ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా... | RBI Has Announced Measures To Revive Economy | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా...

Published Sat, Apr 18 2020 12:47 AM | Last Updated on Sat, Apr 18 2020 12:47 AM

RBI Has Announced Measures To Revive Economy - Sakshi

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన సూచనలు కనబడుతున్నాయని తొలిసారి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినరోజే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అవకాశమిచ్చే చర్యలను ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా స్తంభించిపోయిన భిన్న రంగాలకు ఊతమివ్వడానికి, మార్కెట్‌లో లిక్విడిటీని పెంచడానికి ఆర్‌బీఐ నెల రోజుల వ్యవధిలో ప్రకటించిన రెండో ప్యాకేజీ ఇది. కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో అమెరికాతోసహా ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో పడ్డాయి. 1930లలో ప్రపంచాన్ని ఆవరించిన మహా మాంద్యంతో పోల్చదగ్గ వర్తమాన స్థితి నుంచి బయటపడటానికి అన్ని దేశాలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

అందుబాటులో వున్న వనరులన్నిటినీ వినియోగించి ఆ మహమ్మారిని తుదముట్టించడానికి ఒకపక్క ప్రయత్నాలు చేస్తూనే, తప్పనిసరి పరిస్థితుల్లో సమస్త కార్యకలాపాలను స్తంభింపజేశాయి. ఇందువల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ఇంతవరకూ తొమ్మిది లక్షల కోట్ల డాలర్ల నష్టం సంభవించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది మన జీడీపీతో పోలిస్తే మూడు రెట్లు అధికం. కరోనా కాటు తర్వాత అన్ని దేశాల జీడీపీలు తలకిందులయ్యాయి. మన జీడీపీయే 1.9 శాతం మించదని ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. అయితే ఈమాత్రం నమోదుకావాలన్నా ప్రభుత్వమూ, ఆర్‌బీఐ కలిసికట్టుగా వ్యవహరించి చర్యలు తీసుకోవాల్సివుంటుంది.

గత నెల 27న ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే రెపో రేటును 0.75 శాతం తగ్గించింది. తన దగ్గర వివిధ బ్యాంకులు డిపాజిట్‌ చేసే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు...అంటే రివర్స్‌ రెపో రేటును 90 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఈ రెండు చర్యలవల్లా బ్యాంకుల ద్వారా భారీ మొత్తంలో మార్కెట్‌లోకి నిధులు వెల్లువెత్తుతాయన్నది ఆర్‌బీఐ ఆలోచన. వీటితోపాటు నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌)ని  కూడా ఒక శాతం తగ్గించింది. మొదటి దఫా ప్రకటించిన ఈ చర్యలైనా, తాజాగా శుక్రవారం ప్రకటించిన చర్యలైనా బ్యాంకులకు నిధులు సమృద్ధిగా అందుబాటులో వుంచడం, ఆ నిధుల్ని  అవి రుణాల రూపంలో మార్కెట్లలోకి వదిలేలా చూడటం ఆర్‌బీఐ ధ్యేయం. అయితే ఈ అనిశ్చిత వాతావరణంలో రుణాలిస్తే ఏమవుతుందోనన్న సందేహం బ్యాంకుల్ని పీడిస్తోంది. అందువల్లే క్రితంసారి రివర్స్‌ రెపో రేటు తగ్గించినా బ్యాంకులు  తమ నిధులను రిజర్వ్‌బ్యాంక్‌ దగ్గర వుంచడానికి ప్రయత్నించాయి తప్ప రుణాలు మంజూరు చేసే సాహసానికి దిగలేదు.

వాస్తవానికి ఇలాంటి భయం బ్యాంకులను చాలా ఏళ్లనుంచి వేధిస్తోంది. బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు ఉద్దేశపూర్వకంగా భారీ మొత్తాల్లో రుణాలు తీసుకుని, ఎగ్గొట్టడం మొదలెట్టాక బ్యాంకులు కుంభకోణాల భయంతో క్రియాశీలకంగా వుండటం తగ్గించుకున్నాయి. భయంభయంగా అడుగులేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌బీఐ చర్యలు ఎంతవరకూ ఫలిస్తాయన్నది చూడాలి. బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తాలపై మూడు నెలలు మారటోరియం విధిస్తున్నట్టు ఆర్‌బీఐ క్రితంసారి ప్రకటించింది. కానీ క్రియకొచ్చేసరికి అదంతా కొట్టుకుపోయింది. ‘మీరు చెల్లించాల్సిన ఈఎంఐ గడువు దగ్గరపడుతోంది. దాన్ని చెల్లించలేమనుకుంటే ఈ ఎస్సెమ్మెస్‌ సందేశాన్ని ఫలానా నంబర్‌కు పంపండి.

కానీ ఇలా వాయిదా వేయడం వల్ల అదనంగా వడ్డీ చెల్లించాల్సివస్తుందని గ్రహించండి’ అంటూ రుణగ్రహీతల్ని బ్యాంకులు వణికిస్తున్నాయి. ఉన్న కొలువు ఊడిపోయి కొందరు, రావల్సిన జీతానికి కత్తెరపడి మరికొందరు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారని అంచనా వేసి ఆర్‌బీఐ ప్రకటించిన ఉపశమన చర్య కాస్తా ఆచరణలో ఇలా తయారైంది. అత్యున్నత స్థానంనుంచి ఆర్‌బీఐ చెప్పే గంభీరమైన మాటలకూ, క్షేత్రస్థాయిలో బ్యాంకుల చేతలకూ మధ్య ఇంత అగాథం వుంటే అనుకున్న లక్ష్యం నెరవేరదు. బ్యాంకులకు అన్నిటికన్నా ముందు ఆత్మవిశ్వాసం కలిగించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం.  

క్రితంసారి ప్యాకేజీలో కార్పొరేట్‌ బాండ్ల కొనుగోలుకు బ్యాంకులు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుంటే, ఈసారి నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలపై ఆర్‌బీఐ దృష్టిసారించింది. వాణిజ్య బ్యాంకులు వెళ్లడానికి సాహసించని ప్రాంతాల్లో ఈ సంస్థలు వ్యాపారం చేస్తాయి. చిన్నా చితకా వ్యాపారులకు, చిన్న వృత్తుల్లో వున్నవారికి అప్పులిస్తాయి. అదే తరహాలో సమర్థవంతంగా వసూలు చేసుకుంటాయి. ఇలాంటి సంస్థలకు రుణాలు మంజూరుచేయాలన్న నిబంధనతో ఆర్‌బీఐ ప్రత్యేకించి బ్యాంకులకు  రూ. 50,000 కోట్లు అందజేయాలని నిర్ణయించింది. అలాగే చిన్నతరహా బిజినెస్‌ ఫైనాన్స్, హౌసింగ్‌ ఫైనాన్స్‌ చేసేవారికి రుణాల్విడం కోసం నాబార్డ్, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్‌(సిడ్బి)లకు రూ. 50,000 కోట్ల మేర రీఫైనాన్సింగ్‌ సదుపాయం కల్పించింది. వీటిద్వారా గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు వగైరాలకు నిధులందుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ సదుపాయం కింద తననుంచి అదనపు రుణాలు పొందేందుకు ఆర్‌బీఐ అవకాశమిచ్చింది.

కరోనా వైరస్‌పై పోరు సాగిస్తున్న ప్రభుత్వాలకు ఈ సదుపాయం ఎంతగానో తోడ్పడుతుంది. సకాలంలో రుణం చెల్లించనప్పుడు దాన్ని మొండి బకాయిగా పరిగణించడానికి ఇప్పుడు 90 రోజుల గడువుంటే తాజా ప్యాకేజీలో దాన్ని ఆర్‌బీఐ 180 రోజులకు మార్చింది. ఇందువల్ల పారిశ్రామిక సంస్థలకూ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకూ, ఇతర రుణగ్రహీతలకూ ఎంతో వెసులుబాటు లభిస్తుంది. సంక్షోభాలను అవకాశాలుగా పరిగణిస్తూ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ చాకచక్యంగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేవారెందరో వున్నారు. వారే దేశాభివృద్ధికి దోహదపడతారు. ఆర్‌బీఐ ఇప్పుడూ, ఇంతక్రితం ప్రకటించిన నిర్ణయాలు అలాంటివారికి ఆసరాగా నిలబడితే మన ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం పెద్ద కష్టం కాదు. బ్యాంకులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement