వృద్ధి, ధరల్లో స్థిరత్వం నేపథ్యం
రుణ వృద్ధికి తోడ్పాటు
ఫిచ్ అంచనా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–2026) రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ దిగ్గజం– ఫిచ్ విశ్లేషించింది. స్థిర వృద్ధి, ధరల పెరుగుదల్లో కట్టడి వంటి అంశాలు దీనికి దోహదపడతాయన్నది ఫిచ్ విశ్లేషణ. రెపో రేటు కోత 2025–26లో కార్పొరేట్ల రుణ లభ్యత పెరుగుదలకు దారితీసే అంశంగా పేర్కొంది. అధిక మూలధన వ్యయాలు నమోదయినప్పటికీ, వచే ఆర్థిక సంవత్సరం భారత్ కార్పొరేట్ల మార్జిన్లు మెరుగుపడతాయన్న విశ్వాసాన్ని ఫిచ్ వెలిబుచ్చింది. ‘‘ఇండియా కార్పొరేట్ల క్రెడిట్ ట్రెండ్స్’’ పేరుతో ఫిచ్ రూపొందించిన తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు...
వృద్ధి 6.5 శాతం
2025–26లో సిమెంట్, విద్యుత్, పెట్రోలియం ఉత్పత్తులు, ఉక్కు, ఇంజినీరింగ్, నిర్మాణ (ఈఅండ్‌సీ) కంపెనీల ఉత్పత్తులకు మంచి డిమాండ్ అవకాశాలు ఉన్నాయి. దీనితో ఎకానమీ 6.5 శాతం పురోగమించే వీలుంది. మౌలిక సదుపాయాల వ్యయం పెరగవచ్చు. ఎకానమీ స్థిరవృద్ధికి ఈ అంశం దోహదపడుతుంది.
మరికొన్ని అంశాలు...
→ దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు నెమ్మదించడం వల్ల ఆటో రంగంలో వృద్ధి మధ్యస్థంగా ఉండే వీలుంది.
→ రవాణా, పర్యాటక పరిశ్రమలో డిమాండ్ రికవరీ ఒక మోస్తరు వేగంతో కొనసాగుతుంది.
→ అంతర్జాతీయంగా అధిక సరఫరాల ప్రభావం రసాయన కంపెనీల ధరలపై ప్రభావం చూపుతుంది.
→ టెలికం కంపెనీల ఆదాయ వృద్ధికి టారిఫ్‌ల పెంపు మద్దతు లభిస్తుంది.
→ ఔషధ రంగంలో మెరుగైన ఫలితాలు నమోదుకావచ్చు.
రూపాయిపై ఒత్తిడి
కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత రూపాయి మరింత క్షీణించవచ్చు. అమెరికాసహా కొన్ని దేశాలు తీసుకునే వాణిజ్య రక్షణాత్మక చర్యల వల్ల దిగుమతులు తగ్గి, రూపాయిపై ఆ ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
ఐటీ మందగమనం..
కీలకమైన విదేశీ మార్కెట్లలోని వినియోగదారులు ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వ్యయాల విషయంలో విచక్షణతో వ్యవహరించవచ్చు. దీనితో ఐటీ, సేవా కంపెనీల అమ్మకాల్లో కేవలం ఒక అంకె వృద్ధి మాత్రమే నమోదయ్యే వీలుంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి విక్రయాల్లో వృద్ధి ఒక అంకెకు పరిమితం కావచ్చు.
రేటు తగ్గింపు ప్రక్రియ షురూ!
రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపనకు పడిపోయే అవకాశం ఉంది. ఆర్‌బీవ్యోల్బణం నుండి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని మేము నమ్ముతున్నాము. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్‌బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నాము.
– అఖిల్ మిట్టల్, సీనియర్ ఫండ్ మేనేజర్
(టాటా అసెట్ మేనేజ్‌మెంట్)
ఫిబ్రవరిలో రేటు తగ్గదు
నవంబర్ 2024లో 5.5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 5.2 శాతానికి దిగివచ్చింది. ఇది మా అంచనాలకన్నా తక్కువ. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి పాలసీ సమీక్షలో రెపో రేటు తగ్గింపు కష్టమే. అయితే కూరగాయల వంటి నిత్యావసర వస్తువుల్లో ధరలలో గణనీయమైన క్షీణత వల్ల వృద్ధే లక్ష్యంగా ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యుల్లో కొందరు కోతకు మొగ్గుచూపే వీలుంది.
– అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్
ఏప్రిల్ పాలసీలో కోత
కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్‌బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా రేటు తగ్గింపునకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ) రేటు తగ్గింపునకు మరొక పాలసీ వరకూ ఆర్‌బీఐ వేచిచూసే వీలుంది.
– పరాస్ జస్రాయ్, ఇండ్–రా ఎకనమిస్ట్
Comments
Please login to add a commentAdd a comment