Utility Vehicles
-
భారీగా పెరిగిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్.. గత నెలలో అమ్మకాలు ఇలా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023 మే నెలలో హోల్‌సేల్‌లో ప్యాసింజర్ వెహికిల్స్ 3,34,247 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 మే నెలతో పోలిస్తే ఇది 13.54 శాతం అధికమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. టాటా మినహా యుటిలిటీ వెహికిల్స్ 33.5 శాతం పెరిగి 1,55,184 యూనిట్లు నమోదయ్యాయి. టాటా మోటార్స్ మూడు నెలలకోసారి అమ్మకాల వివరాలను వెల్లడిస్తోంది. ద్విచక్ర వాహనాలు 17.42 శాతం అధికమై 14,71,550 యూనిట్లు విక్రయం అయ్యాయి. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఇందులో మోటార్‌సైకిల్స్ 20.63 శాతం పెరిగి 9,89,120 యూనిట్లు, స్కూటర్స్ 12.18 శాతం దూసుకెళ్లి 4,46,593 యూనిట్లకు చేరాయి. త్రీవీలర్లు 28,595 నుంచి 48,732 యూనిట్లకు ఎగశాయి. అన్ని విభాగాల్లో కలిపి తయారీ కంపెనీల నుంచి డీలర్‌షిప్‌లకు చేరిన వాహనాల సంఖ్య టాటా మోటార్స్ మినహా 15,32,861 నుంచి 18,08,686 యూనిట్లకు చేరింది. 2022 మే నెలతో పోలిస్తే గత నెలలో అన్ని వాహన విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) మరిన్ని ఇంట్రస్టింగ్ కథనాలు, బిజినెస్ వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్ -
విదేశాలకు 6.62 లక్షల కార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 6,62,891 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు ఎగుమతి అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. ప్యాసింజర్ కార్లు 10 శాతం వృద్ధితో 4,13,787 యూనిట్లు, యుటిలిటీ వాహనాలు 23 శాతం ఎగసి 2,47,493 యూనిట్లకు చేరుకున్నాయి. వ్యాన్ల ఎగుమతులు 1,853 నుంచి 1,611 యూనిట్లకు వచ్చి చేరాయి. ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో మారుతీ సుజుకీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2021–22తో పోలిస్తే ఈ కంపెనీ 8 శాతం అధికంగా 2,55,439 యూనిట్లను విదేశాలకు సరఫరా చేసింది. హ్యుండై మోటార్ ఇండియా నుంచి 18 శాతం ఎక్కువగా 1,53,019 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. కియా ఎగుమతులు 50,864 నుంచి 85,756 యూనిట్లకు ఎగశాయి. నిస్సాన్ మోటార్ ఇండియా 60,637 యూనిట్లు, రెనో ఇండియా 34,956, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 27,137, హోండా కార్స్ ఇండియా 22,710, మహీంద్రా అండ్ మహీంద్రా 10,622 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం వాహన ఎగుమతులు 2022–23లో 47,61,487 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం తగ్గుదల. -
టయోటా హైలక్స్ బుకింగ్స్ ప్రారంభం
ముంబై: వాహన తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ ప్రీమియం యుటిలిటీ వెహికిల్ హైలక్స్ బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభించింది. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్స్ స్వీకరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 2022 జనవరిలో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. సరఫరా అడ్డంకుల నేపథ్యంలో అదే ఏడాది ఫిబ్రవరిలో బుకింగ్స్‌ను నిలిపివేసింది. హైలక్స్ ధర ఎక్స్‌షోరూంలో రూ.33.99 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుపరిచారు. వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాలకైనా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హైలక్స్.. భారత మార్కెట్లో కొత్త ప్రమాణాలను సృష్టిస్తుందని విశ్వసిస్తున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్, స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు. -
యుటిలిటీ వాహనాలకు డిమాండ్
