ముంబై: కరోనా రెండో విడత భారత్‌పై తీవ్ర ప్రభావం చూపిందన్నారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. అయితే మే చివరి నుంచి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నట్టు చెప్పారు. పెరుగుతున్న డేటా తస్కరణ, సైబర్ దాడుల సమస్యలను దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘‘2020–21 రెండో అర్ధ భాగంలో కోలుకున్న దేశ ఆర్థిక వ్యవస్థపై.. 2021 ఏప్రిల్, మే నెలల్లో తిరిగి ప్రభావం పడింది. కరోనా వైరస్ కేసులు ఎంత వేగంగా పెరిగాయో.. అంతే వేగంగా నియంత్రణలోకి రావడం వల్ల మే చివరి నుంచి, జూన్ వరకు కార్యకలాపాల్లో పురోగతి నెలకొంది’’ అంటూ ఆర్‌బీఐ రూపొందించిన ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్‌ఎస్‌ఆర్)లో శక్తికాంతదాస్ ప్రస్తావించారు.
ఎన్‌పీఏలు పెరగొచ్చు..
బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు/వసూలు కాని రుణాలు) 2021 మార్చి నాటికి 7.5 శాతం వద్దే స్థిరంగా, ఆరు నెలల ముందునాటి మాదిరే ఉన్నట్టు ఆర్‌బీఐ ఎఫ్‌ఎస్‌ఆర్ తెలిపింది. అయితే 2022 మార్చి నాటికి ఇవి 9.8 శాతానికి పెరిగే అవకాశాలున్నట్టు పేర్కొంది. ఇది కూడా కనీస అంచనాలేనని.. పరిస్థితులు మరీ ప్రతికూలంగా మారితే స్థూల ఎన్‌పీఏలు 11.22 శాతానికి కూడా పెరిగిపోవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 2021 మార్చి నాటికి 9.54 శాతంగా ఉంటే.. 2022 మార్చి నాటికి 12.52 శాతానికి చేరొచ్చని పేర్కొంది. అయితే, ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఎఫ్‌ఎస్‌ఆర్‌లో బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 2022 మార్చి నాటికి 13.5 శాతానికి పెరగొచ్చని అంచనా వేయడం గమనార్హం. బ్యాంకుల వద్ద తగినంత నిధులున్నట్టు ఈ నివేదిక తాజాగా పేర్కొంది. ఆర్థిక సంస్థల బ్యాలన్స్ షీట్లపై ప్రభావం గతంలో వేసిన స్థాయిలో ఉండకపోవచ్చని శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు. తాము ప్రకటించిన చర్యలు పూర్తి స్థాయిలో ఆచరణ రూపం దాలిస్తేనే వాస్తవ ప్రభావం ఎంతన్నది తెలుస్తుందన్నారు. ఆర్థిక స్థిరత్వమే తమ ప్రాధాన్యంగా చెప్పారు.
రిటైల్, ఎంఎస్‌ఎంఈ రుణాలపై దృష్టి
రిటైల్, ఎంఎస్‌ఎంఈ రుణాలపై ఎక్కువ ప్రభావం ఉందంటూ వీటిపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎఫ్‌ఎస్‌ఆర్ బ్యాంకులకు సూచించింది. అనుకూల మార్కెట్ పరిస్థితులు ఏర్పడితే మూలధన నిధులను పెంచుకోవాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment