యుటిలిటీ వెహికిల్స్ (యూవీ) విభాగంలో వేగంగా ఎదుగుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం)... ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎలక్ట్రిక్ విభాగంలో రూ.3,500–4,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధమయింది. బెంగళూరులోని పరిశోధన–అభివృద్ధి కేంద్రంలో 200 మందికిపైగా ఇంజనీర్ల పర్యవేక్షణలో ఎలక్ట్రిక్ వాహనాలపై పరిశోధనలు సైతం చేస్తోంది.
మంగళవారం కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీని ముంబైలో విడుదల చేసిన సందర్భంగా సంస్థ ఎండీ పవన్ గోయెంకా మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ విభాగంలో ఈ2వో ప్లస్, ఈ– వెరిటో, ఈ సుప్రో వాహనాలున్నాయి. ఏడాదిలో కేయూవీ 100 వాహనాన్ని కూడా విడుదల చేస్తాం. ఆ తర్వాత స్కార్పియో, బొలెరొ, టీయూవీ 300, ఎక్స్‌యూవీ 500లను ఎలక్ట్రిక్ పట్టాలెక్కిస్తాం. దశల వారీగా మహీంద్రా ఎస్‌యూవీ వాహనాలన్నిటికీ ఎలక్ట్రిక్ వెర్షన్లు తెస్తాం’’ అని ఆయన వివరించారు.
ప్రస్తుతం నెలకు 200 యూనిట్లుగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీని 5 వేల యూనిట్లకు పెంచుతామని చెప్పారాయన. కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్,మార్కెటింగ్) విజయ్ రామ్ నక్రా, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆరవపల్లి కూడా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మహీంద్రా ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ రాజన్ వధేరా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలివీ...
కేయూవీ 100ను విడుదల చేసిన 21 నెలల్లోనే దాని అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఎందుకు?
నిజమే! గతేడాది జనవరిలోనే కేయూవీ 100 వాహనాన్ని విడుదల చేశాం. కస్టమర్లు కొత్త ఫీచర్లు కోరుకోవటంతో దీనికి 40 ఫీచర్లను జత చేశాం. కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీ పేరిట మార్కెట్లోకి తెచ్చాం. ఇప్పటికే దేశంలో కేయూవీ 100కు 60 వేల మంది కస్టమర్లున్నారు. వీరిలో 50% మంది తొలిసారి కారును కొనుగోలు చేసినవారే. వీరిలో 15% మంది మహిళలు సైతం ఉన్నారు.
ఇంకా కొత్త వాహనాలేమైనా తెస్తున్నారా?
కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీని మహారాష్ట్రలోని చకన్ ప్లాంట్‌లో తయారు చేశాం. ప్రస్తుతం ఈ ప్లాంటులో కే 2, కే 2 ప్లస్, కే 4 ప్లస్, కే 6 ప్లస్, కే 8 వేరియంట్స్ ఉన్నాయి. వీటి ధరలు (ముంబై ఎక్స్‌షోరూమ్) పెట్రోల్ ఇంజిన్‌లో రూ.4.39 లక్షల నుంచి 6.40 లక్షల మధ్య, డీజిల్ ఇంజిన్‌లో రూ.5.39 లక్షల నుంచి రూ.7.33 లక్షల మధ్య ఉన్నాయి. నెలకు 4 వేల వాహనాలను విక్రయించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఏడాదిలో మరో 4 వాహనాలను విడుదల చేస్తాం. ఇందులో ఎస్‌యూవీ ఎస్201, ఎంపీవీ యూ321 వాహనాలుంటాయి.
మీ విక్రయాల్లో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత?
ఈ ఏడాది సెప్టెంబర్ అమ్మకాల్లో మేం 16% వృద్ధిని నమోదు చేశాం. 23% వృద్ధితో 25,327 ప్యాసింజర్ వాహనాలను, 19% వృద్ధితో 19,021 కమర్షియల్ వాహనాలను విక్రయించాం. ఎగుమతులు మాత్రం 11 శాతం క్షీణించాయి. మా దేశీ విక్రయాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చాలా ప్రధానం. ఈ రెండు రాష్ట్రాల వాటా మొత్తం అమ్మకాల్లో 10 శాతం వరకూ ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాలు కీలకం.
పెట్రోల్ ఇంజిన్‌లో మీ సామర్థ్యం పెంచుకుంటున్నారా?
ప్రస్తుతం మహీంద్రాకు 1.2 లీటర్ల కంటే పెద్ద పెట్రోల్ ఇంజిన్ లేదు. అందుకే శాంగ్‌యాంగ్ భాగస్వామ్యంతో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఏడాదిలో దీన్ని మార్కెట్లోకి తెస్తాం. తర్వాత 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసి.. జీతో వంటి తేలికపాటి వాణిజ్య వాహనాలకు (ఎల్‌సీవీ) అమరుస్తాం. ఆ తర్వాతే డ్రైవర్ లేని ట్రాక్టర్‌పై పరిశోధనలు జరుపుతాం.
డ్రైవర్ లేని కారును తయారు చేసే ఉద్దేశమైతే ప్రస్తుతానికేదీ లేదు. హిమాచల్, హరియాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు, బిగ్ బాస్కెట్, ఇతర ఈ–కామర్స్ సంస్థల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఆర్డర్లు వచ్చాయి. కమర్షియల్ వాహనాలు ఎలక్ట్రిక్ వైపు మళ్లటం కాసింత కష్టమే. కానీ, ప్యాసింజర్ వాహనాలు త్వరలోనే ఎలక్ట్రిక్ వైపు మళ్లుతాయి. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల మీదే ఎక్కువ దృష్టిసారించింది.
– ముంబై నుంచి శ్రీనాథ్ అడెపు
Comments
Please login to add a commentAdd a comment