ముంబై: యుటిలిటీ వాహనాలకు (యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా అమ్ముడయ్యే కార్లలో ఇవి అధిక వాటా దక్కించుకునే ధోరణి కొనసాగవచ్చని ఫిచ్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. అధిక మార్జిన్లు ఉండే యూవీల విక్రయాలపై మరింత దృష్టి పెట్టడం ద్వారా కమోడిటీల ధరల పెరుగుదల, అదనపు భద్రత ప్రమాణాలపరమైన వ్యయాల భారాన్ని ఆటోమొబైల్ సంస్థలు కొంత మేర ఎదుర్కొనేందుకు వీలుంటుందని పేర్కొంది. మరోవైపు, ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతుండటంతో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల తయారీని ఆటోమొబైల్ సంస్థలు తగ్గించుకుంటున్నట్లు వివరించింది. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్ల విక్రయాల్లో యూవీల పరిమాణం 49 శాతం పెరిగినట్లు (అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 28 శాతం) ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్ల సంయుక్త వాటా 66 శాతం నుండి 48 శాతానికి పడిపోయింది. యూవీలకు ఆదరణ పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ఇక యూవీ కేటగిరీలో అంతర్గతంగా ఎంట్రీ, మధ్య స్థాయి వాహనాల అమ్మకాల వాటా మొత్తం కార్ల విక్రయాల్లో 38 శాతానికి చేరింది. విశిష్టమైన సామర్థ్యాలతో పనిచేసే విశాలమైన యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని ఫిచ్ పేర్కొంది. కొత్త మోడల్స్‌తో వృద్ధికి ఊతం.. గత కొన్నేళ్లుగా హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే ఆటోమొబైల్ సంస్థలు పెద్ద సంఖ్యలో కొత్త యూవీ మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఎంట్రీ కార్ల కొనుగోలుదారులతో పోల్చినప్పుడు ధరను పెద్దగా పట్టించుకోకుండా కొత్త కార్లకు అప్‌గ్రేడ్ అయ్యేవారు, అధికాదాయ వర్గాల వారు ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ, మధ్య స్థాయి యూవీల అమ్మకాలు 21 శాతం పెరగ్గా, గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం మేర పెరిగాయి. కోవిడ్–19పరమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ యూవీలకు డిమాండ్ తగ్గలేదని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తగ్గుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు.. సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్ కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతూ ఉండటం వల్ల డిమాండ్, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. కమోడిటీల రేట్లు పెరిగిపోవడం, వాహన భద్రత ప్రమాణాలు కఠినతరం చేయడంతో 2018 నుంచి చూస్తే ఎంట్రీ స్థాయి కార్ల ధరలు 20–30 శాతం పెరిగాయని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విభాగంలో అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయని తెలిపింది. కార్లలో అదనంగా ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే నిబంధన ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తే తయారీ వ్యయాలు మరో 3–5 శాతం మేర పెరగవచ్చని పేర్కొంది. దీంతో ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో కొత్త కార్ల ఆవిష్కరణలు తగ్గవచ్చని, కొన్ని మోడల్స్‌ను నిలిపివేసే అవకాశాలున్నాయని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. దీని ఫలితంగా ఈ విభాగం వృద్ధి అవకాశాలు మరింతగా మందగిస్తాయని పేర్కొంది. ఖర్చులు పెరుగుతున్నా యూవీల అమ్మకాలు పెరుగుతుండటమనేది దేశీ కార్ల తయారీ సంస్థల లాభదాయకతకు తోడ్పాటుగా ఉండగలదని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. సియామ్ గణాంకాల ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు 6 శాతం క్షీణించగా యూవీల అమ్మకాలు 40 శాతం పెరిగి ఆ మేరకు వ్యత్యాసాన్ని భర్తీ చేశాయని, పరిశ్రమ 13 శాతం వృద్ధి నమోదు చేయడంలో తోడ్పడ్డాయని పేర్కొంది. -
ఎస్‌యూవీలు.. తగ్గేదేలే!
గత కొన్నేళ్లుగా దేశీ ఆటో రంగంలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. కార్ల విభాగంలో కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్‌యూవీలు) అమ్మకాలు యమ స్పీడ్‌గా వృద్ధి చెందుతున్నాయి. వెరసి అత్యధిక శాతం కస్టమర్లు ఆసక్తి చూపే చిన్న ప్రీమియం కార్ల విక్రయాలను ఇవి వెనక్కి నెడుతున్నాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి 11 నెలల్లో మొత్తం అమ్మకాలలో చిన్న ఎస్‌యూవీల వాటా 22 శాతానికి ఎగసింది. ఇదే సమయంలో హ్యాచ్‌బ్యాక్ కార్ల వాటా 19 శాతంగా నమోదైంది. ఇతర వివరాలు చూద్దాం... దేశీయంగా ప్రయాణికుల(ప్యాసింజర్) వాహనాల విభాగంలో ఇటీవల కొన్నేళ్లుగా ఎస్‌యూవీలు యమ స్పీడును ప్రదర్శిస్తున్నాయి. అమ్మకాలలో ప్రీమియం చిన్న కార్లను దాటి వేగంగా పరుగెడుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది తొలి 11 నెలల్లో వీటి వాటా 22 శాతానికి చేరింది. వెరసి ఎప్పటినుంచో అమ్మకాలలో మార్కెట్ లీడర్లుగా నిలుస్తున్న హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాలను వెనక్కి నెట్టాయి. ఏప్రిల్–ఫిబ్రవరిలో వీటి వాటా 19%కి పరిమితంకావడమే ఇందుకు నిదర్శనం. ఈ బాటలో దేశీయంగా విక్రయమవుతున్న ప్రతీ రెండు కార్లలో నూ ఒకటి ఎస్‌యూవీయే ఉంటున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. వెరసి మార్చితో ముగియనున్న ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడవుతున్న విభాగంగా ఎంట్రీలెవెల్ ఎస్‌యూవీలు నిలవనున్నట్లు తెలియజేశారు! వివిధ మోడళ్ల ఎఫెక్ట్ కొన్నేళ్లుగా రూ. 10 లక్షల ధరలలోపు కొత్త యూఎస్వీ మోడళ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. వీటికి సులభమైన ఫైనాన్స్ సౌకర్యాలు జత కలుస్తున్నాయి. మరోపక్క సరఫరా సమస్యలతో హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల తయారీ నీరసించడం ఎస్‌యూవీలకు డిమాండును పెంచుతోంది. పరి శ్రమ వర్గాల అంచనాల ప్రకారం మారుతీ సుజుకీ బ్రెజ్జా, టాటా నెక్సాన్, పంచ్, రేనాల్ట్ కైగర్, హ్యుందాయ్ వెన్యూ మోడళ్లు ఉమ్మడిగా తొలి 11 నెలల్లో 6,00,000 వరకూ విక్రయమయ్యాయి. ఇదే కాలంలో వివిధ కంపెనీల హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు 5,40,000 అమ్ముడైనట్లు అంచనా. ప్రారంభ శ్రేణి ఎస్‌యూవీల స్పీడుకు ప్రధానంగా మూడు కారణాలున్నట్లు మారుతీ సుజుకీ సీనియర్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ చెబుతున్నారు. పలు కొత్త మోడళ్లు విడుదలకావడం, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్ ధరలతో పోలిక వంటి అంశాలను ప్రస్తావించారు. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో బ్రెజ్జా అత్యధికంగా విక్రయమవుతున్న మోడల్‌గా పేర్కొన్నారు. జాబితాలో కంపెనీలు.. హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలలో సగం వాటా ఎస్యూవీలదేకాగా.. టాటా మోటా ర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా , జీప్, కియా, ఎంజీ మోటార్స్, నిస్సాన్ ఎస్‌యూవీలను రూపొందించడంలో ముందుంటున్నాయి. గత మూడు, నాలుగేళ్లలోనే 12 రకాల కొత్త యూఎస్‌వీలు మార్కెట్లలోకి ప్రవేశించాయి. మొత్తం ఎస్‌యూవీల మార్కెట్లో ఎంట్రీలెవెల్ ఎస్‌యూవీల వాటా 60 శాతంకావడం గమనించదగ్గ అంశం! -
వారెవ్వా కియా! రికార్డు సృష్టించిన అనంత ప్లాంట్.. తక్కువ వ్యవధిలోనే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా కొత్త మైలురాయిని అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంట్ నుంచి 5 లక్షలకుపైగా యూనిట్లను భారత్‌తోపాటు విదేశాలకు సరఫరా చేసింది. దేశీయంగా 4 లక్షల యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది. లక్షలకుపైగా కార్లను 91 దేశాలకు ఎగుమతి చేసింది. 2019 సెపె్టంబర్లో అనంతపూర్ ప్లాంట్ నుంచి సెల్టోస్ కార్ల ఎగుమతి ప్రారంభమైంది. భారత్ నుంచి విదేశాలకు యుటిలిటీ వాహనాలను అధికంగా సరఫరా చేస్తున్న కంపెనీల్లో ఒకటైన కియా ఇండియా.. గతేడాది ఎగుమతుల్లో 25 శాతంపైగా వాటాను దక్కించుకుంది. ‘అయిదు లక్షల యూనిట్లు అనేది పెద్ద సంఖ్య. 29 నెలల్లోపే ఈ మైలురాయిని చేరుకున్నందుకు గర్విస్తున్నాం. భారత్‌లో మా ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుండీ అద్భుతమైన ఉత్పత్తులు, సేవల ద్వారా కస్టమర్లకు గొప్ప విలువను అందించడంపై దృష్టి సారించాం. నాలుగు లక్షల భారతీయ కుటుంబాలలో భాగమయ్యాం. వినియోగదార్లు మాపై చూపిన అభిమానానికి చాలా కృతజ్ఞతలు. కొత్త కారు కరెన్స్‌తో తదుపరి మైలురాళ్లను మరింత వేగంగా చేరుకోగలం. కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించడం ద్వారా దేశంలో వృద్ధి ప్రయాణంలో ఈ కారు మార్గనిర్దేశం చేస్తుంది’ అని కియా ఇండియా ఎండీ, సీఈవో టే జిన్ పార్క్ ఈ సందర్భంగా తెలిపారు. -
పెద్ద ఎస్‌యూవీలదే భవిష్యత్..!
ముంబై: నాలుగు మీటర్లలోపు ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్యూవీ), కాంపాక్ట్ ఎస్‌యూవీల మార్కెట్ ఇటీవలికాలంలో శరవేగంగా అభివృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇతర కార్ల పరిశ్రమ 3 శాతం వృద్ధిరేటును నమోదుచేయగా, ఎస్యూవీ విభాగం ఏకంగా 11 శాతం చక్రగతి వృద్ధిరేటును నమోదుచేసినట్లు వెల్లడించిన భారత ఆటోమొబైల్ తయారీదార్ల సంఘం (సియామ్).. 2017–18 కాలంలో ఈ విభాగం అమ్మకాలు 9,22,000 యూనిట్లుగా నమోదై, అంతకుముందు ఏడాదితో పోల్చితే 21 శాతం వృద్ధిచెందినట్లు తెలిపింది. ఇంతటి వేగంగా దూసుకుపోతున్న మార్కెట్‌ను ఇక నుంచి పెద్ద ఎస్‌యూవీలు సొంతం చేసుకోనున్నట్లు మార్కెట్ పరిశోధన సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ అంచనా వేసింది. 2019 తొలి అర్ధభాగంలో విడుదలకానున్న పలు కంపెనీల ఎస్‌యూవీల సమాచారం ఆధారంగా తమ అంచనాను వెల్లడించినట్లు తెలియజేసిన ఈ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ పునీత్ గుప్తా.. 2021 నాటికి కాంపాక్ట్ ఎస్‌యూవీల కంటే నాలుగు మీటర్లు మించిన బిగ్ ఎస్‌యూవీల అమ్మకాలు 35 శాతం వృద్ధిరేటును సాధించవచ్చని అంచనావేస్తున్నట్లు వెల్లడించారు. సులభంగా ఫైనాన్స్ సాకర్యం అందుబాటులో ఉండడం, ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతుండటం ఆధారంగా రూ.12 లక్షలు–రూ.15 లక్షల ఎస్‌యూవీల మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందనుందని అంచనావేశారు. వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధంగా ఉన్న టాటా మిడ్–సైజ్ ప్రీమియం హరియర్, మహీంద్రా ఎస్201, కియా ఎస్పీ, ఎమ్జీ మోటార్స్ బోజూన్ 530, హోండా హెచ్ఆర్–వి ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. -
మహీంద్రా ఎస్‌యూవీలన్నీ ఇక ఎలక్ట్రిక్!
యుటిలిటీ వెహికిల్స్ (యూవీ) విభాగంలో వేగంగా ఎదుగుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం)... ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎలక్ట్రిక్ విభాగంలో రూ.3,500–4,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధమయింది. బెంగళూరులోని పరిశోధన–అభివృద్ధి కేంద్రంలో 200 మందికిపైగా ఇంజనీర్ల పర్యవేక్షణలో ఎలక్ట్రిక్ వాహనాలపై పరిశోధనలు సైతం చేస్తోంది. మంగళవారం కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీని ముంబైలో విడుదల చేసిన సందర్భంగా సంస్థ ఎండీ పవన్ గోయెంకా మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ విభాగంలో ఈ2వో ప్లస్, ఈ– వెరిటో, ఈ సుప్రో వాహనాలున్నాయి. ఏడాదిలో కేయూవీ 100 వాహనాన్ని కూడా విడుదల చేస్తాం. ఆ తర్వాత స్కార్పియో, బొలెరొ, టీయూవీ 300, ఎక్స్‌యూవీ 500లను ఎలక్ట్రిక్ పట్టాలెక్కిస్తాం. దశల వారీగా మహీంద్రా ఎస్యూవీ వాహనాలన్నిటికీ ఎలక్ట్రిక్ వెర్షన్లు తెస్తాం’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం నెలకు 200 యూనిట్లుగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీని 5 వేల యూనిట్లకు పెంచుతామని చెప్పారాయన. కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్,మార్కెటింగ్) విజయ్ రామ్ నక్రా, ప్రొడక్ట్ డెవలప్మెంట్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆరవపల్లి కూడా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మహీంద్రా ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ రాజన్ వధేరా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలివీ... కేయూవీ 100ను విడుదల చేసిన 21 నెలల్లోనే దాని అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఎందుకు? నిజమే! గతేడాది జనవరిలోనే కేయూవీ 100 వాహనాన్ని విడుదల చేశాం. కస్టమర్లు కొత్త ఫీచర్లు కోరుకోవటంతో దీనికి 40 ఫీచర్లను జత చేశాం. కేయూవీ 100 ఎన్ఎక్స్టీ పేరిట మార్కెట్లోకి తెచ్చాం. ఇప్పటికే దేశంలో కేయూవీ 100కు 60 వేల మంది కస్టమర్లున్నారు. వీరిలో 50% మంది తొలిసారి కారును కొనుగోలు చేసినవారే. వీరిలో 15% మంది మహిళలు సైతం ఉన్నారు. ఇంకా కొత్త వాహనాలేమైనా తెస్తున్నారా? కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీని మహారాష్ట్రలోని చకన్ ప్లాంట్‌లో తయారు చేశాం. ప్రస్తుతం ఈ ప్లాంటులో కే 2, కే 2 ప్లస్, కే 4 ప్లస్, కే 6 ప్లస్, కే 8 వేరియంట్స్ ఉన్నాయి. వీటి ధరలు (ముంబై ఎక్స్‌షోరూమ్) పెట్రోల్ ఇంజిన్‌లో రూ.4.39 లక్షల నుంచి 6.40 లక్షల మధ్య, డీజిల్ ఇంజిన్‌లో రూ.5.39 లక్షల నుంచి రూ.7.33 లక్షల మధ్య ఉన్నాయి. నెలకు 4 వేల వాహనాలను విక్రయించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఏడాదిలో మరో 4 వాహనాలను విడుదల చేస్తాం. ఇందులో ఎస్యూవీ ఎస్201, ఎంపీవీ యూ321 వాహనాలుంటాయి. మీ విక్రయాల్లో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత? ఈ ఏడాది సెప్టెంబర్ అమ్మకాల్లో మేం 16% వృద్ధిని నమోదు చేశాం. 23% వృద్ధితో 25,327 ప్యాసింజర్ వాహనాలను, 19% వృద్ధితో 19,021 కమర్షియల్ వాహనాలను విక్రయించాం. ఎగుమతులు మాత్రం 11 శాతం క్షీణించాయి. మా దేశీ విక్రయాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చాలా ప్రధానం. ఈ రెండు రాష్ట్రాల వాటా మొత్తం అమ్మకాల్లో 10 శాతం వరకూ ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాలు కీలకం. పెట్రోల్ ఇంజిన్‌లో మీ సామర్థ్యం పెంచుకుంటున్నారా? ప్రస్తుతం మహీంద్రాకు 1.2 లీటర్ల కంటే పెద్ద పెట్రోల్ ఇంజిన్ లేదు. అందుకే శాంగ్యాంగ్ భాగస్వామ్యంతో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఏడాదిలో దీన్ని మార్కెట్లోకి తెస్తాం. తర్వాత 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసి.. జీతో వంటి తేలికపాటి వాణిజ్య వాహనాలకు (ఎల్సీవీ) అమరుస్తాం. ఆ తర్వాతే డ్రైవర్ లేని ట్రాక్టర్‌పై పరిశోధనలు జరుపుతాం. డ్రైవర్ లేని కారును తయారు చేసే ఉద్దేశమైతే ప్రస్తుతానికేదీ లేదు. హిమాచల్, హరియాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు, బిగ్ బాస్కెట్, ఇతర ఈ–కామర్స్ సంస్థల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఆర్డర్లు వచ్చాయి. కమర్షియల్ వాహనాలు ఎలక్ట్రిక్ వైపు మళ్లటం కాసింత కష్టమే. కానీ, ప్యాసింజర్ వాహనాలు త్వరలోనే ఎలక్ట్రిక్ వైపు మళ్లుతాయి. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల మీదే ఎక్కువ దృష్టిసారించింది. – ముంబై నుంచి శ్రీనాథ్ అడెపు -
మహీంద్రా నుంచి 2 కొత్త ఎస్‌యూవీలు
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వచ్చే ఏడాది మూడు కొత్త వాహనాలను అందించనున్నది. వీటిలో రెండు స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్స్, ఒకటి తేలిక రకం వాణిజ్య వాహనం ఉంటాయని కంపెనీ ఈడీ పవన్ గోయెంకా చెప్పారు. శాంగ్‌యాంగ్‌తో కలిసి కొత్త సిరీస్ ఇంజిన్లను రూపొందిస్తామని చెప్పారు. ఇక టూవీలర్ సెగ్మెంట్ విషయానికొస్తే, పీజీయట్ మోటార్ సైకిల్స్‌లో 51 శాతం వాటాను రూ.215 కోట్లకు కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఈ కంపెనీ ఉత్పత్తులను భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా విక్రయించనున్నామని చెప్పారు. అయితే ఇవి ఖరీదైనవి కావడంతో వీటిని ఎప్పుడు భారత్‌లోకి తెచ్చేది చెప్పలేమని పేర్కొన్నారు. ఈ ఫ్రెంచ్ కంపెనీ తయారీ వనరులను మహీంద్రా 2వీలర్స్ కంపెనీకి వినియోగించుకుంటామని చెప్పారు. మొదటగా మోజో మోటార్‌సైకిల్‌కు ఉపయోగించుకుంటామని, ఇలా తయారు చేసిన మోజోను ఆర్నెళ్లలో భారత్‌లో, ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో అందిస్తామని తెలిపారు. గెన్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే ఏడాది అమెరికా, యూరప్ మార్కెట్లలోకి ప్రవేశపెడతామని చెప్పారు. పీజియట్ మోటార్‌సైకిల్స్ కంపెనీని 2-3 ఏళ్లలో బ్రేక్ ఈవెన్‌కు తీసుకురాగలిగితే సంతోషమేనని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో మార్కెట్ పరిస్థితులు అనిశ్చితిగా ఉన్నాయని, ఏదైనా జరగరానిది జరిగితే క్షీణపథంలోకి జారిపోతామని పేర్కొన్నారు. -
మహీంద్రా.. రెక్స్టన్ ఆర్ఎక్స్6
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా సోమవారమిక్కడ భారత మార్కెట్లో సాంగ్యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్6 మోడల్‌ను ఆవిష్కరించింది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో విలాసవంతమైన ఫీచర్లతో ఈ ఖరీదైన వాహనాన్ని రూపొందించింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.20.11 లక్షలు. ముందువైపు, ఇరు పక్కల కూడా ఎయిర్‌బ్యాగ్స్‌ను ఉంచారు. మలుపుల్లో, అలాగే కొండ ప్రాంతాల్లో వాహనం జారకుండా స్థిరంగా ఉండేలా వ్యవస్థ ఉంది. ప్రీమియం లెదర్‌తో ఇంటీరియన్‌ను తీర్చిదిద్దారు. టిల్ట్, ఓపెన్ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్‌ను అమర్చారు. నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఇప్పటికే రెక్స్టన్ నుంచి ఆటో ట్రాన్స్‌మిషన్‌తో ఆర్ఎక్స్7 (రూ.21.28 లక్షలు), మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఆర్ఎక్స్5 (రూ.19 లక్షలు) మోడళ్లున్నాయి. ఈ రెండు మోడళ్లలో లేని 17 రకాల ఫీచర్లను ఆర్ఎక్స్6లో పొందుపరిచారు. మరో ఆరు ఇంజిన్లపై.. సాంగ్యాంగ్తో కలిసి ఆరు ఇంజిన్ల తయారీలో నిమగ్నమైనట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ విభాగం సేల్స్ చీఫ్ అరుణ్ మల్హోత్రా ఈ సందర్భంగా తెలిపారు. వీటిని రెండు కంపెనీలూ వినియోగిస్తాయని, మూడేళ్లలో సిద్ధమవుతాయని చెప్పారు. హై ఎండ్, లగ్జరీ ఫీచర్లతో మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్‌ను వినియోగదారులు కోరుతున్నందునే ఆర్ఎక్స్6ను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. హై స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల పరిమాణం దేశంలో 2013-14లో 23,665 యూనిట్లు నమోదైంది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 26,208 యూనిట్లు. ఈ విభాగంలో మహీంద్రా రెండో స్థానంలో ఉంది.