ధరల కట్టడికే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: ధరల కట్టడికే రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యమిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలూ అక్కర్లేదని అన్నారు. ఇందుకు అవసరమైనప్పుడల్లా ‘వడ్డీరేట్ల’ సాధనాన్ని ప్రధానంగా వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. అయితే ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యమంటే- వృద్ధిని అలక్ష్యం చేయడం కాదని అన్నారు. ఈ రెండూ సమతౌల్యతతో ముందుకు సాగే అంశాలని వివరించారు. ప్రతి సమీక్షా సమావేశంలో నిర్ణయాలకు అనుగుణంగా తనను అంచనా వేయొద్దని ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. జనవరి 28 తదుపరి సమీక్షలో నిర్ణయానికి ముందు ద్రవ్యోల్బణం, పారిశ్రామిక వృద్ధి తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.
సెప్టెంబర్ 4న గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రాజన్ రెండుసార్లు పావు శాతం చొప్పున రెపో రేటు పెంచారు. అయితే డిసెంబర్ 18న తాజా సమీక్ష సందర్భంగా ఈ రేటులో ఎటువంటి మార్పూ చేయలేదు. దీనితో ఇక ఆర్‌బీఐ దృష్టి ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపునకు మళ్లినట్లు కొందరు విశ్లేషణలు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాజన్ తాజా వ్యాఖ్యలు చేశారు.