ముంబై: మెటల్, ఇంధన, యుటిలిటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 71,337 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లుబలపడి 21,441 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది మూడోరోజూ లాభాల ముగింపు. వరుస సెలవుల తర్వాత ఉదయం దేశీయ మార్కెట్ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అయితే ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు క్రమంగా లాభాల దిశగా కదిలాయి.
ఒక దశలో సెన్సెక్స్ 364 పాయింట్లు పెరిగి 71,471 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 71,471 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఐటీ, టెక్, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున రాణించాయి. బాక్సింగ్ డే సందర్భంగా యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,636 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,464 కోట్ల షేర్లను కొన్నారు. అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (0.75%), రిలయన్స్ (0.50%), కోటక్ బ్యాంక్ (1.35%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి.
మోటిసన్స్ లిస్టింగ్ భళా
మోటిసన్స్ జ్యువెలరీ లిస్టింగ్ రోజునే ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. ఇష్యూ ధర రూ. 55తో పోలిస్తే బీఎస్‌ఈలో ఏకంగా 89 శాతం ప్రీమియంతో రూ. 104 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆపై ఒక దశలో 98 శాతంపైగా దూసుకెళ్లి గరిష్టంగా రూ. 109ను అధిగమించింది. చివరికి 84 శాతం లాభంతో రూ. 101 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 98 శాతం జంప్‌చేసి రూ. 109 వద్ద లిస్టయ్యింది. ఆపై దాదాపు రూ. 110 వద్ద గరిష్టానికి చేరింది. చివరికి 88 శాతంపైగా వృద్ధితో రూ. 104 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 996 కోట్లుగా నమోదైంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 151 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment