International commodity price
-
మైనస్‌లోకి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కమోడిటీ ధరల క్షీణతతో ఆహారం, ఇంధనం, ఇతరత్రా ముడి సరుకుల రేట్లు తగ్గిన నేపథ్యంలో టోకు ధరలు దాదాపు మూడేళ్లలో తొలిసారిగా మైనస్‌లోకి జారిపోయాయి. ఏప్రిల్‌లో 34 నెలల కనిష్టానికి దిగివచ్చాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 0.92 శాతంగా నమోదైంది. చివరిసారిగా 2020 జూన్‌లో డబ్ల్యూపీఐ .. మైనస్ 1.81 శాతంగా నమోదైంది. ఇది గత 11 నెలలుగా తగ్గుదల బాటలోనే కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్‌లో బేస్ అధికంగా 15.38 శాతం స్థాయిలో ఉండటం కూడా ఏప్రిల్‌లో తాజా పరిస్థితికి కారణమని అధికారవర్గాలు తెలిపాయి. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఈ మార్చ్‌లో 1.34 శాతంగా ఉంది. టోకు ధరలు ఏటా క్షీణిస్తుండటాన్ని సాంకేతికంగా ప్రతిద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. ‘2023 ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం రేటు మందగించడానికి ప్రధానంగా ఆహారోత్పత్తులు, ప్రాథమిక లోహాలు, టెక్స్టైల్స్, ఆహారేతర ఉత్పత్తులు, రసాయనాలు.. రసాయన ఉత్పత్తులు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, పేపర్.. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గడం కారణం’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లోనూ ఇలాగే.. కమోడిటీల ధరలు తగ్గే కొద్దీ రాబోయే రోజుల్లోనూ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మరింత తగ్గడం కొనసాగవచ్చని బార్క్లేస్ ఒక నివేదికలో తెలిపింది. టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ తగ్గుతున్నందున తదుపరి పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్.. వడ్డీ రేట్ల పెంపునకు మరికాస్త విరామం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రతిద్రవ్యోల్బణ ధోరణి వచ్చే 2–3 నెలలు కొనసాగవచ్చని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి డబ్ల్యూపీఐ 1–2 శాతం శ్రేణిలో ఉండొచ్చని కేర్ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ ఎకానమిస్ట్ రజని సిన్హా తెలిపారు. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టమైన 4.70 శాతానికి తగ్గింది. గత నెల పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల్లోని మరిన్ని విశేషాలు.. ► ఆహార, ఆహారయేతర, ఇంధన.. విద్యుత్, తయారీ ఉత్పత్తులు మొదలైన వాటన్నింటి ధరలు తగ్గాయి. ► మార్చితో పోలిస్తే ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.48 శాతం నుంచి 3.54 శాతానికి దిగి వచ్చింది. పండ్లు, పాలు .. గుడ్లు, మాంసం, చేపల ధరలు తగ్గాయి. కూరగాయల ద్రవ్యోల్బణం మైనస్ 1.50 శాతంగా నమోదైంది. బంగాళాదుంపల ధరల పెరుగుదల మైనస్ 18.66 శాతం, ఉల్లి మైనస్ 18.41 శాతం, గోధుమలు 7.27 శాతంగాను ఉంది. ► ఇంధనం, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 8.96 శాతం నుంచి 0.93 శాతానికి తగ్గింది. ► తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మార్చిలో 0.77% కాగా ఏప్రిల్‌లో మైనస్ 2.42%గా ఉంది. -
తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు
న్యూఢిల్లీ: భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు ఉన్నట్లు తెలిపింది. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం ఇస్తున్న సావరిన్ రేటింగ్‌కు వచ్చిన ఇబ్బంది ఏదీ లేదని భరోసా ఇచ్చింది. ఈ ఏడాది జనవరి సెప్టెంబర్ మధ్య ఫారెక్స్ నిల్వలు దాదాపు 100 బిలియన్ డాలర్లు తగ్గి, 533 బిలియన్ డాలర్లు చేరినప్పటికీ.. దేశ దాదాపు 10 నెలల దిగుమతుల అవసరాలకు ఇవి సరిపోతాయని అంచనా. తాజా పరిస్థితులపై ఫిచ్ రేటింగ్ వెలువరించిన తాజా నివేదిక అంశాలను పరిశీలిస్తే.. ► భారత్‌లోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ ఖాతా లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (1.2 శాతం) భారీగా పెరిగినప్పటికీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ► పబ్లిక్ ఫైనాన్స్ పరిస్థితులు రేటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. భారత్ సావరిన్ రుణ అంశాలు అంతర్జాతీయ ఫైనాన్సింగ్‌పై పరిమితంగానే ఆధారపడడం ఇక్కడ గమనార్హం. దీనివల్ల ప్రపంచ అస్థిరత నుండి భారతదేశం తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం లేదు. భారీ ఫారెక్స్ నిల్వలు రుణ చెల్లింపు సామర్థ్యానికి భరోసాను ఇస్తాయి. స్వల్పకాలిక అంతర్జాతీయ రుణం మొత్తం ఫారెక్స్ నిల్వల్లో కేవలం 24 శాతమే ఉండడం సానుకూల అంశం. ► 2022 రెండవ త్రైమాసికంలో భారత్ స్థూల విదేశీ రుణం జీడీపీలో 18.6 శాతంగా ఉంది. 2021 ‘బీబీబీ’ రేటెడ్ సావరిన్ దేశాల 72 శాతంతో పోల్చితే ఇది చాలా తక్కువ. ► భారత్ ఎగుమతులపై యూరోపియన్, అమెరికా మార్కెట్ల మందగమన ప్రభావం సమీప కాలంలో ఉండవచ్చు. అయితే 2022–23లో క్యాడ్ 3.4 శాతం (జీడీపీలో) ఉన్నా, 2023– 24లో ఇది 2 శాతానికి తగ్గే అవకాశం ఉంది. భారత్ ఎగుమతుల్లో ప్రధానమైన ఇంధన ధరల తగ్గుతాయన్న అంచనాలు దీనికి కారణం. రేటింగ్స్ ఇలా... భారత్‌కు ఫిచ్ ‘బీబీబీ– (జూన్‌లో నెగటివ్ అవుట్‌లుక్ నుంచి స్టేబుల్ అవుట్‌లుక్‌కు పెంపు) రేటింగ్ ఇస్తోంది. ఎస్అండ్పీ ‘బీబీబీ–’ రేటింగ్‌ను కలిగి ఉంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ బీఏఏ3 (స్టేబుల్ అవుట్‌లుక్) రేటింగ్‌ను ఇస్తోంది. ఈ రేటింగ్స్ చెత్ గ్రేడ్‌కు ఒక అంచె ఎక్కువ. ఒక దేశం లేదా కంపెనీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు రేటింగ్ సంస్థల రేటింగ్‌ను ప్రాతిపదికగా తీసుకునే సంగతి తెలిసిందే. -
అంతర్జాతీయంగా పసిడి పరుగు
వాషింగ్టన్: ఆర్థిక అనిశ్చితి ధోరణుల్లో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గురువారం 35 డాలర్లకుపైగా పెరిగి 1,752 డాలర్లపైన ట్రేడవుతోంది (రాత్రి 11 గంటల సమయంలో). అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, మాంద్యం పరిస్థితుల్లో ఇకముందు ఫెడ్ ఫండ్ రేటు మరింత దూకుడుగా ఉండబోదన్న అంచనాలు, 20 సంవత్సరాల గరిష్టం 109 నుంచి వెనక్కు తగ్గిన డాలర్ ఇండెక్స్ (ఈ వార్త రాస్తున్న సమయంలో 106.4 వద్ద ట్రేడింగ్) వంటి కీలక అంశాలు దీనికి నేపథ్యం. ఇక అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా ముంబై ప్రధాన బులియన్ మార్కెట్లో ధర రూ.500 వరకూ లాభపడింది. -
క్షీణతలోనే... టోకు ద్రవ్యోల్బణం
అక్టోబర్‌లో మైనస్ 3.81 శాతం * 12 నెలల నుంచీ ఇదే ధోరణి * అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల ఎఫెక్ట్ * నిత్యావసరాల్లో... పప్పులు, ఉల్లి ధరలు భారం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 12వ నెలలోనూ అసలు పెరక్కపోగా... మైనస్‌లోనే కొనసాగింది. అక్టోబర్‌లో -3.81%గా నమోదయ్యింది. సెప్టెంబర్‌లో ఈ రేటు -4.54%. 2014 ఇదే నెలలో ఈ రేటు 1.66%గా ఉంది. దేశంలో టోకు ధరల సూచీ అసలు పెరక్కపోడానికి కారణాల్లో అంతర్జాతీయ కమోడిటీ ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం ఒకటి. అయితే టోకున చూస్తే... నిత్యావసరాల్లో పప్పులు, ఉల్లి ధరలు తీవ్రంగా ఉన్నాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... మూడు ప్రధాన విభాగాల వార్షిక రీతిన వివరాలు... మూడు విభాగాలూ మైనస్‌లోనే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్-ఫుడ్, మినరల్స్ విభాగాలతో కూడిన ఈ కేటగిరీలో ద్రవ్యోల్బణం -0.36% క్షీణతలో ఉంది. అయితే ప్రధానంగా ఫుడ్ ఆర్టికల్స్‌ను ఇందులో చూస్తే పెరుగుదల రేటు 2.44%. ఫ్యూయల్ అండ్ పవర్: ద్రవ్యోల్బణం క్షీణతలో -16.32%గా ఉంది. తయారీ: సూచీలో దాదాపు 65 శాతం వాటా ఉన్న ఈ రంగంలో కూడా ద్రవ్యోల్బణం -1.67 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తులు...: ఫుడ్ కేటగిరీలో టోకు ద్రవ్యోల్బణం మొత్తంగా 2.44% పెరిగితే... ప్రధానంగా పప్పులు, ఉల్లి ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. పప్పు దినుసుల ధరలు వార్షికంగా 52.98% పెరిగాయి. ఉల్లి ధరలు 85.66% అధికంగా ఉన్నాయి. కూరగాయల ధరలు 2.56% పెరిగాయి. ఈ నెలలో ధరలు పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో పాలు (1.75%), గోధుమలు (4.68%) ఉన్నాయి. ధరలు తగ్గిన ఉత్పత్తుల్లో ఆలుగడ్డ (-59%) ఉంది. పాలసీ సమీక్షపై దృష్టి... డిసెంబర్ 1న ఆర్బీఐ పాలసీ సమీక్షను నిర్వహించనుంది. ఈ సందర్భంగా నిర్ణయానికి అక్టోబర్ టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. అక్టోబర్‌లో వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఈ రేటు నాలుగు నెలలుగా పెరుగుతూ వస్తోంది. పప్పులు, ఇతర ఆహార ఉత్పత్తుల రిటైల్ ధరల పెరుగుదలే దీనికి కారణం.