ముంబై: యుటిలిటీ వాహనాలకు (యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా అమ్ముడయ్యే కార్లలో ఇవి అధిక వాటా దక్కించుకునే ధోరణి కొనసాగవచ్చని ఫిచ్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. అధిక మార్జిన్లు ఉండే యూవీల విక్రయాలపై మరింత దృష్టి పెట్టడం ద్వారా కమోడిటీల ధరల పెరుగుదల, అదనపు భద్రత ప్రమాణాలపరమైన వ్యయాల భారాన్ని ఆటోమొబైల్ సంస్థలు కొంత మేర ఎదుర్కొనేందుకు వీలుంటుందని పేర్కొంది. మరోవైపు, ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతుండటంతో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల తయారీని ఆటోమొబైల్ సంస్థలు తగ్గించుకుంటున్నట్లు వివరించింది.
దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్ల విక్రయాల్లో యూవీల పరిమాణం 49 శాతం పెరిగినట్లు (అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 28 శాతం) ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్ల సంయుక్త వాటా 66 శాతం నుండి 48 శాతానికి పడిపోయింది. యూవీలకు ఆదరణ పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ఇక యూవీ కేటగిరీలో అంతర్గతంగా ఎంట్రీ, మధ్య స్థాయి వాహనాల అమ్మకాల వాటా మొత్తం కార్ల విక్రయాల్లో 38 శాతానికి చేరింది. విశిష్టమైన సామర్థ్యాలతో పనిచేసే విశాలమైన యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని ఫిచ్ పేర్కొంది.
కొత్త మోడల్స్‌తో వృద్ధికి ఊతం..
గత కొన్నేళ్లుగా హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే ఆటోమొబైల్ సంస్థలు పెద్ద సంఖ్యలో కొత్త యూవీ మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఎంట్రీ కార్ల కొనుగోలుదారులతో పోల్చినప్పుడు ధరను పెద్దగా పట్టించుకోకుండా కొత్త కార్లకు అప్‌గ్రేడ్ అయ్యేవారు, అధికాదాయ వర్గాల వారు ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ, మధ్య స్థాయి యూవీల అమ్మకాలు 21 శాతం పెరగ్గా, గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం మేర పెరిగాయి. కోవిడ్–19పరమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ యూవీలకు డిమాండ్ తగ్గలేదని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది.
తగ్గుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు..
సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్ కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతూ ఉండటం వల్ల డిమాండ్, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. కమోడిటీల రేట్లు పెరిగిపోవడం, వాహన భద్రత ప్రమాణాలు కఠినతరం చేయడంతో 2018 నుంచి చూస్తే ఎంట్రీ స్థాయి కార్ల ధరలు 20–30 శాతం పెరిగాయని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విభాగంలో అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయని తెలిపింది. కార్లలో అదనంగా ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే నిబంధన ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తే తయారీ వ్యయాలు మరో 3–5 శాతం మేర పెరగవచ్చని పేర్కొంది. దీంతో ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌లో కొత్త కార్ల ఆవిష్కరణలు తగ్గవచ్చని, కొన్ని మోడల్స్‌ను నిలిపివేసే అవకాశాలున్నాయని ఫిచ్ రేటింగ్స్ వివరించింది.
దీని ఫలితంగా ఈ విభాగం వృద్ధి అవకాశాలు మరింతగా మందగిస్తాయని పేర్కొంది. ఖర్చులు పెరుగుతున్నా యూవీల అమ్మకాలు పెరుగుతుండటమనేది దేశీ కార్ల తయారీ సంస్థల లాభదాయకతకు తోడ్పాటుగా ఉండగలదని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. సియామ్ గణాంకాల ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు 6 శాతం క్షీణించగా యూవీల అమ్మకాలు 40 శాతం పెరిగి ఆ మేరకు వ్యత్యాసాన్ని భర్తీ చేశాయని, పరిశ్రమ 13 శాతం వృద్ధి నమోదు చేయడంలో తోడ్పడ్డాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment