ఆర్‌బీఐ దారెటు..?
రేట్ల కోత కష్టమేనంటున్న బ్యాంకర్లు...
అధిక రిటైల్ ద్రవ్యోల్బణమే కారణం...
వడ్డీరేట్లను తగ్గించాల్సిందేనంటున్న కార్పొరేట్లు
రేపే ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష
న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిల్లోనే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సారి పాలసీ సమీక్ష(రేపు)లో ఆర్‌బీఐ కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా వడ్డీరేట్ల కోతకు అవకాశాలు చాలా స్వల్పంగానే ఉన్నాయని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. అయితే, టోకు ధరల(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మైనస్‌లోనే ఉండటం... పారిశ్రామికోత్పత్తి వృద్ధి మందగమనం నేపథ్యంలో ఆర్‌బీఐ కచ్చితంగా వడ్డీరేట్లను తగ్గించి తమకు ఊరట కల్పించాల్సిందేనని కార్పొరేట్ ఇండియా డిమాండ్ చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే రేట్ల కోత అత్యవసరమని ప్రభుత్వం కూడా సూచిస్తోంది.
జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి(5.4 శాతం) ఎగబాకిన సంగతి తెలిసిందే. అయితే, టోకు ధరల ద్రవ్యోల్బణం మాత్రం ఇంకా మైనస్‌లోనే(- 2.4) ఉండటం గమనార్హం. ఇదిలాఉండగా.. తాజాగా వెలువడిన ఎనిమిది మౌలిక పరిశ్రమల ఉత్పాదకత గణాంకాలు తీవ్ర నిరుత్సాహకరంగా ఉన్నాయి. వృద్ధి రేటు కేవలం 3%కే పరిమితం కావడం మందగమనానికి నిదర్శనంగా నిలుస్తోంది.
యథాతథంగానే..!
రేపటి పాలసీలో ఆర్‌బీఐ వడ్డీరేట్ల(రెపో) కోత ఉండకపోవచ్చని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ‘డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మైనస్‌లోనే ఉన్నప్పటికీ.. రిటైల్ ధరలు కాస్త పెరిగాయి. దీనికి ప్రధానంగా అధిక ఆహారోత్పత్తుల ధరలే కారణం. ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలకు రిటైల్ ధరలను ప్రామాణికంగా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రేట్ల కోతకు ఆస్కారం లేనట్టే’ అని ఆమె చెప్పారు. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా సీఈఓ, ఎండీ రంజన్ ధావన్ కూడా ఇదే విధంగా అభిప్రాయపడ్డారు. ‘గత పాలసీ సమీక్ష నాటితో పోలిస్తే స్థూల ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పులేవీ లేవు.
మరోపక్క, వర్షాలు సరిగ్గా కురిశాయా, లేదా అన్నదానిపై స్పష్టతలేదు. రుతుపవన వర్షపాత సమాచారాన్ని ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తుంది. రిటైల్ ధరలనే ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కీలక పాలసీ రేట్లు యథాతథంగానే ఉంటాయని అంచనా’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, కొంతమంది బ్యాంకర్లు మాత్రం రేట్ల కోతకు చాన్స్ ఉందంటున్నారు. ఆర్‌బీఐ రేపటి సమీక్షలో రేట్ల కోతపై అంచనా వేయడం కష్టమేనని.. అయితే, వడీరేట్లు కచ్చితంగా తగ్గుముఖ ధోరణిలోనే ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిప్యూటీ ఎండీ పరేశ్ సుక్తాంకర్ పేర్కొన్నారు. మార్చిలోగా మరో 0.25-0.5% రేట్ల కోతకు అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం రేట్లు ఇలా...: ఆర్‌బీఐ కీలక పాలసీ రేటు అయిన రెపో.. ప్రస్తుతం 7.25 శాతంగా ఉంది. బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటునే రెపోగా వ్యవహరిస్తారు. ఇక నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతం, రివర్స్ రెపో 6.25 శాతం, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్) 21.5 శాతం చొప్పున ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ రెపో రేటును ఆర్‌బీఐ పావు శాతం చొప్పున మూడుసార్లు తగ్గించింది. చివరిసారిగా జూన్‌లో రెపో రేటు కోతను ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఇదే తొలి తగ్గింపు కూడా. ఇతర రేట్ల జోలికిమాత్రం వెళ్లలేదు.
అధిక పీపీఎఫ్ రేటుతో రుణరేట్ల కోతకు బ్రేక్...
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), పన్ను రహిత బాండ్‌ల కారణంగా డిపాజిట్ రేట్లను తగ్గించేందుకు అవకాశం చిక్కడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. అంతిమంగా రుణాలపై వడ్డీరేట్లను మరింతగా తగ్గించేందుకు వీల్లేకుండాపోతోందని అంటున్నారు. ‘మరింతగా డిపాజిట్ రేట్ల తగ్గింపునకు వీలునన్నప్పటికీ.. బ్యాంకులు ఈ దిశగా చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా పీపీఎఫ్‌పై 8.7 శాతం వడ్డీరేటు లభిస్తోంది. ఇక పన్ను రహిత బాండ్‌లు కూడా మంచి రాబడులు ఇస్తున్నాయి. వీటినుంచి పోటీకారణంగా బ్యాంకులు డిపాజిట్ రేటు కోతకు వెనుకాడుతున్నాయి’ అని కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ చైర్మన్, ఎండీ ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు.