓపిగ్గా వాటిని కడతారు. ఆడపిల్లలకు జడ కుట్టే సీజను ఇదే. మల్లెపూలు, కనకాంబరాలు, మరువం మూడు వరుసలు చేసి మూడు రంగులతో కళకళలాడిస్తారు. కలిగిన వాళ్లు బంగారు జడబిళ్లలు పెట్టుకుంటారు. ఫొటో సమయంలో పాపిటబిళ్ల సరేసరి. లేదంటే స్టూడియోవాడు ఇస్తాడు. జడ అద్దంలో పడేలా ఒక ఫోటో దిగి అది వచ్చే వరకు ఆడపిల్లలు వెయిట్ చేస్తారు. వచ్చాక ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలిస్తే ఎప్పటికీ అది అలా ఉండిపోతుంది. ఊళ్ల నుంచి బంధువుల పిల్లలు వస్తారు. గోలీలు, బొంగరాలు తెస్తారు. బజారులో దొరికే గోలీలు ఎవరి దగ్గరైనా ఉంటాయి. కాని సోడా గోలీలు ఉన్నవాళ్లు గొప్ప. నీలం రంగులో ఉండే ఆ గోలీలు భలే మెరుస్తాయి. పెద్దసైజు గోలీని డంకా అంటారు. రెండు గోలీలు గోడకు వేసి డంకాతో కొడితే ఒక గోలీ లాభం. చెట్టు కింద అరుగులు కూడా ఈ కాలంలో కళకళలాడుతాయి. వేపచెట్టు నీడలో పిల్లలు ‘సీతారాములు’ ఆట ఆడతారు. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు పేర్లు చీటీలలో రాసి నలుగురూ నాలుగు చీటీలు ఎత్తుకొని సీత ఎవరో కనిపెట్టమంటారు. కనిపెడితే మార్కులు. ఈ కాలంలోనే పరమపద సోపానపటం ఆడతారు. ఈలోపు అమ్మ కిరిణీ పండును తొక్క తీసి ముక్కలు చేసి కాసింత చక్కెర అలంకరణగా జల్లి ఇస్తుంది. అవి తిని చేయి కడుక్కోకుండానే ఆటకు పరుగు. వేసవి వస్తే ఒక ఊరి పిల్లలు ఇంకో ఊరు చూస్తారు. కాదు.. ఒక ఊరి పిల్లలు ఇంకో ఊళ్లో ఉండే తమ వారిని చూస్తారు. వీరు తమ మనుషులు అని ఆనందిస్తారు. బంధాలను బాల్యం నుంచే పెనవేసుకుంటారు. మేనత్తకు ఒక మేనల్లుడంటే ఇష్టం. పెద్దమ్మకు ఒక చెల్లికూతురు అంటే ప్రాణం. పిన్ని ఫలానా బుజ్జిగాడి కోసం డబ్బు దాచి సినిమాకు పోరా అని ఇస్తుంది. బంధువులొస్తే కజ్జికాయలు వండుతారు. పొయ్యి దగ్గర కూచుని మాటలు మరిగిస్తారు. రాత్రిళ్లు పెరట్లో నులకమంచాలు వేసుకుని ఆకాశాన్ని చూస్తూ కథలు చెప్పుకుంటారు. నీళ్లు జల్లి డాబాల మీద పక్కలు వేస్తారు. చందమామలు చదివి తెలుగు నేరుస్తారు. బాలమిత్ర లోకంలో తమను తాము మరుస్తారు. చద్దన్నం రుచి తెలుస్తుంది. బండి వాడు అతి సన్నగా కోసిన పావలా బద్ద పుచ్చకాయను ఎంత ఆలస్యంగా తిందామనుకున్నా తొందరగానే అయిపోతుంది. స్కూల్లో చదువుకున్నది స్కూలు చదువు. వేసవిలో చదువుకునేది మరో చదువు. అలాంటి చదువు ఇప్పుడు ఉందా.. లేకపోవడం వల్ల దూరం చేస్తున్నామా... ఉండీ దూరం చేస్తున్నామా... మూలాలు ఉన్న మొక్కలు గట్టిగా ఎదుగుతాయి. వేసవిలో పడాల్సిన వేర్లు పిల్లలకు పడనివ్వండి. -
అశోక్ అద్వైత్కు రజతం
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ స్విమ్మర్ కౌషిక అశోక్ అద్వైత్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అబుదాబి వేదికగా జరిగిన ఈ అంతర్జాతీయ టోర్నమెంట్లో అద్వైత్ దేశానికి పతకాన్ని అందించాడు. స్విమ్మింగ్‌లో పోటీపడిన అద్వైత్ బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో రాణించి రజత పతకాన్ని సాధించాడు. ఈ టోర్నమెంట్లో జాతీయ జట్టుకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ప్లేయర్ అద్వైత్ మాత్రమే. ఢిల్లీ వేదికగా జరిగిన అర్హత పోటీల్లో సత్తా చాటిన అద్వైత్ వరల్డ్ సమ్మర్ ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందు కు అద్వైత్ 2016 నుంచి గచ్చిబౌలిలో ఎన్ఐఎస్ కోచ్ ఆయుశ్ యాదవ్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందు తున్నాడు. స్విమ్మింగ్‌లోనే కాకుండా చదువుల్లో నూ రాణిస్తోన్న అతను అరోరా కాలేజీలో డిగ్రీ (బ్యాచ్‌లర్ ఇన్ టూరిజం స్టడీస్ మేనేజ్మెంట్) చదువుతున్నాడు. ఈనెల 14 నుంచి 21 వరకు అబుదాబిలో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తం 21 పతకాలను సాధించింది. అందులో 9 స్వర్ణాలు, 6 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అద్వైత్ కఠిన శిక్షణ పొందాడని కోచ్ ఆయుశ్ తెలిపారు. ప్రతిరోజు 5 గంటల పాటు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేవాడని పేర్కొన్నారు. -
క్రీడలతో వేసవి సెలవుల సందడి
విజయనగరం అర్బన్: వేసవి కాలం వచ్చేసింది... మరో 20 రోజుల్లో విద్యార్ధులకు వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి... ఇక సమ్మర్‌ను ఎలా ఎంజాయ్ చేయాలో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రణాళికలు వేసుకుంటున్నారు. కొందరేమో బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్లినా ఎక్కవ రోజులు ఊర్లలోనే ఉంటారు. ఇళ్లలోనే ఉన్న విద్యార్ధులకు స్థానికంగా ఉన్న క్రీడామైదానాల్లోనూ, ఇండోర్‌లోనూ క్రీడలు ఆడుకోవడానికి సిద్దమవుతున్నారు. ఇక.. క్రీడా పరికరాల దుకాణాల్లో అయితే కనిపిస్తున్న సందడి అంతా ఇంతా కాదు. పరికరాలు కొనుగోలు చేస్తున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు పట్టణాలల్లో క్రీడా సామగ్రి లభించే దుకాణాలు ఉన్నాయి. ఖరీదు ఎంతైనా తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తూ చిన్నారులు ఎంజాయ్‌లో మునిగి తేలు తున్నారు. క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, క్యారమ్, హాకీ, షటిల్ తదిరతాలపై మక్కువ చూపుతున్నారు. మార్కెట్లలో లభిస్తున్న క్రీడాపరికరాలు... వాటి ధరలు... ప్రయోజనాలపై కథనం. చదరంగం: జిల్లాలో చెస్ (చదరంగ)కు మంచి ఆదరణ ఉంది. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచడానికి చెస్ ఎంతో దోహదపడుతుంది. చెస్ బోర్డు రూ.55 నుంచి రూ.700 వరకు ధరలలో లభిస్తున్నాయి. ఇంట్లోనే కూర్చుని ఈ ఆట ఆడుకోవచ్చు. మెదడుకు మేత చదరంగం ఆట. పిల్లలకు ఈ క్రీడ అలవరిస్తే చదువులో కూడా ఎంతో రాణించే అవకాశాలున్నాయి. స్విమ్మింగ్ క్రీడలు: వేసవిలో స్విమ్మింగ్ (ఈత)కు విద్యార్ధులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. పట్టణంలోని కంటోన్మెంట్లో ఆక్వా స్విమ్మింగ్ శిక్షణా కేంద్రం ఉంది. స్విమ్మింగ్ తెలిసనివారు, నేర్చుకోవాలనుకున్నవారు ఫీజు కాకుండా దుస్తులు, ఇతర వాటిని కొనుగోలు చేయక తప్పదు. గాగుల్స్ (కంటి అద్దాలు) రూ.70 నుంచి రూ.250, క్యాష్ నిక్కర్ రూ.80 వరకు ధరలలో అమ్మకాలు చేస్తున్నారు. బాక్సింగ్....: బాక్సింగ్ క్రీడ అరుదుగా ఆడుతుంటారు. కానీ ఇటీవల జిల్లా కేంద్రం నుంచి బాక్సింగ్ పోటీలకు వెళ్తున్న క్రీడాకారులు పలు పతకాలు సాధిస్తున్నారు. బాక్సింగ్‌ను నవతరానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకు అవసరమైన దుస్తులు, సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. కిట్ బ్యాగ్ (ఇసుక నింపినన సంచి) రూ.180 నుంచి రూ.600, గ్లౌజెస్ రూ.350, బ్యాండేజ్ రూ.120 ధరల్లో లభిస్తున్నారు. క్రికెట్.... క్రేజీ: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ క్రేజీ కొనసాగుతోంది... క్రికెట్ అంటేనే నేటితరం విద్యార్ధులు, యువకులు వెర్రెత్తి పోతున్నారు. క్రికెట్ క్రీడ నగరాల నుంచి గ్రామాలకు పాకింది. ఇంకేముంది సెలవులు రావడంతో ఉదయాన్నే చిన్నారులు బ్యాట్లు, బాలు చేతబట్టి మైదానాల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే... ఈ ఆట ఆడాలంటే క్రికెట్ సామగ్రి సొంతంగా అవసరం తప్పదు. రూ.250 మొదలుకుని రూ.4 వేలు వరకు క్రికెట్ బ్యాబ్ ధరలలో అందుబాటులో ఉన్నాయి. బీడీఎం, ఎస్జీ, ఎస్ఎఫ్, ఎస్ఎస్, కోకో బుర్రా తదితర రకాలు అందుబాటులో ఉన్నాయి. రూ.150 నుంచి రూ.600 వరకు పీస్ బాల్ అమ్ముతున్నారు. స్టంప్స్, బాల్స్, బ్యాట్, గ్లౌవ్స్ అన్ని కలుపుకుని రూ.14 వేల వరకు ధరల్లో లభిస్తున్నాయి. ఫుట్‌బాల్....: ఫుట్‌బాల్ క్రీడతో ఎక్కువ కిలోక్యాలరీల శక్తి ఖర్చవుతుంది. రోజూ గంటపాటు సాధన చేస్తే 150 నుంచి 200 కిలో కేలరీలు ఖర్చవుతాయి. రూ.100 నుంచి రూ.1,700 వరకు విలువు చేసే నివై, కాస్కో, విక్సన్ రకాల కంపెనీల పుట్బాల్లు లభిస్తున్నాయి. క్యారమ్ బోర్టు! క్యారమ్ బోర్డు క్రీడ ఇంట్లో కూర్చురి ఆడే ఆట. పిల్లలు, పెద్దలు ఈ ఆట ఆడడం సహజం. చాకచక్యంగా, సమయస్పూర్ధితో ఆడే ఆట ఇది. అయితే.... ప్రస్తుతం క్యారమ్ బోర్టులు దుకాణాల్లో రూ.400 నుంచి రూ.5,000 వేలు వరకు ఉన్నాయి. వాలీబాల్... ఓ మంచి వ్యాయామ క్రీడ: వాలీబాల్ మంచి వ్యాయామ క్రీడ. బాగా ఎత్తులో ఉండేవారికి ఈ క్రీడ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వాలీబాల్ ధరలు రూ.300 నుంచి రూ.1,500 వరకు విలువు విలువ చేసే కాస్కో, నివై, ఆష్టో, విక్సన్ తదితర కంపెనీల వాలీబాల్లు అందుబాటులో ఉన్నాయి. బాస్కెట్‌బాల్, హ్యాండ్ బాల్ ధరలు ఆయా కంపెనీల ఆధారంగా రూ.220 నుంచి రూ.700 వరకు ఉన్నాయి. జాతీయ క్రీడ... హాకీ: జాతీయ క్రీడ హాకీ క్రీడపై ఎక్కువ మందికి మక్కువ లేకపోయినా జిల్లాలో ఈ క్రీడ మనుగడలో ఉంది. ఈ క్రీడలో కండరాలు బలంగా తయారవుతాయి. హాకీ స్టిక్స్ రూ.75 నుంచి రూ.1,500 వరకు విలువ చేసేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. షటిల్బాడ్మెంటన్...: షటిల్ అన్ని రకాల వయస్సుగల వారు ఆడుకునే క్రీడ ఇది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీపీ, షుగర్ వ్యాధి గ్రస్తులకు ఈ క్రీడ మంచి చేస్తుంది. సాధారణంగా ఫటిల్ ఆడే వారి బ్యాట్ ధర రూ.50 నుంచి టోర్నమెంట్ ఆదే క్రీడాకారుల బ్యాట్ల ధరలు రూ. 17 వేల వరకు ఉన్నాయి. యోనెక్స్, లెనిన్, కామాక్షి, క్యూకీ, మాక్స్‌ప్రో, యాంగ్ తదితర రకాల మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వైకుంఠపాలి...: ఇంట్లో పిల్లలు, పెద్దలు కలిసి ఆడే ఆట వైకుంఠపాలి. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఈ ఆట ఆడేవారు. ఇప్పుడు మళ్లీ ఈ ఆటకు ఆదరణ ఇటీవల పెరిగింది. నిచ్చెన, పాములు ఉండే ఈ ఆటను ఆడడం చాలా సరదాగా ఉంటుంది. గవ్వలతో ఆడుతారు. ఎన్ని గవ్వలు పడితే అన్ని గడులు దాల్సి ఉంటుంది. అందులో నిచ్చెన వస్తే పైకి వెళ్లడం, పాములు వస్తే కిందకు దిగడం జరుగుతుంది. ఆట మొత్తంలో ఎవరు వైకుంఠానిఇక చేరుతారో వారే విజేతలన్న మాట. ఈ క్రీడ ఆడే వైకుంఠ పటం రూ.40 నుంచి రూ.250 వరకు లభిస్తున్నాయి. ఆత్మ రక్షణకు కరాటే...: కరాటే ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యార్ధినులు కరాటే నేర్చుకోవడం ఎంతో మేలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే కరాటే శిక్షణ ఇప్పిస్తున్నారు. అయితే... వేసవిలో విద్యార్ధలు కరాటే నేర్చుకోవడానికి అవసరమైన డ్రెస్‌లు రూ.300, నాన్చాక్కు రూ.60 నుంచి రూ.120 వరకు దరల్లో లభిస్తున్నాయి. జిల్లాలో వేసవి శిక్షణ కేంద్రాలు కూడా వెలిశాయి.