
కరోనా మహమ్మారి నుంచి గట్టెక్కాలంటే..
సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌తోనే కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించలేమని భారత్‌లో ఆర్థిక వ్యవస్థను తెరిచేముందు పెద్ద ఎత్తున ప్రజలకు వైరస్ టెస్ట్‌లు నిర్వహించాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురాం రాజన్ స్పష్టం చేశారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్ వద్ద ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నందున భారత్ లాక్‌డౌన్ నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం సహా పలు అంశాలపై ఆయన విస్తృతంగా చర్చించారు.అధికార వికేంద్రీకరణతోనే కరోనా మహమ్మారితో డీలా పడిన ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించవచ్చని రాజన్ పేర్కొన్నారు.
ఉత్పత్తి ఫలాలను ప్రజలకు పంచేందుకు బదులు అవకాశాలను ప్రజల ముందుకు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రజల అవసరాలను మెరుగ్గా అవగాహన చేసుకోగలిగే స్ధానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలన్నారు. కరోనా మహమ్మారితో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు పూర్తిగా పడకేసిన క్రమంలో రఘురాం రాజన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఇక లాక్‌డౌన్ నుంచి సమర్ధవంతమైన వ్యూహంతో బయటకు వచ్చిన అనంతరం ఆర్థిక వ్యవస్థను అత్యంత జాగరూకతతో తెరవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా మంచి నాణ్యతతో కూడిన ఉద్యోగాలను ప్రభుత్వం సృష్టించాలని సూచించారు.
చదవండి : కోవిడ్-19 షాక్‌నకు ఆర్థిక టానిక్ అదే!
లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు ఆహారం,సంక్షేమంపై రూ 65,000 కోట్లు వెచ్చించాల్సి ఉందని, భారత జీడీపీ 200 లక్షల కోట్లు కావడంతో ఇది ఏమాత్రం భారం కాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆర్థిక సంక్లిష్ట సమయాల్లో అసమానత్వాలను సరిచేయాల్సిన అవసరం ఉందని రాజన్ అన్నారు. నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించడం ద్వారా ఈ అంతరాలకు చెక్ పెట్టవచ‍్చని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీగా విడుదల చేయాలని కోరారు. వీలైనంత ఎక్కువమంది పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా ఆర్థిక సాయం, ఆహారం సమకూరాలని అన్నారు. భారత ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి కొత్తగా కరోనా వైరస్ కేసులు వెలుగుచూడకుండా నియంత్రించాలని సూచించారు. మరోసారి లాక్‌డౌన్ ప్రకటిస్తే అది మరింత విపరిణామాలకు దారితీస్తుందని, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని రాజన్ హెచ్చరించారు.