ఫెడ్ రేటు పెరిగితే మన కంపెనీలపై ప్రభావం స్వల్పమే!
ఇండియా రేటింగ్స్ నివేదిక!
నేడే రేట్ల పెంపుపై నిర్ణయం
న్యూఢిల్లీ : అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ రిజర్వ్ గురువారం ఫెడ్ ఫండ్స్ రేటు పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో.. దీని ప్రభావాలను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు, ఆర్థిక, రేటింగ్ సంస్థలు విశ్లేషించుకుంటున్నాయి. భారత్ విషయానికి వస్తే- కేవలం 2.6 శాతం పెద్ద కంపెనీలకు మాత్రమే లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలు తలెత్తుతాయని ఇండియా రేటింగ్స్ తన తాజా సర్వేలో పేర్కొంది. గురువారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పస్తుతం 0-0.25 శాతం వున్న ఫెడ్ ఫండ్స్ రేటును పెంచే అంశంపై భిన్న వాదనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఆర్థిక వ్యవస్థకు ఊపును అందించే లక్ష్యంతో 2008 ఆర్థిక సంక్షోభ సమయం నుంచీ అమెరికా జీరోస్థాయి వడ్డీరేటు వ్యవస్థను కొనసాగిస్తోంది. ఇప్పుడు అమెరికా పరిస్థితులు మెరుగుపడ్డంతో ఈ రేటు పెంచవచ్చని ఒకపక్క ఊహాగానాలు ఉన్నాయి. అయితే ప్రపంచ క్లిష్ట ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ రేటు పెంచకపోవచ్చన్న వాదనా ఉంది.