దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 14 నెలల గరిష్ఠానికి పెరిగి 6.21 శాతానికి చేరింది. గతంలో ఆగస్టు 2023లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. కానీ ఈసారి ఈ మార్కును దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది 5.49 శాతం నమోదవ్వగా.. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణం ఇంతలా పెరిగేందుకు కారణమని ఆర్‌బీఐ తెలిపింది.
ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 9.24 శాతంగా ఉండేది. అక్టోబర్‌లో ఇది ఏకంగా 10.87 శాతానికి పెరిగింది. గ్రామీణ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబరులో నమోదైన 5.87 శాతంతో పోలిస్తే అక్టోబర్‌లో 6.68 శాతానికి చేరింది. పట్టణ ద్రవ్యోల్బణం అంతకు ముందు నెలలో 5.05 శాతం నుంచి 5.62 శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.81-6 శాతానికి చేరువగా ఉంటుందని రాయిటర్స్ పోల్ ఇటీవల అంచనా వేసింది. కానీ అందుకు భిన్నంగా గణాంకాలు వెలువడ్డాయి.
ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హైరిస్క్ అలర్ట్!
భగ్గుమంటున్న కూరగాయలు
వంట సామగ్రి, కూరగాయలు, వంట నూనె, ఉల్లిపాయల ధరలు పెరగడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఉల్లిపాయ హోల్‌సేల్ ధరలు కిలోగ్రాముకు రూ.40-60 నుంచి రూ.70-80కి పెరిగాయి. ఈ నేపథ్యంలో రానున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌లో కీలక వడ్డీ రేట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఆసక్తి నెలకొంది. తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ ద్వైమాసిక భేటీ డిసెంబర్ 6న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment