న్యూఢిల్లీ: భారత్ వృద్ధి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి మెరుగుపడుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తయారీ రంగంలో ఉత్పత్తి మెరుగుదల, మౌలిక సదుపాయాల వ్యయంలో స్థిరమైన పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో మార్చిలో వేసిన తొలి 6 శాతం అంచనాలను తాజాగా 6.3 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ఈ అంచనా ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటు అని కూడా పేర్కొంది. ఫిచ్ గ్లోబల్ ఎకనమిక్ తాజా అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
- 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో 6.5 శాతం చొప్పున వృద్ధి నమోదుకావచ్చు.
- బ్యాంకింగ్ భారీ రుణ వృద్ధి, మౌలిక సదుపాయాల వ్యయం నుంచి ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు పొందుతోంది.
- తయారీ రంగంలో రికవరీతోపాటు నిర్మాణ, వ్యవసాయ రంగాలు కూడా పురోగతిలో ఉన్నాయి. ఆయా అంశాలు దేశీయ డిమాండ్‌ను పెంచుతున్నాయి.
- ద్రవ్యోల్బణం భయాలు తొలగుతున్నాయి. తగిన వర్షపాతం అంచనాలు ఉన్నాయి. 2023లో ఆర్‌బీఐ రెపో రేటు (ప్రస్తుతం 6.50 శాతం) యథాతథంలో కొనసాగవచ్చు.
ప్రపంచ వృద్ధి అంచనా పెంపు
కాగా ఊహించినదానికన్నా పరిస్థితులు మెరుగ్గా ఉన్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను సైతం 2.4 శాతానికి పెంచుతున్నట్లు నివేదిక పేర్కొంది. మార్చిలో ఈ అంచనా 2 శాతం.
Comments
Please login to add a commentAdd a comment