
న్యూఢిల్లీ: దేశ రియల్టీ రంగానికి ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ స్థిరత్వ (స్టెబుల్ అవుట్‌లుక్) రేటింగ్ ఇచ్చింది. అమ్ముడుపోకుండా ఉన్న స్టాక్ తగ్గుముఖం పట్టడంతోపాటు, కొత్త చట్టం రెరా అమలుతో ఈ రంగంలో స్థిరీకరణ చోటు చేసుకుంటుందని అభిప్రాయపడింది. రెరా చట్టం ఈ ఏడాది మే నుంచి అమల్లోకి వచ్చింది. చాలా మంది డెవలపర్లు నూతన చట్టానికి అనుగుణంగా తమ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి సారించనున్న నేపథ్యంలో విక్రయం కాని యూనిట్లు 2018లో తగ్గుతాయని ఫిచ్ తన నివేదికలో పేర్కొంది.
దీనివల్ల కొత్త ప్రాజెక్టుల్లో క్షీణత కొనసాగుతుందని, ఫలితంగా ఈ రంగంలో స్థిరీకరణ జరుగుతుందని అంచనా వేసింది. జీఎస్టీ అన్నది రియల్టీకి తటస్థమని, పూర్తయిన ప్రాజెక్టులకు తక్కువ పన్ను వల్ల డిమాండ్ అటువైపు మళ్లుతుందని పేర్కొంది. ఆర్థికంగా బలమైన, పెద్ద డెవలపర్లు నిలదొక్కుకుంటారని, చిన్న, అధిక రుణ భారంతో ఉన్న వారు నిధుల కోసం ఆస్తులను విక్రయించే అవకాశం ఉందని పేర్కొంది.
పట్టణాల రియల్టీ ర్యాంకింగ్‌కు విఘాతం: పీడబ్ల్యూసీ
కేంద్ర సర్కారు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ అమలుతో రియల్ ఎస్టేట్ రంగానికి నిధుల లభ్యత సమస్యలను సృష్టించడమే కాకుండా, పట్టణాభివృద్ధి, పెట్టుబడులపై ప్రభావం చూపిందని ఓ నివేదిక పేర్కొంది. దీంతో పట్టణాల ర్యాంకింగ్‌లు తగ్గిపోయినట్టు అర్బన్ ల్యాండ్ ఇనిస్టిట్యూట్, పీడబ్ల్యూసీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
600 మంది రియల్ ఎస్టేట్ రంగ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించి నివేదికను ఈ సంస్థలు ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ రియల్ ఎస్టేట్ – ఏషియా పసిఫిక్ 2018’ పేరుతో విడుదల చేశాయి. ముంబై పెట్టుబడుల పరంగా గతేడాది రెండో స్థానంలో ఉండగా, తాజాగా అది 12వ స్థానానికి దిగజారినట్టు ఈ నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment