భారత్‌కు సావరిన్‌ రేటింగ్‌ కట్‌ | Moodys downgrades India is sovereign rating to Baa3 | Sakshi
Sakshi News home page

భారత్‌కు సావరిన్‌ రేటింగ్‌ కట్‌

Published Tue, Jun 2 2020 5:04 AM | Last Updated on Tue, Jun 2 2020 8:10 AM

Moodys downgrades India is sovereign rating to Baa3 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌కు ఇస్తున్న సార్వభౌమ స్థాయి (సావరిన్‌ రేటింగ్‌)ని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తగ్గించింది. ఇప్పటి వరకూ ఈ రేటింగ్‌ ‘బీఏఏ2’ అయితే దీనిని ‘బీఏఏ3’కి తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇక భారత్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను కూడా నెగటివ్‌లోనే కొనసాగించనున్నట్లు పేర్కొంది.  

డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణాలు...
► కోవిడ్‌–19 మహమ్మారి భారత్‌ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసింది. అయితే రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌కు ఇది ఒక్కటే కారణం కాదు.  

► తీసుకుంటున్న పలు విధాన నిర్ణయాల అమల్లో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి.

► ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధిరేటు  సుదీర్ఘకాలం అట్టడుగునే కొనసాగనుంది.

► ఇక ఆర్థిక వ్యవస్థకు  ద్రవ్యపరమైన ఒత్తిడులు కూడా ఎదురుకానున్నాయి. తక్కువ ఆదాయం–వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో ఇందుకు సంబంధించి నికర వ్యత్యాసం... ద్రవ్యలోటు మరింతగా కట్టుతప్పే అవకాశం ఉంది.

► ఫైనాన్షియల్‌ సెక్టార్‌లో ఒత్తిడి నెలకొనే అవకాశాలు సుస్పష్టం.  


2020–21లో జీడీపీ 4 శాతం క్షీణత
కోవిడ్‌–19 సృష్టించిన నష్టంసహా పలు కారణాల వల్ల 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ 4 శాతం క్షీణ రేటును నమోదుచేసుకునే అవకాశం ఉందని మూడీస్‌ పేర్కొంది. నిజానికి కోవిడ్‌ మహమ్మారి దాడికి ముందే భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన విషయాన్ని కూడా మూడీస్‌ ప్రస్తావించింది.  

పెరగనున్న రుణ భారం: దీర్ఘకాలం వృద్ధి రేటు దిగువస్థాయిలోనే కొనసాగే పరిస్థితులు ఉండడం వల్ల రుణ భారం తగ్గించుకోవడం ప్రభుత్వానికి కొంత క్లిష్టంగా మారే వీలుంది. కరోనాకు ముందు 2019–20లో భారత్‌ ప్రభుత్వం రుణ నిష్పత్తి జీడీపీలో 72% ఉంటే, ఇది ఈ ఆర్థిక సంవత్సరం 84%కి పెరిగే అవకాశం ఉంది. అయితే రుణ భారాన్ని తగ్గించుకోవడం స్వల్పకాలంలో సాధ్యమయ్యే అవకాశంలేదు. బీఏఏ– రేటెడ్‌ దేశాలతో పోల్చితే భారత్‌పై అధిక వడ్డీరేటు భారం ఉంది. బీఏఏ స్టేబుల్‌ దేశాలతో పోల్చితే మూడు రెట్లు ఈ భారం అధికంగా ఉందని మూడీస్‌ పేర్కొంది. ప్రైవేటు రంగంలో పొదుపులు, ప్రభుత్వ డెట్‌ మెచ్యూరిటీలు దీర్ఘకాలంలో ఉండడం రుణ భారం, వడ్డీ చెల్లింపుల విషయం లో కొంత సానుకూల విషయం.

ఏమిటి ఈ రేటింగ్‌..?

ఒక దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థలు రేటింగ్‌ ఇస్తుంటాయి. ఎస్‌అండ్‌పీ, ఫిచ్, మూడీస్‌ ఇందులో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఆయా  దిగ్గజ సంస్థలు ఇచ్చే రేటింగ్‌ ప్రాతిపదికనే ఒక దేశం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుంది. దేశ సీనియర్‌ ఆర్థిక శాఖ అధికారులు సైతం దేశానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులను అధికారికంగా రేటింగ్‌ సంస్థల ప్రతినిధులకు వివరించి, రేటింగ్‌ పెంచవలసినదిగా కోరతారంటే, ఆయా సంస్థలు ఇచ్చే సావరిన్‌ రేటింగ్‌ ఒక దేశం పెట్టుబడులను ఆకర్షించడంలో ఎంతగా దోహదపడుతుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం మూడీస్‌ ఇచ్చిన రేటింగ్‌ ‘బీఏఏ3’ నెగటివ్‌ అవుట్‌లుక్‌ కూడా ఇప్పటికీ ‘ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌’ పరిధిలోకే వస్తుందన్న విషయం గమనార్హం. అయితే ‘జంక్‌’ గ్రేడ్‌కు ఇది ఒక మెట్టు ఎక్కువ.   మిగిలిన రెండు సంస్థలు ప్రస్తుతం భారత్‌కు మూడీస్‌ ఇస్తున్న రేటింగ్‌ ‘బీఏఏ3 నెగటివ్‌’కు సరిసమానమైనవే కావడం గమనార్హం. 2017, నవంబర్‌లో మూడీస్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేసినా, అటు తర్వాత రెండు దఫాల్లో  క్రమంగా తగ్గిస్తూ వచ్చింది.

కరెన్సీకీ కోత
భారత ప్రభుత్వ ఫారిన్‌ కరెన్సీ అండ్‌ లోకల్‌ కరెన్సీ దీర్ఘకాలిక జారీ రేటింగ్స్‌ను కూడా మూడీస్‌ ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి తగ్గించింది. అలాగే భారత్‌ లోకల్‌ కరెన్సీ సీనియర్‌ అన్‌సెక్యూర్డ్‌ రేటింగ్స్‌నూ  ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి  కుదించింది. ఇక షార్ట్‌టర్మ్‌ లోకల్‌ కరెన్సీ రేటింగ్‌ను ‘పీ–2 నుంచి పీ–3’కి తగ్గించింది. వీటికి సంబంధించి అవుట్‌లుక్‌ను నెగటివ్‌గా పేర్కొంది.  

ఊహించిందే...
భారత్‌కు సంబంధించి ఫిచ్, ఎస్‌అండ్‌పీలు బీఏఏ3 నెగటివ్‌కు సరిసమానమైన రేటింగ్స్‌ కొనసాగిస్తున్నందువల్ల మూడీస్‌ కూడా ఈ మేరకు సర్దుబాటు చేస్తుందని మార్కెట్‌ మొదటి నుంచీ ఊహిస్తూ వస్తోంది. అయితే ఈ రేటింగ్‌ కూడా భారత్‌కు ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ హోదానే ఇస్తోంది. దీనివల్ల బాండ్, రూపాయి మార్కెట్‌లో భారీ మార్పు ఏదీ ఉండబోదని మేము భావిస్తున్నాం.  

– కే. హరిహర్, ట్రెజరర్, ఫస్ట్‌రాండ్‌ బ్యాంక్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement