Fitch Ratings
-
సావరీన్ రేటింగ్‌కు ‘క్షీణత రిస్క్’
భారత ఆర్థిక వ్యవస్థ రుణ భారం పెరుగుతుందని, ఒకవేళ ఏవైనా పెద్ద ఆర్థిక సమస్యలు ఎదురైతే ఇది మరింత పెరగొచ్చని (దిగువ వైపు రిస్క్) ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. దీంతో సార్వభౌమ రేటింగ్ తగ్గుదల రిస్క్ పొంచి ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే సమయంలో మధ్య కాలానికి సంబంధించి ద్రవ్య కార్యాచరణను కట్టుబడడం, రుణ భారాన్ని తగ్గించుకునే విషయంలో విశ్వాసం పెరిగినట్లు తెలిపింది. ఇది నిర్ణీత కాలానికి సార్వభౌమ రేటింగ్ పరంగా సానుకూలం అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది.చివరిసారిగా 2024 ఆగస్ట్‌లో భారత్‌కు బీబీబీ మైనస్-స్టెబుల్ (స్థిరత్వం) రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్టు ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. పెట్టుబడుల పరంగా ఇది కనిష్ట రేటింగ్. 2006 ఆగస్ట్ నుంచి భారత్‌కు ఇదే రేటింగ్‌ను ఫిచ్ కొనసాగిస్తూ వస్తోంది. 2024–25 సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యోలోటును 4.8 శాతానికి కట్టడి చేయనున్నట్టు, 2025–26లో దీన్ని 4.4 శాతానికి తగ్గించుకోనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. ఆర్థిక వృద్ధి బలహీన పడిన తరుణంలోనూ రుణ భారం తగ్గింపునకు ప్రభుత్వం కట్టుబడి ఉండడాన్ని ఫిచ్ రేటింగ్స్ భారత ప్రైమరీ సావరీన్ అనలిస్ట్ జెరేమీ జూక్ ఈ సందర్భంగా ప్రశంసించారు. అంచనాలు వాస్తవికంగా ఉన్నాయంటూ, వాటిని భారత్ సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే బలహీన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో ఆదాయం వసూళ్లు చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గిపోవచ్చని హెచ్చరించారు. దీనికి అదనంగా ఖర్చు నియంత్రణ చర్యలు అవసరం కావొచ్చన్నారు. వృద్ధి తటస్థం2025–26 బడ్జెట్ వృద్ధికి తటస్థంగా ఉన్నట్టు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. పన్నుల తగ్గింపుతో వినియోగానికి ఊతమివ్వడం, స్థిరమైన మూలధన వ్యయాలు అనేవి ద్రవ్యలోటు తగ్గింపు ప్రతికూలతలను భర్తీ చేయొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. నియంత్రణల తొలగింపు ద్వారా పెట్టుబడులను ఇతోధికం చేసే విధానం మధ్య కాలానికి వృద్ధి సానుకూలమని, విధానాల కచ్చితమైన అమలుపైనే విజయం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. వృద్ధి, ద్రవ్యలోటు తగ్గింపు మధ్య సమతుల్యత అన్నది మరింత సవాలుతో కూడినదిగా తెలిపింది. రానున్న సంవత్సరాల్లో అంచనాల కంటే ఆదాయం తక్కువగా ఉండొచ్చని.. కఠినమైన వ్యయ నియంత్రణలు, మూలధన వ్యయ నియంత్రణల ప్రాముఖ్యాన్ని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొంది. మధ్య కాలానికి ద్రవ్యలోటు పట్ల ప్రభుత్వం గొప్ప స్పష్టత ఇచ్చిందని తెలిపింది. 2031 మార్చి నాటికి జీడీపీలో రుణభారాన్ని 50 శాతానికి తగ్గించుకోనున్నట్టు బడ్జెట్లో ప్రకటించడాన్ని గుర్తు చేసింది. 2025 మార్చి నాటికి అంచనాలతో పోలి్చతే 7 శాతం తగ్గనుంది. ఇదీ చదవండి: ఈసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?సావరీన్ రేటింగ్ యథాతథంవచ్చే ఏడాదికి ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతానికి కట్టడి చేసేందుకు ఆర్థిక శాఖ ప్రతిపాదించిన నేపథ్యంలో ఇండియా సావరీన్ రేటింగ్‌ను వెంటనే అప్‌గ్రేడ్ చేయబోమని రేటింగ్స్ దిగ్గజం మూడీస్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే బాటలో సమర్థవంత చర్యలకు తెరతీస్తుండటాన్ని సానుకూలంగా పరిగణిస్తున్నట్లు మూడీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ క్రిస్టియన్ డి గజ్మన్ పేర్కొన్నారు. అయితే ద్రవ్య లోటు కట్టడి, ఆర్థిక క్రమశిక్షణ తదితరాల కారణంగా మెరుగుపడనున్న రుణ సామర్థ్యం, రుణభారం తదితరాలతో సావరీన్ రేటింగ్ పెంపునకు త్వరపడబోమని తెలియజేశారు. ప్రస్తుతం మూడీస్ దేశీ సావరీన్ రేటింగ్‌ను సుస్థిర ఔట్‌లుక్‌తో బీఏఏఏ3గా కొనసాగిస్తోంది. ఇది కనీస ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్కాగా.. తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ ఏడాది(2024–25) ద్రవ్య లోటు 4.8 శాతానికి పరిమితం కానున్నట్లు అభిప్రాయపడ్డారు. 2025–26లో 4.4 శాతానికి కట్టడి చేసే ప్రణాళికలు ప్రకటించారు. -
మార్చి తర్వాత వడ్డీరేటు తగ్గింపు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–2026) రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ దిగ్గజం– ఫిచ్ విశ్లేషించింది. స్థిర వృద్ధి, ధరల పెరుగుదల్లో కట్టడి వంటి అంశాలు దీనికి దోహదపడతాయన్నది ఫిచ్ విశ్లేషణ. రెపో రేటు కోత 2025–26లో కార్పొరేట్ల రుణ లభ్యత పెరుగుదలకు దారితీసే అంశంగా పేర్కొంది. అధిక మూలధన వ్యయాలు నమోదయినప్పటికీ, వచే ఆర్థిక సంవత్సరం భారత్ కార్పొరేట్ల మార్జిన్లు మెరుగుపడతాయన్న విశ్వాసాన్ని ఫిచ్ వెలిబుచ్చింది. ‘‘ఇండియా కార్పొరేట్ల క్రెడిట్ ట్రెండ్స్’’ పేరుతో ఫిచ్ రూపొందించిన తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... వృద్ధి 6.5 శాతం 2025–26లో సిమెంట్, విద్యుత్, పెట్రోలియం ఉత్పత్తులు, ఉక్కు, ఇంజినీరింగ్, నిర్మాణ (ఈఅండ్‌సీ) కంపెనీల ఉత్పత్తులకు మంచి డిమాండ్ అవకాశాలు ఉన్నాయి. దీనితో ఎకానమీ 6.5 శాతం పురోగమించే వీలుంది. మౌలిక సదుపాయాల వ్యయం పెరగవచ్చు. ఎకానమీ స్థిరవృద్ధికి ఈ అంశం దోహదపడుతుంది. మరికొన్ని అంశాలు... → దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు నెమ్మదించడం వల్ల ఆటో రంగంలో వృద్ధి మధ్యస్థంగా ఉండే వీలుంది. → రవాణా, పర్యాటక పరిశ్రమలో డిమాండ్ రికవరీ ఒక మోస్తరు వేగంతో కొనసాగుతుంది. → అంతర్జాతీయంగా అధిక సరఫరాల ప్రభావం రసాయన కంపెనీల ధరలపై ప్రభావం చూపుతుంది. → టెలికం కంపెనీల ఆదాయ వృద్ధికి టారిఫ్‌ల పెంపు మద్దతు లభిస్తుంది. → ఔషధ రంగంలో మెరుగైన ఫలితాలు నమోదుకావచ్చు.రూపాయిపై ఒత్తిడి కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత రూపాయి మరింత క్షీణించవచ్చు. అమెరికాసహా కొన్ని దేశాలు తీసుకునే వాణిజ్య రక్షణాత్మక చర్యల వల్ల దిగుమతులు తగ్గి, రూపాయిపై ఆ ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఐటీ మందగమనం.. కీలకమైన విదేశీ మార్కెట్లలోని వినియోగదారులు ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వ్యయాల విషయంలో విచక్షణతో వ్యవహరించవచ్చు. దీనితో ఐటీ, సేవా కంపెనీల అమ్మకాల్లో కేవలం ఒక అంకె వృద్ధి మాత్రమే నమోదయ్యే వీలుంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి విక్రయాల్లో వృద్ధి ఒక అంకెకు పరిమితం కావచ్చు.రేటు తగ్గింపు ప్రక్రియ షురూ! రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపనకు పడిపోయే అవకాశం ఉంది. ఆర్బీవ్యోల్బణం నుండి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని మేము నమ్ముతున్నాము. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నాము. – అఖిల్ మిట్టల్, సీనియర్ ఫండ్ మేనేజర్ (టాటా అసెట్ మేనేజ్మెంట్)ఫిబ్రవరిలో రేటు తగ్గదు నవంబర్ 2024లో 5.5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.2 శాతానికి దిగివచ్చింది. ఇది మా అంచనాలకన్నా తక్కువ. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి పాలసీ సమీక్షలో రెపో రేటు తగ్గింపు కష్టమే. అయితే కూరగాయల వంటి నిత్యావసర వస్తువుల్లో ధరలలో గణనీయమైన క్షీణత వల్ల వృద్ధే లక్ష్యంగా ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యుల్లో కొందరు కోతకు మొగ్గుచూపే వీలుంది. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ ఏప్రిల్ పాలసీలో కోత కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా రేటు తగ్గింపునకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ) రేటు తగ్గింపునకు మరొక పాలసీ వరకూ ఆర్బీఐ వేచిచూసే వీలుంది. – పరాస్ జస్రాయ్, ఇండ్–రా ఎకనమిస్ట్ -
వృద్ధి పటిష్టం.. రేటింగ్ యథాతథం: ఫిచ్
న్యూఢిల్లీ: పటిష్ట వృద్ధి తీర, ద్రవ్య విశ్వసనీయత నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థకు ‘స్టేబుల్ అవుట్‌లుక్‌తో బీబీబీమైనస్’ ను కొనసాగిస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ స్పష్టం చేసింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటును 7.2 శాతంగా అంచనావేసిన ఫిచ్, 2025–26లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని పేర్కొంది.2023–24లో దేశం సాధించిన 8.2 శాతంతో పోల్చితే ఒక శాతంపైగా వృద్ధిరేటు తగ్గుతుండడం గమనార్హం. ఈ ఏడాది మేలో మరో రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ దేశ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్ నుంచి పాజిటివ్‌కు’ పెంచింది. అయితే ‘బీబీబీమైనస్’ను కొనసాగించింది. రెండు సంస్థల రేటింగ్‌లూ ‘జంక్ స్టేటస్’కు ఒక అంచె ఎక్కువ. మూడీస్ కూడా ఇదే స్థాయి రేటింగ్‌ను దేశానికి ఇస్తోంది.మూడీస్ వృద్ధి అంచనాల పెంపు మూడీస్ తాజాగా ఒక నివేదికను విడుదల చేస్తూ, దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను పెంచింది. 2024లో జీడీపీ వృద్ధి అంచనాలను 6.8 శాతం నుంచి 7.2 శాతానికి, 2025లో 6.4 శాతం నుంచి 6.6 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొంది. -
సెన్సెక్స్ 507 పాయింట్ల రికవరీ
ముంబై: మిడ్‌సెషన్ నుంచి ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు బుధవారం కనిష్టస్థాయిల నుంచి రికవరీ అయ్యాయి. అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, ఎస్బీఐ షేర్లు 2 శాతం వరకు రాణించి సూచీల దన్నుగా నిలిచాయి. ఉదయం సెషన్లో 369 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 138 పాయింట్ల లాభంతో 65,539 వద్ద స్థిరపడింది. కనిష్టం నుంచి మొత్తంగా 507 పాయింట్లు రికవరీ అయ్యింది. నిఫ్టీ సైతం 118 పాయింట్ల పతనం నుంచి తేరుకొని 30 పాయింట్ల లాభంతో 19,465 వద్ద ముగిసింది. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరగడం, చైనా ఆరి్థక వ్యవస్థ మాంద్య ఆందోళనలు, అమెరికాకు బ్యాంకులకు ఫిచ్ డౌన్‌గ్రేడ్ రేటింగ్ హెచ్చరికలు పరిణామాల నేపథ్యంలో తొలిసెషన్లో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే బ్రిటన్‌లో ద్రవ్యోల్బణ తగ్గుముఖం పట్టినట్లు డేటా గణాంకాలు వెల్లడి కావడం, యూఎస్ ఫెడ్ మినిట్స్, పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి ముందు షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో అనూహ్యంగా సెంటిమెంట్ మెరుగుపడింది. మెటల్, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మధ్య, చిన్న తరహా షేర్లు రాణించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.50%, 0.25 శాతం చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 723 కోట్ల విలువైన షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,406 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. పార్సీ కొత్త ఏడాది సందర్భంగా ఫారెక్స్, మనీ మార్కెట్లు బుధవారం పనిచేయలేదు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► ఇండిగో ప్రమోటర్ శోభ అగర్వాల్ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 2.9% వాటాను రూ.2,802 కోట్లకు అమ్మారు. దీంతో కంపెనీ షేరు 3.56% నష్టపోయి రూ.2458 వద్ద ముగిసింది. ► క్యూ1లో రూ.7,840 నష్టాన్ని ప్రకటించడంతో టెలికం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా 3% నష్టపోయి రూ.7.82 వద్ద స్థిరపడింది. ► ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా బర్మన్ ఫ్యామిలీ రిలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌లో 7.5% వాటాను రూ.534 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో బీఎస్ఈలో రిలిగేర్ షేరు 6% పెరిగి రూ.233 వద్ద స్థిరపడింది. ఎస్బీఎఫ్సీ బంపర్ లిస్టింగ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ షేరు లిస్టింగ్‌లో అదరగొట్టింది. ఇష్యూ ధర రూ.57తో పోలిస్తే 44% ప్రీమియంతో రూ.82 వద్ద లిస్టయ్యింది. మరింత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 67% ఎగిసి రూ.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి రూ.61% లాభంతో రూ.92 వద్ద స్థిరపడింది. కంపెనీ విలువ రూ.9,813 కోట్లుగా నమోదైంది. -
మార్కెట్లపై ‘ఫిచ్’ పంచ్
ముంబై: ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ అమెరికా రుణ రేటింగ్‌ను తగ్గించడంతో బుధవారం ఈక్విటీ మార్కెట్లు బేర్మన్నాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు ఒక శాతానికి పైగా కుప్పకూలాయి. ఫలితంగా దలాల్ స్ట్రీట్‌లో రూ.3.46 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఉదయం సెన్సెక్స్ 395 పాయింట్ల నష్టంతో 66,064 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు పతనమై 19,655 వద్ద మొదలయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల ప్రభావంతో రోజంతా నష్టాల్లో కదలాడాయి. విస్తృత స్థాయిలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆయా రంగాల సూచీలు గరిష్టంగా రెండున్నర శాతం వరకు క్షీణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1027 పాయింట్లు నష్టపోయి 65,432 వద్ద, నిఫ్టీ 311 పాయింట్లు క్షీణించి 19,423 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. చివర్లో కనిష్ట స్థాయిల వద్ద స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 677 పాయింట్లు నష్టపోయి 65,783 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్లు పతనమై 19,527 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లలో పెద్ద ఎత్తున విక్రయాలు తలెత్తాయి. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలూ ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1878 కోట్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.2 కోట్లను షేర్లను విక్రయించారు. రూపాయి ఆరునెలల్లో అతిపెద్ద పతనం రూపాయి విలువ ఆరు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. డాలర్ మారకంలో 45 పైసలు కరిగిపోయి 82.67 వద్ద స్థిరపడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనం, విదేశీ ఇన్వెస్టర్లు నిధుల ఉపసంహరణలు ఇందుకు కారణమయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 82.38 వద్ద మొదలైంది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇంట్రాడే కనిష్ట స్థాయి(82.67) వద్ద ముగిసింది. ‘ప్రపంచ మార్కెట్లో రిస్క్ తీసుకునే సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు ఆసియా కరెన్సీల బలహీన ట్రేడింగ్‌తో రూపాయి భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ కరెన్సీ విలువల్లో డాలర్ బలపడటమూ దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచింది’ అని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఒక్క రోజులో రూ.3.46 లక్షల కోట్ల నష్టం సెన్సెక్స్ ఒక శాతానికి పైగా క్షీణించడంతో దలాల్ స్ట్రీట్‌లో రూ.3.46 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.303 లక్షల కోట్లకు దిగివచి్చంది. నష్టాలు ఎందుకంటే ► ‘గత 20 ఏళ్లలో అమెరికా అప్పుల కుప్పగా మారింది. పాలనా వ్యవస్థలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. యూఎస్ రుణ రేటింగ్‌ను ఏఏఏ నుంచి ఏఏప్లస్ రేటింగ్‌కు తగ్గిస్తున్నాము’ అని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. ఈ ప్రకటన ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ► ఫిచ్ రేటింగ్ కుదింపుతో పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ల నుంచి బాండ్లలోకి మళ్లాయి. అమెరికా పదేళ్ల కాలపరిమిత బాండ్లపై రాబడి ఏకంగా 4% పెరిగింది. ► యూరో జోన్, చైనా జూలై పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడంతో అంతర్జాతీయ వృద్ధి భయాలు వెంటాడాయి. ఈ పరిణామాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు 2–1% క్షీణించాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. ► దేశీయంగా గడిచిన నాలుగు నెలల్లో సూచీలు 13% ర్యాలీ చేయడంతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపారు. -
వృద్ధి రేటు అంచనాలు పెంచిన ఫిచ్..
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి మెరుగుపడుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తయారీ రంగంలో ఉత్పత్తి మెరుగుదల, మౌలిక సదుపాయాల వ్యయంలో స్థిరమైన పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో మార్చిలో వేసిన తొలి 6 శాతం అంచనాలను తాజాగా 6.3 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ఈ అంచనా ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటు అని కూడా పేర్కొంది. ఫిచ్ గ్లోబల్ ఎకనమిక్ తాజా అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో 6.5 శాతం చొప్పున వృద్ధి నమోదుకావచ్చు. బ్యాంకింగ్ భారీ రుణ వృద్ధి, మౌలిక సదుపాయాల వ్యయం నుంచి ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు పొందుతోంది. తయారీ రంగంలో రికవరీతోపాటు నిర్మాణ, వ్యవసాయ రంగాలు కూడా పురోగతిలో ఉన్నాయి. ఆయా అంశాలు దేశీయ డిమాండ్‌ను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం భయాలు తొలగుతున్నాయి. తగిన వర్షపాతం అంచనాలు ఉన్నాయి. 2023లో ఆర్బీఐ రెపో రేటు (ప్రస్తుతం 6.50 శాతం) యథాతథంలో కొనసాగవచ్చు. ప్రపంచ వృద్ధి అంచనా పెంపు కాగా ఊహించినదానికన్నా పరిస్థితులు మెరుగ్గా ఉన్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను సైతం 2.4 శాతానికి పెంచుతున్నట్లు నివేదిక పేర్కొంది. మార్చిలో ఈ అంచనా 2 శాతం. -
భళా.. భారత్, కానీ.. ప్రభుత్వ ఆదాయాలు - వ్యయాల పరిస్థితే బలహీనం!
