జీఎస్‌టీతో దీర్ఘకాలంలో వృద్ధి! | GST to boost GDP; significant risks in short term: Fitch | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీతో దీర్ఘకాలంలో వృద్ధి!

Published Wed, Jul 5 2017 1:53 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

జీఎస్‌టీతో దీర్ఘకాలంలో వృద్ధి!

జీఎస్‌టీతో దీర్ఘకాలంలో వృద్ధి!

ఫిచ్‌ రేటింగ్స్‌ నివేదిక
అయితే స్వల్పకాలంలో
ఆదాయాలు పెరగవని విశ్లేషణ


ముంబై: ఒకే దేశం–ఒకే విపణి –ఒకే పన్ను  పేరుతో జూలై 1వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) దేశంలో ఉత్పాదకతకు మద్దతు నిస్తుందని, దీర్ఘకాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి దోహదపడుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనావేసింది. అయితే దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి ఆదాయాలు మాత్రం ఇప్పటికిప్పుడు పెరిగే అవకాశం ఏదీ లేదనీ అంచనావేసింది.  నాలుగు విభాగాల కింద విభిన్న ఉత్పత్తులకు 0–28 శాతం శ్రేణిలో పన్నును అమలు చేస్తూ, తాజాగా అమల్లోకి వచ్చిన పరోక్ష పన్ను విధానంపై  ఫిచ్‌ విడుదల చేసిన ఒక నివేదికలో ముఖ్యాంశాలు...

పరోక్ష పన్నుల వ్యవస్థ ఏకీకరణ, వాణిజ్యంలో దేశీయ అడ్డంకుల తొలగింపు వంటి అంశాల్లో జీఎస్‌టీ మంచి ఫలితాలను అందిస్తుంది. దీర్ఘకాలంలో ఉత్పాదకత, జీడీపీ వృద్ధికి సాయం అందిస్తుంది. తక్షణం మాత్రం ఆదాయాలు పెరిగిపోయే అవకాశం మాత్రం లేదు. వ్యాపారం చేయడంలో సరళతరం, దేశ వ్యాప్తంగా ఒకే పన్ను, విదేశీ పెట్టుబడులను భారత్‌ భారీగా ఆకర్షించే పరిస్థితులు ఇక్కడ పేర్కొనదగిన అంశాలు.
పన్ను పరిధిలోకి తమ చిన్న సరఫరాదారులు వచ్చేలా చేయడానికి భారీ కంపెనీలు తగిన చర్యలు తీసుకునే వీలుంది.
కొత్త ఎలక్ట్రానిక్‌ ఫైలింగ్‌ వ్యవస్థ మరింత ట్యాక్స్‌ రిపోర్టింగ్‌కు దోహదపడుతుంది.
రిటైల్‌ అమ్మకాల్లో 90 శాతం వాటా ఉన్న చిన్న అసంఘటిత రిటైలర్లకు తమ అమ్మకాలను తక్కువచేసి చూపించడం, ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైలింగ్స్‌ నుంచి తప్పించుకోవడం వంటివి కుదరవు. యావత్తు సరఫరా చైన్‌లో లావాదేవీల వ్యవస్థ ఇందుకు అనుమతించదు. ఇది సంఘటిత రిటైలింగ్‌కు దారితీస్తుంది.
అయితే కొత్త పన్ను అమలులో కొంతకాలం పాలనా, నిర్వహణా పరమైన అడ్డంకులు తలెత్తవచ్చు.
సంస్థల వ్యాపార నిర్వహణ, వాటి ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్, ట్యాక్స్‌ అకౌంటింగ్, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ వంటి అంశాల్లో గణనీయ మార్పునకు జీఎస్‌టీ దోహదపడుతుంది.

రేటింగ్స్‌ పెంపుపై మౌనం..
జీఎస్‌టీ అమలు నేపథ్యంలో ఫిచ్‌ రేటింగ్స్‌ నివేదిక ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు.  ప్రస్తుతం ఫిచ్‌ భారత్‌కు జంక్‌(చెత్త)కన్నా ఒక మెట్టు ఎక్కువ ‘బీబీబీ–’ పాజిటివ్‌ అవుట్‌లుక్‌ రేటింగ్‌ను ఇస్తోంది. మరో  రేటింగ్‌ దిగ్గజం మూడీస్‌ కూడా ప్రస్తుతం భారత్‌కు ఇదే రేటింగ్స్‌ ఇస్తున్నప్పటికీ, జీడీపీ వల్ల దేశాభివృద్ధి జరుగుతుందనీ, సావరిన్‌ రేటింగ్స్‌కు ఇది సానుకూల అంశమని ఆదివారం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement