నిజామాబాద్ పసుపు మార్కెట్‌లో రైతులు
జగిత్యాల అగ్రికల్చర్: వాణిజ్య పంటలైన మిర్చి, పత్తికి మార్కెట్లో మంచి ధర లభిస్తుండగా, పసుపు ధరలు మాత్రం కొన్నేళ్లుగా పాతాళంలో ఉంటున్నాయి. చర్మ సౌందర్య సాధనాలు, రంగులు, ఆహార పరిశ్రమల్లో విరివిగా వాడే పసుపునకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంటుంది. కానీ, ఆ మేరకు ఎగుమతులు లేక పంట పండించిన రైతులకు అనుకున్న స్థాయిలో ధరలు రావడం లేదు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడులు తగ్గగా, చేతికొచ్చిన పంటకు సైతం మార్కెట్లో ధర రాని పరిస్థితి నెలకొంది.
దేశంలోనే తెలంగాణ టాప్
పసుపు పంట ఉత్పత్తిలో తెలంగాణ 3.13 లక్షల టన్నుల దిగుబడితో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర 2.26 లక్షల టన్నులు, కర్ణాటకలో 1.30 లక్షల టన్నులు, తమిళనాడు 0.86 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్ 0.73 లక్షల టన్నులు, మధ్యప్రదేశ్ 0.60 లక్షల టన్నులు, పశ్చిమబెంగాల్‌లో 0.45 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి అవుతోంది. తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మాత్రమే పసుపు ఎక్కువగా సాగవుతోంది. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో పంట వేస్తారు.
దిగుబడులు అంతంతే..
ఈ ఏడాది అధిక వర్షాలతో పసుపు పంట దెబ్బతిన్నది. పంటలో ఎక్కువ రోజుల పాటు నీరు నిల్వ ఉండటంతో మొక్కలు చనిపోయాయి. దీనికి తోడు, దుంపకుళ్లు రోగం వచ్చి దిగుబడులు పడిపో యాయి. ఎకరానికి 35 క్వింటాళ్ల వరకు దిగుబడు లు వస్తాయనుకుంటే, కనీసం 15 నుంచి 20 క్విం టాళ్లు కూడా రాలేదు. రైతులు ఎకరాకు కనీసం ఒక లారీ పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువుకు రూ.25 వేలు ఖర్చు పెట్టారు.
కలుపు తీత, ఎరువుల కోసం రూ.20 వేల వరకు ఖర్చు చేశారు. అలాగే పంట తవ్వేటప్పుడు, కొమ్ములు విరిచేటప్పుడు, ఉడకబెట్టేందుకు కూలీలకు ఎకరాకు రూ.30 వేల వరకు అవుతోంది. ఇలా..దాదాపు ఎకరాకు రూ.70–80 వేలు పెట్టుబడి పెట్టినా ఆ స్థాయిలో దిగుబడులు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు.
ధరలు అంతంతే..
రాష్ట్రంలో పండిన పసుపును రైతులు నిజామాబాద్, వరంగల్ మార్కెట్లతో పాటు తమిళనాడులోని ఈరోడ్, సేలం, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు తీసుకెళ్తారు. అయితే, ధరలు మాత్రం క్వింటాల్ కొమ్ము పసుపునకు రూ.5–7 వేలు, మండ పసుపునకు రూ.4–6 వేలు మాత్రమే పలుకుతున్నాయి. దీంతో పెట్టుబడులు కూడా రావడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నిజామాబాద్ మార్కెట్‌కు 14,525 మెట్రిక్ టన్నుల పసుపు రాగా, ఈసారి 13,925 టన్నులు వచ్చింది. ఎగుమతులకు పెద్ద ఎత్తున అనుమతి ఇస్తేనే రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారస్తులు భావిస్తున్నారు.
1.71 లక్షల టన్నుల పసుపు మాత్రమే ఎగుమతి
ప్రపంచవ్యాప్తంగా పసుపు ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. అయితే, దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 2019–20లో 1.37 లక్షల టన్నులు, 2020–21లో 1.71 లక్షల టన్నుల పసు పు మాత్రమే ఎగుమతి అయింది. మిగిలిన పసు పును దేశీయంగానే ఉపయోగిస్తున్నారు. అయితే దేశీయంగా పెద్దగా డిమాండ్ లేక ధర రావడం లేదని, వీలైనంత ఎక్కువగా ఎగుమతులను ప్రోత్సహిస్తే మంచి రేటు వచ్చే అవకాశం ఉంటుందని రైతులు, వ్యాపారులు భావిస్తున్నారు.
పంట లేదు.. ధర లేదు
రెండెకరాల్లో పసుపు వేశా. వర్షాలతో పంట దెబ్బతిన్నది. 50 క్వింటాళ్లు దిగుబడి వస్తుందనుకుంటే 25 క్విం టాళ్లు మాత్రమే వచ్చింది. నిజామాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్తే క్వింటాల్‌కు రూ.5 వేలు చెల్లించారు. ఏమైనా అంటే పచ్చిగా ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు.
– తీపిరెడ్డి బాపురెడ్డి, పసుపు రైతు, లక్ష్మీపూర్, జగిత్యాల
మద్దతు ధర చెల్లించాలి
పసుపు పంట క్వింటాల్‌కు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని పోరాడుతున్నాం. ఈ నేపథ్యంలోనే ప్ర భుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు గత పార్లమెంట్ ఎన్నికల్లో దాదా పు 175 మంది పసుపు రైతులం నిజామాబాద్‌లో పోటీ చేశాం. అయినా పసుపు రైతుల బతుకు మారలేదు.
– పన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు, జగిత్యాల
Comments
Please login to add a commentAdd a comment