న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కమోడిటీ ధరల క్షీణతతో ఆహారం, ఇంధనం, ఇతరత్రా ముడి సరుకుల రేట్లు తగ్గిన నేపథ్యంలో టోకు ధరలు దాదాపు మూడేళ్లలో తొలిసారిగా మైనస్‌లోకి జారిపోయాయి. ఏప్రిల్‌లో 34 నెలల కనిష్టానికి దిగివచ్చాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 0.92 శాతంగా నమోదైంది. చివరిసారిగా 2020 జూన్‌లో డబ్ల్యూపీఐ .. మైనస్ 1.81 శాతంగా నమోదైంది. ఇది గత 11 నెలలుగా తగ్గుదల బాటలోనే కొనసాగుతోంది.
గతేడాది ఏప్రిల్‌లో బేస్ అధికంగా 15.38 శాతం స్థాయిలో ఉండటం కూడా ఏప్రిల్‌లో తాజా పరిస్థితికి కారణమని అధికారవర్గాలు తెలిపాయి. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఈ మార్చ్‌లో 1.34 శాతంగా ఉంది. టోకు ధరలు ఏటా క్షీణిస్తుండటాన్ని సాంకేతికంగా ప్రతిద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. ‘2023 ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం రేటు మందగించడానికి ప్రధానంగా ఆహారోత్పత్తులు, ప్రాథమిక లోహాలు, టెక్స్‌టైల్స్, ఆహారేతర ఉత్పత్తులు, రసాయనాలు.. రసాయన ఉత్పత్తులు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, పేపర్.. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గడం కారణం’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది.
రాబోయే రోజుల్లోనూ ఇలాగే..
కమోడిటీల ధరలు తగ్గే కొద్దీ రాబోయే రోజుల్లోనూ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మరింత తగ్గడం కొనసాగవచ్చని బార్‌క్లేస్ ఒక నివేదికలో తెలిపింది. టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ తగ్గుతున్నందున తదుపరి పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్.. వడ్డీ రేట్ల పెంపునకు మరికాస్త విరామం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రతిద్రవ్యోల్బణ ధోరణి వచ్చే 2–3 నెలలు కొనసాగవచ్చని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి డబ్ల్యూపీఐ 1–2 శాతం శ్రేణిలో ఉండొచ్చని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ ఎకానమిస్ట్ రజని సిన్హా తెలిపారు. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టమైన 4.70 శాతానికి తగ్గింది. గత నెల పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల్లోని మరిన్ని విశేషాలు..
► ఆహార, ఆహారయేతర, ఇంధన.. విద్యుత్, తయారీ ఉత్పత్తులు మొదలైన వాటన్నింటి ధరలు తగ్గాయి.
► మార్చితో పోలిస్తే ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.48 శాతం నుంచి 3.54 శాతానికి దిగి వచ్చింది. పండ్లు, పాలు .. గుడ్లు, మాంసం, చేపల ధరలు తగ్గాయి. కూరగాయల ద్రవ్యోల్బణం మైనస్ 1.50 శాతంగా నమోదైంది. బంగాళాదుంపల ధరల పెరుగుదల మైనస్ 18.66 శాతం, ఉల్లి మైనస్ 18.41 శాతం, గోధుమలు 7.27 శాతంగాను ఉంది.
► ఇంధనం, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 8.96 శాతం నుంచి 0.93 శాతానికి తగ్గింది.
► తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మార్చిలో 0.77% కాగా ఏప్రిల్‌లో మైనస్ 2.42%గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment