ఇదిలాఉండగా, ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణ సమీకరణ ఆధారిత రేటు (ఎంసీఎల్‌ఆర్) మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రేటును బ్యాంకులు వ్యవస్థపై 100 నుంచి 150 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) బదలాయించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. ఇదే జరిగితే వాహన, వ్యక్తిగత, ఆటో, వాణిజ్య రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. గత నెల మొదట్లో జరిగిన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపది విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. వచ్చే నెల్లో జరిగే సమావేశాల్లోనూ పావుశాతం రేటు పెంపు ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం ఎగువనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రుణ రేట్ల పెరుగుదల నేపథ్యంలో గడచిన ఏడాది కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తంగా డిపాజిట్ రేట్లు కూడా 1.5 శాతం నుంచి 2 శాతం పెరిగాయి. వ్యవస్థలో డిపాజిట్లు కూడా 75 బేసిస్ పాయింట్లు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment