న్యూఢిల్లీ: పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంకు మార్చకపోవచ్చని తెలుస్తోంది. వృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లు తగ్గించాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంపైనే ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మొగ్గుచూపనున్నారు. అధిక ధరల కారణంగా ఏప్రిల్ 1 సమీక్షలో సైతం పాలసీ రేట్లను యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 9.66 శాతం, రిటైల్ ద్రవ్యోల్బణం 8.59 శాతం ఉంది. రెండు నెలలకోసారి జరిగే ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష ఈసారి జూన్ 3న జరుగుతోంది. విశేషమేమంటే నరేంద్ర మోడి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతుండడం తొలిసారి.
ద్రవ్యోల్బణమే కారణం: ఈసారి వడ్డీ రేట్లలో యథాతథ స్థితి కొనసాగవచ్చని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ ఎం.నరేంద్ర తెలిపారు. రుతుపవనాలు బలహీనంగా ఉండొచ్చనే ముప్పుతోపాటు ద్రవ్యోల్బణం ఇంకా అధికంగా ఉన్నందున ఆర్‌బీఐ వడ్డీ రేట్లను మార్చకపోవచ్చని అభిప్రాయపడ్డారు. బల హీన రుతుపవనాల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు. ఈసారి సాధారణం కంటే తక్కువగా వర్షపాతం ఉంటుందని, అలాగే ఎల్‌నినో వచ్చేందుకు 60% అవకాశముందని భారత వాతావరణ శాఖ ఏప్రిల్‌లో అంచనా వేసింది.
ధరల కట్టడికే: ఇక రాజన్ పగ్గాలు చేపట్టిన సెప్టెంబరు తర్వాతి నుంచి కీలక రెపో రేటును ఆర్‌బీఐ మూడుమార్లు పెంచింది. ధరల కట్టడే తొలి ప్రాధాన్యత అని ఆర్‌బీఐ పునరుద్ఘాటించిందని, వృద్ధి-ధరల లక్ష్యాలను సమతులం చేసే ప్రయత్నం చేస్తుందని డీబీఎస్ అంటోంది. ఈసారి రెపో రేటును పెంచకపోవచ్చని తెలిపింది.
25 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చు: అసోచాం
మంగళవారం నిర్వహించనున్న పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని అసోచాం పోల్ సర్వే అంచనా. లాంఛనప్రాయంగా 25 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని ఆర్థిక వేత్తలు, సీఈవోలు సర్వేలో చెప్పారు. కేంద్ర బ్యాంకు అధినేత మరింత ఆచరణవాదం చూపిస్తారని కార్పొరేట్లు, ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారని అసోచాం ప్రెసిడెంట్ రానా కపూర్ చెప్పారు. టోకు, చిల్లర ధరల స్థాయిలో ద్రవ్యోల్బణం కట్టడికి మరింత నిబద్ధతగా ఇతరులు కూడా వ్యవహరిస్తారు కాబట్టి ఆర్‌బీఐ గవర్నర్ విధులు సులభతరం అవుతాయని అన్నారు. భారత వృద్ధి రేటు ప్రస్తుతం 5 శాతం లోపే ఉంది. 2013-14లో ఇది 4.7 శాతానికి పరిమితమైంది.
వడ్డీరేట్లు మారక పోవచ్చు
Published Mon, Jun 2 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM
Advertisement