బ్రిటన్‌ను మించనున్న భారత్‌!! | India likely to surpass UK in the worlds largest economy rankings: PwC | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ను మించనున్న భారత్‌!!

Published Mon, Jan 21 2019 1:01 AM | Last Updated on Mon, Jan 21 2019 1:01 AM

India likely to surpass UK in the worlds largest economy rankings: PwC - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఈసారి బ్రిటన్‌ను భారత్‌ అధిగమించవచ్చని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఒక నివేదికలో పేర్కొంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2017లో ఫ్రాన్స్‌ను దాటేసిన భారత్‌ 2.59 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ఆరో అతి పెద్ద ఎకానమీగా అవతరించింది. బ్రిటన్‌ అయిదో స్థానంలో ఉంది. అయితే,  ఇక తాజా పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం భారత్‌ అయిదో స్థానానికి, ఫ్రాన్స్‌ ఆరో స్థానానికి చేరనుండగా.. బ్రిటన్‌ ఏడో స్థానానికి పడిపోనుంది. 2017లో బ్రిటన్‌ జీడీపీ 2.62 లక్షల కోట్ల డాలర్లుగాను, ఫ్రాన్స్‌ జీడీపీ 2.58 లక్షల కోట్ల స్థాయిలోనూ నమోదయ్యాయి. ప్రస్తుతం 19.39 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా (12.23 లక్షల కోట్ల డాలర్లు), జపాన్‌ (4.87 లక్షల కోట్ల డాలర్లు) జర్మనీ (3.67 లక్షల కోట్ల డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.  సాధారణంగా ఒకే స్థాయి అభివృద్ధి, జనాభా తదితర అంశాల కారణంగా బ్రిటన్, ఫ్రాన్స్‌ల స్థానాలు అటూ, ఇటూ అవుతూ ఉంటాయని.. కానీ భారత్‌ మాత్రం ర్యాంకిగ్‌ పెంచుకుంటూనే ఉందని పీడబ్ల్యూసీ తెలిపింది.

గ్లబల్‌ ఎకానమీ వాచ్‌ పేరిట రూపొందించిన బీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. 2019లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7.6 శాతంగా ఉండనుండగా, ఫ్రాన్స్‌ది 1.7 శాతంగాను, బ్రిటన్‌ది 1.6 శాతంగాను వృద్ధి నమోదు కానుంది. ‘అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు, చమురు సరఫరాపరమైన షాక్‌లేమీ లేకపోతే 2019–20లో భారత్‌ 7.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చు. కొత్తగా అమల్లోకి తెచ్చిన వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ), కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తొలి ఏడాదిలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు అధిక వృద్ధికి ఊతమిచ్చే అవకాశం ఉంది‘ అని పీడబ్ల్యూసీ పేర్కొంది. ప్రపం చ ఎకానమీపై ప్రభావం చూపే అంశాల ఆధారంగా పీడబ్ల్యూసీ ఏటా ఈ జాబితా రూపొందిస్తుంది.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement