ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగు పెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ దిగ్గజం నోమురా ప్రకటించింది. జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధిస్తుందన్న ఆర్‌బీఐ అంచనాలు మరీ ఆశావహంగా ఉన్నట్టు పేర్కొంది. 2024–25లో 6.7 శాతం, 2025–26లో 6.8 శాతం మేర భారత జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న తమ అంచనాలు మరింత క్షీణించడానికి రిస్క్‌లు పెరుగుతున్నట్టు పేర్కొంది.
వృద్ధి సూచికలు జీడీపీ మరింత మోస్తరు స్థాయికి చేరుకుంటుందని సూచిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధిని సాధిస్తుందని ఇటీవలి ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్ష తన గత అంచనాలను కొనసాగించడం తెలిసిందే.
పట్టణాల్లో వినియోగం సాధారణంగా మారుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయని.. ప్యాసింజర్ వాహన విక్రయాలు తగ్గడం, విమాన ప్రయాణికుల రద్దీ మోస్తరు స్థాయికి దిగిరావడం, ఎఫ్‌ఎంసీజీ సంస్థల అమ్మకాలు దీనికి నిదర్శనాలుగా పేర్కొంది. పట్టణ వినియోగంలో ఈ బలహీన ధోరణి కొనసాగుతుందని తాము భావిస్తున్నట్టు నోమురా తెలిపింది.
కంపెనీలు వేతన వ్యయాలను తగ్గించుకుంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ‘‘కరోనా అనంతరం ఏర్పడిన పెంటప్ డిమాండ్ సమసిపోయింది. ద్రవ్య విధానం కఠినంగా మారింది. అన్ సెక్యూర్డ్ రుణాలపై ఆర్‌బీఐ ఆంక్షలు వ్యక్తిగత రుణాలు, ఎన్‌బీఎఫ్‌సీ రుణాల వృద్ధి క్షీణతకు దారితీశాయి’’ అని నోమురా తన నివేదికలో వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment