న్యూఢిల్లీ: మెరుగైన వ్యవసాయోత్పత్తి, అధిక ప్రభుత్వ వ్యయాలు భారత్ ఆర్థిక కార్యకలాపాలకు దన్నుగా ఉంటాయని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనావేసింది. వ్యవసాయం రంగం పురోగమనం నేపథ్యంలో గ్రామీణ వినియోగం బాగుంటుందని విశ్లేషించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ వృద్ధి 7 శాతంగా ఉంటుందని తన సెప్టెంబర్ అప్‌డేటెడ్ అవుట్‌లుక్ (ఏడీఓ) నివేదికలో అంచనా వేసింది.
2025–26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా అవుట్‌లుక్ విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులకు సేవల రంగం తోడ్పాటును అందిస్తుందని నివేదిక వివరించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 6.7 శాతం ఎకానమీ వృద్ధి నమోదయినప్పటికీ, రానున్న కాలంలో ఈ రేటు పుంజుకుంటుందన్న భరోసాను నివేదిక వెలిబుచ్చింది.
ఎకానమీ 2023–24లో 8.2 శాతం పురోగమించగా, 2024–25లో 7.2 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేస్తోంది. ‘‘ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో భారత్ ఆర్థిక వ్యవస్థ చక్కటి, స్థిరమైన పనితీరు కనబరిచింది’’అని ఏడీబీ కంట్రీ (ఇండియా) డైరెక్టర్ మియో ఓకా చెప్పారు. కాగా, 2024–25లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతంగా ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది.
దక్షిణాసియాకు భారత్ భరోసా: డబ్ల్యూఈఎఫ్ సర్వే
ఇదిలావుండగా, ఎకానమీ దృఢమైన పనితీరుతో భారత్ మొత్తం దక్షిణాసియా ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ స్థాయిలో నిలుపుతున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సర్వేలో పాల్గొన్న మెజారిటీ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే గ్లోబల్ రికవరీ పట్ల ఆశావహ దృక్పదాన్ని వెలువరిస్తూనే కొన్ని సవాళ్లూ ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా పెరుగుతున్న రుణ స్థాయిలు ఆందోళన కలిగిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. దీనివల్ల మౌలిక, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ వ్యయాలకు గండిపడే అవకాశం ఉందని అంచనావేశారు. మొత్తంమీద 2024, 2025లో ప్రపంచ ఎకానమీ ఒక మోస్తరు, లేదా పటిష్టంగా పురోగమించడం ఖాయమన్నది వారి అభిప్రాయం. అమెరికా ఎన్నికల ఫలితాలు కూడా ప్రపంచ ఎకానమీపై ప్రభావం చూపే కీలక అంశాల్లో ఒకటిగా ఆర్థికవేత్తలు పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment