హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 6,62,891 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు ఎగుమతి అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. ప్యాసింజర్ కార్లు 10 శాతం వృద్ధితో 4,13,787 యూనిట్లు, యుటిలిటీ వాహనాలు 23 శాతం ఎగసి 2,47,493 యూనిట్లకు చేరుకున్నాయి.
వ్యాన్ల ఎగుమతులు 1,853 నుంచి 1,611 యూనిట్లకు వచ్చి చేరాయి. ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో మారుతీ సుజుకీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2021–22తో పోలిస్తే ఈ కంపెనీ 8 శాతం అధికంగా 2,55,439 యూనిట్లను విదేశాలకు సరఫరా చేసింది. హ్యుండై మోటార్ ఇండియా నుంచి 18 శాతం ఎక్కువగా 1,53,019 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. కియా ఎగుమతులు 50,864 నుంచి 85,756 యూనిట్లకు ఎగశాయి.
నిస్సాన్ మోటార్ ఇండియా 60,637 యూనిట్లు, రెనో ఇండియా 34,956, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 27,137, హోండా కార్స్ ఇండియా 22,710, మహీంద్రా అండ్ మహీంద్రా 10,622 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం వాహన ఎగుమతులు 2022–23లో 47,61,487 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం తగ్గుదల.
Comments
Please login to add a commentAdd a comment