న్యూఢిల్లీ: భారత్ సావరిన్ రేటింగ్ విషయంలో యథాతథ వైఖరిని అవలంభిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ తన తాజా ప్రకటనలో పేర్కొంది. చక్కటి వృద్ధి తీరు, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులను తట్టుకొని నిలబడ్డం వంటి అంశాల నేపథ్యంలో రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాల విషయంలో పరిస్థితి బలహీనంగా ఉందని కూడా హెచ్చరించింది. ‘బీబీబీ మైనస్’ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. చెత్త రేటింగ్‌కు ఒక అంచె అధికం. 2006 ఆగస్టు నుంచి ఇదే రేటింగ్‌ను ఫిచ్ కొనసాగిస్తోంది. మరో రెండు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజాలు– మూడీస్, స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) కూడా భారత్‌కు ఇదే తరహా రేటింగ్‌ను ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా దేశంలోకి పెట్టుబడులు రావడానికి ఆయా సంస్థలు ఇచ్చే రేటింగ్స్ కీలకం. ఫిచ్ విశ్లేషణలో కొన్ని ముఖ్యాంశాలు.. ♦లాంగ్–టర్మ్ ఫారిన్ కరెన్సీ ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్) స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’గా కొనసాగుతుంది. పటిష్ట వృద్ధి ధోరణి సావరిన్ రేటింగ్‌కు మద్దతిస్తున్న ప్రధాన అంశం. ♦ చెక్కుచెదరని పెట్టుబడుల అవకాశాల నేపథ్యంలో భారత్ వృద్ధి 2023 ఏప్రిల్–2024 మార్చి (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం) మధ్య 6 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. 2022–23లో 7 శాతం వృద్ధి రేటు అంచనాకాగా, 2024–25లో ఎకానమీ స్పీడ్‌ను 6.7 శాతంగా అంచనావేస్తున్నాం. ♦ తోటి ఎకానమీలతో పోల్చితే భారత్ వృద్ధి అవుట్‌లుక్ బాగుంది. దీనితోపాటు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులను తట్టుకునే సామర్థ్యం వల్ల గత ఏడాదికాలంగా పురోగమన బాటలో పయనిస్తోంది. ♦ ప్రభుత్వం మౌలిక రంగంపై పెడుతున్న ప్రత్యేక దృష్టి నేపథ్యంలో గత కొన్నేళ్లుగా కార్పొరేట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో సానుకూల ధోరణి కనిపిస్తోంది. దీనితో ప్రైవేట్ రంగం బలమైన పెట్టుబడితో వృద్ధి బాటపై ఉన్నట్లు కనిపిస్తోంది. ♦ సేవా రంగ ఎగుమతులకు భారత్ మంచి అవకాశాలు పొందవచ్చు. ♦ గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం సగటును 6.7 శాతం ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5.8 శాతంగా నమోదుకావచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6% అప్పర్బాండ్ కన్నా ఇది 20 బేసిస్ పాయింట్లు తక్కువ. బలహీనతలు ఇవీ.. దేశం కొన్ని బలహీనతలనూ ఎదుర్కొంటోంది. ఆదాయాలు–వ్యయాలు, అధిక లోటు, దీనిని తగ్గించడానికి ప్రభుత్వ వ్యయాల కోత, రుణ భారం, ప్రపంచబ్యాంక్ గవర్నెన్స్ సూచీలుసహా, జీడీపీ తలసరి ఆదాయంసహా కొన్ని వ్యవస్థాగత సూచీలు ఇక్కడ ప్రస్తావనాంశాలు. ద్రవ్యోల్బణం సవాళ్లు, పెరుగుతున్న వడ్డీరేట్లు, అంతర్జాతీయంగా డిమాండ్ పరిస్థితుల మందగమనం, మహమ్మారికి సంబంధించి సమసిపోని సవాళ్లు– అనుమానాలు వంటివీ ఎకానమీ పురోగతికి సవాళ్లుగా ఉన్నాయి. కార్మిక శక్తి భాగస్వామ్యం ఎకానమీలో ఇంకా బలహీనంగానే ఉంది. సంస్కరణల అమలు బాట ఒడిదుడుకులుగానే ఉంది. భారత్ మార్కెట్ అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నప్పటికీ, ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవడానికి సంబంధించి తగిన సంస్కరణలతో భారత్ సంసిద్ధంగా ఉందా? లేదా అన్న అంశంపై అనిశ్చితి నెలకొంది. భారత్ ప్రభుత్వ రుణ భారం 2022–23లో 82.8%గా (జీడీపీలో) ఉంటుందని భావిస్తున్నాం. -
చమురు కంపెనీలకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్ల అనూహ్య పెరుగుదల వల్ల దేశీ చమురు ఉత్పత్తి కంపెనీలు ఆర్జిస్తున్న భారీ లాభాలపై (విండ్‌ఫాల్ ట్యాక్స్) పన్నును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఎత్తివేయవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. చమురు ధరలు మోస్తరు స్థాయికి చేరుకోనుండడాన్ని ఇందుకు అనుకూలంగా ప్రస్తావించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి విండ్‌ఫాల్ పన్నును కేంద్ర సర్కారు అమల్లోకి తీసుకురావడం గమనార్హం. దేశీయంగా ఉత్పత్తి చేసి విక్రయించే, ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌లపై దీన్ని విధించింది. అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగిపోవడంతో ఉత్పత్తి కంపెనీలకు ఒక్కసారిగా అనూహ్య లాభాలు వచ్చిపడ్డాయి. ఈ ప్రయోజనాన్ని కొంత వరకు పన్నుల రూపంలో ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వెనక్కి తీసుకునే ప్రయతాన్ని ప్రభుత్వం చేసింది. దేశ చమురు వినియోగంలో 15 శాతం స్థానికంగా ఉత్పత్తి అవుతున్నదే ఉంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దశాబ్ద గరిష్టాలకు చేరడం తెలిసిందే. ఈ ఏడాది చివరికి బ్రెంట్ చమురు బ్యారెల్ ధర 85 డాలర్ల వద్ద స్థిరపడుతుందని ఫిచ్ అంచనా వేసింది. ధరలు తగ్గడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు పుంజుకుంటాయని, 2022లో నష్టాలను అవి కొంత వరకు భర్తీ చేసుకుంటాయని ఫిచ్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. రిఫైనింగ్ మార్జిన్లు మధ్య స్థాయికి చేరుకుంటాయని, చమురు మార్కెటింగ్ కంపెనీల క్రెడిట్ అంశాలు మెరుగుపడతాయని పేర్కొంది. -
తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు
న్యూఢిల్లీ: భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు ఉన్నట్లు తెలిపింది. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం ఇస్తున్న సావరిన్ రేటింగ్‌కు వచ్చిన ఇబ్బంది ఏదీ లేదని భరోసా ఇచ్చింది. ఈ ఏడాది జనవరి సెప్టెంబర్ మధ్య ఫారెక్స్ నిల్వలు దాదాపు 100 బిలియన్ డాలర్లు తగ్గి, 533 బిలియన్ డాలర్లు చేరినప్పటికీ.. దేశ దాదాపు 10 నెలల దిగుమతుల అవసరాలకు ఇవి సరిపోతాయని అంచనా. తాజా పరిస్థితులపై ఫిచ్ రేటింగ్ వెలువరించిన తాజా నివేదిక అంశాలను పరిశీలిస్తే.. ► భారత్‌లోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ ఖాతా లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (1.2 శాతం) భారీగా పెరిగినప్పటికీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ► పబ్లిక్ ఫైనాన్స్ పరిస్థితులు రేటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. భారత్ సావరిన్ రుణ అంశాలు అంతర్జాతీయ ఫైనాన్సింగ్‌పై పరిమితంగానే ఆధారపడడం ఇక్కడ గమనార్హం. దీనివల్ల ప్రపంచ అస్థిరత నుండి భారతదేశం తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం లేదు. భారీ ఫారెక్స్ నిల్వలు రుణ చెల్లింపు సామర్థ్యానికి భరోసాను ఇస్తాయి. స్వల్పకాలిక అంతర్జాతీయ రుణం మొత్తం ఫారెక్స్ నిల్వల్లో కేవలం 24 శాతమే ఉండడం సానుకూల అంశం. ► 2022 రెండవ త్రైమాసికంలో భారత్ స్థూల విదేశీ రుణం జీడీపీలో 18.6 శాతంగా ఉంది. 2021 ‘బీబీబీ’ రేటెడ్ సావరిన్ దేశాల 72 శాతంతో పోల్చితే ఇది చాలా తక్కువ. ► భారత్ ఎగుమతులపై యూరోపియన్, అమెరికా మార్కెట్ల మందగమన ప్రభావం సమీప కాలంలో ఉండవచ్చు. అయితే 2022–23లో క్యాడ్ 3.4 శాతం (జీడీపీలో) ఉన్నా, 2023– 24లో ఇది 2 శాతానికి తగ్గే అవకాశం ఉంది. భారత్ ఎగుమతుల్లో ప్రధానమైన ఇంధన ధరల తగ్గుతాయన్న అంచనాలు దీనికి కారణం. రేటింగ్స్ ఇలా... భారత్‌కు ఫిచ్ ‘బీబీబీ– (జూన్‌లో నెగటివ్ అవుట్‌లుక్ నుంచి స్టేబుల్ అవుట్‌లుక్‌కు పెంపు) రేటింగ్ ఇస్తోంది. ఎస్అండ్పీ ‘బీబీబీ–’ రేటింగ్‌ను కలిగి ఉంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ బీఏఏ3 (స్టేబుల్ అవుట్‌లుక్) రేటింగ్‌ను ఇస్తోంది. ఈ రేటింగ్స్ చెత్ గ్రేడ్‌కు ఒక అంచె ఎక్కువ. ఒక దేశం లేదా కంపెనీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు రేటింగ్ సంస్థల రేటింగ్‌ను ప్రాతిపదికగా తీసుకునే సంగతి తెలిసిందే. -
భారత్ రేటింగ్ అంచనా పెంపు
న్యూఢిల్లీ: భారతదేశ సార్వభౌమ రేటింగ్‌కు సంబంధించి ‘అవుట్‌లుక్’ను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రెండేళ్ల తర్వాత ‘నెగెటివ్’ నుండి ‘స్థిరం’కు అప్‌గ్రేడ్ చేసింది. వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ వల్ల మధ్య–కాల వృద్ధికి ఎదురయ్యే సవాళ్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే రేటింగ్‌ను మాత్రం ‘బీబీబీ (–) మైనస్’గా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ఫిచ్ 2006 ఆగస్టులో ‘బీబీబీ–’కు అప్‌గ్రేడ్ చేసింది. అప్పటి నుంచి ఇదే రేటింగ్ కొనసాగుతోంది. అయితే అయితే అవుట్‌లుక్ మ్రాతం ‘స్టేబుల్’–‘నెగటివ్’మధ్య ఊగిసలాడుతోంది. భారత్ ఎకానమీ రికవరీ వేగవంతంగా ఉందని, ఫైనాన్షియల్ రంగం బలహీనతలు తగ్గుతున్నాయని ఫిచ్ తాజాగా పేర్కొంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల తీవ్రత వల్ల సవాళ్లు ఉన్పప్పటికీ ఎకానమీకి ఉన్న సానుకూల అంశాలు తమ తాజా నిర్ణయానికి కారణమని తెలిపింది. మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. ► ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో భారత్ ఎకానమీ అంచనాలను 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నాం. మార్చిలో వేసిన అంచనాలు 8.5 శాతం నుంచి 7.8 శాతానికి కుదిస్తున్నాం. అంతర్జాతీయ కమోడిటీ ధరల తీవ్రత, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, కఠిన ద్రవ్య విధానం దీనికి కారణాలు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 8.7 శాతం పురోగమించింది. ► కోవిడ్ –10 మహమ్మారి షాక్ నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ దృఢమైన రికవరీని కొనసాగిస్తోంది. ► సహచర వర్థమాన దేశాలతో పోల్చితే భారత్ పటిష్ట వృద్ధిలో పయనిస్తోంది. ఇది ఎకానమీపై మా అవుట్‌లుక్ మారడానికి కారణం. -
యుటిలిటీ వాహనాలకు డిమాండ్
ముంబై: యుటిలిటీ వాహనాలకు (యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా అమ్ముడయ్యే కార్లలో ఇవి అధిక వాటా దక్కించుకునే ధోరణి కొనసాగవచ్చని ఫిచ్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. అధిక మార్జిన్లు ఉండే యూవీల విక్రయాలపై మరింత దృష్టి పెట్టడం ద్వారా కమోడిటీల ధరల పెరుగుదల, అదనపు భద్రత ప్రమాణాలపరమైన వ్యయాల భారాన్ని ఆటోమొబైల్ సంస్థలు కొంత మేర ఎదుర్కొనేందుకు వీలుంటుందని పేర్కొంది. మరోవైపు, ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతుండటంతో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల తయారీని ఆటోమొబైల్ సంస్థలు తగ్గించుకుంటున్నట్లు వివరించింది. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్ల విక్రయాల్లో యూవీల పరిమాణం 49 శాతం పెరిగినట్లు (అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 28 శాతం) ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్ల సంయుక్త వాటా 66 శాతం నుండి 48 శాతానికి పడిపోయింది. యూవీలకు ఆదరణ పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ఇక యూవీ కేటగిరీలో అంతర్గతంగా ఎంట్రీ, మధ్య స్థాయి వాహనాల అమ్మకాల వాటా మొత్తం కార్ల విక్రయాల్లో 38 శాతానికి చేరింది. విశిష్టమైన సామర్థ్యాలతో పనిచేసే విశాలమైన యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని ఫిచ్ పేర్కొంది. కొత్త మోడల్స్‌తో వృద్ధికి ఊతం.. గత కొన్నేళ్లుగా హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే ఆటోమొబైల్ సంస్థలు పెద్ద సంఖ్యలో కొత్త యూవీ మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఎంట్రీ కార్ల కొనుగోలుదారులతో పోల్చినప్పుడు ధరను పెద్దగా పట్టించుకోకుండా కొత్త కార్లకు అప్‌గ్రేడ్ అయ్యేవారు, అధికాదాయ వర్గాల వారు ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ, మధ్య స్థాయి యూవీల అమ్మకాలు 21 శాతం పెరగ్గా, గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం మేర పెరిగాయి. కోవిడ్–19పరమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ యూవీలకు డిమాండ్ తగ్గలేదని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తగ్గుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు.. సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్ కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతూ ఉండటం వల్ల డిమాండ్, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. కమోడిటీల రేట్లు పెరిగిపోవడం, వాహన భద్రత ప్రమాణాలు కఠినతరం చేయడంతో 2018 నుంచి చూస్తే ఎంట్రీ స్థాయి కార్ల ధరలు 20–30 శాతం పెరిగాయని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విభాగంలో అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయని తెలిపింది. కార్లలో అదనంగా ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే నిబంధన ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తే తయారీ వ్యయాలు మరో 3–5 శాతం మేర పెరగవచ్చని పేర్కొంది. దీంతో ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో కొత్త కార్ల ఆవిష్కరణలు తగ్గవచ్చని, కొన్ని మోడల్స్‌ను నిలిపివేసే అవకాశాలున్నాయని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. దీని ఫలితంగా ఈ విభాగం వృద్ధి అవకాశాలు మరింతగా మందగిస్తాయని పేర్కొంది. ఖర్చులు పెరుగుతున్నా యూవీల అమ్మకాలు పెరుగుతుండటమనేది దేశీ కార్ల తయారీ సంస్థల లాభదాయకతకు తోడ్పాటుగా ఉండగలదని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. సియామ్ గణాంకాల ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు 6 శాతం క్షీణించగా యూవీల అమ్మకాలు 40 శాతం పెరిగి ఆ మేరకు వ్యత్యాసాన్ని భర్తీ చేశాయని, పరిశ్రమ 13 శాతం వృద్ధి నమోదు చేయడంలో తోడ్పడ్డాయని పేర్కొంది. -
Russia-Ukraine war: యూరప్ ఆర్థికం.. అస్తవ్యస్తం
బ్రసెల్స్: ఉక్రెయిన్–రష్యాల మధ్య ఉద్రిక్తతలతో యూరప్ దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. యుద్ధ ప్రభావాలతో ఇంధనాల రేట్లు ఎగిసిన నేపథ్యంలో.. ఉమ్మడి కరెన్సీగా యూరోను ఉపయోగించే 19 దేశాల్లో ధరల పెరుగుదల ఏప్రిల్‌లో మరో రికార్డు స్థాయికి చేరింది. మార్చిలో ద్రవ్యోల్బణం 7.4 శాతంగా ఉండగా.. తాజాగా ఏప్రిల్‌లో ఇది 7.5 శాతానికి చేరింది. దీంతో యూరోజోన్‌లో వరుసగా ఆరో నెలా కొత్త రికార్డు స్థాయి నమోదైనట్లయింది. ఫలితంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి బైటపడే అవకాశాలపై తీవ్ర ప్రభావాలు పడతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. యూరోజోన్ దేశాల్లో 34.3 కోట్ల మంది పైగా ప్రజలు ఉన్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని రికార్డు స్థాయికి ఎగదోసిన అంశాలే ప్రస్తుతం యూరోజోన్‌లో ధరల పెరుగుదలకు కారణమని పరిశీలకులు తెలిపారు. ఇంధన ధరలు 38 శాతం అప్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ఇంధన ధరలు 38 శాతం పెరిగాయని యూరోస్టాట్ వెల్లడించింది. యుద్ధ ప్రభావంతో ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతి దేశాల్లో ఒకటైన రష్యా నుంచి చమురు, గ్యాస్ సరఫరాల్లో ఆటంకాలు ఏర్పడతాయన్న ఆందోళనల కారణంగా ఈ రెండు ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చమురు ఎగుమతి దేశాలు, రష్యా సహా వాటి అనుబంధ దేశాలు.. ఉత్పత్తిని పెంచే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుండటంతో సమస్య మరింత జటిలం అవుతోంది. ఇక ముడి సరుకులు, విడిభాగాల సరఫరాలో అవరోధాలు దీన్ని ఇంకా తీవ్రం చేస్తున్నాయి. ప్రజలు, ప్రభుత్వాలకు ద్రవ్యోల్బణం సెగ గట్టిగానే తగులుతోంది. భవిష్యత్తుపై దీనిపై తీవ్ర ఆందోళన నెలకొంది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఇంధన అవసరాల కోసం రష్యా మీద ఆధారపడిన యూరప్ దేశాల పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది. ఉక్రెయిన్ మీద దాడికి దిగిన రష్యా మీద రాజకీయ అవసరాల రీత్యా పోటాపోటీగా ఆంక్షలు ప్రకటించక తప్పడం లేదు. కానీ వాటిని పాటించే పరిస్థి తి లేదు. తమ తమ దేశాల్లో హీటింగ్, విద్యు త్, ఇంధన అవసరాల రీత్యా రష్యా నుంచి ఇంధన దిగుమతులను రద్దు చేసుకునే పరిస్థితుల్లో అవి లేవు. ఇలా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొత్తం మీద యూరోజోన్ ఆర్థిక రికవరీకి తీవ్ర విఘాతం కలిగించేదిగా మారిందని ఫిచ్ రేటింగ్స్ ఎకనమిక్స్ టీమ్ డైరెక్టర్ తేజ్ పారిఖ్ అభిప్రాయపడ్డారు. అటు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచాలని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. కానీ ధరలను అదుపు చేసేందుకు రేట్లు పెంచితే .. కోవిడ్, ఇంధన కొరత, యుద్ధం వంటి దెబ్బల నుంచి ఎకానమీలు కోలుకోవడానికి విఘాతం కలుగుతుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు విధించిన ఆంక్షలతో 2021 తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 0.3% నుంచి 0.2%కి మందగించడం వీటికి మరింత ఊతమిస్తున్నాయి. తొలి త్రైమాసికం మధ్యలో మొదలైన యుద్ధ (ఫిబ్రవరి 24) ప్రభావాలు రానున్న నెలల్లో కూడా కనిపిస్తాయని విశ్లేషకులు తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్ యుద్ధ ఫలితాలతో రెండో త్రైమాసికంలో యూరోజోన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మంద గించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం ఎగియడాన్ని చూస్తే జూలైలో ఈసీబీ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించారు. -
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు..తగ్గనున్న వినియోగం..!
న్యూఢిల్లీ: అధిక ధరల నేపథ్యంలో భారత్ గ్యాస్ వినియోగంలో వృద్ధి తగ్గనుందని రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) గ్యాస్ వినియోగ వృద్ధి 5 శాతానికి పరిమితం అవుతుందని వివరించింది. ఇంతక్రితం ఈ అంచనా 7 శాతం. దేశీయ గ్యాస్ ధరలలో ఇటీవలి పెరుగుదల అధిక ఎన్ఎన్జీ రేట్ల వంటి అంశాలు వినియోగదారుల ధోరణిలో మార్పును తీసుకువస్తాయని, పర్యావరణ అనుకూల ఇంధనం వైపునకు వారు దృష్టి సారించేలా చేస్తాయని నివేదిక అభిప్రాయపడింది. దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను రెట్టింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు కొత్త రేట్లు అమల్లో ఉంటాయి. వీటి ప్రకారం .. ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు రికార్డు స్థాయిలో యూనిట్‌కు (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) 6.10 డాలర్ల స్థాయికి పెరిగింది. ఏప్రిల్‌కు ముందు ఇది 2.90 డాలర్లుగా ఉండేది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర (యూనిట్‌కు) 6.13 డాలర్ల నుంచి 9.92 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన రేట్లు ఎగిసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలను సవరిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫిచ్ రేటింగ్స్ తాజా నివేదిక ఇచ్చింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. దేశీయ గ్యాస్ ధరలు, అధిక ఎల్ఎన్జీ ధరల పెరుగుదల కారణంగా భారతదేశంలో సహజ వాయువు వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధికి పరిమితమవుతుందని మేము భావిస్తున్నాము (2021–22లో ఈ వినియోగ అంచనా 6.5 శాతం). ఇది క్రితం అంచనా 7 శాతంకన్నా తక్కువ. దేశీయ గ్యాస్ ఉత్పత్తి ప్రస్తుత వినియోగంలో దాదాపు సగం ఉంది. మిగిలినది ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి అవుతోంది. ప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ గెయిల్ (ఇండియా)కు తన సహజ వాయువు మార్కెటింగ్ సెగ్మెంట్ నుండి వచ్చే ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో స్పాట్ ఎల్ఎన్జీ ధరలు (అమెరికా నుండి దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్న ఎల్ఎన్జీ ధర కంటే అధికంగా) భారీగా పెరగడం దీనికి కారణం. అయితే అధిక ఎల్ఎన్జీ ధరలు భారతదేశంలో గ్యాస్ వినియోగ వృద్ధి స్పీడ్‌ను తగ్గిస్తాయి. 2021–22, 2022–23లో బలమైన లాభదాయకత గెయిల్ వాటాదారుల రాబడుల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంది. అయితే గెయిల్ ఆర్థిక క్రెడిట్ ప్రొఫైల్ ’బీబీబీ’కి అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నాం. ఏడాది ఏప్రిల్‌లో రూ. 1,080 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు గెయిల్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ నష్టాలు భర్తీ... కాగా, ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) పెట్రోలు, డీజిల్ ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ మార్కెటింగ్ నష్టాలను చవిచూడవచ్చని ఫిచ్ అభిప్రాయపడింది. అయితే బలమైన రిఫైనింగ్ మార్జిన్లు, భారీ ఇన్వెంటరీ లాభాలు ఈ నష్టాలను భర్తీ చేస్తాయని ఫిచ్ అంచనావేసింది. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 27 డాలర్లు (లీటరకు రూ.13) పెరిగినప్పటికీ, సంబంధిత మూడు ఇంధన రిటైలర్లు నవంబర్ 2021 నుంచి మార్చి 2022 మధ్య రికార్డు స్థాయిలో 137 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను మార్చకుండా యథాతథంగా కొనసాగించిన విషయాన్ని ఫిచ్ తాజా నివేదిక ప్రస్తావించింది. మూడు కంపెనీలు మార్చి 22 నుండి 16 రోజుల పాటు లీటరుకు రూ. 10 చొప్పున పెంచాయి. దేశీయ మార్జిన్లు ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ప్రైవేట్ ఇంధన రిటైలర్లు ఎగుమతులను మెరుగైన మార్జిన్లతో పెంచుకుంటారని భావిస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. భారతదేశం డీజిల్ ఎగుమతి ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరిలో 2021 ఇదే కాలంతో పోల్చితే 12 శాతం పెరిగింది. చదవండి: అసలే భారంగా ధరలు..ఇప్పుడు మరింత పైపైకి..! -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, క్రూడాయిల్ పరుగే పరుగు..ఆందోళనలో భారత్!
న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా భారత్ ఎకానమీకి తీవ్ర సవాళ్లు తప్పవని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ మంగళవారం తన నివేదికలో పేర్కొంది. ఆయా అంశాల విశ్లేషణల అనంతరం ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే (2022–23) వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 10.3 శాతం నుండి 8.5 శాతానికి (1.8 శాతం) తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను 60 బేసిస్ పాయింట్లు పెంచినట్లు పేర్కొంది. దీనితో ఈ అంచనా 8.1 శాతం నుంచి 8.7 శాతానికి పెరిగింది. అధిక పన్ను వసూళ్లుసహా, ఎకానమీలో పలు హై ఫ్రీక్వెన్సీ ఇండెక్స్‌లు ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడమే దీనికి కారణమని వివరించింది. 2023–24లో ఎకానమీ వృద్ధి రేటు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 7 శాతంగా ఉండే వీలుందని పేర్కొంది. గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్– మార్చి 2022 పేరుతో వెల్లడించిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► కోవిడ్–19 మహమ్మారి అనంతరం చోటుచేసుకుంటున్న రికవరీపై యుద్ధం ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది వృద్ధిని తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ► ఉక్రెయిన్‌పై యుద్ధం, రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రపంచ ఇంధన సరఫరాలను ప్రమాదంలో పడేశాయి. ఆంక్షలు ఇప్పుడే రద్దయ్యే అవకాశం లేదు. ► ప్రపంచ ఇంధన సరఫరాల్లో రష్యా వాటా దాదాపు 10 శాతం. సహజ వాయువులో 17 శాతం. చమురు, గ్యాస్ ధరల పెరుగుదల పరిశ్రమ వ్యయాలను పెంచుతుంది. ఇంధన అధిక ధరల వల్ల వినియోగదారుల వాస్తవ ఆదాయాలు తగ్గుతాయి. ► డిసెంబరు త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు చాలా పటిష్టంగా ఉంది. జీడీపీ మహమ్మారి ముందస్తు స్థాయి కంటే 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. అయితే వ్యవస్థలో మహమ్మారి సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ►2020, 2021లో వచ్చిన కరోనా రెండు వేవ్‌లకు భిన్నంగా 2022లో నెలకొన్న మూడవ వేవ్ పరిస్థితి ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ తక్కువ నష్టంతో ఒమిక్రాన్ వేవ్‌ను అధిగమించిందని మా హై–ఫ్రీక్వెన్సీ డేటా సూచిస్తోంది. ►ద్రవ్యోల్బణం మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది. క్రమంగా తగ్గేముందు 2022 డిసెంబరు త్రైమాసికంనాటికి 7 శాతంపైకి ద్రవ్యోల్బణం చేరుతుందని భావిస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న అప్పర్ బ్యాండ్ (2–6%), ఆపైన ద్రవ్యోల్బణం సమీపకాలంలో కొనసాగుతుందని భావిస్తున్నాం. ► గత వారం రోజుల్లో స్థానిక ఇంధన ధరలు దాదాపు ఫ్లాట్‌గానే ఉన్నాయి. అయితే చమురు కంపెనీలు తుదకు అధిక చమురు ధరల భారాన్ని వినియోగదారుకు (ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపు మినహాయింపు) బదిలీ చేస్తాయని భావిస్తున్నాము. ► 2022 క్యాలెండర్ సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను గత వారం మరొక గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 9.5% నుండి 9.1%కి తగ్గించిన సంగతి తెలిసిందే. అధిక ఇంధనం ధర, ఎరువుల దిగుమతి బిల్లు మూలధన వ్యయాన్ని పరిమితం చేస్తుందని మూడీస్ తన అంచనాల్లో పేర్కొంది. ►యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ బ్యారల్ ధర ఈ నెల ప్రారంభంలో పదమూడు సంవత్సరాల గరిష్టం 140 డాలర్లకు చేరింది. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వృద్ధి రేటు 3.5 శాతానికి పరిమితం ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను క్యాలెండర్ ఇయర్లో 70 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది. దీనితో ఈ రేటు 4.2 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింది. -
రష్యాలో పెట్టుబడులు ‘చెత్తే’!
న్యూఢిల్లీ: రష్యా సావరిన్ రేటింగ్‌ను అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మూడీస్, ఫిచ్ జంక్ గ్రేడ్‌కు తగ్గించాయి. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో పశ్చిమ దేశాల తీవ్ర ఆంక్షలు రేటింగ్ కోతకు దారితీశాయి. అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు ఒక దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఆ దేశానికి సంబంధించి మూడీస్, ఫిచ్, ఎస్అండ్పీ వంటి సంస్థల రేటింగ్ ఏమిటన్నది పరిశీలిస్తాయి. మూడీస్, ఫిచ్ తాజా నిర్ణయం పుతిన్ ప్రభుత్వం రుణ వ్యయాలను భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి. రుణాలు చెల్లించలేని (డిఫాల్ట్ రిస్క్) పరిస్థితి ఉత్పన్నం కావచ్చని జంక్ కేటగిరీ సూచిస్తుంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ రష్యా లాంగ్ టర్మ్ ఇష్యూయెర్ అండ్ సీనియర్ అన్సెక్యూర్డ్ (లోకల్–అండ్ ఫారిన్ కరెన్సీ) డెట్ రేటింగ్‌ను ‘బీఏఏ3’ నుంచి ‘బీ3’కి తగ్గించింది. ‘‘రష్యన్ ఫెడరేషన్ సెంట్రల్ బ్యాంక్ (సీబీఆర్)సహా కొన్ని పెద్ద ఆర్థిక సంస్థలపై పశ్చిమ దేశాలు విధించిన తీవ్రమైన ఆంక్షల కారణంగా రష్యా రేటింగ్‌లపై సమీక్ష నిర్వహించడం జరిగింది. పరిస్థితి తీవ్రతను బట్టి రేటింగ్‌ను మరింత డౌన్‌గ్రేడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిచ్ దేశ రేటింగ్‌ను ‘బీబీబీ’ నుంచి ‘బీ’కి కుదించింది. దేశాన్ని ‘రేటింగ్ వాచ్ నెగెటివ్’ జాబితాలో పెట్టింది. ‘‘అంతర్జాతీయ ఆంక్షల తీవ్రత ఆర్థిక స్థిరత్వ ప్రమాదాలను పెంచింది. రష్యా క్రెడిట్ ఫండమెంటల్స్‌కు భారీ నష్టాన్ని తాజా పరిస్థితులు సూచిస్తున్నాయి. ప్రభుత్వ రుణ చెల్లింపుల పరిస్థితులను దెబ్బతీస్తున్నాయి’’ అని బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫిచ్ సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. పలు దేశాల ఆంక్షలు, రూబుల్ పతనం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, ఫైనాన్షియల్ వ్యవస్థలకు సంబంధించి విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించింది. ఫారిన్ కరెన్సీ డినామినేటెడ్ బ్యాంక్ డిపాజిట్లు (అధికంగా డాలర్ల రూపంలో ఉండే) భారీ ఉపసంహరణలకు పరిస్థితి దారితీస్తుందని వివరించింది. మొత్తం డిపాజిట్లలో వీటి వాటా 25 శాతమని (దాదాపు 200 బిలియన్ డాలర్లు) పేర్కొంది. ఇవి బయటకు వెళ్లిపోతే వ్యవస్థ స్థిరత్వానికి విఘాతం ఏర్పడుతుందని, రూబుల్ ద్రవ్య లభ్యత, స్థిరత్వాలకు సంబంధించి బ్యాంకులకు సహకరించడంలో రష్యన్ ఫెడరేషన్ సెంట్రల్ బ్యాంక్ విఫలమవుతుందని హెచ్చరించింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న (క్రితం అంచనాలు 1.6%) జీడీపీ వృద్ధితీరుకు తాజా పరిణామాలు విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. రష్యా ఎగుమతుల్లో 55% డాలర్ల రూపంలో ఉంటే, 29% యూరోలో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, తాజా పరిణామాలు రష్యా ట్రేడ్ చెల్లింపులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది. 2021లో రష్యా ఎగుమతుల్లో 44% (దాదాపు 241 బిలియన్ డాలర్లు) ఇంధన రంగం వెయిటేజ్ కాగా, ఉక్రెయిన్‌పై దాడి, పర్యవసానాల నేపథ్యంలో వాణిజ్య భాగస్వామ్య దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటాయని కూడా ఫిచ్ పేర్కొనడం గమనార్హం. -
భారత్ ఎకానమీ అంచనాలకు కోత
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా రికవరీ ప్రక్రియ మందగించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి అంచనాలను 10 శాతానికి కుదిస్తున్నట్లు రేటింగ్స్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. గతంలో ఇది 12.8 శాతంగా ఉంటుందని ఫిచ్ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సెకండ్ వేవ్ వ్యాప్తి వల్ల బ్యాంకింగ్ రంగానికి సవాళ్లు మరింతగా పెరిగాయని తాజాగా ఒక నివేదికలో పేర్కొంది. స్థానికంగా లాక్డౌన్లు విధించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు .. పూర్వ స్థాయికి పడిపోకుండా కాస్త ఊతం లభించిందని వివరించింది. అయితే, కీలకమైన పలు వ్యాపార కేంద్రాల్లో కార్యకలాపాలు దెబ్బతినడం వల్ల రికవరీ ప్రక్రియ మందగించిందని ఫిచ్ తెలిపింది. 2019–20లో 4 శాతంగా ఉన్న భారత్ వృద్ధి రేటు .. కోవిడ్–19 మొదటి దశ వ్యాప్తి తరుణంలో 2020–21లో 7.3 శాతం పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రెండంకెల స్థాయిలో ఉండవచ్చని ముందుగా అంతా అంచనా వేసినప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ రాకతో పరిస్థితి మారిపోయింది. ఆర్బీఐ ఇటీవలే తమ అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి కుదించింది. మూడీస్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మొదలైన అంతర్జాతీయ సంస్థలు కూడా ఇది 9.3 శాతం–9.5 శాతం దాకా ఉండవచ్చని భావిస్తున్నాయి. అటు ప్రపంచ బ్యాంకు ఏకంగా 10.1 శాతం నుంచి 8.3 శాతానికి కుదించింది. టీకా ప్రక్రియ కీలకం.. టీకాల ప్రక్రియ వేగం పుంజుకుంటే వ్యాపార వర్గాలు, వినియోగదారుల్లో విశ్వాసం మెరుగుపడే అవకాశం ఉందని ఫిచ్ వెల్లడించింది. అయినప్పటికీ తదుపరి కరోనా ఉధృతి మరింత పెరిగినా, లాక్డౌన్లు విధించిన ఆర్థిక వ్యవస్థ రికవరీకి సవాళ్లు ఎదురు కావచ్చని పేర్కొంది. ‘2021 జూలై 5 నాటికి 137 కోట్ల జనాభాలో 4.7 శాతం ప్రజలకు మాత్రమే టీకా ప్రక్రియ పూర్తయ్యింది. అర్థవంతమైన, నిలకడైన ఆర్థిక రికవరీ సాధనకు దీనివల్ల రిస్కులు పొంచి ఉన్నాయి‘ అని ఫిచ్ వివరించింది. ఫలితంగా, బ్యాంకుల మధ్యకాలిక పనితీరుపై కూడా ప్రభావం పడవచ్చని పేర్కొంది. వ్యాపార, ఆదాయ వృద్ధికి అవకాశాలు పరిమితంగా ఉండటం వల్ల బ్యాంకులకు పరిస్థితి సమస్యాత్మకంగా ఉండవచ్చని తెలిపింది. మరోవైపు, ’బీబీబీమైనస్’ రేటింగ్ గల ఇతర దేశాలతో పోలిస్తే భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి కాస్త మెరుగ్గానే ఉండవచ్చని, కానీ కరోనా గాయాల కారణంగా మధ్యకాలికంగా వ్యాపార వర్గాలు, వినియోగదారుల సెంటిమెంటు బలహీనపడే రిస్కులు ఉన్నాయని ఫిచ్ తెలిపింది. -
2021-22 వృద్ధి రేటు అంచనాలను భారీగా కోత
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి భారీ వృద్ధి అంచనాలకు భారీగా కోతపెడుతున్న సంస్థల జాబితాలో తాజాగా అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ చేరింది. ఫిబ్రవరిలో వేసిన 13.7 శాతం వృద్ధి అంచనాలను భారీగా 4.4 శాతం తగ్గించి 9.3 శాతానికి కుదించింది. తాజా పరిస్థితులు ఎకానమీ రికవరీకి తీవ్ర అడ్డంకిగా మారాయని మూడీస్ పేర్కొంది. ఈ ప్రతికూల ప్రభావం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందనీ హెచ్చరించింది. మూడీస్ ప్రస్తుతం ఇతర రేటింగ్ దిగ్గజ సంస్థలు- ఎస్అండ్పీ, ఫిచ్ తరహాలోనే భారత్‌కు ‘చెత్త’ స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువగా ‘నెగటివ్ అవుట్‌లుక్‌తో బీఏఏ3’ రేటింగ్‌ను ఇస్తోంది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25-ఏప్రిల్ 14, ఏప్రిల్ 15-మే 3, మే 4-మే 17, మే 18-మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగింది. ఈ పరిస్థితి ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వరకూ క్షీణరేటు నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నాల్గవ త్రైమాసికంలో పరిస్థితి కుదుటపడుతున్నట్లు కనిపించినా ఊహించని రీతిలో కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మూడీస్ భారత్ ఆర్థిక వ్యవస్థపై మంగళవారం విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే.. అధిక రుణ భారం (జీడీపీలో దాదాపు 90 శాతానికి చేరుతుందన్న అంచనా) బలహీన ఫైనాన్షియల్ వ్యవస్థలు సార్వభౌమ క్రెడిట్ ప్రొఫైల్‌పై ఒత్తిడులను తీవ్రతరం చేస్తున్నాయి. సెకండ్ వేవ్‌తో ఉత్పన్నమైన పరిస్థితలు భారత్ ఆరోగ్య వ్యవస్థపై ప్రతికూలను చూపుతున్నాయి. ఆసుపత్రులు క్రిక్కిరిసిపోయిన పరిస్థితి. మెడికల్ సరఫరాల్లో తీవ్ర కొరత ఏర్పడుతోంది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు కొనసాగుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థపై 2020 తరహా తీవ్ర పర్యవసానాలు ఉండబోవు. ఆయా స్థానిక చర్యలు స్వల్పకాలమే కొనసాగే అవకాశం ఉండడం, వ్యాపారాలు, వినియోగదారులు కరోనాతో కలిసి పనిచేయడానికి మార్గాలను అన్వేషిస్తుండటం దీనికి కారణం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలు 7.9 శాతంగా ఉండే వీలుంది. దీర్ఘకాలంలో 6 శాతంగా ఉండవచ్చు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనడంలో విధాన నిర్ణయ సంస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇక ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021-22లో 10.8 శాతం ఉంటుందని క్రితం వేసిన అంచనాలు మరింతగా 11.8 శాతానికి పెంపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉన్న రుణ భారం 2023లో 92 శాతానికి ఎగసే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు దిగ్గజ రేటింగ్ సంస్థలు ఇలా... ఎస్అండ్పీ గ్లోబల్ 2021-22 ఆర్థిక సంవత్సరం 11 శాతం వృద్ధి తొలి (మార్చి) అంచనాలను దిగువముఖంగా సవరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కరోనా కొత్త కేసులు మే చివరినాటికి గరిష్టానికి చేరి, అక్కడినుంచీ పెరక్కుండా తగ్గుతూ వస్తే, భారత్ 9.8 శాతం వృద్ధి సాధిస్తుందని తెలిపింది. అయితే జూన్ చివరి వరకూ ఈ పరిస్థితి లేకపోతే 8.2 శాతానికి కూడా వృద్ధి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. భారత్‌కు ఎస్అండ్పీ 13 సంవత్సరాలుగా స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ-’ రేటింగ్‌ను ఇస్తోంది. రెండేళ్లు ఈ రేటు మార్చబోమని కూడా ఇటీవలే భరోసా ఇచ్చింది. ఇక ఫిచ్ రేటింగ్స్ అంచనా ఇప్పటి వరకూ 2021-22లో 12.8 శాతంగా కొనసాగుతోంది. అయితే 2022-23లో ఇది 5.8 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. ఫిచ్ దేశానికి నెగటివ్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’ అవుట్‌లుక్ ఇస్తోంది. అయితే ఫిచ్ గ్రూప్ సంస్థ- ఫిచ్ సొల్యూషన్ మాత్రం 2020-21 వృద్ధి అంచనాలను ఇప్పటికే 12.8 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. కోతల బాటనే నోమురా జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం- నోమురా కూడా భారత్ 2021-22 వృద్ధి అంచనాలకు భారీ కోత పెట్టింది. తొలి 12.6 శాతం అంచనాలను 10.8 శాతానికి కుదించింది. ఆర్థిక క్రియాశీలతకు సంబంధించి తన ప్రొప్రైటరీ ఇండెక్స్ మే 9వ తేదీతో ముగిసిన వారంలో 64.5 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. వారం వారీగా ఇది 5 శాతం పతనమని పేర్కొన్న నోమురా, 2020 జూన్ నాటి పరిస్థితికి ఆర్థిక క్రియాశీలత జారిపోయిందని తెలిపింది. ఇండెక్స్‌లో భాగమైన రవాణా విభాగం 10 శాతం పడిపోయిందనీ, విద్యుత్ డిమాండ్ 4.1 శాతం తగ్గిందని వివరించింది. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు ఎకానమీ రికవరీకి తీవ్ర విఘాతంగా ఉందని పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. తద్వారానే మహమ్మారి వేగాన్ని నియంత్రించవచ్చని సూచించింది. దేశంలో ఆరోగ్య రంగంపై వ్యయాలు మరింత పెంపుపై దృష్టి సారించాల్సిన తక్షణ అవసరాన్ని ప్రస్తుత పరిస్థితి ఉద్ఘాటిస్తోందని తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. కేర్ అంచనాలు... నాల్గవసారి! కేర్ రేటింగ్స్ మంగళవారం మరోసారి భారత్ 2021-22 వృద్ధి అంచనాలను సవరించింది. 10.2 శాతం నుంచి 9.2 శాతానికి అంచనాలను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. 2021 మార్చి 24న సంస్థ 11 నుంచి 11.2 శాతం అంచనాలను వెలువరించింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 5న 10.7 శాతానికి తగ్గించింది. ఏప్రిల్ 21న మరింతగా 10.2 శాతానికి సవరించింది. తీవ్ర జీవనోపాధి సంక్షోభం దిశగా భారత్! భారత్ ‘తీవ్ర జీవనోపాధి సంక్షోభం’ దిశగా పయనించే అవకాశం ఉందని బెల్జియంకు చెందిన ఇండియన్ ఎకనమిస్ట్ ప్రముఖ ఎకనమిస్ట్ జీన్ డ్రెజ్ హెచ్చరించారు. సెకండ్‌వేవ్ తీవ్రత, రాష్ట్రాల స్థానిక ఆంక్షలు, లాక్డౌన్ల నేపథ్యం- శ్రామిక వర్గంపై పిడుగుపాటుగా మారవచ్చని ఒక ఇంటర్వ్యూలో సూచించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ఆంక్షల వల్ల ఏర్పడిన పరిస్థితి ‘దాదాపు జాతీయ లాక్డౌన్’ను తలపిస్తోందని అన్నారు. 2024–25 నాటికి భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా నడిపించాలన్న ప్రభుత్వ లక్ష్యం ‘‘సాకారమయ్యే’’ అవకాశమే లేదని అన్నారు. దేశానికి సంబంధించి భారత్‌లో కొన్ని వర్గాల ‘‘సూపర్–పవర్ ఆశయాలు’’ సాధ్యమబోవని అభిప్రాయపడ్డారు. శ్రామిక వర్గం పరిస్థితి 2020కన్నా ప్రస్తుతం భిన్నంగా ఏమీ లేదని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వానికి సలహాలను ఇచ్చిన జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ)లో జీన్ డ్రెజ్ సభ్యుడు కావడం గమనార్హం. భారత్ కష్టాల్లో ఉంటే ప్రపంచానికీ కష్టమే : నిషా దేశాయ్ బిస్వాల్ వాషింగ్టన్: భారత్ కష్టాల్లో ఉంటే ప్రపంచానికి కూడా కష్టకాలంగానే ఉంటుందని అమెరికా-భారత్ బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) ప్రెసిడెంట్ నిషా దేశాయ్ బిస్వాల్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో కరోనా వైరస్ పరమైన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని తెలియగానే అమెరికా కార్పొరేట్ సంస్థలు అసాధారణ స్థాయిలో తోడ్పాటు అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయని పేర్కొన్నారు. మహమ్మారిపై పోరాటానికి టాప్ 40 కంపెనీల సీఈవోలతో కొత్తగా గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైనట్లు తెలిపారు. భారత్ మళ్లీ పుంజుకుంటుంది: ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్యసమితి: భారత్ 2022లో తిరిగి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి మంగళవారం ప్రకటించింది. భారత జీడీపీ 10.1 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2021 సంవత్సరానికి మాత్రం భారత వృద్ధి అవకాశాలు చాలా బలహీనంగా ఉన్నట్టు పేర్కొంది. కరోనా మహమ్మారికి నూతన కేంద్రంగా భాతర్ మారడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక స్థితిపై వార్షిక మధ్యంత నివేదికను మంగళవారం విడుదల చేసింది. చదవండి: ఈ మొబైల్ ఫోన్‌పై ఏకంగా రూ. 60 వేలు తగ్గింపు -
కరోనా సెకండ్ వేవ్ : బ్యాంకులకు చిక్కులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు రెండో విడత భారీగా పెరిగిపోతుండడం భారత ఆర్థిక వ్యవస్థ రికవరీపై ప్రభావం చూపిస్తుందని.. బ్యాంకులకు సమస్యలు తెచ్చి పెడుతుందని ఫిచ్ రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. 2021లో భారత బ్యాంకింగ్ రంగానికి మోస్తరు ప్రతికూల వాతావరణం ఉంటుందని పేర్కొంది. కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతూ పోతే.. నియంత్రణ కోసం చేపట్టే మరిన్ని చర్యలు వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలపై మరింత ప్రభావం పడేలా దారితీస్తుందని.. అప్పుడు సమస్యలు తీవ్రమవుతాయని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. ‘‘ప్రభుత్వం అనుసరిస్తున్న మరింత సర్దుబాటు ద్రవ్య విధానం స్వల్ప కాలంలో వృద్ధిపై ఒత్తిళ్లను అధిగమించేలా చేయవచ్చు. అయితే, ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలగకుండా ఉండడం అన్నది టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం, సమర్థవంతంగా అమలు చేయడంపైనే ఆధారపడి ఉంటుంది’’అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. 2021-22 సంవత్సరంలో భారత జీడీపీ 12.8 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఫిచ్ లోగడ అంచనా వేసిన విషయం గమనార్హం. అయితే పెరుగుతున్న కరోనా కేసులతో ఈ అంచనాలకు రిస్క్ ఉందని సంస్థ పేర్కొంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి మందగించొచ్చని పేర్కొంది. బ్యాంకుల వ్యాపారంపై ప్రభావం.. ‘‘80 శాతం నూతన ఇన్ఫెక్షన్ కేసులు ఆరు ప్రముఖ రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. బ్యాంకుల రుణాల్లో ఈ రాష్ట్రాల ఉమ్మడి వాటా 45 శాతం. ఈ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలపై ఇంకా ప్రభావం పడితే ఇప్పటికే బలహీనంగా ఉన్న వ్యాపార వాతావరణాన్ని ఇంకా దెబ్బతీస్తుంది’’అని ఫిచ్ తెలిపింది. రెండో విడత కరోనా కేసుల ఉధృతి వినియోగదారుల, కార్పొరేట్ల విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. దీంతో బ్యాంకుల నూతన వ్యాపారాన్ని నెమ్మదించేలా చేయవచ్చని పేర్కొంది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) వ్యాపార రుణాలు, రిటైల్ రుణాలకు ఎక్కువ రిస్క్ ఉంటుందని అంచనా వేసింది. రిటైల్ రుణాలు తమ అంచనాల కంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ పెరుగుతున్న కేసుల ప్రభావం వీటిపై పడొచ్చని పేర్కొంది. (గేమింగ్‌కు మహిళల ఫ్యాషన్ హంగులు) -
దూసుకెళ్తున్న ఇండియా వృద్ధిరేటు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి 2021-22 ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్-2022 మార్చి) అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ బుధవారం గణనీయంగా మెరుగు పరచింది. గత 11 శాతం వృద్ధి అంచనాలను 12.8 శాతంగా పేర్కొంది. కరోనా ప్రేరిత సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ ఊహించినకన్నా వేగంగా పురోగమిస్తోందని, తమ అంచనాల మెరుగుకు ఇదే ప్రధాన కారణమనీ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బేస్ ఎఫెక్ట్ ప్రభావమూ ఉందని పేర్కొంది. ఫిచ్ గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్ (జీఈఓ)నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను గమనిస్తే... 2020 చివరి ఆరు నెలల కాలంలో భారత్ ఎకానమీ గణనీయమైన పురోగతి సాధించింది. ఆర్థిక వ్యవస్థ పటిష్ట తీరుతో 2021లోకి ప్రవేశించింది. తయారీ, సేవలు పురోగతి బాటన పయనిస్తున్నాయి. వినియోగ డిమాండ్ బాగుంది. అలాగే రవాణా వ్యవస్థ పుంజుకుంది. అయితే తాజాగా పెరుగుతున్న కేసులు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే విధంగా సమస్య కొనసాగితే 2021-22 తొలి త్రైమాసికంలో కొన్ని రాష్ట్రాల్లో వృద్ధిపై ప్రభావం చూపే వీలుంది. అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భారత్ వృద్ధి తీరుపై ప్రభావితం చూపే వీలుంది. ఫైనాన్షియల్ సెక్టార్ పరిస్థితి కొంత క్లిష్టంగా ఉంది. ప్రత్యేకించి రుణాలు, పెట్టుబడి వ్యయాల విషయంలో కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. 2022-23లో మాత్రం జీడీపీ వృద్ధి 5.8 శాతానికి పరిమితమవుతుంది. నిజానికి గత అంచనాలకన్నా 0.5 శాతం అంచనాలను తగిస్తున్నాం. ద్రవ్యోల్బణం తగ్గుదల లేకపోవడం, స్వల్ప కాలంగా చూస్తే, వృద్ధి అవుట్‌లుక్ మెరుగ్గా వుండటం వంటి అంశాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపో ప్రస్తుత స్థాయి(4 శాతం) నుంచి మరింత తగ్గించే అవకాశం లేదు. అయితే వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) సమస్యలు రాకుండా ఆర్బీఐ తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుంది. బ్యాంకింగ్ రంగం అవుట్‌లుక్ ఏప్రిల్ 1వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే వచ్చే ఆరి్థక సంవత్సరం అంత బాగుండకపోవచ్చు. కోవిడ్-19 నేపథ్యంలో ఎకానమీలో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులు, చిన్న వ్యాపారాలకు జరిగిన నష్టాలు, నిరుద్యోగం, ప్రైవేటు వినియోగంలో తగ్గుదల వంటి అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్‌లో ప్రతిబింబించడంలేదు. చదవండి: సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
బ్యాంకింగ్ రంగం అంత బాగోకపోవచ్చు!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగం అవుట్‌లుక్ ఏప్రిల్ 1వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం అంత బాగుండక పోవచ్చని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం-ఫిచ్ అంచనా వేస్తోంది. క్తొత వ్యాపారాలు, ఆదాయ వృద్ధి, రుణ నాణ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజా అంచనాకు వచ్చినట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే.. కోవిడ్-19 నేపథ్యంలో ఎకానమీలో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులు, చిన్న వ్యాపారాలకు జరిగిన నష్టాలు, నిరుద్యోగం, ప్రైవేటు వినియోగంలో తగ్గుదల వంటి అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్‌లో ప్రతిబింబించడంలేదు. ఆయా అంశాల ప్రతికూలతలు, రుణ నాణ్యతలో లోపాలు 2022 మార్చి నాటికి ముగిసే బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై ప్రభావితం చూపే అవకాశం ఉంది. భారత్ బ్యాంకులు ఫైనాన్షియల్ పరిస్థితులు, సవాళ్లపై అప్పటి వరకూ ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. నిర్వహణా పరంగా తీసుకున్న కొన్ని చర్యల వల్ల మాత్రమే 2020 డిసెంబర్ వరకూ జరిగిన తొమ్మిది నెలల్లో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లలో కొంత మెరుగుదల కనిపించింది తప్ప, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంతకు ముందుకన్నా రుణ బలహీన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రుణ వృద్ధి రేటు కూడా అంతంత మాత్రంగానే ఉంది. బ్యాంకింగ్‌కు భారీగా మూలధనం అందించే విషయంలో కూడా ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయి. సమస్య తీవ్రతలో ఇది మరో కోణం. రుణ నాణ్యత సరిగాలేకపోవడం, ఆర్థిక రికవరీలో అస్పష్టత వంటి అంశాలు బ్యాంకింగ్ రంగం అవుట్‌లుక్‌ను బలహీనపరుస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగానికి 5.5 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.40,150 కోట్లు) మూలధనంగా అందించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, ఫిచ్ ‘అంచనా మూలధనం అవసరం’కన్నా ఇది చాలా తక్కువ. వివిధ పరిస్థితుల్లో బ్యాంకింగ్‌కు 15 బిలియన్ డాలర్ల నుంచి 58 బిలియన్ డాలర్ల వరకూ అవసరమవుతాయి. నియంత్రణా పరంగా ఇచ్చిన వెసులుబాటును వెనక్కు తీసుకుంటే, ఇది బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై అలాగే మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గణాంకాలను లోతుగా విశ్లేషిస్తే, ఒత్తిడి తీవ్రతను గుర్తించవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి రేటు 11శాతంగా నమోదుకావచ్చు. అయితే పలు రంగాలు సామర్థ్యానికి దిగువనే కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉంది. రిటైల్ కస్టమర్లో ఒత్తిడి కొనసాగుతోంది. ప్రైవేటు వినియోగం తగ్గుదల, పట్టణ యుటిలిటీ బిల్లుల చెల్లింపుల్లో వైఫల్యాలు, సామాజిక భద్రతా పథకాల నుంచి ఉపసంహరణల వంటి అంశాలు దీనిని సూచిస్తున్నాయి. లఘు, మధ్య తరహా పరిశ్రమలకు 2021- 22 ఆర్థిక సంవత్సరం కూడా ఒక పరీక్షా కాలంగా నిలవనుంది. మొండిబకాయిల తీవ్రత... కోవిడ్-19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల(ఎన్పీఏ) భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) ఇటీవలే పేర్కొంది. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని నివేదిక పేర్కొంది. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది. 2020 సెప్టెంబర్ నాటికి బ్యాంకింగ్‌పై ఎన్పీఏ భారం 7.5 శాతం. అప్పటి నుంచీ చూస్తే, కనీసమయినా ఎన్పీఏలు 600 బేసిస్ పాయింట్లు (6 శాతం) అయినా పెరుగుతుందన్నమాట. నివేదిక ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండి బకాయిలు 2021 సెప్టెంబర్ నాటికి కనీస స్థాయిలో చూసినా 9.7 శాతం - 16.2 శాతాల శ్రేణిలో ఉండే వీలుంది. ప్రైవేటు బ్యాంకింగ్ విషయంలో ఈ శ్రేణి 4.6 శాతం-7.9 శాతం శ్రేణిలో ఉండవచ్చు. ఫారిన్ బ్యాంకుల విషయంలో ఈ శ్రేణి 2.5 శాతం - 5.4 శాతం శ్రేణిలో ఉండే వీలుంది. ఇక తీవ్ర స్థాయిల్లో పీఎస్బీ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకుల విషయంలో ఎన్పీఏలు వరుసగా 17.6 శాతం, 8.8 శాతం, 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. రుణ నాణ్యత పటిష్టతపై ఇప్పుడే చెప్పలేం: క్రిసిల్ ఇదిలావుండగా, బ్యాంకింగ్ రుణ నాణ్యత పటిష్టత గురించి ఇప్పుడే ఏమీ నిర్థారణకు రాలేమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ అనుబంధ విభాగం క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంది. తన క్రెడిట్ రేషియోను 0.54 నుంచి 1 స్థాయికి చేర్చింది. -
ప్రైవేటు బ్యాంకింగ్ మరింత బలోపేతం
న్యూఢిల్లీ: నష్టాలను సర్దుబాటు చేసుకోతగినంత నగదు నిల్వలు కలిగిన ప్రైవేటు బ్యాంకులు.. అదే సమయంలో నష్టాలను తట్టుకోగల సామర్థ్యం తక్కువగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి మార్కెట్ వాటాను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ‘‘తగినన్ని నిధులున్న బ్యాంకులు ముందుగానే నష్టాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుకోగలవు. ఈ క్రమంలో పెద్దగా ఇబ్బంది పడకుండానే మార్కెట్ వాటాను పెంచుకోగలవు’’ అని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. అయితే, బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి (రుణాలకు డిమాండ్) స్తబ్దుగా ఉన్నందున తక్షణమే మార్కెట్ వాటాను పెంచుకుంటాయని భావించడం లేదని, కరోనా సమసిపోయిన తర్వాత స్థిరమైన వృద్ధిని చూపిస్తాయని తెలిపింది. ప్రైవేటు బ్యాంకులు 14.4% మార్కెట్ వాటాను.. ఆస్తులు, రుణాల పరంగా 18.5% వాటాను ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి కైవసం చేసుకున్నాయని, ఇందులో అధిక శాతం వాటా గత ఐదేళ్ల కాలంలో సంపాదించుకున్నదేనని వివరించింది. ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం వాటి మార్కెట్ స్థానాన్ని స్థిరీకరించుకునేందుకు గత కొన్నేళ్లలో సాయపడిందని.. కానీ, భవిష్యత్తులో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకునేందుకు, వృద్ధికి అవసరమైన నిధులను అవి సమీకరించుకోకపోతే మాత్రం వాటి మార్కెట్ వాటాను మరింత కోల్పోతాయని విశ్లేషించింది. ఆర్బీఐ సూచనల మేరకు కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు తాజా నిధులను సమీకరించినప్పటికీ.. ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే చాలా పరిమితమేనని పేర్కొంది. ‘‘కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు తాజా మూలధన నిధులను సమీకరించనున్నట్లు ప్రకటించాయి. ఎప్పటిలోపు సమీకరించేదీ ప్రకటించలేదు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఈ తరహా అస్పష్ట పరిస్థితి వెంటనే మెరుగుపడాల్సి ఉంది’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. -
9బ్యాంకుల రేటింగ్ డౌన్‌గ్రేడ్: ఫిచ్ రేటింగ్స్
ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ భారత్‌కు చెందిన 9 బ్యాంకుల రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తితో భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటుందని అంచనా వేస్తూ ఈ 9బ్యాంకులకు సంబంధించి గతంలో కేటాయించిన ‘‘స్థిరత్వం’’ రేటింగ్‌ను ‘‘నెగిటివ్’’కు డౌన్‌గ్రేడ్ చేసింది. ఎస్బీఐ బ్యాంక్‌తో పాటు, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. ఇదే రేటింగ్ సంస్థ గతవారంలో (జూన్ 18న) భారత్ అవుట్‌లుక్‌ను ‘‘బిబిబి(-)’’ నుంచి ‘‘నెగిటివ్’’కి డౌన్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి తర్వాత వ్యవస్థలో ఏర్పడిన సవాళ్లతో ఆర్థిక కొలమానాల్లో గణనీయమైన క్షీణతతో పాటు ఇటీవల భారత్ సార్వభౌమ రేటింగ్ తగ్గింపుతో బ్యాంకులకు ప్రభుత్వం మద్దతు ఇచ్చే సామర్థ్యం తగ్గుతుంది.’’ ఫిచ్ రేటింగ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐకు అండగా ప్రభుత్వం: వ్యక్తిగత బ్యాంకులను పరిగణలోకీ తీసుకుంటే.., వ్యూహాత్మక ప్రాధాన్యత కారణంగా అవసరమైతే ఎస్బీఐకు ప్రభుత్వం నుంచి మంచి మద్దతు లభిస్తోందని రేటింగ్ సంస్థ తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఆస్తులు, డిపాజిట్లలో దాదాపు 25% మార్కెట్ వాటా కలిగి ఉంది. ఎస్బీలో 57.9 శాతం వాటా ప్రభుత్వం చేతిలో ఉంది. అలాగే తన సహచర బ్యాంకుల కంటే చాలా విస్తృత విధాన పాత్రను కలిగి ఉంది.ఐడీబీఐ బ్యాంక్ ఇష్యూయర్ డీఫాల్ట్ రేటింగ్ ను బీబీ(+)గా ధృవీకరించింది. అయితే అవుట్‌లుక్ మాత్రం నెగిటివ్‌గా కొనసాగింది. పిచ్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసినప్పటికీ.., ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మిడ్‌సెషన్ సమయానికి.... ఎస్బీఐ బ్యాంక్ షేరు 3శాతం లాభంతో రూ.189.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 2శాతం ర్యాలీ చేసి రూ.370.40 వద్ద ట్రేడ్ అవుతోంది. యాక్సిస్ బ్యాంక్ షేరు 3శాతం పెరిగి రూ.430 వద్ద ట్రేడ్ అవుతోంది. -
వచ్చే ఏడాది జీడీపీ రయ్ రయ్!
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ఫిచ్ రేటింగ్స్ ఎంతో సానుకూల అంచనాలను వెలువరించింది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) జీడీపీ వృద్ధి రేటు ప్రతికూల (మైనస్) శ్రేణిలోకి వెళ్లిపోతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22)లో మాత్రం వేగంగా పుంజుకుని 9.5 శాతానికి వృద్ధి చెందుతుందన్న అంచనాలను ఫిచ్ రేటింగ్స్ తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే నిదానించిన భారత ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి 2020–21లో మరింత కుంగదీస్తుందని, జీడీపీ వృద్ధి మైనస్ 5 శాతానికి క్షీణిస్తుందని పేర్కొంది. ‘‘కరోనా మహమ్మారి భారత వృద్ధి ధోరణిని బలహీనపరిచింది. దీంతో అధిక ప్రజా రుణ భారం కారణంగా ఏర్పడిన సవాళ్లు అది భరించలేదు. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభం అనంతరం భారత జీడీపీ ‘బీబీబీ’ కేటగిరీలోని ఇతర దేశాల కంటే మెరుగైన స్థానానికి చేరుకుంటుంది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడిపోకుండా ఇది ఆదుకుంటుంది’’ అని ఏపీఏసీ సార్వభౌమ క్రెడిట్ అంచనాల పేరుతో బుధవారం విడుదల చేసిన నివేదికలో ఫిచ్ రేటింగ్స్ భారత ఆర్థిక వ్యవస్థను విశ్లేషించింది. మార్చి చివరి వారంలో దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ దాదాపు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఉద్దీపనలు చాలా తక్కువ ‘‘ప్రభుత్వం జీడీపీలో 10% మేర ఉద్దీపనల చర్యలను ప్రకటించింది. ఇందులో ద్రవ్యపరమైన చర్యలు జీడీపీలో ఒక శాతమే. తోటి దేశాలతో పోలిస్తే ఇది ఎంతో తక్కువ’’ అంటూ ఫిచ్ రేటిం గ్స్ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. 2019– 20లో ప్రభుత్వ రుణం జీడీపీలో 70%కి చేరుకుందని, బీబీబీ రేటింగ్ సగటు 42% కంటే ఎంతో ఎక్కువని పేర్కొంది. అదే విధంగా ప్రజా రుణం 2020–21లో జీడీపీలో 84%కి చేరుకుంటుందని, 2019 డిసెంబర్ నాటికి తాము వేసిన 71% అంచనాల కంటే ఎక్కువని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. భారత రేటింగ్ కొనసాగింపు: ఎస్అండ్పీ భారత సార్వభౌమ రేటింగ్‌ను దీర్ఘకాలానికి ప్రస్తుత ‘బీబీబీ మైనస్’ స్థిర అవుట్‌లుక్‌ను.. అదే విధంగా సల్పకాల కరెన్సీ ఇష్యూలకు ఏ–3గా కొనసాగిస్తున్నట్టు ఎస్అండ్పీ బుధవారం ప్రకటించింది. వృద్ధికి సంబంధించి సమస్యలు పెరుగుతున్నాయంటూనే.. 2021 నుంచి ఆర్థిక, ద్రవ్యపరమైన పరిస్థితులు కుదురుకుంటాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ‘‘కరోనా వైరస్‌ను కట్టడి చేసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న అంచనాల ఆధారంగానే స్థిరమైన అవుట్‌లుక్ ఇస్తున్నాం. భారత దీర్ఘకాల వృద్ధి రేటుకు సవాళ్లు పెరుగుతున్నాయి. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న సంస్కరణలను చక్కగా అమలు చేసినట్టయితే దేశ వృద్ధి రేటు తోటి దేశాల కంటే ముందుంటుంది’’ అని ఎస్అండ్పీ తన నివేదికలో పేర్కొంది. బీబీబీ మైనస్ అన్నది పెట్టుబడులకు కనిష్ట రేటింగ్. భారత్ విషయంలో ఎస్అండ్పీ 13 ఏళ్లుగా ఇదే రేటింగ్‌ను కొనసాగిçస్తుండటం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి మైనస్ 5%కి పడి పోతుందని, 2021–22లో 8.5%కి పుం జుకుంటుందని, 2022–23లో మాత్రం 6.5%కి పరిమితమవుతుందనేది ఎస్అండ్పీ అంచనా. -
భారత్‌కు సావరిన్ రేటింగ్ కట్
న్యూఢిల్లీ: భారత్‌కు ఇస్తున్న సార్వభౌమ స్థాయి (సావరిన్ రేటింగ్)ని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తగ్గించింది. ఇప్పటి వరకూ ఈ రేటింగ్ ‘బీఏఏ2’ అయితే దీనిని ‘బీఏఏ3’కి తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇక భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను కూడా నెగటివ్‌లోనే కొనసాగించనున్నట్లు పేర్కొంది. డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణాలు... ► కోవిడ్–19 మహమ్మారి భారత్ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసింది. అయితే రేటింగ్ డౌన్‌గ్రేడ్‌కు ఇది ఒక్కటే కారణం కాదు. ► తీసుకుంటున్న పలు విధాన నిర్ణయాల అమల్లో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ► ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధిరేటు సుదీర్ఘకాలం అట్టడుగునే కొనసాగనుంది. ► ఇక ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరమైన ఒత్తిడులు కూడా ఎదురుకానున్నాయి. తక్కువ ఆదాయం–వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో ఇందుకు సంబంధించి నికర వ్యత్యాసం... ద్రవ్యలోటు మరింతగా కట్టుతప్పే అవకాశం ఉంది. ► ఫైనాన్షియల్ సెక్టార్లో ఒత్తిడి నెలకొనే అవకాశాలు సుస్పష్టం. 2020–21లో జీడీపీ 4 శాతం క్షీణత కోవిడ్–19 సృష్టించిన నష్టంసహా పలు కారణాల వల్ల 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 4 శాతం క్షీణ రేటును నమోదుచేసుకునే అవకాశం ఉందని మూడీస్ పేర్కొంది. నిజానికి కోవిడ్ మహమ్మారి దాడికి ముందే భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన విషయాన్ని కూడా మూడీస్ ప్రస్తావించింది. పెరగనున్న రుణ భారం: దీర్ఘకాలం వృద్ధి రేటు దిగువస్థాయిలోనే కొనసాగే పరిస్థితులు ఉండడం వల్ల రుణ భారం తగ్గించుకోవడం ప్రభుత్వానికి కొంత క్లిష్టంగా మారే వీలుంది. కరోనాకు ముందు 2019–20లో భారత్ ప్రభుత్వం రుణ నిష్పత్తి జీడీపీలో 72% ఉంటే, ఇది ఈ ఆర్థిక సంవత్సరం 84%కి పెరిగే అవకాశం ఉంది. అయితే రుణ భారాన్ని తగ్గించుకోవడం స్వల్పకాలంలో సాధ్యమయ్యే అవకాశంలేదు. బీఏఏ– రేటెడ్ దేశాలతో పోల్చితే భారత్‌పై అధిక వడ్డీరేటు భారం ఉంది. బీఏఏ స్టేబుల్ దేశాలతో పోల్చితే మూడు రెట్లు ఈ భారం అధికంగా ఉందని మూడీస్ పేర్కొంది. ప్రైవేటు రంగంలో పొదుపులు, ప్రభుత్వ డెట్ మెచ్యూరిటీలు దీర్ఘకాలంలో ఉండడం రుణ భారం, వడ్డీ చెల్లింపుల విషయం లో కొంత సానుకూల విషయం. ఏమిటి ఈ రేటింగ్..? ఒక దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థలు రేటింగ్ ఇస్తుంటాయి. ఎస్అండ్పీ, ఫిచ్, మూడీస్ ఇందులో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఆయా దిగ్గజ సంస్థలు ఇచ్చే రేటింగ్ ప్రాతిపదికనే ఒక దేశం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుంది. దేశ సీనియర్ ఆర్థిక శాఖ అధికారులు సైతం దేశానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులను అధికారికంగా రేటింగ్ సంస్థల ప్రతినిధులకు వివరించి, రేటింగ్ పెంచవలసినదిగా కోరతారంటే, ఆయా సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ఒక దేశం పెట్టుబడులను ఆకర్షించడంలో ఎంతగా దోహదపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మూడీస్ ఇచ్చిన రేటింగ్ ‘బీఏఏ3’ నెగటివ్ అవుట్‌లుక్ కూడా ఇప్పటికీ ‘ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ పరిధిలోకే వస్తుందన్న విషయం గమనార్హం. అయితే ‘జంక్’ గ్రేడ్‌కు ఇది ఒక మెట్టు ఎక్కువ. మిగిలిన రెండు సంస్థలు ప్రస్తుతం భారత్‌కు మూడీస్ ఇస్తున్న రేటింగ్ ‘బీఏఏ3 నెగటివ్’కు సరిసమానమైనవే కావడం గమనార్హం. 2017, నవంబర్‌లో మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్ చేసినా, అటు తర్వాత రెండు దఫాల్లో క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. కరెన్సీకీ కోత భారత ప్రభుత్వ ఫారిన్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ దీర్ఘకాలిక జారీ రేటింగ్స్‌ను కూడా మూడీస్ ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి తగ్గించింది. అలాగే భారత్ లోకల్ కరెన్సీ సీనియర్ అన్సెక్యూర్డ్ రేటింగ్స్‌నూ ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి కుదించింది. ఇక షార్ట్‌టర్మ్ లోకల్ కరెన్సీ రేటింగ్‌ను ‘పీ–2 నుంచి పీ–3’కి తగ్గించింది. వీటికి సంబంధించి అవుట్‌లుక్‌ను నెగటివ్‌గా పేర్కొంది. ఊహించిందే... భారత్‌కు సంబంధించి ఫిచ్, ఎస్‌అండ్‌పీలు బీఏఏ3 నెగటివ్‌కు సరిసమానమైన రేటింగ్స్ కొనసాగిస్తున్నందువల్ల మూడీస్ కూడా ఈ మేరకు సర్దుబాటు చేస్తుందని మార్కెట్ మొదటి నుంచీ ఊహిస్తూ వస్తోంది. అయితే ఈ రేటింగ్ కూడా భారత్‌కు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ హోదానే ఇస్తోంది. దీనివల్ల బాండ్, రూపాయి మార్కెట్లో భారీ మార్పు ఏదీ ఉండబోదని మేము భావిస్తున్నాం. – కే. హరిహర్, ట్రెజరర్, ఫస్ట్‌రాండ్ బ్యాంక్ -
ఇండియా జీడీపీ అంచనాలు మరింత తగ్గించిన ఫిచ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎకానమీ దాదాపు 5 శాతం మేర వెనుకంజ వేయవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇది గత ఏప్రిల్‌లో వేసిన అంచనాల కన్నా చాలా తక్కువ. దీంతో పాటు ప్రపంచ ఎకానమీపై అంచనాలను కూడా తగ్గించింది. అయితే అంతర్జాతీయంగా ఎకానమీ బాటమ్‌అవుట్ కానున్న సంకేతాలున్నాయని వెల్లడించింది. భారత్‌లో ముందు ఊహించినదాని కన్నా ఎక్కువకాలం లాక్డౌన్ విధించారని, దీంతో ఆర్థిక గణాంకాలు బలహీనంగా మారాయని వివరించింది. 2021-22లో తిరిగి ఎకానమీ పట్టాలెక్కి 9. 5శాతానికి చేరవచ్చని అభిప్రాయపడింది. వర్దమాన మార్కెట్లలో చైనా మినహా ఇతర దేశాల వృద్ధి ఈ ఏడాది సరాసరిన 4.5 శాతం మేర పతనం కావచ్చని అంచనా వేసింది. 2020లో చైనా 0.7 శాతం, యూఎస్ మైనస్ 5.6 శాతం, జపాన్ మైనస్ 5 శాతం మేర వృద్ధి నమోదు చేస్తాయని తెలిపింది. నెలవారీ ఆర్థిక సూచికలు పరిశీలిస్తే అంతర్జాతీయంగా మందగమనం చివరకు వచ్చినట్లు కనిపిస్తోందని తెలిపింది. యూఎస్, యూరోజోన్‌లో క్రమంగా కన్జూమర్ల కొనుగోళ్లు పెరిగాయని తెలిపింది. అంతర్జాతీయంగా ఉద్దీపనలు పెరిగాయని, అయితే రికవరీ నెమ్మదిగా, ఒడిదుడకులతో వస్తుందని అంచనా వేసింది. నిరుద్యోగిత పెరగడం, కరోనా నివారక నిబంధనలు.. వినిమయ వ్యయాలు తగ్గిస్తాయని, కంపెనీలు కొత్తగా మూలధన వ్యయాలు చేసేందుకు ఒకటికిరెండు మార్లు పునరాలోచించుకుంటాయని అభిప్రాయపడింది. వచ్చే ఏడాది(20-21)లో ఎకానమీలన్నీ గాడిన పడవచ్చని తెలిపింది. -
కరోనా కల్లోలం : జీడీపీపై ఫిచ్ షాకింగ్ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటుపై షాకింగ్ అంచనాలు వెలువడ్డాయి. ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత జీడీపీపై మరోసారి ఆందోళనకర అంచనాలను వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కేవలం 1 శాతం దిగువన నమోదు కావొచ్చని అభిప్రాయపడింది. మూడు వారాల క్రితం అంచనా వేసిన 2 శాతం అంచనాను సంస్థ తాజాగా దీన్ని0.8 శాతానికి తగ్గించింది. చైనాలో కూడా 2020 లో 0.7 శాతం వృద్ధి నమోదు కానుందని తెలిపింది. అలాగే ఇంతకుముందు అంచనా వేసిన 1.9 శాతంతో పోలిస్తే 2020 లో ప్రపంచ జీడీపీ 3.9 శాతానికి పతనం కానుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ఇది యుద్ధానంతర కాలం నాటి అసాధారణమైన మాంద్యం అని వ్యాఖ్యానించింది. కోవిడ్-19, లాక్ డౌన్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం గుప్పిట్లోకి వెళ్లిపోతున్న తరుణంలో ఆ ప్రభావం భారత్‌పై ఉండొచ్చని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండు త్రైమాసికాల్లో సంకోచం లేదా ప్రతికూల ప్రతికూల వృద్ధిని వుంటుందని, అయితే 2021-22లో జీడీపీ 6.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. (బాబోయ్ కరోనా జీడీపీకి షాక్!) కరోనా వైరస్ సంక్షోభం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోందని తెలిపింది. ఆర్థిక పతనం ప్రపంచవ్యాప్తంగా పునరావృతమవుతోందనీ, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల జీడీపీ మరింత దిగజారనుందని అంచనావేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చెయిన్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం అంతర్జాతీయంగా వ్యాపించిందని, ఎగుమతుల పరిస్థితి కూడా ప్రతికూలంగా వుందని తెలిపింది. పడిపోతున్న వస్తువుల ధరలు, మూలధన ప్రవాహాలు, మరింత పరిమితమవుతున్న పాలసీ విధానాలు దేశీయ వైరస్-నియంత్రణ చర్యలు ప్రభావాన్ని పెంచుతున్నాయని తెలిపింది. చైనా భారతదేశం రెండింటి వృద్ది ఒక శాతం దిగువకు అంచనా వేసినందున, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల జీడీపీ 2020లో మరింత క్షీణిస్తుందని తెలిపింది. 1980ల నాటికంటే దారుణమైన పరిస్తితి అని పేర్కొంది. కాగా 2020-21లో భారతదేశం 1.9శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది. అదే సమయంలో భారతదేశ వృద్ధి 1.5- 4 శాతం వద్ద అంచనా వేసిన సంగతి తెలిసిందే. (ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ) -
కరోనా వార్తలే కీలకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసుల పోకడను బట్టే దేశీయంగా గానీ, అంతర్జాతీయంగా గానీ ఈ వారం స్టాక్ మార్కెట్ల కదలికలు ఉంటాయని నిపుణులంటున్నారు. సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయని వారంటున్నారు. దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం విలువ కదలికలు, ముడి చమురు ధరల గమనం....ఈ అంశాలు కూడా ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషణ. ఫిచ్ అంచనా ప్రభావం!: 2020–21లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 2 శాతానికి పడిపోతుందన్న ఫిచ్ అంచనా మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చు. నేడు వెలువడే (సోమవారం) సేవల రంగం పీఎమ్ఐ గణాంకాలు, 9న ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి అవకాశం.... కాగా కరోనా వైరస్ కేసులను బట్టే దేశీ, విదేశీ స్టాక్ మార్కెట్ల తీరు ఉంటుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా చెప్పారు. మార్కెట్ ఇప్పటికే చెప్పుకోదగిన స్థాయిలో కరెక్షన్కు గురయిందని, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. మహావీర్ జయంతి సందర్భంగా నేడు(సోమవారం) సెలవు. అలాగే గుడ్‌ఫ్రైడే (ఈ నెల 10న) సందర్భంగా కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరగదు. దీంతో ఈ వారంలో మూడు రోజులే ట్రేడింగ్ జరగనున్నది. భారీ విదేశీ నిధులు వెనక్కి..: కరోనా వైరస్ కల్లోలం ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి గత నెలలో రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.61,973 కోట్లు, బాండ్ మార్కెట్ నుంచి రూ.56,211 కోట్లు వెరసి రూ.1.18,184 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం బహుశా ఇదే మొదటిసారి. -
బాబోయ్ కరోనా జీడీపీకి షాక్!
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వృద్ధికి కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ గట్టిగానే తగలనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఏకంగా 30 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. 2020–21లో వృద్ధి రేటు కేవలం 2 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. గత అంచనాలైన 5.6 శాతాన్ని ఇటీవల మార్చిలో 5.1 శాతానికి కుదించిన ఫిచ్ .. తాజాగా సగం పైగా తగ్గించేయడం గమనార్హం. లాక్డౌన్లతో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం ప్రభావాలు భారత్‌పైనా గణనీయంగా ఉండబోతున్నాయని వివరించింది. చైనాలో తొలి దశలో తయారీ కార్యకలాపాల నిలిపివేతతో సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఈ ప్రభావాలు మరింతగా విస్తరించాయని పేర్కొంది. ‘ఈ ఏడాది అంతర్జాతీయంగా మాంద్యం వస్తుందని అంచనాలున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం భారత అంచనాలను 2 శాతానికి కుదిస్తున్నాం‘ అని ఫిచ్ తెలిపింది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ గత వారమే 2020లో భారత వృద్ధి రేటు అంచనాలను 5.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించేసిన సంగతి తెలిసిందే. అటు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ 3.5 శాతానికి, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ 3.6 శాతానికి కుదించాయి. చిన్న సంస్థలు, బ్యాంకులకు దెబ్బ... వినియోగదారులు ఖర్చులు తగ్గించుకోనుండటంతో లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు, సేవల రంగాలపై అత్యధికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని ఫిచ్ పేర్కొంది. సాధారణంగా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) నుంచి రుణాలు తీసుకునే వారి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంటుందని, వారి ఆదాయాలేమైనా తగ్గిన పక్షంలో రుణాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తవచ్చని తెలిపింది. ‘ఈ పరిస్థితుల్లో భారత్‌లోని ఎన్బీఎఫ్సీలు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. లాక్‌డౌన్‌తో ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా కార్యకలాపాలు దెబ్బతినొచ్చు. కరోనా కేసులు స్థానికంగా పెరిగితే ఆర్థికంగా సెంటిమెంటుపై కూడా దెబ్బతింటుంది. దీనితో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎన్బీఎఫ్సీలు మళ్లీ పట్టాలు తప్పే అవకాశముంది‘ అని ఫిచ్ తెలిపింది. వచ్చే ఏడాది రికవరీ: ఏడీబీ అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీ అమలవుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 4 శాతానికి పరిమితం కావొచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాలు దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో ప్రపంచ ఎకానమీ మరింత మాంద్యంలోకి జారిపోతుందని, భారత వృద్ధి ఇంకా మందగించవచ్చని పేర్కొంది. ఒకవేళ ఇది భారత్‌లోనే శరవేగంగా విస్తరిస్తే, ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు తప్పవని ఏడీబీ తెలిపింది. అయితే, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత రికవరీ మరింత పటిష్టంగా ఉండగలదని ఏషియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీవో) నివేదికలో ఏడీబీ తెలిపింది. ‘ప్రస్తుతం అసాధారణ గడ్డుకాలంగా నడుస్తోంది. కరోనా ప్రజల జీవితాలతో పాటు వ్యాపారాలను ప్రపంచ వ్యాప్తంగా ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది‘ అని ఏడీబీ ప్రెసిడెంట్ మసాత్సుగు అసకావా తెలిపారు. ‘ప్రపంచ వృద్ధికి, భారత రికవరీకి కరోనా పెను సవాలుగా మారింది. కానీ భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో గట్టిగా కోలుకోవచ్చు. సంస్కరణల ఊతంతో అప్పుడు 6.2% ఉండొచ్చు‘ అని ఏడీబీ చీఫ్ ఎకానమిస్ట్ యసుయుకి సవాడా చెప్పారు. మహమ్మారి బారిన పడిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు భారత్ వేగంగా స్పందించిందన్నారు. వ్యక్తిగత, కార్పొరేట్ ట్యాక్స్ రేట్లపరంగా కొనసాగుతున్న సంస్కరణలు, వ్యవసాయం.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక రంగాన్ని గట్టెక్కించేందుకు తీసుకుంటున్న చర్యలు రికవరీకి తోడ్పడగలవని చెప్పారు. ప్రపంచానికి 4.1 ట్రిలియన్ డాలర్ల నష్టం.. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు 2 నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్) దాకా నష్టపోవచ్చని ఏడీబీ పేర్కొంది. గ్లోబల్ జీడీపీలో ఇది 2.3–4.8%కి సమానంగా ఉంటుందని వివరించింది. వర్ధమాన ఆసియా దేశాలు కరోనా వల్ల అత్యధికంగా నష్టపోనున్నాయని తెలిపింది. టూరిజం, వాణిజ్యం, రెమిటెన్సులు వంటి విషయాల్లో ప్రపంచ దేశాలతో ఎక్కువగా అనుసంధానమై ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. కమోడిటీల ధరల పతనం కూడా కొన్ని దేశాలపై ఒత్తిడి పెంచుతోందని వివరించింది. 2020లో వృద్ధి 4.1 శాతానికి తగ్గి, 2021లో 6 శాతానికి రికవర్ కాగలదని తెలిపింది. -
రుణ వృద్ధిలేదు... వ్యాపారాలూ బాగోలేదు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ కుదించింది. 2019 (ఏప్రిల్)–2020 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో కేవలం 4.6 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదవుతుందని తాజాగా అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 5.6 %. బ్యాంకింగ్ రుణ వృద్ధి మందగమనం, పుంజుకోని పారిశ్రామిక, వ్యాపార రంగాలు, వినియోగ విశ్వాసం దెబ్బతినడం వంటి కారణాలను ఫిచ్ తన నివేదికలో ఉటంకించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► భారత్ రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’గానే కొనసాగిస్తున్నాం. మధ్యకాలికంగా చూస్తే, వృద్ధి అవుట్‌లుక్ పటిష్టంగా ఉండడమే దీనికి కారణం. విదేశీ మారకపు నిల్వల స్థాయి పటిష్టంగా ఉండడం సానుకూల అంశం. ► ఆర్బీఐ (5 శాతం), మూడీస్ (4.9 శాతం), ఏడీబీ (5.1శాతం) కన్నా తాజాగా ఫిచ్ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. ► 2020–21లో జీడీపీ క్రమంగా పుంజుకునే అవకాశం ఉంది. ఈ రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు. 2021–22లో వృద్ధి రేటు మరింత పెరిగి 6.5 శాతానికి చేరే వీలుంది. ఆర్బీఐ తీసుకున్న ద్రవ్య పరపతి విధాన చర్యలు (వరుసగా ఐదు ద్వైమాసిక సమావేశంలో 135 శాతం రెపో కోత. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ప్రస్తుతం 5.15 శాతం), పన్నురేటు తగ్గించడంసహా కేంద్రం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు వృద్ధిరేటు పురోగతికి దోహదపడే వీలుంది. ► 2019–20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ఉండాలన్నది లక్ష్యమయినా, ఇది కొంత అదుపు తప్పే అవకాశం ఉంది. 2019– 20లో మొత్తంలో ద్రవ్యలోటు పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్ అంచనాల్లో 102.4 శాతానికి చేరిందన్నమాట. ► 2020లో ఆర్బీఐ మరో 65 బేసిస్ పాయింట్ల రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే రెపో రేటు 4.5 శాతానికి వస్తుంది. ► నవంబర్‌లో ధరల పెరుగుదల రేటు 5.5 శాతంగా ఉంది. -
దేశ ఆర్థిక వ్యవస్థకు మరో షాక్
దేశ ఆర్థిక వ్యవస్థకు మరో షాక్ తగిలింది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ భారత క్రెడిట్ రేటింగ్స్ అంచనాలను తగ్గించింది. గత ఆరు సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా దేశ వృద్ధి రేటు 5 శాతం కనిష్టానికి పడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ లక్ష్యానికి(3.3 శాతం) భిన్నంగా 2020 నాటికి జీడీపీలో 3.7శాతం లోటు బడ్జెట్‌కు కేటాయించబోతున్నట్లు మూడీస్ అంచనా వేసింది. దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం, రుణబారం నేపథ్యంలో రేటింగ్స్ తగ్గాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్థి మందగమనం వల్ల ఆదాయాల తగ్గుదలతో పాటు మెరుగైన జీవన ప్రమాణాలు పొందలేరని, తద్వారా పెట్టబడులకు విఘాతం కలుగుతుందని మూడీస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ విలియమ్ ఫోస్టర్ తెలిపారు. మూడీస్ ప్రకటన తర్వాత ఒక నెల రోజులు డాలర్, రూపాయలను పంపిణీ చేయలేమని ఫార్వర్డ్స్ రోస్ ప్రకటించడం గమనార్హం. వినియాగదారుల రుణాలు తీర్చడంలో ప్రధాన వనరుగా ఉన్న బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలలో సమస్యలు అంత త్వరగా తీరబోవని తెలిపింది. మరోవైపు ఫిచ్ రేటింగ్స్, ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ మాత్రం ఇప్పటికీ భారతదేశ దృక్పథాన్ని అభినంధించడం విశేషం. -
జీడీపీకి ఫిచ్ కోత..
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి (2019–20) గతంలో వేసిన 6.8 శాతం నుంచి 6.6 శాతానికి రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తాజాగా తగ్గించింది. అధిక రుణ భారం కారణంగా ద్రవ్య విధానాన్ని సడలించే అవకాశాలు ప్రభుత్వానికి పరిమితంగానే ఉన్నాయని ఈ సంస్థ అభిప్రాయపడింది. రానున్న సంవత్సరంలో భారత జీడీపీ 7.1 శాతానికి పుంజుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత రేటింగ్‌ను మార్పు చేయకుండా బీబీబీ మైనస్, స్థిరమైన దృక్పథాన్నే కొనసాగించింది. అధిక స్థాయిలో ప్రభుత్వ రుణం, ఆర్థిక రంగ సమస్యలు, కొన్ని నిర్మాణాత్మక అంశాలు వెనక్కి లాగుతున్నప్పటికీ... బలమైన విదేశీ మారక నిల్వలతో మధ్య కాలానికి వృద్ధి పరంగా మంచి అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ తెలిపింది. భారత జీడీపీ వృద్ధి వరుసగా ఐదో త్రైమాసిక కాలంలోనూ (ఏప్రిల్–జూన్) 5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ‘‘దేశీయ డిమాండ్ క్షీణిస్తోంది. ప్రైవేటు వినియోగం, ఇన్వెస్ట్మెంట్ బలహీనంగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్య వాతావరణం కూడా బలహీనంగానే ఉంది’’ అని వివరించింది. -
ఆర్బీఐ ప్రతిపాదనలపై ఫిచ్ హెచ్చరిక
సాక్షి, ముంబై : బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), రిటైల్ రుణ గ్రహీతలకు బ్యాంకులు మరిన్ని రుణాలు పంపిణీ చేసే దిశగా ఆర్బీఐ ఇటీవల తీసుకున్న పలు చర్యలు అంతిమంగా బ్యాంకింగ్ రంగానికి సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. గతేడాది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం బారిన పడిన తర్వాత నుంచి ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో... ఈ రంగానికి ఉపశమనం కల్పించే పలు నిర్ణయాలను ఆర్బీఐ ఎంపీసీ ఈ నెల మొదటి వారంలో ప్రకటించింది. ఇందులో బ్యాంకుల టైర్1 మూలధనంలో 15 శాతం వరకు ఒక ఎన్బీఎఫ్సీ సంస్థకు నిధులు సమకూర్చవచ్చన్న పరిమితిని 20 శాతానికి పెంచింది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలకు ఎన్బీఎఫ్సీ ఇచ్చే రుణాలను ప్రాధాన్యం రంగ రుణాలుగా పరిగణించడం, కన్జ్యూమర్ రుణాల రిస్క్ వెయిటేజీని 125 శాతం నుంచి 100 శాతానికి తగ్గించడం జరిగింది. మందగమన సంకేతాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి రుణ వితరణ పెరిగేలా చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు ఫిచ్ అభివర్ణించింది. అయితే, ఇలా అధికంగా రుణాలు మంజూరు చేయడం చివరకు బ్యాంకులకు ముప్పుగా పరిణమిస్తుందని, బ్యాంకులు అధిక క్రెడిట్ రిస్కును అంగీకరించాల్సి వస్తుందని ఫిచ్ తెలిపింది. అంతర్జాతీయంగా ఎన్‌బీఎఫ్‌సీలకు, బ్యాంకులకు మధ్య అనుసంధానతకు చెక్ పెట్టాలన్న ప్రయత్నాలకు, భారత్‌లో తాజా చర్యలు వైరుధ్యంగా ఉన్నట్టు పేర్కొంది. ఇలా చేయడం వల్ల ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలు బ్యాంకులకు కూడా పాకుతాయని హెచ్చరించింది. -
భారత్ వృద్ధికి ఫిచ్ కోత
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థలో మళ్లీ మందగమన సంకేతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ తాజాగా దేశ జీడీపీ వృద్ధి అంచనాల్లో భారీగా కోత విధించటం దీనికి బలం చేకూరుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2018–19) సంబంధించి ముందుగా వెలువరించిన వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 7.2 శాతానికి కుదిస్తున్నట్లు ఫిచ్ పేర్కొంది. గురువారం విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక అంచనాల నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండొచ్చంటూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఫిచ్ పేర్కొంది. జూన్‌లో 7.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసి... సెప్టెంబర్‌లో దాన్ని పెంచటం గమనార్హం. అధిక భారం, రుణ లభ్యత తగ్గుమఖం పట్టడం వంటివి వృద్ధి అంచనాలను తగ్గించడానికి ప్రధాన కారణాలుగా రేటింగ్ దిగ్గజం తెలియజేసింది. 2017–18లో వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతానికి ఎగబాకగా... తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం రెండో త్రైమాసికంలో 7.1 శాతానికి పడిపోయింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఈ ఏడాది వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. దీనికంటే తక్కువగానే ఫిచ్ అంచనాలుండటం గమనార్హం. ఇక 2019–20 ఏడాదికి వృద్ధి రేటు 7 శాతం, 2020–21లో 7.1 శాతంగా ఉండొచ్చని లెక్కగట్టింది. సెప్టెంబర్‌లో అంచనా వేసిన 7.3 శాతంతో పోలిస్తే వచ్చే రెండేళ్లకు కూడా కోత పడింది. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలివీ... ► ఈ ఏడాది క్యూ2 వృద్ధి రేటు భారీగా పడిపోవడం ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలకు నిదర్శనం. ► వినియోగం రేటు 8.6 శాతం నుంచి 7 శాతానికి బలహీనపడినప్పటికీ.. ఇంకా మెరుగ్గానే కనబడుతోంది. పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. 2016–17ద్వితీయార్థం నుంచీ పెరుగుతున్నాయి. ► దిగుమతుల అంతకంతకూ పెరిగిపోవడంతో వాణిజ్య లోటు మరింత ఎగబాకవచ్చు. ► వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చే విధంగానే కేంద్ర ప్రభుత్వం ద్రవ్య విధానాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ► 2019 చివరినాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 75 స్థాయికి పడిపోవచ్చు(ప్రస్తుతం 71 స్థాయిలో కదలాడుతోంది). ► ప్రభుత్వం వ్యయాలను పెంచడం ద్వారా.. ప్రధానంగా మౌలిక సదుపాయాలకు భారీగా నిధులను వెచ్చిండం వల్ల జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి పడిపోకుండా అడ్డుకట్ట పడింది. మరోపక్క, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► బ్యాంకింగ్ రంగం ఇంకా అధిక మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతోంది. మరోపక్క ఐఎల్‌అండ్‌ఎఫ్‌సీ డిఫాల్ట్ తర్వాత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్బీఎఫ్సీ)లకు ద్రవ్య సరఫరా తగ్గి.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ► రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం కొద్దిగా పెరిగే అవ కాశాలున్నాయి. ఇటీవలి కాలంలో తగ్గిన ఆహారోత్పత్తుల ధరలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం, రూపాయి పతనం కారణంగా దిగుమతుల భారం కావడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు. ► ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు పెరుగుతుండటం రూపాయి క్షీణతకు మరింత ఆజ్యం పోస్తాయి. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా ఎగబాకవచ్చు. ప్రపంచ వృద్ధి అంచనాలు యథాతథం.. ఈ ఏడాది (2018) ప్రపంచ వృద్ధి అంచనాలను యథాతథంగా 3.3 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఫిచ్ పేర్కొంది. వచ్చే ఏడాది( 2019) అంచనాల్లోనూ (3.1%) మార్పులు చేయలేదు. మరోపక్క, చైనా వృద్ధి రేటు ఈ ఏడాది 6.6 శాతం, వచ్చే ఏడాది 6.1 శాతం చొప్పున ఉండొచ్చని అంచనా వేసింది. గత అంచనాలను కొనసాగించింది. ఇక ఒపెక్ దేశాలు క్రూడ్ ఉత్పత్తిలో కొంత కోతకు అంగీకరించే అవకాశం ఉందని... దీనివల్ల ప్రస్తుత స్థాయి నుంచి ముడిచమురు ధరలు కొంత పుంజుకోవచ్చని ఫిచ్ అభిప్రాయపడింది. ‘2018 ఏడాదికి సగటు క్రూడ్(బ్రెంట్) బ్యారెల్ ధర 72.5 డాలర్లుగా ఉండొచ్చు. వచ్చే ఏడాది అంచనా 65 డాలర్లలో మార్పులేదు. 2020 అంచనాలను మాత్రం 57.5 డాలర్ల నుంచి 62.5 డాలర్లకు పెంచుతున్నాం’అని ఫిచ్ తెలిపింది. కాగా, అక్టోబర్ ఆరంభంలో భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు రేటు 85 డాలర్ల నుంచి నవంబర్ ఆఖరి నాటికి 60 డాలర్ల దిగువకు పడిపోయిన సంగతి తెలిసిందే. -
75స్థాయికి రూపాయి దిగజారుతుందా?
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు చమురు ధరల దెబ్బతో డాలరు మారకంలో పాతాళానికి పడిపోయిన దేశీయ కరెన్సీ రూపాయి విలువ మరింత దిగజారనుందని అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా దేశ కరెంటు ఖాతాలోటు ఆందోళనకరంగా విస్తరించిన నేపథ్యంలో రూపాయి విలువ మరింత క్షీణించ నుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఫిచ్ అంచనా వేసింది. ఇటీవల స్వల్పంగా పుంజుకున్నప్పటకీ రూపాయి 2018 గత ఏదేళ్లలో లేని దారుణ స్థాయికి పడిపోతుందని గురువారం వ్యాఖ్యానించింది. అంతేకాదు వచ్చే ఏడాది(2019) చివరినాటికి డాలరు మారకంలో రూపాయి 75స్థాయికి పతనం కానుందని అంచనా వేసింది. విస్తృత కరెంటు ఖాతా లోటు, కఠినమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంగా పేర్కొంది. మరోవైపు 2019, మే నెలలో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రూపాయి క్షీణించనుందని రాయిటర్స్ పోల్స్ అంచనా వేసింది. కాగా గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే డాలర్ మారకంలో రూపాయి 71.04 వద్ద రెండు వారాల కనిష్ఠ స్థాయిని నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
భారత్ రేటింగ్ మార్చడం లేదు!
న్యూఢిల్లీ: భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించిన రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌కు ఫిచ్... స్థిర అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’ సావరిన్ రేటింగ్ ఉంది. ఇది అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. 12 సంవత్సరాల నుంచీ ఇదే గ్రేడింగ్‌ను భారత్‌కు ఫిచ్ కొనసాగిస్తోంది. ప్రస్తుత రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే పరిస్థితి లేదని ఫిచ్ తాజాగా స్పష్టం చేసింది. బలహీన ద్రవ్య పరిస్థితులు ఇందుకు కారణంగా పేర్కొంది. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్‌కు ఇబ్బందులు ఉన్నాయని ఫిచ్ స్పష్టం చేసింది. భారత్ దీర్ఘకాల ఫారిన్ కరెన్సీ ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్)ను ‘స్థిర అవుట్‌లుక్‌తో బీబీబీ–’గానే కొనసాగిస్తున్నాం అని ఫిచ్ ఈ ప్రకటనలో పేర్కొంది. ఫిచ్ ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►మధ్య కాలికంగా వృద్ధి పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్య పరిస్థితులకు కూడా మధ్య కాలికంగా సానుకూలంగా ఉన్నాయి. అయితే ద్రవ్య పరిస్థితులు పేలవంగా ఉండడం, బలహీన ఫైనాన్షియల్‌అంశాలు, వ్యవస్థాగత అంశాలు బాగుండకపోవడం వంటి అంశాలు రేటింగ్ పెంపునకు ప్రతికూలంగా ఉన్నాయి. ►ముఖ్యంగా స్థూల ఆర్థిక అంశాల అవుట్‌లుక్‌కు ప్రతికూలతలు స్పష్టంగా ఉన్నాయి. రుణ వృద్ధి పడిపోయింది. మొండిబకాయిలు సహా బ్యాం కింగ్ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంక్షోభం అనంతరం తలెత్తిన లిక్విడిటీ పరమైన అంశాలు కూడా ఇక్కడ గమనార్హం. ► ఇక ప్రభుత్వ రుణ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 70 శాతానికి చేరింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19)జీడీపీలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం)ను 3.3 శాతానికి (6.24 లక్షల కోట్లు) కట్టడి చేయడం కష్టంగానే కనబడుతోంది. ఆదాయాలు తక్కువగా ఉండడం ఇక్కడ గమనార్హం. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి నెలనెలా లక్ష రూపాయల పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నా... ఇప్పటి వరకూ అది పూర్తిస్థాయిలో నెరవేరలేదు. కేవలం 2 నెలలు (ఏప్రిల్, అక్టోబర్) మినహా లక్ష కోట్లు వసూళ్లు జరగలేదు. ►ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే సార్వత్రిక ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో వ్యయాల అదుపు కష్టమే. ఒకపక్క రాబడులు తగ్గడం, మరోపక్క అధిక వ్యయాల తప్పని పరిస్థితులు ద్రవ్యలోటు పరిస్థితులను కఠినం చేసే అవకాశం ఉంది. ► ఇతర వర్థమాన దేశాలతో పోల్చిచూస్తే, ప్రపంచబ్యాంక్ గవర్నెర్స్ ఇండికేటర్ తక్కువగా ఉంది. ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి సూచీ కూడా బలహీనంగా ఉంది. ► ధరల పెరుగుదల, కరెంట్ అకౌంట్ లోటు కట్టడిపై భయాలు రేటింగ్ పెంపు అవకాశాలకు గండికొడుతున్నాయి. ► ఇక 2019 మార్చితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉంటుందన్న అంచనాల్లో మార్పులేదు. 2017–18లో ఈ రేటు 6.7 శాతం. అయితే కఠిన ద్రవ్య పరిస్థితులు, బలహీన ఫైనాన్షియల్ రంగ బ్యాలెన్స్‌షీట్ అంశాలు, అంతర్జాతీయ క్రూడ్ ధరలు ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాలి. అయితే 2019–21 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి 7.3 శాతానికే పరిమితం కావచ్చు. ప్రభుత్వ వర్గాల నిరాశ? ఫిచ్ రేటింగ్ పెంపునకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేసింది. 2004 తరువాత మొట్టమొదటి సారి మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ (ఫిచ్ ప్రత్యర్థి) 2017 నవంబర్‌లో భారత్ సావరిన్ రేటింగ్‌ను ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కి అప్‌గ్రేడ్ చేసింది. తర్వాత భారత్ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఈ నేపథ్యంలో రేటింగ్ పెంపు సమంజసమని ఫిచ్‌ను ఒప్పించడానికి కేంద్రం ప్రయత్నం చేసింది. 2006 ఆగస్టు 1న ఫిచ్ భారత్ సావరిన్ రేటింగ్‌ను ‘బీబీ+’ నుంచి ‘స్థిర అవుట్‌లుక్‌తో బీబీబీ–’కు అప్‌గ్రేడ్ చేసింది. అప్పటి నుంచీ అదే రేటింగ్‌ను కొనసాగిస్తోంది. అయితే 2012లో అవుట్‌లుక్‌ను ‘నెగిటివ్’కు మార్చింది. కానీ తదుపరి ఏడాదే ‘స్థిరానికి’ పెంచింది. కాగా మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఎస్అండ్పీ కూడా తన భారత్ ప్రస్తుత రేటింగ్ ‘బీబీబీ–’ నుంచి అప్‌గ్రేడ్‌చేయడానికి ససేమిరా అంటోంది. ప్రభుత్వ అధిక రుణ భారం, అల్పాదాయ స్థాయి దీనికి కారణాలుగా చూపుతోంది. ఇదే రేటింగ్‌ను 2007 నుంచీ ఎస్అండ్పీ కొనసాగిస్తోంది. -
జీడీపీ వృద్ధి మరింత పైకి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ పెంచింది. గతంలో 7.4 శాతంగా అంచనా వేయగా, తాజాగా దాన్ని 7.8 శాతం చేసింది. జూన్ త్రైమాసికంలో జీడీపీ రేటు మెరుగ్గా నమోదవడమే తమ అంచనాల సవరణకు కారణమని తెలిపింది. నిజానికి జూన్ త్రైమాసికానికి జీడీపీ 7.7 శాతం వృద్ధి రేటు నమోదు చేయవచ్చని ఫిచ్ అంచనా వేయగా, వాస్తవ వృద్ధి 8.2 శాతంగా నమోదైంది. అయితే, పెరుగుతున్న ముడిచమురు దిగుమతుల బిల్లు, అధిక వడ్డీ రేట్లు ఆందోళనకర అంశాలుగా పేర్కొంది. ఇక 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 0.2 శాతం తగ్గించి 7.3 శాతానికి ఫిచ్ సవరించింది. ఈ మేరకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తన వైఖరిని వెల్లడించింది. ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యంలో (4 శాతానికి అటూ, ఇటూ 2 శాతం అదనం) గరిష్టానికి చేరుకోవచ్చని, అధిక డిమాండ్ రూపాయిపై ఒత్తిళ్లకు దారితీస్తుందని అంచనా వేసింది. బ్యాంకుల బలహీన బ్యాలన్స్ షీట్లు, ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారడం, చమురు దిగుమతుల బిల్లు పెరగడం వంటివి ఆర్థిక రంగ భవిష్యత్ వృద్ధికి సవాళ్లుగా ఫిచ్ పేర్కొంది. రూపాయి ఈ ఏడాది ఇంత వరకు దారుణ పనితీరు చూపించిన ఆసియా కరెన్సీగా అభివర్ణించింది. -
ఇచ్చిన నిధులన్నీ నష్టాలతో సరి!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ప్రకటించిన భారీ నష్టాల కారణంగా... కేంద్రం సమకూర్చిన రూ.85 వేల కోట్ల అదనపు మూలధనం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. బలహీనంగా ఉన్న పీఎస్‌బీల పరిస్థితి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడే అవకాశాలు కనిపించటం లేదని కూడా స్పష్టంచేసింది. భారీ నష్టాల కారణంగా వాటి లాభదాయకతపై, రేటింగ్స్‌పై కూడా ఒత్తిడి తప్పదని హెచ్చరించింది. ‘‘మొండిబాకీలను సత్వరం గుర్తించేలా... నికర నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) వర్గీకరణలో చేసిన మార్పుల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యంత పేలవమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సి వచ్చింది. అయితే, దీర్ఘకాలంలో బ్యాంకింగ్ రంగ పరిస్థితి మెరుగుపడేందుకు ఈ ప్రక్షాళన తోడ్పడుతుంది. ఎన్పీఏల వర్గీకరణ వల్ల మొత్తం బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు ఊహించిన దానికన్నా మరింత అధికంగా పెరిగి 9.3% నుంచి 12.1%నికి చేరాయి. పీఎస్‌బీల సగటు ఎన్పీఏలు 14.5 శాతానికి ఎగిశాయి.’’అని పేర్కొంది. ప్రభుత్వం మరిన్ని నిధులిస్తే తప్ప...: గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగంలోని మొత్తం 21 బ్యాంకుల్లో... దిగ్గజం ఎస్బీఐసహా 19 బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటించాయి. పీఎన్‌బీసహా ఆరు పీఎస్‌బీల మూలధనం... కనిష్ట స్థాయికన్నా దిగువకి పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకు ఇవి నిర్దేశిత 8 శాతం స్థాయిని చేరుకోవాల్సి ఉంటుందని ఫిచ్ పేర్కొంది. 2018–19లో ప్రభుత్వం ఇస్తామన్న రూ.72 వేల కోట్ల అదనపు మూలధనం సాయంతో నియంత్రణ సంస్థల చర్యల నుంచి బ్యాంకులు తప్పించుకున్నా... అవి స్థిరపడటానికి, వృద్ధి సాధించడానికి, నియంత్రణ సంస్థ నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు సాగించడానికి కేంద్రం మరిన్ని నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని ఫిచ్ వివరించింది. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 7.3%!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం (2018–19)లో 7.3 శాతానికి పుంజుకోవచ్చని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2019–20)లో ఇది 7.5 శాతంగా ఉండొచ్చని లెక్కగట్టింది. గతేడాది(2017–18)లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదైంది. నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)కు ముందున్ననాటి స్థాయికి వ్యవస్థలో నగదు సరఫరా చేరుకోవడం, అదేవిధంగా వస్తు–సేవల పన్ను(జీఎస్టీ) సంబంధిత అడ్డంకులు తొలగిపోవడం... వృద్ధి జోరుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. గత నెలలో జరిపిన సమీక్షలో భారత్ సార్వభౌమ(సావరీన్) పరపతి రేటింగ్‌ను వరుసగా 12వ ఏడాది కూడా ఎలాంటి మార్పులూ చేయకుండా ఫిచ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. పలు విప్లవాత్మక సంస్కరణలతోపాటు ద్రవ్యలోటు కట్టడికి కట్టుబడి ఉన్నామంటూ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా రేటింగ్‌ను పెంచేందుకు ఫిచ్ ససేమిరా అనడం గమనార్హం. కాగా, దీనిపై ఫిచ్ స్పందిస్తూ... ‘మధ్య, దీర్ఘకాలానికి వృద్ధి అంచనాలు మెరుగ్గానే ఉన్నాయి. మరోపక్క, ఎగుమతులు ఇతరత్రా అంశాలు కూడా సానుకూలంగానే ఉన్నప్పటికీ... ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పుతుండటం, కంపెనీల పనితీరు ఏమంత ఆశాజనకంగా లేకపోవడం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రేటింగ్‌పై నిర్ణయం తీసుకున్నాం’ అని వివరించింది. అయితే, ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణల అమలుతో వ్యాపార వాతావరణం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని ఫిచ్ తెలిపింది. ఆసియా–పసిఫిక్ దేశాలకు సంబంధించి తాజా సావరీన్ పరపతి సమీక్షలో ఫిచ్ ఈ అంశాలను వెల్లడించింది. ద్రవ్యలోటుపై దృష్టిపెట్టాలి... మోదీ సర్కారు తాజా బడ్జెట్లో ఈ ఏడాది ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రుణ భారం పెరుగుతుండటం.. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో తాము అంచనా వేసినదానికంటే ప్రభుత్వం వెనుకబడటం, ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిలు అంతకంతకూ ఎగబాకడం వంటివి దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలాంశాలని ఫిచ్ పేర్కొంది. ద్రవ్యలోటు కట్టడిపై మరింత దృష్టిసారించాలని సూచించింది. -
ఏమో! ఏం కార్పొరేట్ గవర్నెన్సో!!
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఆ బ్యాంకులో కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను ఎత్తి చూపించేవిగా ఉన్నాయని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ వ్యాఖ్యానించింది. అడ్డగోలుగా ఇచ్చిన రుణాలు మొండిబాకీలుగా మారి బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేస్తున్న ఈ తరుణంలో... తాజా వివాదం వల్ల ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతిష్ట మసకబారే ప్రమాదముందని ఒక నివేదికలో పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ .. తన భర్త దీపక్ కొచర్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా క్విడ్ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిప్పించారంటూ ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఫిచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వివాదంపై సీబీఐతో పాటు ఈడీ వంటి ఏజెన్సీలు కూడా విచారణ జరుపుతున్నాయి. స్వతంత్ర దర్యాప్తు ఎందుకు లేదు? వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాలపై నిర్ణయం తీసుకున్న కమిటీలో చందా కొచర్ కూడా ఉండటం, స్వతంత్ర ఏజెన్సీలతో దర్యాప్తునకు బ్యాంకు సుముఖంగా లేకపోవడం మొదలైన అంశాలన్నీ ఐసీఐసీఐలో పాటిస్తున్న కార్పొరేట్ గవర్నెన్స్ విధానాల పటిష్టతపై సందేహాలు రేకెత్తించేవిగా ఉన్నాయని ఫిచ్ వ్యాఖ్యానించింది. దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడయ్యే అంశాలను బట్టి బ్యాంకుపై నియంత్రణ సంస్థ ఆంక్షలు విధించే అవకాశాలున్నాయని పేర్కొంది. దీంతో పాటు ఆర్థికంగా జరిమానాలు విధించడం, చట్టపరమైన చర్యలు తీసుకునే రిస్కులు కూడా ఉండొచ్చని వివరించింది. ఈ పరిణామాలతో బ్యాంకుపై ఇన్వెస్టర్ల విశ్వాసం సైతం దెబ్బతింటుందని పేర్కొంది. రేటింగ్‌పరమైన రిస్కులు.. బ్యాంక్‌కి సంబంధించిన పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని, ఒకవేళ బ్యాంకు ప్రతిష్టను.. ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే రిస్కులు పెరిగితే రేటింగ్‌పరమైన చర్యలు తీసుకుంటామని ఫిచ్ తెలిపింది. పరిస్థితి తీవ్రమైతే బ్యాంకు నిధుల సమీకరణ వ్యయాలపై, లిక్విడిటీపై ప్రతికూల ప్రభావం పడొచ్చని ఫిచ్ తెలిపింది. అయితే, వ్యవస్థలో కీలకమైన బ్యాంకు కావటంవల్ల ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయొచ్చని తెలియజేసింది. ఒకవేళ బ్యాంకు యాజమాన్యం తప్పు చేసిందని విచారణలో తేలితే... ప్రైవేట్ బ్యాంకులు సమర్థవంతమైన నాయకత్వంతో మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు అమలు చేస్తున్నాయన్న అభిప్రాయం పోయే ప్రమాదముందని వివరించింది. -
ఐసీఐసీఐపై ఫిచ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: వీడియోకాన్ గ్రూపు రుణ వివాదంతో ఇబ్బందుల్లో పడ్డ ఐసీఐసీఐ బ్యాంకు ప్రాభవం మరింత మసకబారుతోంది. తాజాగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకుపై ఆరోపణలు సంస్థ రిపుటేషన్ను దెబ్బతీస్తుందని పేర్కొంది. సీబీఐ విచారణ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిందని తెలిపింది. అంతేకాదు ఐసీఐసీఐలో గవర్నెన్స్‌పై ప్రశ్నలు తలెత్తాయని ఫిచ్ రేటింగ్స్ సోమవారం వ్యాఖ్యానించింది. బ్యాంకుపై ఆరోపణలను దర్యాప్తు సంస్థ రుజువు అయితే..భారీ ఆర్థిక జరిమానా ప్రమాదంతోపాటు చట్టపరమైన చర్యలు కూడా తీవ్రంగానే ఉండనున్నాయని ఫిచ్ అంచనా వేసింది. వీడియోకాన్ గ్రూపునకు సంబంధించిన రుణ కేటాయింపు వివాదాన్ని పరిశీలిస్తున్నామని..దీనికనుగుణంగా తదుపరి రేటింగ్‌ను అంచనా వేస్తామని ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంకు కీర్తి , ఆర్థిక ప్రొఫైల్‌కు నష్టాలు గణనీయంగా పెరగడం లాంటి ఇతర పరిణమాల నేపథ్యంలో తగిన రేటింగ్ తీసుకుంటామని తెలిపింది. అలాగే స్వతంత్ర దర్యాప్తునకు బ్యాంకు అయిష్టతను ప్రకటించడం కార్పొరేట్ పాలనా పద్ధతిపై బలమైన సందేహాలను కలగిస్తోందని ఫిచ్ అభిప్రాయపడింది.అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలీస్తే ఐసీఐసీఐలాంటి ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెర్స్ పటిష్టంగా ఉంటుందనేది తమ విశ్వాసంగా ప్రకటించింది. మెరుగైన-అర్హత కలిగిన బోర్డు సభ్యులు, వృత్తిపరమైన నైపుణ్య నిర్వహణ అంశాల కారణంగా కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగ్గా వుంటుందని పేర్కొంది. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు డ్యామేజ్ కంట్రోల్లో పడింది. టాప్ పెట్టుబడిదారులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఇన్వెస్టర్లు మరిన్నివివరాలు కావాలంటూ డిమాండ్ చేశారు. అటు బ్యాంకు సీఈవో చందా కొచర్ భర్త దీపక్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను వరుసగా అయిదవ రోజు కూడా సీబీఐ విచారిస్తోంది. అటు ఐసీఐసీఐలో 12.3 శాతం అధిక వాటా కలిగి వున్న ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ కూడా ఈ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. -
వృద్ధి 7.3 శాతమే
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ రానున్న ఆర్థిక సంవత్సరం (2018–19)లో 7.3 శాతం మేర వృద్ధి చెందుతుందని రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. తదుపరి ఆర్థిక సంవత్సరం (2019–20)లో ఇది 7.5 శాతానికి పుంజుకుంటుందని అంచనా వెల్లడించింది. మౌలిక రంగంలో పెట్టుబడులు పెరగడం, జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోవడం వల్ల ఇది సాధ్యమవుతుందని వివరించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5% వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ నివేదికలో ఫిచ్ పేర్కొంది. కేంద్ర గణాంకాల శాఖ అంచనా 6.6% కంటే ఇది తక్కువే. విధానాల కారణంగా వృద్ధి రేటు మందగమనం ముగిసిపోయినందునే ఈ అంచనా వేస్తున్నట్టు తెలిపింది. నివేదికలోని వివరాలు ♦ 2017 మధ్య నాటికి నగదు సరఫరా అన్నది డీమోనిటైజేషన్ ముందు నాటికి చేరింది. ఇది క్రమంగా పెరుగుతోంది. ♦ జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన సమస్యలు క్రమంగా సమసిపోతున్నాయి. ♦ 2018–19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య స్థిరీకరణ నిదానంగా ఉంటుంది. ఇది సమీప కాలంలో వృద్ధికి మద్దతుగా నిలుస్తుంది. ♦ కనీస మద్దతు ధరలు, ఉచిత ఆరోగ్య బీమా, గ్రామీణంగా డిమాండ్‌ను పెంచుతాయి. ♦ ప్రభుత్వరంగ సంస్థల ద్వారా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వవ్యయాలు పెరగనున్నాయి. ♦ రోడ్ల నిర్మాణం, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ సైతం మధ్య కాలంలో వృద్ధికి మద్దతిస్తాయి. ♦ ఆహార ధరలు పెరుగుతుండటం ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచుతుంది. అయితే, చమురు ధరల ప్రభావాన్ని ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ద్వారా కళ్లెం వేయనుంది. ♦ 2018, 2019 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 5 శాతం కంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు. ♦ వృద్ధి రేటు పుంజుకుంటే వచ్చే ఏడాది ఆర్బీఐ రేట్లు పెంచే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా 3 శాతంపైనే ఇక అంతర్జాతీయంగాను వృద్ధి రేటు ఈ ఏడాది మెరుగ్గా ఉంటుందన్న ఫిచ్, అమెరికా, యూరోజోన్, చైనాల ఆర్థిక వ్యవస్థలు చక్కని వృద్ధిని నమోదు చేస్తాయని పేర్కొంది. 2019 వరకు మూడు శాతానికి పైనే వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేసింది. -
ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడతాం
న్యూఢిల్లీ: ఆర్థిక క్రమశిక్షణకు భారత్ కట్టుబడి ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ ప్రతినిధులకు ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. నిర్మాణాత్మక సంస్కరణలు, వస్తు–సేవల పన్ను(జీఎస్టీ) వ్యవస్థ కూడా గాడిలో పడుతున్న నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరందుకుంటోందని వారు చెప్పారు. ఈ తరుణంలో మళ్లీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశంగా అవతరించినట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దేశ సార్వభౌమ రేటింగ్‌ను పెంచాలని సూచించారు. భారత్ రేటింగ్‌పై వార్షిక సమీక్ష ప్రక్రియలో భాగంగా బుధవారం ఫిచ్ డైరెక్టర్ (సావరీన్ రేటింగ్స్) థామస్ రూక్‌మాకెర్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం తదితర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆర్థిక క్రమశిక్షణ కార్యచరణ (రోడ్‌మ్యాప్) బాటలోనే ప్రభుత్వం పయనిస్తోందని, సవరించిన ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. 2020–21 ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీలో ద్రవ్యలోటును (ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) 3 శాతానికి కట్టడి చేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జీఎస్టీ ఆదాయం 11 నెలలకే పరిమితమైనప్పటికీ... ద్రవ్యలోటును 3.5 శాతానికి కట్టడి చేస్తున్నట్లు ఫిచ్ ప్రతినిధులకు వివరించారు. పీఎన్బీ స్కామ్‌పై ఆరా!! జీఎస్టీ అమలులో సమస్యలు, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో (పీఎన్బీ) ఇటీవల చోటుచేసుకున్న భారీ కుంభకోణానికి సంబంధించి పలు అంశాలను ఫిచ్ ప్రతినిధులు ఈ సందర్భంగా లేవనెత్తినట్లు సమాచారం. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వ తక్షణ ఎజెండాలో లేదని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. నష్టజాతక ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) విక్రయం కొనసాగుతుందని.. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ఆదాయం రూ.లక్ష కోట్లను తాకిందని వారు ఫిచ్ ప్రతినిధులకు వివరించారు. 2006 నుంచి అదే రేటింగ్... ప్రస్తుతం ఫిచ్ ‘బీబీబీ మైనస్ (స్థిర అవుట్‌లుక్)’ రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌లో ఇదే అత్యంత తక్కువస్థాయి రేటింగ్. చివరిసారిగా 2006లో ‘బీబీ ప్లస్’ నుంచి ఇప్పుడున్న రేటింగ్‌కు అప్‌గ్రేడ్ చేసింది. అప్పటి నుంచి ఎలాంటి మార్పూ చేయలేదు. మధ్యలో అవుట్‌లుక్‌ను ప్రతికూలానికి మార్చినా, ఆ తర్వాత మళ్లీ స్థిరానికి చేర్చింది. కాగా, 14 ఏళ్ల తర్వాత మరో రేటింగ్ ఏజెన్సీ మూడీస్ గతేడాది నవంబర్‌లో భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు పెంచిన సంగతి తెలిసిందే. అదేవిధంగా అవుట్‌లుక్‌ను (భవిష్యత్తు రేటింగ్ అంచనా) కూడా స్థిరం నుంచి సానుకూలానికి మార్చింది. స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) మాత్రం 2007 నుంచి భారత్ రేటింగ్‌ను యథాతథంగానే (బీబీబీ మైనస్) కొనసాగిస్తోంది. కాగా, ఇటీవలి కేంద్ర బడ్జెట్ తర్వాత ఫిచ్... భారత్‌కు ఉన్న అధిక రుణ భారమే రేటింగ్ పెంపునకు అడ్డంకిగా మారుతోందని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం భారత్ జీడీపీతో పోలిస్తే రుణ భారం 69 శాతం మేర ఉంది. కాగా, ఈ ఏడాది(2017–18) ద్రవ్యలోటు లక్ష్యాన్ని తాజా బడ్జెట్లో కేంద్రం 3.2 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. -
మూడీస్ అలా..ఫిచ్ ఇలా..
సాక్షి,న్యూఢిల్లీ: మూడీస్ రేటింగ్‌తో ఆర్థిక వ్యవస్థపై జోష్ నెలకొంటే..తాజాగా ఫిచ్ రేటింగ్స్ నిరుత్సాహపరిచింది. ప్రస్తుత ఆర్థిఖ సంవత్సరంలో వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 6.7 శాతానికి ఫిచ్ తగ్గించింది. ఆశించిన మేర ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం నెలకొనలేదని పేర్కొంది. మరోవైపు 2018-19 ఆర్థిక సంవ్సరానికి వృద్ధి అంచనాను సైతం 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. రాబోయే రెండేళ్లలో వ్యవస్ధాగత సంస్కరణల అజెండా అమలుతో పాటు వ్యక్తిగత వినిమయ ఆదాయాలు పెరగడంతో జీడీపీ వృద్ధి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. జీఎస్టీ,నోట్ల రద్దు కారణంగా ఇటీవల పలు క్వార్టర్లలో జీడీపీ వృద్ధి మందగించిందని అమెరికన్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలు వృద్ధికి ఊతమిచ్చి, వ్యాపారాల్లో విశ్వాసం పెంచుతాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. బ్యాంకులకు మూలధన సాయం,రూ ఏడు లక్షల కోట్లతో రహదారుల నిర్మాణం వంటి చర్యలతో పెట్టుబడుల వాతావరణం ఊపందుకుంటుందని పేర్కొంది. -
రియల్టీకి ఫిచ్ స్థిరత్వ రేటింగ్
న్యూఢిల్లీ: దేశ రియల్టీ రంగానికి ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ స్థిరత్వ (స్టెబుల్ అవుట్‌లుక్) రేటింగ్ ఇచ్చింది. అమ్ముడుపోకుండా ఉన్న స్టాక్ తగ్గుముఖం పట్టడంతోపాటు, కొత్త చట్టం రెరా అమలుతో ఈ రంగంలో స్థిరీకరణ చోటు చేసుకుంటుందని అభిప్రాయపడింది. రెరా చట్టం ఈ ఏడాది మే నుంచి అమల్లోకి వచ్చింది. చాలా మంది డెవలపర్లు నూతన చట్టానికి అనుగుణంగా తమ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి సారించనున్న నేపథ్యంలో విక్రయం కాని యూనిట్లు 2018లో తగ్గుతాయని ఫిచ్ తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల కొత్త ప్రాజెక్టుల్లో క్షీణత కొనసాగుతుందని, ఫలితంగా ఈ రంగంలో స్థిరీకరణ జరుగుతుందని అంచనా వేసింది. జీఎస్టీ అన్నది రియల్టీకి తటస్థమని, పూర్తయిన ప్రాజెక్టులకు తక్కువ పన్ను వల్ల డిమాండ్ అటువైపు మళ్లుతుందని పేర్కొంది. ఆర్థికంగా బలమైన, పెద్ద డెవలపర్లు నిలదొక్కుకుంటారని, చిన్న, అధిక రుణ భారంతో ఉన్న వారు నిధుల కోసం ఆస్తులను విక్రయించే అవకాశం ఉందని పేర్కొంది. పట్టణాల రియల్టీ ర్యాంకింగ్‌కు విఘాతం: పీడబ్ల్యూసీ కేంద్ర సర్కారు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ అమలుతో రియల్ ఎస్టేట్ రంగానికి నిధుల లభ్యత సమస్యలను సృష్టించడమే కాకుండా, పట్టణాభివృద్ధి, పెట్టుబడులపై ప్రభావం చూపిందని ఓ నివేదిక పేర్కొంది. దీంతో పట్టణాల ర్యాంకింగ్‌లు తగ్గిపోయినట్టు అర్బన్ ల్యాండ్ ఇనిస్టిట్యూట్, పీడబ్ల్యూసీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 600 మంది రియల్ ఎస్టేట్ రంగ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించి నివేదికను ఈ సంస్థలు ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ రియల్ ఎస్టేట్ – ఏషియా పసిఫిక్ 2018’ పేరుతో విడుదల చేశాయి. ముంబై పెట్టుబడుల పరంగా గతేడాది రెండో స్థానంలో ఉండగా, తాజాగా అది 12వ స్థానానికి దిగజారినట్టు ఈ నివేదిక తెలిపింది. -
జీఎస్టీతో దీర్ఘకాలంలో వృద్ధి!
♦ ఫిచ్ రేటింగ్స్ నివేదిక ♦ అయితే స్వల్పకాలంలో ♦ ఆదాయాలు పెరగవని విశ్లేషణ ముంబై: ఒకే దేశం–ఒకే విపణి –ఒకే పన్ను పేరుతో జూలై 1వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) దేశంలో ఉత్పాదకతకు మద్దతు నిస్తుందని, దీర్ఘకాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి దోహదపడుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రేటింగ్స్ అంచనావేసింది. అయితే దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి ఆదాయాలు మాత్రం ఇప్పటికిప్పుడు పెరిగే అవకాశం ఏదీ లేదనీ అంచనావేసింది. నాలుగు విభాగాల కింద విభిన్న ఉత్పత్తులకు 0–28 శాతం శ్రేణిలో పన్నును అమలు చేస్తూ, తాజాగా అమల్లోకి వచ్చిన పరోక్ష పన్ను విధానంపై ఫిచ్ విడుదల చేసిన ఒక నివేదికలో ముఖ్యాంశాలు... ♦ పరోక్ష పన్నుల వ్యవస్థ ఏకీకరణ, వాణిజ్యంలో దేశీయ అడ్డంకుల తొలగింపు వంటి అంశాల్లో జీఎస్టీ మంచి ఫలితాలను అందిస్తుంది. దీర్ఘకాలంలో ఉత్పాదకత, జీడీపీ వృద్ధికి సాయం అందిస్తుంది. తక్షణం మాత్రం ఆదాయాలు పెరిగిపోయే అవకాశం మాత్రం లేదు. వ్యాపారం చేయడంలో సరళతరం, దేశ వ్యాప్తంగా ఒకే పన్ను, విదేశీ పెట్టుబడులను భారత్ భారీగా ఆకర్షించే పరిస్థితులు ఇక్కడ పేర్కొనదగిన అంశాలు. ♦ పన్ను పరిధిలోకి తమ చిన్న సరఫరాదారులు వచ్చేలా చేయడానికి భారీ కంపెనీలు తగిన చర్యలు తీసుకునే వీలుంది. ♦ కొత్త ఎలక్ట్రానిక్ ఫైలింగ్ వ్యవస్థ మరింత ట్యాక్స్ రిపోర్టింగ్‌కు దోహదపడుతుంది. ♦ రిటైల్ అమ్మకాల్లో 90 శాతం వాటా ఉన్న చిన్న అసంఘటిత రిటైలర్లకు తమ అమ్మకాలను తక్కువచేసి చూపించడం, ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్స్ నుంచి తప్పించుకోవడం వంటివి కుదరవు. యావత్తు సరఫరా చైన్‌లో లావాదేవీల వ్యవస్థ ఇందుకు అనుమతించదు. ఇది సంఘటిత రిటైలింగ్‌కు దారితీస్తుంది. ♦ అయితే కొత్త పన్ను అమలులో కొంతకాలం పాలనా, నిర్వహణా పరమైన అడ్డంకులు తలెత్తవచ్చు. ♦ సంస్థల వ్యాపార నిర్వహణ, వాటి ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ట్యాక్స్ అకౌంటింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, టెక్నాలజీ వంటి అంశాల్లో గణనీయ మార్పునకు జీఎస్టీ దోహదపడుతుంది. రేటింగ్స్ పెంపుపై మౌనం.. జీఎస్టీ అమలు నేపథ్యంలో ఫిచ్ రేటింగ్స్ నివేదిక ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ప్రస్తుతం ఫిచ్ భారత్‌కు జంక్(చెత్త)కన్నా ఒక మెట్టు ఎక్కువ ‘బీబీబీ–’ పాజిటివ్ అవుట్‌లుక్ రేటింగ్‌ను ఇస్తోంది. మరో రేటింగ్ దిగ్గజం మూడీస్ కూడా ప్రస్తుతం భారత్‌కు ఇదే రేటింగ్స్ ఇస్తున్నప్పటికీ, జీడీపీ వల్ల దేశాభివృద్ధి జరుగుతుందనీ, సావరిన్ రేటింగ్స్‌కు ఇది సానుకూల అంశమని ఆదివారం పేర్కొంది. -
చిన్న వాహన రుణాలకు నోట్ల రద్దు దెబ్బ!
ఫిచ్ రేటింగ్స్ నివేదిక... ముంబై: దేశంలో పెద్ద నోట్ల రద్దు చిన్న వాహన పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసిందని అంతర్జాతీయ గ్లోబల్ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. చిన్న ఆటో రుణ గ్రహీతలు పునఃచెల్లింపుల సామర్థ్యాన్ని కోల్పోయారని పేర్కొంటూ, నోట్ల రద్దు వల్ల వారి ఆదాయాలు గణనీయంగా పడిపోవడమే దీనికి కారణమని తన తాజా నివేదికలో వివరించింది. దీనితోపాటు పెద్ద నోట్ల రద్దు అసంఘటిత రంగంపై ప్రతికూల ప్రభావం చూపిందని కూడా నివేదిక పేర్కొంది. ఇది ఆర్థిక క్రియాశీలతకు విఘాతం కలిగించిందని విశ్లేషించింది. పరిస్థితి అదుపులోకి రావడానికి మరో రెండు, మూడు నెలలు పడుతుందని తాము భావిస్తున్నట్లు వివరించింది. మార్చి నాటికి సర్దుకుంటుంది: నోమురా ఇదిలావుండగా, పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన నగదు గందరగోళం మార్చినాటికి సర్దుకుం టుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నోమురా పేర్కొంది. కరెన్సీ–జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) నిష్పత్తి మార్చినాటికి 9 శాతానికి చేరుకుం టుందని, దీనివల్ల మనీ సర్క్యులేషన్లో ఇబ్బం దులు తప్పుతాయని విశ్లేషించింది. నోమురా తెలిపిన సమాచారం ప్రకారం– 2016 నవంబర్ 4న జీడీపీలో కరెన్సీ సర్క్యులేషన్ పరిమాణం 11.8 శాతంగా ఉంది. అటు తర్వాత జనవరి 6 నాటికి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 5.9 శాతానికి పడిపోయింది. ఆపైక్రమంగా పెరుగుతూ జనవరి 20వ తేదీ నాటికి 6.9 శాతానికి చేరింది. మార్చి నాటికి పరిస్థితి మరింత మెరుగుపడుతుందని నోమురా పరిశోధనా నివేదిక వివరించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రతిష్టంభన ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని, తిరిగి వృద్ధి రికవరీ మెరుగుపడుతుందని భావిస్తున్నామని కూడా వివరించింది. -
8% వృద్ధికి మరో రెండేళ్లు ఆగాల్సిందే: ఫిచ్
2018-19లోనే ఇది సాధ్యమవుతుందని అంచనా న్యూఢిలీ: భారత్ ఎనిమిది శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందేనని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. 2016-17లో భారత్ వృద్ధి రేటును 7.4 శాతంగా అంచనావేసిన ఫిచ్ ద్వైమాసిక గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్ (జీఈఓ) నివేదిక, 2017-18లో ఇది 7.9 శాతానికి చేరుతుందని పేర్కొంది. 2018-19లో 8 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. 2015-16లో వృద్ధి రేటు 7.9 శాతం కావడం గమనార్హం. సంస్కరణల ఫలితాలు, సరళతర ద్రవ్య పరపతి విధానం ఈ వృద్ధి రేటుకు కారణంగా పేర్కొంది. నివేదిక అంశాలను చూస్తే... ♦ 2016 చివరినాటికి బ్యాంకులకు తానిచ్చే రుణ రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పావు శాతం తగ్గిస్తుంది. 2017లో మరో పావు శాతం రేటు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రేటు 6.5 శాతంగా ఉంది. అలాగే ప్రభుత్వ వ్యయాలు పెరగడం, తగిన వర్షపాతం కూడా ఆర్థిక వ్యవస్థకు లాభించే అంశాలు. ♦ సంస్కరణలు ప్రత్యేకించి ఇటీవల వస్తు, సేవల పన్ను బిల్లుకు పార్లమెంటు ఆమోదం సమీపకాలంలో ఇన్వెస్టర్ సెంటిమెంట్ మెరుగుపడ్డానికి దోహదపడతాయి. ♦ ఫిచ్20 ఆర్థికవ్యవస్థల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుంది. ♦ గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ప్రైవేటు వినియోగం వృద్ధి 6.7 శాతంగా ఉంది. ఇది 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతానికి చేరే వీలుంది. అయితే పెట్టుబడుల అంశం ప్రస్తుతం ప్రతికూలాంశం. ఇది 2015-16 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో అసలు వృద్ధిలేకపోగా 3.1 శాతం క్షీణించింది. అయితే ఈ విభాగంసైతం 2017-18లో 6.3 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నాం. ♦ ఇక ఎగుమతులు బలహీన దోరణిలోనే కొనసాగే వీలుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్వల్పంగా 1.6 శాతం వృద్ధి నమోదుచేసుకునే వీలుంది. ♦ {దవ్యోల్బణం క్రమంగా పెరిగి 2016 చివరకు 5.5 శాతానికి, 2017 చివరికి 5.8 శాతానికి చేరే వీలుంది. 2018 చివరికి 6 శాతానికి పెరగవచ్చు. మరోపక్క, వచ్చే ఐదేళ్లకాలానికిగాను రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం 4 శాతంగా(రెండు శాతం అటూ ఇటుగా) నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
రేటింగ్ ను పెంచండి: భారత్
న్యూఢిల్లీ: భారత్‌లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయాలని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్‌ను భారత్ కోరింది. ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉన్నామని, దివాలా చట్టం తెచ్చామని, మరిన్ని సంస్కరణలు తెచ్చామని, మరిన్ని సంస్కరణలు తేనున్నామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఫిచ్ ప్రతినిధులకు వివరించారు. ఆయన ఫిచ్ ప్రతినిధులతో మంగళవారం రెండు గంటల పాటు చర్చలు జరిపారు. -
భారత వృద్ధి అంచనాలను తగ్గించిన ఫిచ్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిట్ భారత వృద్ధి అంచనాలను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలో భారత ఆర్థిక వృద్ది 8%గా ఉంటుందని ఫిచ్ గతంలో అంచనా వేసింది. కానీ ఫిచ్ ఆ అంచనాలను ప్రస్తుతం 7.8%కి కుదించింది. 2016-17లో చైనాతో పోలిస్తే భారత వృద్ధి రేటు (8.1%) ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. 2017-18లో భారత వృద్ధి 8% ఉంటుందని పేర్కొంది. నిర్మాణాత్మక సంస్కరణల అమలుతో దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం పెరిగి తద్వారా వృద్ధి రేటు పుంజుకోవచ్చని తెలిపింది. -
బ్యాంకుల రేటింగ్ కట్
ముంబై: వివిధ అంశాలకు సంబంధించి భారత్ బ్యాంకింగ్ సామర్థ్యాలపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు మూడీస్, ఫిచ్ దృష్టి సారించాయి. ఆయా అంశాలకు సంబంధించి రేటింగ్‌లపై కోత పెట్టాయి. ఎస్బీఐపై మూడీస్ ఇలా... భారత బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ డెట్ రేటింగ్‌కు మూడీస్ కోతపెట్టింది. ప్రస్తుత ‘బీఏఏ2’ రేటును ‘బీఏఏ3’కి డౌన్‌గ్రేడ్ చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. సీనియర్ అన్సెక్యూర్డ్ డెట్, లోకల్ కరెన్సీ డిపాజిట్ రేటింగ్‌లపై ఈ కోత పెడుతున్నట్లు వెల్లడించింది. మొండిబకాయిల సమస్య, పునఃపెట్టుబడులు జరగవేమోనన్న సందేహాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీనిపై వ్యాఖ్యలకు ఎస్బీఐ వర్గాలు తక్షణం అందుబాటులో లేవు. పీఎన్బీ, బీఓబీ రేటింగ్‌లకు ఫిచ్ కోత కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) లాభదాయకతకు సంబంధించిన వయబిలిటీ రేటింగ్స్‌ను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తగ్గించింది. ఇప్పటివరకూ ఈ రేటింగ్ ‘బీబీబీ’కాగా దీనిని ‘బీబీప్లస్’కు కుదిస్తున్నట్లు వెల్లడించింది. బ్యాంకుల రుణ సామర్థ్యానికి ఈ రేటింగ్ ప్రతిబింబంగా ఉంటుంది. కాగా దీర్ఘకాలిక ఇష్యూయెర్ డిఫాల్ట్ రేటింగ్స్‌ను మాత్రం ‘బీబీబీ’గా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. మరికొన్ని నిర్ణయాలు ఇవీ...: కాగా ఇండియన్ బ్యాంక్ దీర్ఘకాలిక (ఎల్టీ) ఇష్యూయెర్ డిఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్)ను ‘బీబీబీ’ నుంచి ‘బీబీప్లస్’కు తగ్గిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది. ఆ బ్యాంక్ వయబిలిటీ రేటింగ్‌ను సైతం ‘బీబీబీ’ నుంచి ‘బీబీప్లస్’కు కోతపెడుతున్నట్లు వెల్లడించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరాబ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, బీఓబీ న్యూజిలాండ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ దీర్ఘకాలిక ఇష్యూయెర్ డిఫాల్ట్ రేటింగ్స్ ‘బీబీబీ’గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ విషయంలో వయబిలిటీ రేటింగ్స్ ‘బీబీబీ’గా కొనసాగుతుందని పేర్కొంది. కాగా కెనరాబ్యాంక్‌కు సంబంధించి ఈ రేటింగ్ ‘బీబీప్లస్’కాగా, ఐడీబీఐ బ్యాంక్ విషయంలో ‘బీబీ’గా కొనసాగుతుందని వెల్లడించింది. -
భారత్ వృద్ధి 4.8 శాతమే: ఫిచ్
న్యూఢిల్లీ: ఫిచ్ రేటింగ్ సంస్థ భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను కుదించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 4.8 శాతమని తాజాగా అంచనావేసింది. వృద్ధి రేటు 5.7 శాతమని ఇంతక్రితం జూన్‌లో సంస్థ అంచనా వేసింది. బలహీన డిమాండ్, ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాలను కుదిస్తున్నట్లు ఫిచ్ తన గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. రానున్న ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను సైతం 6.5 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది. రూపాయి క్షీణత ప్రభావం ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుపై పడుతోందని విశ్లేషించింది.