
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున డబ్బులను బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆర్‌బీఐ నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 2020 మార్చి నుంచి 2021 మార్చి నాటికి డిపాజిట్లలో 12.32 శాతం మేర వృద్ధి నమోదైంది. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన డిపాజిట్లలో 15.27 శాతం మేర వృద్ధి నమోదైంది.
ఇక ఏపీలోని బ్యాంకు డిపాజిట్లలో 10.74 శాతం వృద్ధి రికార్డయ్యింది. రాష్ట్రంలో 2020 మార్చి నాటికి రూ.3,24,873 కోట్ల బ్యాంకు డిపాజిట్లుండగా.. 2021 మార్చి నాటికి రూ.3,59,770 కోట్లకు పెరిగాయి. రాష్ట్రంలో గత మూడేళ్ల నుంచి పెరుగుదలే కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటకలో 2021 మార్చి నాటికి అత్యధికంగా రూ.12,56,023 కోట్ల డిపాజిట్లుండగా.. ఏపీలో రూ.3,59,770 కోట్ల డిపాజిట్లున్నాయి.