ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న యుద్ధం భారత్ దిగుమతుల బిల్లుపై తీవ్ర ప్రభావం చూపుతుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దిగుమతుల బిల్లు 600 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొన్న నివేదిక, ఇది దేశంలో ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు, రూపాయి పతనానికి దారితీసే అవకాశం ఉందని అంచనా వేసింది. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రత్నాలు–ఆభరణాలు, వంట నూనెలు, ఎరువులను భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇండియా రేటింగ్స్ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు
- ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో 550 బిలియన్ డాలర్లకు చేరిన దిగుమతుల బిల్లు యుద్ధం మరికొంత కాలం కొనసాగిన పక్షంలో 2021–22 పూరిగా ముగిసే నాటికి 600 బిలియన్ డాలర్లు దాటే అవకాశం ఉంది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు భారీగా పెరిగే పరిస్థితి నెలకొంటుంది.
- క్రూడ్ ఆయిల్ ధరల్లో 5 శాతం పెరుగుదల ఉంటే, వాణిజ్య (కరెంట్ అకౌంట్) లోటు 6.6 బిలియన్ డాలర్లు పెరుగుతుందని అంచనా.
- ఇక పెట్రోలియం ప్రొడక్టుల ధరలు 10 శాతం పెరిగితే, రిటైల్ ద్రవ్యోల్బణం 42 బేసిస్ పాయింట్లు, టోకు ద్రవ్యోల్బణం 104 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరుగుతుంది.
- ఇక భారత్ వద్ద ఫిబ్రవరి 18వ తేదీ నాటికి అత్యధికంగా 632.95 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉండడం కొంత ఊరటనిచ్చే అంశం. ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ, రూపాయి భారీ పతనాన్ని ఇది కొంత మేర కట్టడి చేసే అంశం.
- శ్రీలంక వంటి ఇతర దేశాలు ఎదుర్కొంటున్న విదేశీ మారకద్రవ్య సమస్యలు భారత్ ఎగుమతులపై, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకు 2014–15లో శ్రీలంకతో ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 7.46 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఈ విలువ 4.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఉక్రెయిన్‌ను తీసుకుంటే, 2012–13లో ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 3.11 బిలియన్ డాలర్లయితే, 2021–22లో తొలి 10 నెలల్లో 2.35 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2020–21లో ఈ విలువ కేవలం 2.59 బిలియన్ డాలర్లు. ఇక రష్యాతో 2017–18 నుంచి 2020–21 మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 8 నుంచి 11 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉంటే, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ 9.44 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
ద్రవ్యోల్బణం, రూపాయి, క్యాడ్ ఇలా...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న సూచనల ప్రకారం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగాలి. అయితే జనవరిలో ఈ రేటు నిర్దేశ శ్రేణికి మించి 6.01 శాతంగా నమోదయ్యింది. ఇక దేశంలోకి వచ్చిపోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసాలను ప్రతిబింబించే కరెంట్ అకౌంట్ 2021–22లో 2 శాతం (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ విలువలో) లోటును నమోదుచేసుకుంటుందని యుద్ధానికి ముందు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష అంచనావేసింది. అయితే చమురు, ఇతర దిగుమతి చేసుకునే కమోడిటీ ధరలు తీవ్ర స్థాయిలో కొనసాగితే అంచనాలు మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ)కాగా, ఇప్పటికే 75 దిగువన స్థిరంగా కొనసాగుతోంది.
చదవండి: చమురు బిల్లు తడిసి మోపెడు!
Comments
Please login to add a commentAdd a comment