సాక్షి, హైదరాబాద్: యాంటి కేన్సర్ ఔషధాల ధరలను మరోసారి తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఏడాది మార్చి, మే నెలల్లో రెండు దఫాల్లో 399 రకాల కేన్సర్ ఔషధాల ధరలను భారీగా తగ్గించింది. ఒక్కో మందు ధర 60–87 శాతానికి తగ్గింది. ఇప్పుడు ఈ జాబితాలో మరిన్ని మందులను చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలోనే ధరలు తగ్గనున్న మందుల జాబితాను విడుదల చేయనున్నట్టు ఎన్‌పీపీఏ అధికారులు తెలిపారు. ఇటీవల కీమో థెరఫీ చికిత్సలో వినియోగించే 9 రకాల డ్రగ్స్ ధరలను ఎన్‌పీపీఏ తగ్గించగా, కొత్త ధరకు పాత ధరకు భారీ వ్యత్యాసం కనిపించింది. ఇందులో ఊపిరితిత్తుల కేన్సర్‌కు సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి.
కొత్త ధరల ప్రకారం పెమెట్రెక్సెడ్ 500ఎంజీ ఇంజక్షన్ రూ.2,800లకు లభిస్తోంది. గతంలో దీని ధర రూ.22,000 ఉండేది. 100 ఎంజీ ఇంజక్షన్ ధర రూ.7,700 నుంచి రూ.800లకు తగ్గింది. ఎపిక్లర్ బ్రాండ్ 10 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.561 నుంచి రూ.276కు.. 50 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.2,662 నుంచి రూ.960కు దిగింది. దీంతో పాటు ఎర్లో టినిబ్ 100 ఎంజీ టాబ్లెట్స్ (30 టాబ్లెట్ల ప్యాక్) ధర రూ.6,600 నుంచి రూ.1,840కు.. 150ఎంజీ ట్యాబ్లెట్ రూ.8,800 నుంచి రూ.2400లకు తగ్గింది. లానోలిమస్ బ్రాండ్ సైతం రూ.726 నుంచి రూ.406కు దిగివచ్చింది. మరిన్ని రకాల ఔషధాల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment