న్యూఢిల్లీ: భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు ఉన్నట్లు తెలిపింది.
ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం ఇస్తున్న సావరిన్ రేటింగ్‌కు వచ్చిన ఇబ్బంది ఏదీ లేదని భరోసా ఇచ్చింది. ఈ ఏడాది జనవరి సెప్టెంబర్ మధ్య ఫారెక్స్ నిల్వలు దాదాపు 100 బిలియన్ డాలర్లు తగ్గి, 533 బిలియన్ డాలర్లు చేరినప్పటికీ.. దేశ దాదాపు 10 నెలల దిగుమతుల అవసరాలకు ఇవి సరిపోతాయని అంచనా. తాజా పరిస్థితులపై ఫిచ్ రేటింగ్ వెలువరించిన తాజా నివేదిక అంశాలను పరిశీలిస్తే..
► భారత్‌లోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ ఖాతా లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (1.2 శాతం) భారీగా పెరిగినప్పటికీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
► పబ్లిక్ ఫైనాన్స్ పరిస్థితులు రేటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. భారత్ సావరిన్ రుణ అంశాలు అంతర్జాతీయ ఫైనాన్సింగ్‌పై పరిమితంగానే ఆధారపడడం ఇక్కడ గమనార్హం. దీనివల్ల ప్రపంచ అస్థిరత నుండి భారతదేశం తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం లేదు. భారీ ఫారెక్స్ నిల్వలు రుణ చెల్లింపు సామర్థ్యానికి భరోసాను ఇస్తాయి. స్వల్పకాలిక అంతర్జాతీయ రుణం మొత్తం ఫారెక్స్ నిల్వల్లో కేవలం 24 శాతమే ఉండడం సానుకూల అంశం.
► 2022 రెండవ త్రైమాసికంలో భారత్ స్థూల విదేశీ రుణం జీడీపీలో 18.6 శాతంగా ఉంది. 2021 ‘బీబీబీ’ రేటెడ్ సావరిన్ దేశాల 72 శాతంతో పోల్చితే ఇది చాలా తక్కువ.
► భారత్ ఎగుమతులపై యూరోపియన్, అమెరికా మార్కెట్ల మందగమన ప్రభావం సమీప కాలంలో ఉండవచ్చు. అయితే 2022–23లో క్యాడ్ 3.4 శాతం (జీడీపీలో) ఉన్నా, 2023– 24లో ఇది 2 శాతానికి తగ్గే అవకాశం ఉంది. భారత్ ఎగుమతుల్లో ప్రధానమైన ఇంధన ధరల తగ్గుతాయన్న అంచనాలు దీనికి కారణం.
రేటింగ్స్ ఇలా...
భారత్‌కు ఫిచ్ ‘బీబీబీ– (జూన్‌లో నెగటివ్ అవుట్‌లుక్ నుంచి స్టేబుల్ అవుట్‌లుక్‌కు పెంపు) రేటింగ్ ఇస్తోంది. ఎస్‌అండ్‌పీ ‘బీబీబీ–’ రేటింగ్‌ను కలిగి ఉంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ బీఏఏ3 (స్టేబుల్ అవుట్‌లుక్) రేటింగ్‌ను ఇస్తోంది. ఈ రేటింగ్స్ చెత్ గ్రేడ్‌కు ఒక అంచె ఎక్కువ. ఒక దేశం లేదా కంపెనీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు రేటింగ్ సంస్థల రేటింగ్‌ను ప్రాతిపదికగా తీసుకునే సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment