ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎకానమీ దాదాపు 5 శాతం మేర వెనుకంజ వేయవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇది గత ఏప్రిల్‌లో వేసిన అంచనాల కన్నా చాలా తక్కువ. దీంతో పాటు ప్రపంచ ఎకానమీపై అంచనాలను కూడా తగ్గించింది. అయితే అంతర్జాతీయంగా ఎకానమీ బాటమ్‌అవుట్ కానున్న సంకేతాలున్నాయని వెల్లడించింది. భారత్‌లో ముందు ఊహించినదాని కన్నా ఎక్కువకాలం లాక్‌డౌన్ విధించారని, దీంతో ఆర్థిక గణాంకాలు బలహీనంగా మారాయని వివరించింది. 2021-22లో తిరిగి ఎకానమీ పట్టాలెక్కి 9. 5శాతానికి చేరవచ్చని అభిప్రాయపడింది. వర్దమాన మార్కెట్లలో చైనా మినహా ఇతర దేశాల వృద్ధి ఈ ఏడాది సరాసరిన 4.5 శాతం మేర పతనం కావచ్చని అంచనా వేసింది. 2020లో చైనా 0.7 శాతం, యూఎస్ మైనస్ 5.6 శాతం, జపాన్ మైనస్ 5 శాతం మేర వృద్ధి నమోదు చేస్తాయని తెలిపింది. నెలవారీ ఆర్థిక సూచికలు పరిశీలిస్తే అంతర్జాతీయంగా మందగమనం చివరకు వచ్చినట్లు కనిపిస్తోందని తెలిపింది. యూఎస్, యూరోజోన్‌లో క్రమంగా కన్జూమర్ల కొనుగోళ్లు పెరిగాయని తెలిపింది. అంతర్జాతీయంగా ఉద్దీపనలు పెరిగాయని, అయితే రికవరీ నెమ్మదిగా, ఒడిదుడకులతో వస్తుందని అంచనా వేసింది. నిరుద్యోగిత పెరగడం, కరోనా నివారక నిబంధనలు.. వినిమయ వ్యయాలు తగ్గిస్తాయని, కంపెనీలు కొత్తగా మూలధన వ్యయాలు చేసేందుకు ఒకటికిరెండు మార్లు పునరాలోచించుకుంటాయని అభిప్రాయపడింది. వచ్చే ఏడాది(20-21)లో ఎకానమీలన్నీ గాడిన పడవచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment