ముంబై: దేశీ కార్పొరేట్ల ఆర్థిక పనితీరు మెరుగుపడటానికి మెటల్స్ రంగంలో రికవరీ తోడ్పడనుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సదరు సంస్థల ఆదాయ వృద్ధి నిలకడగా 7–9 శాతం మేర ఉండనుంది. ఇండియా రేటింగ్స్ సంస్థ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2018–19లో లాభదాయకత మెరుగుపడి, కార్పొరేట్ల ఆర్థిక పనితీరు స్థిరంగా ఉండగలదని పేర్కొంది.
అయితే, ఈ రికవరీ కేవలం మెటల్స్ రంగానికి మాత్రమే పరిమితమని, మిగతా రంగాలన్నింటిలోనూ కనిపించడానికి మరింత సమయం పడుతుందని తెలిపింది. వినియోగ ఆధారిత ఆటోమొబైల్, రిటైల్ తదితర రంగాల్లో డిమాండ్ పెరగడంతో ఆదాయాలు 7–9 శాతం మేర, పన్నుకు ముందస్తు లాభాలు 8–11 శాతం మేర వృద్ధి చెందవచ్చని నివేదిక పేర్కొంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో కమోడిటీల ధరలు అధిక స్థాయిలో ఉండొచ్చని.. దీనికి తోడు అధిక వడ్డీ రేట్లు, రూపాయీ క్షీణత తదితర అంశాలు కంపెనీల లాభాల వృద్ధికి అడ్డుకట్ట వేయొచ్చని అంచనా వేసింది.
ఇక అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కఠిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎగుమతి ఆధారిత రంగాలైన ఫార్మా, ఐటీ సంస్థలు సవాళ్లు ఎదుర్కొనాల్సి ఉంటుందని వివరించింది. మరోవైపు, కంపెనీల లాభాల వృద్ధి పరిమిత స్థాయిలోనే ఉండటం వల్ల 2019–20 దాకా పెట్టుబడులు పెరగకపోవచ్చని ఇండియా రేటింగ్స్ వివరించింది. కార్పొరేట్లు కేవలం మెయింటెనెన్స్‌పై మాత్రమే ఖర్చులు చేయొచ్చని, విస్తరణ ప్రణాళికల జోలికి పోకపోవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment