India Ratings Report
-
ఇక బ్యాంకుల బాదుడు షురూ?.. భారం కానున్న లోన్ ఈఎంఐలు
ఇదిలాఉండగా, ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణ సమీకరణ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్) మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ ఆధారిత రేటును బ్యాంకులు వ్యవస్థపై 100 నుంచి 150 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) బదలాయించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. ఇదే జరిగితే వాహన, వ్యక్తిగత, ఆటో, వాణిజ్య రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. గత నెల మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపది విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. వచ్చే నెల్లో జరిగే సమావేశాల్లోనూ పావుశాతం రేటు పెంపు ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం ఎగువనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రుణ రేట్ల పెరుగుదల నేపథ్యంలో గడచిన ఏడాది కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తంగా డిపాజిట్ రేట్లు కూడా 1.5 శాతం నుంచి 2 శాతం పెరిగాయి. వ్యవస్థలో డిపాజిట్లు కూడా 75 బేసిస్ పాయింట్లు పెరిగాయి. -
ఎకానమీకి కరెంట్ అకౌంట్ సవాళ్లు!
ముంబై: భారత్ ఎకానమీకి కరెంట్ అకౌంట్ కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనావేస్తోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కరెంట్ అకౌంట్లో తీవ్ర లోటు (క్యాడ్) నమోదుకావచ్చని, ఇది ఏకంగా 36 నెలల గరిష్ట స్థాయిలో 3.4 శాతంగా (స్థూల దేశీయోత్పత్తి-జీడీపీ విలువలో) ఉండే వీలుందని తన తాజా నివేదికలో అంచనావేసింది. విలువలో ఇది 28.4 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో కరెంట్ అకౌంట్లో లోటులేకపోగా 0.9 శాతం మిగులు (6.6 బిలియన్ డాలర్లు) నెలకొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి మార్చి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు 1.5 శాతం (13.4 బిలియన్ డాలర్లు). అయితే తదుపరి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఇది ఏకంగా 3.4 శాతానికి చేరుతుందన్న అంచనాలు నెలకొనడం గమనార్హం. ఇప్పటికే ఇక్రా హెచ్చరికలు... భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) సీఏడీ– క్యాడ్ సవాళ్లు తప్పవని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఇప్పటికే వెలువరించిన నివేదికలో అంచనావేసింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ లోటు అదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 5 శాతానికి చేరే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. అదే విధంగా 2022-23లో 3.5 శాతంగా (120 బిలియన్ డాలర్లు) ఉండే వీలుందని అంచనావేసింది. దేశంనుంచి ఎగుమతులు తగ్గుతుండడం, దిగుమతుల పెరుగుదల, దీనితో భారీగా పెరగనున్న వాణిజ్యలోటు (ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) వంటి అంశాలు క్యాడ్ ఆందోళనకు కారణమని ఇక్రా విశ్లేషించింది. జూలై, ఆగస్టు నెలల్లో దేశంలోకి భారీ దిగుమతులు జరగ్గా, ఎగుమతులు నామమాత్రపు వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు భారీగా పెరిగిపోతోంది. ఫారెక్స్ దన్ను... అయితే దేశానికి ప్రస్తుతం ఫారెక్స్ విలువ దన్ను పటిష్టంగా ఉంది. 2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. భారత్ వద్ద ప్రస్తుతం (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకోడానికి దోహదపడతాయి. కరెంట్ అకౌంట్... అంటే! ఒక నిర్దిష్ట కాలంల ఒక దేశంలోకి వచ్చీ-దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
చౌక ఇళ్ల రుణ విభాగంపై ప్రభావం
ముంబై: అందుబాటు ధరల్లోని (అఫర్డబుల్) ఇళ్లకు గృహ రుణాలను అందించే కంపెనీలపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణ రంగ వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. ఇది అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించేందుకు దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. రూ.25 లక్షలు, అంతకంటే దిగువ బడ్జెట్ ఇళ్లను అఫర్డబుల్‌గా చెబుతారు. ఆర్థిక అనిశ్చితుల ప్రభావం ఈ విభాగంపై ఎక్కువగా ఉండదని లోగడ నిరూపితమైందంటూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఈ విభాగం వేగంగా పురోగతి సాధించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో వృద్ధిని.. అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి అధిగమించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ విభాగంలో తొలుత కొంత జోరు కనిపించినప్పుటికీ అది ఇప్పుడు సాధారణ స్థాయికి దిగొచ్చిందని పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా రుణ గ్రహీతల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోతుంది. నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలు పెరగడమే కాకుండా, కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు తగ్గుతాయి. ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకాన్ని నిలిపివేయడం అనే సవాలును ఈ విభాగం ఎదుర్కొంటోంది’’ అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. ఈ చర్యతో బ్యాంకులు సైతం వెంటనే పలు రుణాల రేట్లను సవరించేశాయి. ప్రస్తుత రెపో రేటు కరోనా ముందున్న రేటు కంటే పావు శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్ (గృహ రుణాలు) మార్కెట్ 13 శాతం వృద్ధిని చూపిస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. పెరగనున్న భారం ‘‘ఒక శాతం మేర వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఈఎంఐ 6.1–6.4 శాతం మేర పెరుగుతుంది. అందుబాటు ధరల ఇళ్ల రుణ గ్రహీతలపై ఈ పెరుగుదల 5.3 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక వివరించింది. వడ్డీ రేట్ల సైకిల్ ఇలానే ముందుకు సాగితే 2 శాతం మేర రేటు పెరగడం వల్ల ఈఎంఐపై పడే భారం 10.8–13 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి పెంచడం ద్వారా (ఈఎంఐ పెంచకుండా) రుణ దాతలు ఆ ప్రభావాన్ని అధిగమించగలరు. కొత్త కస్టమర్లకు మాత్రం పెరిగిన రేట్ల మేర ఈఎంఐ అధికమవుతుంది. ఇది ఇల్లు కొనుగోలు సెంటిమెంట్‌ను మధ్య కాలానికి ప్రతికూలంగా మార్చేయవచ్చు’’అని ఈ నివేదిక వివరించింది. నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్, కాంక్రీట్ సహా ఎన్నో ముడి సరుకుల ధరల గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. కార్మికులకు చెల్లింపులు కూడా పెరిగిన విషయాన్ని పేర్కొంది. నిర్మాణ వ్యయం 20–25 శాతం మేర పెరిగేందుకు ఈ అంశాలు దారితీశాయని తెలిపింది. పెరిగిన ధరల ప్రభావాన్ని నిర్మాణదారులు పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయలేవని పేర్కొంటూ.. మధ్య కాలానికి ప్రాపర్టీ ధరలపై ఇవి ప్రతిఫలిస్తాయని అంచనా వేసింది. -
కట్టు తప్పనున్న కరెంట్ అకౌంట్ లోటు!
ముంబై: భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్–సీఏడీ) మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో మూడేళ్ల గరిష్ట స్థాయి 43.8 బిలియన్ డాలర్లకు ఎగసే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 1.8 శాతం ఉంటుందని రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. 2020–21లో కరెంట్ అకౌంట్ 23.91 బిలియన్ డాలర్ల మిగుల్లో ఉంది. జీడీపీలో ఇది 0.9 శాతం. దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. రేటింగ్స్ సంస్థ తాజా నివేదికలోని అంశాలను పరిశీలిస్తే.. – 2021–22 చివరి త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) క్యాడ్ 17.3 బిలియన్ డాలర్లు (త్రైమాసిక జీడీపీలో 1.96 శాతం) నమోదయ్యే అవకాశం ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో క్యాడ్ 8.2 బిలియన్ డాలర్లుగా (1.03 శాతం) ఉంది. - ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ముఖ్యంగా కమోడిటీ ధరల పెరుగుదల సమస్య తీవ్రమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి, అస్థిరత వల్ల భారత్ ఎగుమతులు గణనీయమైన ప్రతికూలతలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రపంచ వృద్ధి అంచనాలను కుదించింది. ఇంతక్రితం ఈ రేటు 4.7 శాతం అంచనాలను తాజాగా 3 శాతానికి కుదించింది. - ప్రపంచ వాణిజ్య సంస్థ భారతదేశం కీలక ఎగుమతి భాగస్వాములైన ఉత్తర అమెరికా, యూరప్‌ల దిగుమతుల వృద్ధిని 2022లో వరుసగా 3.9 శాతం మరియు 3.7 శాతంగా అంచనా వేసింది, తొలి అంచనాలు 4.5 శాతం, 6.8 శాతం కావడం గమనార్హం. - అధిక చమురు ధరలు సౌదీ అరేబియా వంటి చమురు–ఎగుమతి దేశాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఇది అధిక వాస్తవ ఆదాయాలకు దారి తీస్తుంది. చమురు ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళనల నేపథ్యంలో దిగుమతి డిమాండ్ తొలి అంచనా 8.7 శాతం నుంచి 11.7 శాతానికి పెరుగుతుందని తాజా అంచనా. - పెరిగిన కమోడిటీ ధరలు, రూపాయి క్షీణత నేపథ్యంలో భారత్ దిగుమతులు పెరగవచ్చు. - ఇక భారత్ ఎగుమతులు 2022–23 తొలి త్రైమాసికంలో 17.7 శాతం పెరిగి 112.5 బిలియన్ డాలర్లకు చేరుతాయని భావిస్తున్నాం. ఇక దిగుమతులు 44.1 శాతం వృద్ధితో 120.9 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. - డాలర్ మారకంలో రూపాయి విలువ మొదటి త్రైమాసికంలో సగటున 77.1గా ఉంటుందని భావిస్తున్నాం. 2021–22 ఇదే త్రైమాసికంలో పోల్చితే ఇది 4.5 శాతం తక్కువ. చదవండి: ఎకానమీకి ‘రూపాయి’ కష్టాలు.. సామాన్యులకు భారం.. -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, భారత్ వృద్ధికి ఇండియా రేటింగ్స్ కోత!
ముంబై: భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలకు ఇండియా రేటింగ్స్ కోత విధించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.6 శాతంకాగా, తాజాగా 7 నుంచి 7.2 శాతం శ్రేణికి తగ్గిస్తున్నట్లు తాజా నివేదికలో పేర్కొంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వినియోగదారు సెంటిమెంట్ బలహీనత దీనికి కారణమని పేర్కొంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత ఎకానమీపై కనబడుతుందని విశ్లేషించింది. ఇప్పుడే చెప్పడం కష్టం... చక్రవర్తి ఇదిలావుండగా, యుద్ధం ప్రభావం భారత్ ఎకానమీపై ఏ మేరకు ఉంటుందన్న విషయం ఇప్పడే చెప్పడం కష్టమవుతుందని ప్రముఖ ఆర్థికవేత్త పినాకి చక్రవర్తి పేర్కొన్నారు. పలు ప్రపంచ దేశాలకు ఇప్పుడు ధరల పెరుగుదల తీవ్రత సవాలుగా ఉందని అన్నారు. -
భారత్ దిగుమతులపై ‘యుద్ధ’ భారం
ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న యుద్ధం భారత్ దిగుమతుల బిల్లుపై తీవ్ర ప్రభావం చూపుతుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దిగుమతుల బిల్లు 600 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొన్న నివేదిక, ఇది దేశంలో ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు, రూపాయి పతనానికి దారితీసే అవకాశం ఉందని అంచనా వేసింది. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రత్నాలు–ఆభరణాలు, వంట నూనెలు, ఎరువులను భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇండియా రేటింగ్స్ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు - ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో 550 బిలియన్ డాలర్లకు చేరిన దిగుమతుల బిల్లు యుద్ధం మరికొంత కాలం కొనసాగిన పక్షంలో 2021–22 పూరిగా ముగిసే నాటికి 600 బిలియన్ డాలర్లు దాటే అవకాశం ఉంది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు భారీగా పెరిగే పరిస్థితి నెలకొంటుంది. - క్రూడ్ ఆయిల్ ధరల్లో 5 శాతం పెరుగుదల ఉంటే, వాణిజ్య (కరెంట్ అకౌంట్) లోటు 6.6 బిలియన్ డాలర్లు పెరుగుతుందని అంచనా. - ఇక పెట్రోలియం ప్రొడక్టుల ధరలు 10 శాతం పెరిగితే, రిటైల్ ద్రవ్యోల్బణం 42 బేసిస్ పాయింట్లు, టోకు ద్రవ్యోల్బణం 104 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరుగుతుంది. - ఇక భారత్ వద్ద ఫిబ్రవరి 18వ తేదీ నాటికి అత్యధికంగా 632.95 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉండడం కొంత ఊరటనిచ్చే అంశం. ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ, రూపాయి భారీ పతనాన్ని ఇది కొంత మేర కట్టడి చేసే అంశం. - శ్రీలంక వంటి ఇతర దేశాలు ఎదుర్కొంటున్న విదేశీ మారకద్రవ్య సమస్యలు భారత్ ఎగుమతులపై, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకు 2014–15లో శ్రీలంకతో ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 7.46 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఈ విలువ 4.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఉక్రెయిన్ను తీసుకుంటే, 2012–13లో ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 3.11 బిలియన్ డాలర్లయితే, 2021–22లో తొలి 10 నెలల్లో 2.35 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2020–21లో ఈ విలువ కేవలం 2.59 బిలియన్ డాలర్లు. ఇక రష్యాతో 2017–18 నుంచి 2020–21 మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 8 నుంచి 11 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉంటే, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ 9.44 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ద్రవ్యోల్బణం, రూపాయి, క్యాడ్ ఇలా... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న సూచనల ప్రకారం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగాలి. అయితే జనవరిలో ఈ రేటు నిర్దేశ శ్రేణికి మించి 6.01 శాతంగా నమోదయ్యింది. ఇక దేశంలోకి వచ్చిపోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసాలను ప్రతిబింబించే కరెంట్ అకౌంట్ 2021–22లో 2 శాతం (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ విలువలో) లోటును నమోదుచేసుకుంటుందని యుద్ధానికి ముందు ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనావేసింది. అయితే చమురు, ఇతర దిగుమతి చేసుకునే కమోడిటీ ధరలు తీవ్ర స్థాయిలో కొనసాగితే అంచనాలు మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ)కాగా, ఇప్పటికే 75 దిగువన స్థిరంగా కొనసాగుతోంది. చదవండి: చమురు బిల్లు తడిసి మోపెడు! -
హమ్మయ్యా!! బ్యాంక్ రుణాలు రికవరీ అవ్వనున్నాయ్, కారణం ఇదే?!
ఇదిలాఉండగా, భారత్ బ్యాంకింగ్ అవుట్‌లుక్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. పటిష్ట రుణ డిమాండ్, బ్యాలన్స్ షీట్స్ అంచనాలు తమ విశ్లేషణకు కారణమని తెలిపింది. బ్యాంకింగ్ రుణ వృద్ధి 10 శాతంగా నమోదయ్యే వీలుందని కూడా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటును 8.4 శాతంగా అభిప్రాయపడింది. రుణాల్లో స్థూల మొండి బకాయిల నిష్పత్తి 6.1 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగిన మూలధన నిల్వలు అందుబాటులో ఉంటాయని అభిప్రాయపడింది. అన్ని రంగాల్లో వృద్ధి, మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో రుణ రికవరీలు కూడా మెరుపడే వీలుందని తెలిపింది. ఇక రుణాలు, డిపాజిట్ల విషయంలో దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల మార్కెట్ వాటా పెరుగుతుందని అంచనా వేసింది. మూలధనం, పోర్ట్‌ఫోలియో నిర్వహణల విషయంలో ప్రైవేటు బ్యాంకులు మంచి పనితీరును కనబరిచే అవకాశం ఉందని విశ్లేషించింది. కాగా, కార్పొరేట్ ఎన్పీఏలు 2020–21లో 10.8%గా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10.4 శాతానికి తగ్గే వీలుందని అభిప్రాయపడింది. 2022–23లో రిటైల్ రంగంలో ఒత్తిడిలో ఉన్న రుణాలు 4.9 శాతానికి తగ్గుతాయని, ఎంఎస్ఎంఈ పరిశ్రమల్లో ఈ పరిమాణం 16.7 శాతానికి పెరుగుతుందన్నది సంస్థ అంచనా. కార్పొరేట్ రంగం విషయంలో ఈ రేటు 10.3 శాతానికి దిగివస్తుందని పేర్కొంది. -
కట్టడిలో ద్రవ్యలోటు.. ఇండియా రేటింగ్స్ నివేదిక
ముంబై: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) లక్ష్యం కన్నా తక్కువగా 6.6 శాతంగానే నమోదవుతుందన్న అభిప్రాయాన్ని ఇండియా రేటింగ్స్ నివేదిక వ్యక్తం చేసింది. ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం రూ.3.73 లక్షల కోట్ల అదనపు వ్యయ ప్రణాళికలు ప్రకటించినప్పటికీ ద్రవ్యలోటు కట్టుతప్పదని విశ్లేషించింది. ఆదాయాలు బాగుండడం, వివిధ మంత్రిత్వశాఖల తక్కువ వ్యయాలు దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది. కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ద్రవ్యలోటు 9.3 (లక్ష్యం 3.5 శాతం) శాతంగా నమోదయ్యింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీనిని 6.8 శాతం (రూ.15.06 లక్షల కోట్లు) వద్ద కట్టడి చేయాలని 2021–22 బడ్జెట్ నిర్దేశించింది. ద్రవ్యలోటు అక్టోబర్ ముగిసే నాటికి రూ. 5,47,026 కోట్లుగా నమోదయ్యింది. 2021–22 బడ్జెట్ అంచనాల్లో (బడ్జెట్ అంచనా రూ.15.06 లక్షల కోట్లు) ఇది 36.3 శాతం. ఆర్బీఐసహా పలు విశ్లేషణా సంస్థలు 6.8 శాతం వద్ద ద్రవ్యలోటు కట్టడి కష్టమని విశ్లేషిస్తున్న నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ తాజా ప్రకటన చేయడం గమనార్హం. బడ్జెట్ అంచనాలను మించి పన్ను వసూళ్లు రూ.5.9 లక్షల కోట్లుగా నమోదవుతాయని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతారామన్ 2021–22 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. చదవండి:100 ట్రిలియన్ డాలర్లకి చేరుకోనున్న ప్రపంచ ఎకానమీ -
భారత్‌కు సావరిన్ రేటింగ్ కట్
న్యూఢిల్లీ: భారత్‌కు ఇస్తున్న సార్వభౌమ స్థాయి (సావరిన్ రేటింగ్)ని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తగ్గించింది. ఇప్పటి వరకూ ఈ రేటింగ్ ‘బీఏఏ2’ అయితే దీనిని ‘బీఏఏ3’కి తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇక భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను కూడా నెగటివ్‌లోనే కొనసాగించనున్నట్లు పేర్కొంది. డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణాలు... ► కోవిడ్–19 మహమ్మారి భారత్ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసింది. అయితే రేటింగ్ డౌన్‌గ్రేడ్‌కు ఇది ఒక్కటే కారణం కాదు. ► తీసుకుంటున్న పలు విధాన నిర్ణయాల అమల్లో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ► ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధిరేటు సుదీర్ఘకాలం అట్టడుగునే కొనసాగనుంది. ► ఇక ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరమైన ఒత్తిడులు కూడా ఎదురుకానున్నాయి. తక్కువ ఆదాయం–వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో ఇందుకు సంబంధించి నికర వ్యత్యాసం... ద్రవ్యలోటు మరింతగా కట్టుతప్పే అవకాశం ఉంది. ► ఫైనాన్షియల్ సెక్టార్లో ఒత్తిడి నెలకొనే అవకాశాలు సుస్పష్టం. 2020–21లో జీడీపీ 4 శాతం క్షీణత కోవిడ్–19 సృష్టించిన నష్టంసహా పలు కారణాల వల్ల 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 4 శాతం క్షీణ రేటును నమోదుచేసుకునే అవకాశం ఉందని మూడీస్ పేర్కొంది. నిజానికి కోవిడ్ మహమ్మారి దాడికి ముందే భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన విషయాన్ని కూడా మూడీస్ ప్రస్తావించింది. పెరగనున్న రుణ భారం: దీర్ఘకాలం వృద్ధి రేటు దిగువస్థాయిలోనే కొనసాగే పరిస్థితులు ఉండడం వల్ల రుణ భారం తగ్గించుకోవడం ప్రభుత్వానికి కొంత క్లిష్టంగా మారే వీలుంది. కరోనాకు ముందు 2019–20లో భారత్ ప్రభుత్వం రుణ నిష్పత్తి జీడీపీలో 72% ఉంటే, ఇది ఈ ఆర్థిక సంవత్సరం 84%కి పెరిగే అవకాశం ఉంది. అయితే రుణ భారాన్ని తగ్గించుకోవడం స్వల్పకాలంలో సాధ్యమయ్యే అవకాశంలేదు. బీఏఏ– రేటెడ్ దేశాలతో పోల్చితే భారత్‌పై అధిక వడ్డీరేటు భారం ఉంది. బీఏఏ స్టేబుల్ దేశాలతో పోల్చితే మూడు రెట్లు ఈ భారం అధికంగా ఉందని మూడీస్ పేర్కొంది. ప్రైవేటు రంగంలో పొదుపులు, ప్రభుత్వ డెట్ మెచ్యూరిటీలు దీర్ఘకాలంలో ఉండడం రుణ భారం, వడ్డీ చెల్లింపుల విషయం లో కొంత సానుకూల విషయం. ఏమిటి ఈ రేటింగ్..? ఒక దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థలు రేటింగ్ ఇస్తుంటాయి. ఎస్అండ్పీ, ఫిచ్, మూడీస్ ఇందులో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఆయా దిగ్గజ సంస్థలు ఇచ్చే రేటింగ్ ప్రాతిపదికనే ఒక దేశం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుంది. దేశ సీనియర్ ఆర్థిక శాఖ అధికారులు సైతం దేశానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులను అధికారికంగా రేటింగ్ సంస్థల ప్రతినిధులకు వివరించి, రేటింగ్ పెంచవలసినదిగా కోరతారంటే, ఆయా సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ఒక దేశం పెట్టుబడులను ఆకర్షించడంలో ఎంతగా దోహదపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మూడీస్ ఇచ్చిన రేటింగ్ ‘బీఏఏ3’ నెగటివ్ అవుట్‌లుక్ కూడా ఇప్పటికీ ‘ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ పరిధిలోకే వస్తుందన్న విషయం గమనార్హం. అయితే ‘జంక్’ గ్రేడ్‌కు ఇది ఒక మెట్టు ఎక్కువ. మిగిలిన రెండు సంస్థలు ప్రస్తుతం భారత్‌కు మూడీస్ ఇస్తున్న రేటింగ్ ‘బీఏఏ3 నెగటివ్’కు సరిసమానమైనవే కావడం గమనార్హం. 2017, నవంబర్‌లో మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్ చేసినా, అటు తర్వాత రెండు దఫాల్లో క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. కరెన్సీకీ కోత భారత ప్రభుత్వ ఫారిన్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ దీర్ఘకాలిక జారీ రేటింగ్స్‌ను కూడా మూడీస్ ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి తగ్గించింది. అలాగే భారత్ లోకల్ కరెన్సీ సీనియర్ అన్సెక్యూర్డ్ రేటింగ్స్‌నూ ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి కుదించింది. ఇక షార్ట్‌టర్మ్ లోకల్ కరెన్సీ రేటింగ్‌ను ‘పీ–2 నుంచి పీ–3’కి తగ్గించింది. వీటికి సంబంధించి అవుట్‌లుక్‌ను నెగటివ్‌గా పేర్కొంది. ఊహించిందే... భారత్‌కు సంబంధించి ఫిచ్, ఎస్‌అండ్‌పీలు బీఏఏ3 నెగటివ్‌కు సరిసమానమైన రేటింగ్స్ కొనసాగిస్తున్నందువల్ల మూడీస్ కూడా ఈ మేరకు సర్దుబాటు చేస్తుందని మార్కెట్ మొదటి నుంచీ ఊహిస్తూ వస్తోంది. అయితే ఈ రేటింగ్ కూడా భారత్‌కు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ హోదానే ఇస్తోంది. దీనివల్ల బాండ్, రూపాయి మార్కెట్లో భారీ మార్పు ఏదీ ఉండబోదని మేము భావిస్తున్నాం. – కే. హరిహర్, ట్రెజరర్, ఫస్ట్‌రాండ్ బ్యాంక్ -
కార్పొరేట్ల లాభాలకు మెటల్స్ ఊతం..
ముంబై: దేశీ కార్పొరేట్ల ఆర్థిక పనితీరు మెరుగుపడటానికి మెటల్స్ రంగంలో రికవరీ తోడ్పడనుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సదరు సంస్థల ఆదాయ వృద్ధి నిలకడగా 7–9 శాతం మేర ఉండనుంది. ఇండియా రేటింగ్స్ సంస్థ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2018–19లో లాభదాయకత మెరుగుపడి, కార్పొరేట్ల ఆర్థిక పనితీరు స్థిరంగా ఉండగలదని పేర్కొంది. అయితే, ఈ రికవరీ కేవలం మెటల్స్ రంగానికి మాత్రమే పరిమితమని, మిగతా రంగాలన్నింటిలోనూ కనిపించడానికి మరింత సమయం పడుతుందని తెలిపింది. వినియోగ ఆధారిత ఆటోమొబైల్, రిటైల్ తదితర రంగాల్లో డిమాండ్ పెరగడంతో ఆదాయాలు 7–9 శాతం మేర, పన్నుకు ముందస్తు లాభాలు 8–11 శాతం మేర వృద్ధి చెందవచ్చని నివేదిక పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కమోడిటీల ధరలు అధిక స్థాయిలో ఉండొచ్చని.. దీనికి తోడు అధిక వడ్డీ రేట్లు, రూపాయీ క్షీణత తదితర అంశాలు కంపెనీల లాభాల వృద్ధికి అడ్డుకట్ట వేయొచ్చని అంచనా వేసింది. ఇక అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కఠిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎగుమతి ఆధారిత రంగాలైన ఫార్మా, ఐటీ సంస్థలు సవాళ్లు ఎదుర్కొనాల్సి ఉంటుందని వివరించింది. మరోవైపు, కంపెనీల లాభాల వృద్ధి పరిమిత స్థాయిలోనే ఉండటం వల్ల 2019–20 దాకా పెట్టుబడులు పెరగకపోవచ్చని ఇండియా రేటింగ్స్ వివరించింది. కార్పొరేట్లు కేవలం మెయింటెనెన్స్‌పై మాత్రమే ఖర్చులు చేయొచ్చని, విస్తరణ ప్రణాళికల జోలికి పోకపోవచ్చని పేర్కొంది. -
ఫెడ్ రేటు పెరిగితే మన కంపెనీలపై ప్రభావం స్వల్పమే!
ఇండియా రేటింగ్స్ నివేదిక! నేడే రేట్ల పెంపుపై నిర్ణయం న్యూఢిల్లీ : అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ రిజర్వ్ గురువారం ఫెడ్ ఫండ్స్ రేటు పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో.. దీని ప్రభావాలను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు, ఆర్థిక, రేటింగ్ సంస్థలు విశ్లేషించుకుంటున్నాయి. భారత్ విషయానికి వస్తే- కేవలం 2.6 శాతం పెద్ద కంపెనీలకు మాత్రమే లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలు తలెత్తుతాయని ఇండియా రేటింగ్స్ తన తాజా సర్వేలో పేర్కొంది. గురువారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పస్తుతం 0-0.25 శాతం వున్న ఫెడ్ ఫండ్స్ రేటును పెంచే అంశంపై భిన్న వాదనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థకు ఊపును అందించే లక్ష్యంతో 2008 ఆర్థిక సంక్షోభ సమయం నుంచీ అమెరికా జీరోస్థాయి వడ్డీరేటు వ్యవస్థను కొనసాగిస్తోంది. ఇప్పుడు అమెరికా పరిస్థితులు మెరుగుపడ్డంతో ఈ రేటు పెంచవచ్చని ఒకపక్క ఊహాగానాలు ఉన్నాయి. అయితే ప్రపంచ క్లిష్ట ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ రేటు పెంచకపోవచ్చన్న వాదనా ఉంది.