prices reduce
-
ఏటీఎఫ్ ధర 6 శాతం తగ్గింపు..
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా వరుసగా పెరుగుతూ వచి్చన విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు తాజాగా దాదాపు 6 శాతం తగ్గాయి. అయితే, వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ (19 కేజీలు) రేటు రూ. 101.5 మేర పెరిగింది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ (14.2 కేజీలు) ధర మాత్రం యధాతథంగా రూ. 903 (ఢిల్లీలో) వద్దే ఉంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 6,954.25 మేర (5.79 శాతం) తగ్గి రూ. 1,18,199.17కి దిగి వచి్చంది. జూలై నుంచి చూస్తే నాలుగు నెలల్లో విమాన ఇంధనం ధర రూ. 29,391 మేర పెరిగింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఇంధనం వాటా దాదాపు 40 శాతం ఉంటున్న నేపథ్యంలో తాజా తగ్గింపుతో విమానయాన సంస్థలకు కాస్త ఊరట లభించనుంది. మరోవైపు, సవరించిన రేట్ల ప్రకారం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,833గా ఉంటుంది. వాణిజ్య సిలిండర్ ధరను పెంచడం ఇది రెండోసారి. అక్టోబర్ 1న రేటును ఏకంగా రూ. 209 మేర ఇంధన కంపెనీలు పెంచాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) సంస్థలు .. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ప్రతి నెల 1న వంట గ్యాస్, ఏటీఎఫ్ ధరలను సవరిస్తాయి. -
మైనస్‌లోకి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కమోడిటీ ధరల క్షీణతతో ఆహారం, ఇంధనం, ఇతరత్రా ముడి సరుకుల రేట్లు తగ్గిన నేపథ్యంలో టోకు ధరలు దాదాపు మూడేళ్లలో తొలిసారిగా మైనస్‌లోకి జారిపోయాయి. ఏప్రిల్‌లో 34 నెలల కనిష్టానికి దిగివచ్చాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 0.92 శాతంగా నమోదైంది. చివరిసారిగా 2020 జూన్‌లో డబ్ల్యూపీఐ .. మైనస్ 1.81 శాతంగా నమోదైంది. ఇది గత 11 నెలలుగా తగ్గుదల బాటలోనే కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్‌లో బేస్ అధికంగా 15.38 శాతం స్థాయిలో ఉండటం కూడా ఏప్రిల్‌లో తాజా పరిస్థితికి కారణమని అధికారవర్గాలు తెలిపాయి. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఈ మార్చ్‌లో 1.34 శాతంగా ఉంది. టోకు ధరలు ఏటా క్షీణిస్తుండటాన్ని సాంకేతికంగా ప్రతిద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. ‘2023 ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం రేటు మందగించడానికి ప్రధానంగా ఆహారోత్పత్తులు, ప్రాథమిక లోహాలు, టెక్స్టైల్స్, ఆహారేతర ఉత్పత్తులు, రసాయనాలు.. రసాయన ఉత్పత్తులు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, పేపర్.. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గడం కారణం’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లోనూ ఇలాగే.. కమోడిటీల ధరలు తగ్గే కొద్దీ రాబోయే రోజుల్లోనూ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మరింత తగ్గడం కొనసాగవచ్చని బార్క్లేస్ ఒక నివేదికలో తెలిపింది. టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ తగ్గుతున్నందున తదుపరి పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్.. వడ్డీ రేట్ల పెంపునకు మరికాస్త విరామం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రతిద్రవ్యోల్బణ ధోరణి వచ్చే 2–3 నెలలు కొనసాగవచ్చని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి డబ్ల్యూపీఐ 1–2 శాతం శ్రేణిలో ఉండొచ్చని కేర్ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ ఎకానమిస్ట్ రజని సిన్హా తెలిపారు. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టమైన 4.70 శాతానికి తగ్గింది. గత నెల పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల్లోని మరిన్ని విశేషాలు.. ► ఆహార, ఆహారయేతర, ఇంధన.. విద్యుత్, తయారీ ఉత్పత్తులు మొదలైన వాటన్నింటి ధరలు తగ్గాయి. ► మార్చితో పోలిస్తే ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.48 శాతం నుంచి 3.54 శాతానికి దిగి వచ్చింది. పండ్లు, పాలు .. గుడ్లు, మాంసం, చేపల ధరలు తగ్గాయి. కూరగాయల ద్రవ్యోల్బణం మైనస్ 1.50 శాతంగా నమోదైంది. బంగాళాదుంపల ధరల పెరుగుదల మైనస్ 18.66 శాతం, ఉల్లి మైనస్ 18.41 శాతం, గోధుమలు 7.27 శాతంగాను ఉంది. ► ఇంధనం, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 8.96 శాతం నుంచి 0.93 శాతానికి తగ్గింది. ► తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మార్చిలో 0.77% కాగా ఏప్రిల్‌లో మైనస్ 2.42%గా ఉంది. -
టోకు ధరలు కూల్.. కూల్!
న్యూఢిల్లీ: దేశ ఎకానమీకి ధరల తగ్గుదల ఊరటనిస్తోంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంకెల దిగువ బాటలోనే టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా నడిచాయి. డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం కేవలం 4.95 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 22 నెలల కాలంలో (2021 ఫిబ్రవరిలో 4.83 శాతం) ఇంత తక్కువ స్థాయి గణాంకాల నమోదు ఇదే తొలిసారి. ఫుడ్ ఆర్టికల్స్ ప్రత్యేకించి కూరగాయలు, ఆయిల్‌సీడ్స్ ధరలు తగ్గడం మొత్తం టోకు ద్రవ్యోల్బణం గణాంకల తగ్గుదలకు కారణం. 2022 సెప్టెంబర్ వరకు వరుసగా 18 నెలలు టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైన కొనసాగింది. అక్టోబర్ నుంచి గడచిన మూడు నెలల్లో రెండంకెల దిగువకు చేరింది. డిసెంబర్లో ఫుడ్ బాస్కెట్ ధర తగ్గడం మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. నవంబర్‌లో 5.88 శాతంగా నమోదుకాగా, డిసెంబర్లో మరింత తగ్గి 5.72%కి (2021 డిసెంబర్‌తో పోల్చి) చేరడం ఎకానమీకి ఊరటనిచ్చింది. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
సామాన్యులకు ఊరట.. ధరలు దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: వినియోగదారునిపై ధరల మంట కొంత తగ్గింది. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) శాంతించాయి. రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ట స్థాయి 6.77 శాతానికి దిగి రాగా, టోకు ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్ట స్థాయి అయిన 8.39 శాతానికి అక్టోబర్‌లో క్షీణించింది. ఆహారం, ఇంధనం, వస్తు తయారీ ధరలు తగ్గడం ఇందుకు అనుకూలించింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలలోనూ తగ్గినట్టయింది. ముఖ్యంగా ఏడాదిన్నర విరామం తర్వాత ఒక అంకెకు దిగొచ్చింది. మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తులు, టెక్స్టైల్స్, తదితర ఉత్పత్తుల ధరలు తగ్గడం టోకు ద్రవ్యోల్బణం ఉపశమించడానికి అనుకూలించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట నియంత్రిత స్థాయి 6 శాతానికి పైనే ఉండడాన్ని గమనించాలి. దీన్ని బట్టి చూస్తుంటే తదుపరి సమీక్షలో రేట్ల పెంపు ఖాయమే అని తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలకు 7 శాతంలోపునకు దిగొస్తుందన్న ఆశాభావాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గత శనివారం వ్యక్తం చేయడం గమనార్హం. ముఖ్యంగా గరిష్ట పరిమితి 6 శాతంపైన 9 నెలలపాటు చలిస్తుండడంతో, ఆర్బీఐ తన చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. రిటైల్ ధరలు ఇలా... ► సెప్టెంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా ఉండగా, అక్టోబర్‌లో 6.77 శాతంగా నమోదైంది. అంతకుముందు ఆగస్ట్ నెలలో 6.71 శాతంగా ఉండడం గమనార్హం. ► ఆర్బీఐ గరిష్ట పరిమితి 6 శాతానికి పైన రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం వరుసగా పదో నెలలోనూ (ఈ ఏడాది జనవరి నుంచి) జరిగింది. ► ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 8.6 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 7.01గా నమోదైంది. ► కూరగాయలకు సంబంధించి 7.7 శాతానికి దిగొచ్చింది. ► ఇంధన ద్రవ్యోల్బణం 9.93 శాతంగా ఉంది. ► డిసెంబర్ త్రైమాసికంలో 6.5 శాతం, మార్చి త్రైమాసికంలో 5.8 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆర్బీఐ అంచనాగా ఉంది. టోకు ద్రవ్యోల్బణం – 8.39 శాతం ► ఆహారోత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం 11.03 శాతం నుంచి 8.33 శాతానికి తగ్గింది. ► కూరగాయలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పండ్లు, గుడ్లు, మాంసం, చేపల టోకు ధరలు తగ్గాయి. సెప్టెంబర్‌లో కూరగాయలపై ద్రవ్యోల్బణం 39.66 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 17.61 శాతానికి తగ్గింది. ► వరి, గోధుమ, ఇతర ధాన్యాల ధరలు పెరిగాయి. ► నూనె గింజలకు సంబంధించి ద్రవ్యోల్బణం మైనస్ 5.36 శాతంగా, మినరల్స్‌కు సంబంధించి 3.86 శాతంగా ఉంది. ► ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 23.17 శాతానికి పరిమితం కాగా, తయారీ ఉత్పత్తులపై టోకు ద్రవ్యోల్బణం 4.42 శాతంగా ఉంది. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
మార్కెట్‌కు 1,656 టన్నుల టమాట రాక
మదనపల్లె: మదనపల్లె టమాట మార్కెట్‌కు రైతులు రికార్డుస్థాయిలో టమాటను తీసుకువస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు సీజన్లో అత్యధికంగా బుధవారం 1,656 మెట్రిక్‌టన్నుల టమాటను తీసుకువచ్చారు. జూన్ 1న మార్కెట్‌కు 342 మెట్రిక్‌టన్నుల టమాట వస్తే కేవలం 28రోజుల వ్యవధిలో ఐదురెట్లు రెట్టింపు సంఖ్యలో దిగుబడులు రావడం విశేషం. గత రెండేళ్లలో టమాట ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, దిగుబడులు అధికంగా వచ్చినా సరుకుకు డిమాండ్ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పెట్టుబడులు, నారు ధరలు విపరీతంగా పెరిగిపోవడం, కూలీల సమస్య అధికంగా ఉండటంతో ఈ సీజన్‌కు రైతులు పంటసాగుకు వెనుకంజ వేశారు. అయితే ఊహించనిరీతిలో మార్చి, ఏప్రిల్‌లో టమాటకు అధిక ధరలు పలకడంతో గంపెడాశతో అప్పులు చేసి సాగుకు పూనుకున్నారు. వాతావరణం అనుకూలించడం, కొత్త వంగడాలతో అధిక దిగుబడులు రావడంతో ఒక్కసారిగా మార్కెట్‌కు టమాటలు పోటెత్తాయి. మదనపల్లె మార్కెట్ నుంచి టమాట ఎగుమతులు జరిగే మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటకలోని అనేక ప్రాంతాల్లో స్థానికంగా టమాట సాగుచేయడంతో బయటి వ్యాపారులు ఎవరూ రాలేదు. దీంతో ధరలు నెలరోజులతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతానికి లభిస్తున్న ధరలు రైతులకు ఆశాజనకంగానే ఉన్నాయి. మదనపల్లె మార్కెట్‌కు అనంతపురం, శ్రీసత్యసాయిజిల్లా, అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం, కర్నాటక శ్రీనివాసపురం, చింతామణి, వడ్డిపల్లె, కోలారు తదితర ప్రాంతాల నుంచి రైతులు టమాటను తీసుకువస్తున్నారు. ఇక్కడి నుంచి తెలంగాణ, పాండిచ్చేరి, మహరాష్ట్ర బీజాపూర్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు, విశాఖపట్నం, కాకినాడ నగరాలకు టమాట ఎగుమతులు జరుగుతున్నాయి. బుధవారం మదనపల్లె మార్కెట్లో మొదటిరకం టమాట కిలో రూ.12–16, రెండోరకం టమాట కిలో రూ.7–11.60 మధ్య ధరలు నమోదయ్యాయి. దిగుబడులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తట్టి శారదమ్మ, కార్యదర్శి అభిలాష్ తెలిపారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న వంటనూనె ధరలు
న్యూఢిల్లీ: దేశంలో అధిక వినియోగంలో ఉన్న సన్‌ఫ్లవర్(పొద్దు తిరుగుడు) తోపాటు సోయాబీన్ ఆయిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. రాబోయే రెండేళ్ల కాలానికి ఈ దిగుమతులపై కస్టమ్ డ్యూటీ, అగ్రిసెస్‌ను మినహాయిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అమాంతం పెరిగిన నూనె ధరలకు కళ్లెం వేయడంలో భాగంగానే వంట నూనెల దిగుమతిపై విధిస్తున్న కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తొలగించింది. ప్రభుత్వ తాజా చర్యతో దేశీయంగా వంటనూనెల ధరలు రాబోయే రోజుల్లో తగ్గుముఖం పట్టనున్నాయి. ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్) నూనె, మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతిపై ఇప్పటి వరకు విధిస్తున్న కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ను తొలగించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థికశాఖ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే, దిగుమతుల కోటా కోసం ఈ నెల 27 నుంచి జూన్ 18లోపు ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ గడువు మించితే మాత్రం గతంలోని సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, దేశీయంగా పంచదార ధరలు పెరగకుండా చూసేందుకు ఎగుమతులకు పరిమితులు విధించింది. ప్రస్తుత సంవత్సరంలో చక్కెర ఎగుమతులను 10 మిలియన్ టన్నులకే ప్రభుత్వం పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల టన్నుల ముడి సోయాబీన్ నూనె, 16-18 లక్షల టన్నుల ముడి సన్‌ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. -
పసుపు చిం‘ధర’ వందర
జగిత్యాల అగ్రికల్చర్: వాణిజ్య పంటలైన మిర్చి, పత్తికి మార్కెట్లో మంచి ధర లభిస్తుండగా, పసుపు ధరలు మాత్రం కొన్నేళ్లుగా పాతాళంలో ఉంటున్నాయి. చర్మ సౌందర్య సాధనాలు, రంగులు, ఆహార పరిశ్రమల్లో విరివిగా వాడే పసుపునకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంటుంది. కానీ, ఆ మేరకు ఎగుమతులు లేక పంట పండించిన రైతులకు అనుకున్న స్థాయిలో ధరలు రావడం లేదు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడులు తగ్గగా, చేతికొచ్చిన పంటకు సైతం మార్కెట్లో ధర రాని పరిస్థితి నెలకొంది. దేశంలోనే తెలంగాణ టాప్ పసుపు పంట ఉత్పత్తిలో తెలంగాణ 3.13 లక్షల టన్నుల దిగుబడితో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర 2.26 లక్షల టన్నులు, కర్ణాటకలో 1.30 లక్షల టన్నులు, తమిళనాడు 0.86 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్ 0.73 లక్షల టన్నులు, మధ్యప్రదేశ్ 0.60 లక్షల టన్నులు, పశ్చిమబెంగాల్లో 0.45 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి అవుతోంది. తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మాత్రమే పసుపు ఎక్కువగా సాగవుతోంది. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో పంట వేస్తారు. దిగుబడులు అంతంతే.. ఈ ఏడాది అధిక వర్షాలతో పసుపు పంట దెబ్బతిన్నది. పంటలో ఎక్కువ రోజుల పాటు నీరు నిల్వ ఉండటంతో మొక్కలు చనిపోయాయి. దీనికి తోడు, దుంపకుళ్లు రోగం వచ్చి దిగుబడులు పడిపో యాయి. ఎకరానికి 35 క్వింటాళ్ల వరకు దిగుబడు లు వస్తాయనుకుంటే, కనీసం 15 నుంచి 20 క్విం టాళ్లు కూడా రాలేదు. రైతులు ఎకరాకు కనీసం ఒక లారీ పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువుకు రూ.25 వేలు ఖర్చు పెట్టారు. కలుపు తీత, ఎరువుల కోసం రూ.20 వేల వరకు ఖర్చు చేశారు. అలాగే పంట తవ్వేటప్పుడు, కొమ్ములు విరిచేటప్పుడు, ఉడకబెట్టేందుకు కూలీలకు ఎకరాకు రూ.30 వేల వరకు అవుతోంది. ఇలా..దాదాపు ఎకరాకు రూ.70–80 వేలు పెట్టుబడి పెట్టినా ఆ స్థాయిలో దిగుబడులు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరలు అంతంతే.. రాష్ట్రంలో పండిన పసుపును రైతులు నిజామాబాద్, వరంగల్ మార్కెట్లతో పాటు తమిళనాడులోని ఈరోడ్, సేలం, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు తీసుకెళ్తారు. అయితే, ధరలు మాత్రం క్వింటాల్ కొమ్ము పసుపునకు రూ.5–7 వేలు, మండ పసుపునకు రూ.4–6 వేలు మాత్రమే పలుకుతున్నాయి. దీంతో పెట్టుబడులు కూడా రావడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నిజామాబాద్ మార్కెట్‌కు 14,525 మెట్రిక్ టన్నుల పసుపు రాగా, ఈసారి 13,925 టన్నులు వచ్చింది. ఎగుమతులకు పెద్ద ఎత్తున అనుమతి ఇస్తేనే రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారస్తులు భావిస్తున్నారు. 1.71 లక్షల టన్నుల పసుపు మాత్రమే ఎగుమతి ప్రపంచవ్యాప్తంగా పసుపు ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. అయితే, దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 2019–20లో 1.37 లక్షల టన్నులు, 2020–21లో 1.71 లక్షల టన్నుల పసు పు మాత్రమే ఎగుమతి అయింది. మిగిలిన పసు పును దేశీయంగానే ఉపయోగిస్తున్నారు. అయితే దేశీయంగా పెద్దగా డిమాండ్ లేక ధర రావడం లేదని, వీలైనంత ఎక్కువగా ఎగుమతులను ప్రోత్సహిస్తే మంచి రేటు వచ్చే అవకాశం ఉంటుందని రైతులు, వ్యాపారులు భావిస్తున్నారు. పంట లేదు.. ధర లేదు రెండెకరాల్లో పసుపు వేశా. వర్షాలతో పంట దెబ్బతిన్నది. 50 క్వింటాళ్లు దిగుబడి వస్తుందనుకుంటే 25 క్విం టాళ్లు మాత్రమే వచ్చింది. నిజామాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్తే క్వింటాల్‌కు రూ.5 వేలు చెల్లించారు. ఏమైనా అంటే పచ్చిగా ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. – తీపిరెడ్డి బాపురెడ్డి, పసుపు రైతు, లక్ష్మీపూర్, జగిత్యాల మద్దతు ధర చెల్లించాలి పసుపు పంట క్వింటాల్‌కు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని పోరాడుతున్నాం. ఈ నేపథ్యంలోనే ప్ర భుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు గత పార్లమెంట్ ఎన్నికల్లో దాదా పు 175 మంది పసుపు రైతులం నిజామాబాద్‌లో పోటీ చేశాం. అయినా పసుపు రైతుల బతుకు మారలేదు. – పన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు, జగిత్యాల -
టికెట్ల ధర సామాన్యుడికి అందకూడదా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని కొందరు నటులు విమర్శించడం హాస్యాస్పదం. భారీ పారితోషికాలతో సినిమా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం అవుతున్నవారు మళ్లీ ఆ సొమ్మును రాబట్టుకోవడానికి ప్రేక్షకుల మీద భారం మోపుతున్నారు. టికెట్ల ధరల విషయంలో పారదర్శకతను తేవడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం వీరికి మింగుడుపడటం లేదంటే ఆశ్చర్యం ఏమీలేదు. ఏ ధరలైనా పెరిగితే గగ్గోలు పెట్టే టీడీపీ మీడియా ఈ విషయంలో భిన్నంగా వ్యవహరించడం కూడా ఆశ్చర్యపరిచే సంగతి కాదు. జగన్ ప్రభుత్వంపై ద్వేషమే వారిని నడిపిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల సగటు ప్రేక్షకులు మాత్రం సంతోషంగా ఉన్నారు. మరి ఆ సామాన్యుడి వైపు సినిమా పరిశ్రమ నిలబడుతుందా, లేదా అన్నది ఆలోచించుకోవాలి. నటుడు నాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. నాని వివాదాలలోకి ఎన్నడూ వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది మొదటిసారిగా ఏపీ ప్రభుత్వ సినిమా టికెట్ల ధరలను విమర్శించిన తీరుపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆయన వ్యాఖ్యలను సమర్థించేవారు కూడా ఉండవచ్చు. ఆయన థియేటర్ల కన్నా కిరాణా షాపులు పెట్టుకోవడం బెటర్ అన్నారు. కిరాణా షాపులవారిని అవమానించడమే అని కొందరు వ్యాఖ్యానిస్తే, కిరాణా షాపు పెట్టుకుంటే ఎవరు వద్దన్నారని మరికొందరు అన్నారు. సినిమా నిర్మాణాలకు అయ్యే వ్యయంపై ఒక నియంత్రణ లేదు. అవుతున్న ఖర్చు ఎంత అన్నదానిపై వాస్తవాలు వెల్లడించే పరిస్థితి తక్కువే. కానీ థియేటర్లలో టికెట్లను తమ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కూడా సినిమా పరి శ్రమలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రత్యేకించి చిన్న సినిమాలు నిర్మించేవారు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలను సమ ర్థిస్తుండగా, భారీ బడ్జెట్‌తో తీస్తున్న వర్గంవారు వ్యతిరేకిస్తున్నారు. అగ్రశ్రేణి నటులు తీసుకునే పారితోషికం చర్చనీయాంశం అవు తోంది. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెబుతున్నారు. ‘భీమ్లా నాయక్’కు మూలమైన మలయాళ సినిమాకు ఐదు కోట్లు ఖర్చయితే, 43 కోట్ల లాభం వచ్చిందట. దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి వంద కోట్లు ఖర్చు పెట్టారట. అందులో యాభై కోట్లు పవన్ కల్యాణ్‌కే చెల్లించవలసి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంతో పవన్ చెప్పగలిగితే క్లారిటీ వస్తుంది. అది కూడా వైట్‌లో తీసు కుంటారా? బ్లాక్‌లో తీసు కుంటారా అన్నది చెప్పగలగాలి. ఈ నేప«థ్యంలో సినిమా టికెట్ల ధరలను సామాన్యులకు అందు బాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం టికెట్ల ధరలు నిర్ణయిం చింది. ఈ ధరల వల్ల తమకు నష్టం వస్తుందని భావిస్తే, సినీ పరిశ్రమ వారు ప్రభుత్వానికి అందుకు ఆధారాలు చూపి, టికెట్ల రేట్లు మరి కొంత పెంచాలని అడగవచ్చు. కానీ ప్రముఖ హీరోలు ఒకరిద్దరు ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. పవన్ కళ్యాణ్ అవసరమైతే తన సినిమాలను ఉచితంగా ఆడిస్తానని అన్నారు. అందుకు ఎవరైనా అభ్యంతరం చెబుతారా? నిజంగా ఆ పని చేయగలరా? నటుడు నాని ధరలు తక్కువ పెట్టడం అంటే ప్రేక్షకులను అవమానించడమని చిత్రమైన సూత్రాన్ని చెప్పారు. ఎంత గొప్ప సినిమా అయినా ఎవరైనా జేబులకు చిల్లు పెట్టుకోవాలని భావిస్తారా? నాని చెప్పిన వాదన కరెక్టు అయితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేయడం వినియోగ దారులను అవమానించినట్లా? కూరగాయల ధరలు పెరిగినా, నిత్యా వసర వస్తువుల ధర పెరిగినా గొడవలు చేసే రాజకీయ పక్షాలు లేదా ఒక వర్గం మీడియా సినిమా టికెట్ల ధరలు పెంచాలన్నట్లుగా వ్యవహ రిస్తున్నాయి. కొంతమంది నటుల వ్యాఖ్యలను పటం కట్టి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కొన్ని థియేటర్లు మూసివేశారని, అందులో పనిచేసేవారి బతుకు ఛిద్రమైపోతోందని ఒక పత్రిక ప్రచారం చేసింది. ఒకప్పుడు చాలా థియేటర్లు ఉండేవి. కానీ ఇప్పుడు 1,100 థియేటర్లు మాత్రమే మిగిలాయి. అప్పుడు ఇలా ఎందుకు కథనాలు ఇవ్వలేదు? కరోనా సందర్భంలో హాళ్లు మూతపడ్డాయి. అప్పుడు ఎందుకు ఆవేదన చెందలేదు? గతంలోనే పలు సినిమా థియేటర్లను కల్యాణ మండపాలుగా మార్చారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై సినిమాలు విడుదల చేయడం థియేటర్లకు నష్టం కాదా? మరి అవి వద్దని ఈ పత్రికలు వార్తలు ఇస్తున్నాయా? సినిమా నటులంటే ప్రజలలో ఉన్న ఆసక్తి మేరకు కథనాలు ఇవ్వవచ్చు. కానీ ద్వేషభావంతో అలా చేస్తు న్నారు. అదే సమయంలో కొందరు మంత్రులు ఇచ్చిన జవాబులకు ప్రాధాన్యం ఇవ్వరు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని తదితరులు ఈ అంశంపై స్పందించారు. సామాన్యుడి ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం చేశామని వారు అన్నారు. అనిల్ యాదవ్ నేరుగానే ఆయా నటులు తీసుకుంటున్న పారితోషికంపై ప్రశ్నలు సంధించారు. మరో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముందుగా హీరోలు తాము తీసుకుంటున్న పరిహారం గురించి బహిరంగంగా చెప్పి, ఆ తర్వాత టికెట్ల ధరల గురించి అడగాలని, లేకుంటే వారికి నైతిక అర్హత ఎక్కడి దని ప్రశ్నించారు. మరి వీటికి జవాబు వస్తుందా? థియేటర్లలో తనిఖీలపై టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లారని కోపంతో ఇలా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. లైసెన్సులు లేకపోయినా, అవస రమైన సదుపాయాలు లేకపోయినా, బ్లాకులో టికెట్లు అమ్ముతున్నా వదలిపెట్టాలన్నది బీజేపీ విధానమా? లేక టీడీపీలో ఉన్నప్పుడు సినిమా వారితో ఏర్పడిన అవినాభావ సంబంధం కారణమా? నిజా నికి సినిమా థియేటర్లలో ప్రతి సంవత్సరం తనిఖీలు చేయాలి. తద్వారా అవి అన్నీ సజావుగా నడిచేలా చూడాలి. సంవత్సరాల తర బడి లైసెన్సులు రెన్యువల్ చేయించుకోకుండా థియేటర్లు నడుస్తు న్నాయంటే, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకుండా ఉన్నాయంటే ఏమను కోవాలి? పొరపాటున ఎక్కడైనా ప్రమాదం జరిగితే అప్పుడు వీరే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కదా! ఆన్లైన్ విధానంలో టికెట్ల అమ్మకానికి సినీ పరిశ్రమలో దాదాపు అంతా ఒప్పుకున్నారు. నిజంగానే ఏదైనా సినిమాకు నిర్దిష్ట కారణాల వల్ల ఎక్కువ వ్యయం అయితే దానిని ఆధార సహితంగా చూపి టిక్కెట్ ధర పెంచాలని నిర్మాతలు కోరితే, ఆమోదించవచ్చేమో. ఆ పెంచిన ధరలో కొంత అదనపు పన్ను వసూలు చేయాలి. తద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం అయితే సామాన్య ప్రేక్షకులు సినిమా టికెట్ల ధరలు తగ్గినందుకు, బ్లాక్‌లో కొనాల్సిన అవసరం లేనందుకు సంతోషిస్తున్నారు. హీరోలు తమ పారితోషికం కొంత తగ్గించుకుంటే, సినిమా నిర్మాణ వ్యయం తగ్గి, ప్రేక్షకులపై భారం వేయకుండా ఉండవచ్చన్నది పలువురి సలహా. కానీ నటులు అందుకు సిద్ధపడతారా అన్నది సందేహమే. మరో విషయం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో సినిమా నటులపై కూడా అధికంగా ఆధారపడుతుంది. దాంతో చంద్రబాబు టికెట్ల ధరలు పెంచాలో, తగ్గించాలో చెప్ప కుండా మౌనంగా ఉన్నట్లుగా ఉంది. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ప్రధానంగా ఒక్క జగన్ ప్రచారంపైనే ఆధారపడి ఉంది. సినిమావారితో సంబంధం లేకుండా ఆయన జనంలోకి వెళ్లారు. ఎవరైనా కొద్దిమంది సహకరించి ఉండవచ్చు. కానీ స్థూలంగా ఆయన సినిమా వారి మీద ఆధారపడింది తక్కువే అని చెప్పాలి. పవన్ కల్యాణ్ వంటి కొద్దిమంది అటు సినిమాలోను, ఇటు రాజకీయాల లోను ఉంటూ గందరగోళంగా వ్యవహరిస్తున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. సినీ రంగంవారు ఏపీలోని థియేటర్ల ద్వారా ఆదాయం పొందుతూ తెలంగాణలో పన్నులు కడుతున్నారట. దానికి కారణం ఈ థియేటర్లు దాదాపు అన్నీ ఐదుగురు చేతిలో ఉండటమేనట. ఏపీలో షూటింగులు జరిపి, పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ కోరికను వీరు పట్టించుకోవడం లేదు. అందువల్ల ఏపీలో షూటింగులు చేసేవారికి అదనపు చార్జీ వసూలు చేసుకునే అవకాశం కొంతవరకూ ఇస్తే మంచిదే. రికార్డింగ్, డబ్బింగ్ స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నవారికి కొంత రాయితీ ఇస్తే బాగుంటుంది. సినిమా అన్నది సామాన్యుడి వినోద సాధనం. దాన్ని అందు బాటు ధరలో ఉంచాలా? ఖరీదైన వ్యవహారంగా మార్చాలా అన్నది సినీ పరిశ్రమ కూడా ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం సామాన్యుల వైపు నిలబడింది. మరి సినిమా రంగం ఎవరి వైపు ఉంటుందో! కొమ్మినేని శ్రీనివాసరావు ,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
పతనాల బాట : పసిడి ధరలు తగ్గుముఖం
ముంబై : బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ఈనెలలో గరిష్టంగా 56,000 రూపాయలకు చేరిన పదిగ్రాముల పసిడి ప్రస్తుతం 50,000 రూపాయల స్ధాయికి పడిపోయింది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు బుధవారం సైతం పతనాల బాటపట్టాయి. స్టాక్‌మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం వన్నె తగ్గింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 249 రూపాయలు తగ్గి 50,675 రూపాయలకు దిగిరాగా, కిలో వెండి 249 రూపాయలు దిగివచ్చి 63,500 రూపాయలుగా నమోదైంది. చదవండి : రూ . 5000 దిగివచ్చిన బంగారం కోవిడ్-19కు మెరుగైన చికిత్స, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ఆశలతో పాటు అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం దిశగా సానుకూల సంకేతాలతో బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ బంగారం 1927 డాలర్ల వద్ద నిలకడగా ఉంది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు బంగారం తదుపరి దిశను నిర్ణయిస్తాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఊరట : దిగివచ్చిన బంగారం, వెండి ధరలు
ముంబై : గత రెండు రోజుల్లో 1500 రూపాయలు పెరిగిన బంగారం ధరలు బుధవారం దిగివచ్చాయి. రెండ్రోజుల్లో ఏకంగా 2000 రూపాయలు పైగా భారమైన వెండి ధర సైతం తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల ఒడిదుడుకులతో దేశీ మార్కెట్లో బంగారం, వెండి పతనాల బాట పట్టాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 411 రూపాయలు తగ్గి 53,160 రూపాయలకు దిగివచ్చింది. ఇక 1905 రూపాయలు తగ్గిన కిలోవెండి 67,600 రూపాయలు పలికింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో అనిశ్చితి నెలకొందని, ఔన్స్ బంగారం 2000 డాలర్ల వద్ద స్ధిరపడినా మదుపరులు ఆచితూచి వ్యవహరించాలని కొటాక్ సెక్యూరిటీస్ పేర్కొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, ఉద్దీపన ప్యాకేజ్‌పై అగ్రదేశం చేపట్టే చర్యలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి, డాలర్‌తో రూపాయి విలువ పతనం వంటి కారణాలతో భారత్‌లో ఈ ఏడాది బంగారం ధరలు ఏకంగా 40 శాతం పెరిగాయి. చదవండి : పసిడి నేల చూపులు -
కేన్సర్ ఔషధాల ధరల తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: యాంటి కేన్సర్ ఔషధాల ధరలను మరోసారి తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఏడాది మార్చి, మే నెలల్లో రెండు దఫాల్లో 399 రకాల కేన్సర్ ఔషధాల ధరలను భారీగా తగ్గించింది. ఒక్కో మందు ధర 60–87 శాతానికి తగ్గింది. ఇప్పుడు ఈ జాబితాలో మరిన్ని మందులను చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలోనే ధరలు తగ్గనున్న మందుల జాబితాను విడుదల చేయనున్నట్టు ఎన్పీపీఏ అధికారులు తెలిపారు. ఇటీవల కీమో థెరఫీ చికిత్సలో వినియోగించే 9 రకాల డ్రగ్స్ ధరలను ఎన్పీపీఏ తగ్గించగా, కొత్త ధరకు పాత ధరకు భారీ వ్యత్యాసం కనిపించింది. ఇందులో ఊపిరితిత్తుల కేన్సర్‌కు సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. కొత్త ధరల ప్రకారం పెమెట్రెక్సెడ్ 500ఎంజీ ఇంజక్షన్ రూ.2,800లకు లభిస్తోంది. గతంలో దీని ధర రూ.22,000 ఉండేది. 100 ఎంజీ ఇంజక్షన్ ధర రూ.7,700 నుంచి రూ.800లకు తగ్గింది. ఎపిక్లర్ బ్రాండ్ 10 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.561 నుంచి రూ.276కు.. 50 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.2,662 నుంచి రూ.960కు దిగింది. దీంతో పాటు ఎర్లో టినిబ్ 100 ఎంజీ టాబ్లెట్స్ (30 టాబ్లెట్ల ప్యాక్) ధర రూ.6,600 నుంచి రూ.1,840కు.. 150ఎంజీ ట్యాబ్లెట్ రూ.8,800 నుంచి రూ.2400లకు తగ్గింది. లానోలిమస్ బ్రాండ్ సైతం రూ.726 నుంచి రూ.406కు దిగివచ్చింది. మరిన్ని రకాల ఔషధాల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. -
కవసాకి సూపర్‌బైక్‌ల ధర భారీగా తగ్గింపు
పుణే : సూపర్‌బైక్‌లను తయారు చేసే కవసాకి కంపెనీ, స్థానికంగా తయారు చేసిన నింజా జెడ్ఎక్స్-10ఆర్, నింజా జెడ్ఎక్స్-10ఆర్ఆర్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని స్థానికంగా రూపొందించడంతో, వీటి ధరలను కూడా భారీగా తగ్గించింది. నింజా జెడ్ఎక్స్-10ఆర్ ధరను రూ.12.80 లక్షలకు తగ్గించగా.. నింజా జెడ్ఎక్స్-10ఆర్ఆర్ను రూ.16.10 లక్షలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు బైక్‌ల పాత ధరలు రూ.18.80 లక్షలు, రూ.21.90 లక్షలుగా ఉన్నాయి. అంటే ఇరు బైక్‌లపై ఆరు లక్షల మేర ధరను కోత పెట్టింది. ఈ ధర తగ్గింపునకు కారణంగా స్థానికంగా వీటిని అసెంబుల్ చేయడమేనని కంపెనీ తెలిపింది. పుణేకు సమీపంలోని ఛకన్ లో వీటిని అసెంబుల్ చేసినట్టు చెప్పింది. ఈ రెండు బైక్‌ల బుకింగ్స్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కవసాకి డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్పెషల్ ప్రీ-ఆర్డర్ ధరలు జూలై చివరి వరకే ఉంటాయని, ఆ అనంతరం మళ్లీ ధరలను పెంచుతామని కంపెనీ వెల్లడించింది. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే వాటిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. కేటాయించిన ఉత్పత్తి అనంతరం బుకింగ్స్‌ను ముగుస్తాయని పేర్కొంది. ఒకవేళ ఎవరైనా కవసాకి సూపర్‌బైక్‌లను కొనుగోలు చేయాలనుకుంటే, ఇదే సరియైన సమయమని కంపెనీ చెబుతోంది.కేఆర్టీ ఎడిషన్‌లో ఆకుపచ్చ రంగులో కొత్త నింజా జెడ్ఎక్స్-10ఆర్ అందుబాటులో ఉండగా... నింజా జెడ్ఎక్స్-10ఆర్ఆర్ కేవలం నలుపు రంగులో మాత్రమే లభ్యమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కవసాకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ వివిధ రంగుల ఆప్షన్లలో మూడు వేరియంట్లను ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చౌకైన ఫ్లాగ్షిప్ సూపర్‌బైక్ ఏదైనా ఉందా? అంటే అది జెడ్ఎక్స్-10ఆర్ అని కంపెనీ చెబుతోంది. ఈ మోటార్‌సైకిళ్లు 998సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రూపొందాయి. 197బీహెచ్పీ, 113.4 ఎన్ఎం టర్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో దీన్ని ఇంజిన్ రూపొందింది. కవసాకి లాంచ్ కంట్రోల్, కవసాకి ట్రాక్షన్ కంట్రోల్, కవసాకి బ్రేకింగ్ కంట్రోల్, క్విక్ సిఫ్టర్, కార్నర్ మేనేజ్మెంట్ ఫంక్షన్, ఏబీసీ వంటి ఫీచర్లు ఈ బైక్‌లలో ఉన్నాయి. -
మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
* పెట్రోల్‌పై రూ. 2, డీజిల్‌పై 50పైసల తగ్గింపు * అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ధరలు న్యూఢిల్లీ: పెట్రో ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ. 2, డీజిల్‌పై 50 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల రోజుల్లో ఇంధన ధరలు తగ్గటం ఇది మూడవ సారి. స్థానిక పన్నుల్లో తగ్గుదలను కూడా కలుపుకుంటే వీటి ధరలు ప్రాంతాలవారీగా మరికొంత తగ్గుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గటంతోపాటు, డాలర్-రూపాయి మారక విలువల్లో మార్పులు పెట్రో ధరల తగ్గుదలకు కారణమని ఐఓసీ పేర్కొంది.తాజా సవరణలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.66.29, డీజిల్ రూ. 48.45 కానుంది. -
తగ్గిన బంగారు, వెండి ధరలు
న్యూఢిల్లీ: బంగారు, వెండి ధరలు పాక్షికంగా తగ్గాయి. బుధవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారు ధర 180 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారు ధర 27,650 రూపాయలు ఉంది. ఇక వెండి ధర కిలోకు 600 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర ప్రస్తుతం 39,100 రూపాయలు ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారు, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ మార్కెట్లో వీటి విలువ తగ్గింది. -
సీఎస్టీ కింద తెలంగాణకు రూ.1,500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్టీ) కింద ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,500 కోట్ల పరిహారం వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు దేశంలో అన్ని రాష్ట్రాల్లోని ప్రజలకు తక్కువ ధరకు లభించేందుకు వీలుగా కేంద్రం అమ్మకం పన్ను విలువను నాలుగు నుంచి రెండు శాతానికి తగ్గించడంతో.. రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పరిహారాన్ని ఇవ్వనుంది. కేంద్ర అమ్మకం పన్ను, రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను కలిపితే వినియోగదారులపై అధిక భారం పడే అవకాశం ఉన్నందున, ధరల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం సీఎస్టీని తగ్గించిన సంగతి విదితమే. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లోనూ పొందుపర్చడం గమనార్హం.